November 24, 2024

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి మించి పెంచాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు 10శాతం రిజర్వేషన్లను సమర్థించిన తర్వాత నితీష్ కుమార్ ఈ వ్యాఖ్య చేశారు. ప్రస్తుతం రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఉందని ఇందులో 27 శాతం ఓబిసీలకు, 15 శాతం షెడ్యూల్డ్ కులాలకు, 7.5 శాతం షెడ్యూల్డ్ తెగలకు వర్తిస్తాయని, ఇప్పుడు అగ్రవర్ణ పేదలకు కల్సిస్తున్న 10 శాతం రిజర్వేషన్లు ఓబిసీల రిజర్వేషన్లను దెబ్బతీస్తాయని ఆయన అన్నారు. దాంతోపాటు ఆయన కులాలవారి జనగణన చేయాలని మరోసారి డిమాండ్ చేశారు.

అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లపైను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత రాజకీయ పార్టీల్లో మిశ్రమ స్పందన కనిపించింది. ఒకే పార్టీలో కూడా వివిధ నేతలు వేరువేరుగా మాట్లాడడం వినిపించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లోను, విద్యాసంస్థల్లో ప్రవశాల్లోను ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. కాంగ్రేసు రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ ఈ తీర్పును స్వాగతించారు. కాని తమిళనాడుకు చెందిన పార్లమెంటు సభ్యులు ఈ తీర్పు పట్ల అంత సంతృప్తి కలిగి లేరు. ఢిల్లీకి చెందిన కాంగ్రెసు నాయకుడు ఈ తీర్పును తీవ్రంగా వ్యతిరేకించడమే కాదు సుప్రీంకోర్టు అగ్రవర్ణ మనస్తత్వాన్ని ప్రదర్శించిందని కూడా వ్యాఖ్యానించారు. శివగంగ నుంచి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు చిదంబరం ఈ తీర్పును స్వాగతించలేమని అన్నారు. తమిళనాడుకు చెందిన మరో కాంగ్రెసు ఎం.పీ జోతిమణి మాట్లాడుతూ సామాజిక న్యాయ పోరాటానికి ఈ తీర్పు ఎదురుదెబ్బగా వర్ణించారు.

తమిళనాడులో డిఎంకే పార్టీ ఈ రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమిళనాడులో డిఎంక, కాంగ్రెసు పార్టీలు రెండు కూడా ఈ తీర్పును వ్యతిరేకిస్తున్నాయి. కాని కాంగ్రెసులో ఇతర నేతలు ఈ తీర్పును స్వాగతిస్తున్నారు. లోక్ సభలో కాంగ్రేసుకు 53 మంది సభ్యులున్నారు. ఇందులో 8 మంది తమిళనాడుకు చెందినవారు. తమిళ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ తీర్పును తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు.

కాంగ్రెసు పార్టీలో జైరాంరమేష్ వంటి నేతలు అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించిన క్రెడిట్ తమదే అని చెప్పుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభించిన ప్రక్రియ వల్లనే నేడు ఈ రిజర్వేషన్లు సాధ్యమయ్యాయని అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2005లో ఏర్పాటు చేసిన కమీషన్ 2010లో తన నివేదికను సమర్పించింది. ఆ తర్వాత అనేక చర్చలు జరిగాయి. చివరకు 2014లో బిల్లు సిద్ధమయ్యిందని జైరాంరమేష్ అన్నారు. కాని మోడీ ప్రభుత్వం ఈ చట్టం చేయడానికి ఐదేళ్ళ సమయం తీసుకుందని తప్పుపట్టారు.

సహజంగానే బీజేపీ ఈ తీర్పును తమ విజయంగా చెప్పుకుంది. దేశంలోని పేదలకు సామాజిక న్యాయం కల్పించామని చెప్పుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ గారి గరీబ్ కల్యాణ్ సాధించిన విజయంగా చెప్పుకున్నారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెసు నేతలు కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు.

సుప్రీంకోర్టు మెజారిటీ తీర్పు అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కల్పించే 103వ రాజ్యాంగ సవరణను 3:2 మెజారిటీతో సమర్థించింది. ఈ తీర్పు పట్ల ప్రముఖ ఇంగ్లీషు పత్రికల్లోను మిశ్రమ స్పందన కనిపించింది.

ది హిందూ పత్రిక సంపాదకీయంలో కేవలం అగ్రవర్ఱ పేదలకు మాత్రమే వర్తించేలా స్వల్పాదయ కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పించడం ప్రశ్నార్థకమని, అన్ని వర్గాలకు ఇందులో స్థానం ఉండాలని రాసింది. అన్ని వర్గాల్లోను పేదలకు ఈ రిజర్వేషన్లు వర్తించేలా చేయాలని పేర్కొంది. ఆదాయ పరిమితిని కూడా తగ్గించాలని, ఆ విధంగా ఓబిసి, యస్సీ, యస్టీలలో మెరిట్ లిస్టుల్లో స్ధానం పొందలేని నిరుపదలు కూడా లాభపడతారని రాసింది.

టైమ్స్ ఆఫ్ ఇండియా సంపాదకీయం ఈ తీర్పును స్వాగతించింది. ఆర్థిక రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు న్యాయబద్దత కల్పించిందని చెప్పింది.

ఇండియన్ ఎక్ప్ ప్రెస్ ఈ తీర్పులో మైనారిటీ జడ్జిమెంటుపై కూడా దృష్టిపెట్టాలని కోరింది. దళితులు, సామాజిక, విద్యాపరమైన వెనుకబడిన వర్గాల్లో కనబడుతున్న భయసందేహాలను కూడా దురం చేయాలని చెప్పింది. హిందూస్తాన్ టైమ్స్ సంపాదకీయంలో రిజర్వేషన్ మౌలిక స్వభావాన్ని ఈ తీర్పు మార్చేసిందని పేర్కొంది. ఈ రిజర్వేషన్ల తర్వాత దేశజనాభాలో చాలా మంది రిజర్వేషన్లకు అర్హత పొందినట్లే అని పేర్కొంది.

టెలీగ్రాఫ్ సంపాదకీయంలో ఈ తీర్పును స్వాగతిస్తూనే ఇందులో కొన్ని ఇబ్బందికరమైన అంశాలున్నాయని రాసింది. ఇతర రిజర్వేషన్లున్న వర్గాల్లోని పేదలకు ఇది వర్తించకపోవడాన్ని గురించి ప్రశ్నించింది. నిస్సందేహంగా అగ్రవర్ణాలు ఈ తీర్పు వల్ల సంతోషిస్తాయని, 2024 ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉన్నాయని రాసింది. అగ్రవర్ణాలు ఈ తీర్పు పట్ల సంతోషించినా దళిత వెనుకబడిన వర్గాలు ఈ తీర్పును అగ్రవర్ణాలకు మరిన్ని అవకాశాలిచ్చే చర్యగా

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఈ నిర్ణయం జరిగిన 2019లోనే టైమ్స్ ఆఫ్ ఇండియా దీని గురించి రాసింది. ఈ నిర్ణయం తర్వాత దేశజనాభాలో దాదాపు అందరూ ఏదో ఒక రిజర్వేషన్ కోటా పోందే పరిస్థితి వస్తుందని పేర్కొంది. 8 లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న వారి లెక్కలు చూస్తే దేశంలో దాదాపు 95 శాతం ప్రజలు ఈ ఆదాయపరిమితి పరిధిలోకి వస్తారు. అంతేకాదు, ఏడాదికి 8 లక్షలు సంపాదించే కుటుంబం జాతీయ సగటు కన్నా కాస్త పైస్థాయిలో ఉన్నట్లే అని కూడా చాలా మంది పేర్కొన్నారు. అలాగే దేశంలోని భూయాజమాన్యం లెక్కలు చూస్తే దాదాపు 86 శాతం మంది ఐదెకరాల కన్నా తక్కువ కలిగిన వారు. అలాగే దేశంలో 80 శాతం వరకు ప్రజలు 500 గజాల కన్నా తక్కువ విస్తీర్ణం ఉన్న ఇండ్లలోనే నివసిస్తున్నారు. కాబట్టి అగ్రవర్ణ పేదలకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించడమంటే ఇతర రిజర్వేషన్ సౌకర్యాలున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసి వర్గాల్లోని పేదలకు ఇవి వర్తించవు. దేశంలో ఎస్సీ, ఎస్టీల జనాభా 23 శాతం. ఓబీసీ జనాభా 40 నుంచి 50 శాతం ఉంటుంది. అంటే ఈ ప్రజల్లో పేదలెవ్వరు అగ్రవర్ణ పేదలకు ఇచ్చే రిజర్వేషన్లలో భాగం పొందలేరు. నిజానికి ఈ వర్గాల్లోనే పేదలు ఎక్కువగా ఉన్నారు. క్లుప్తంగా చెప్పాలంటే దేశజనాభాలో కేవలం 37 శాతం ఉన్న అగ్రవర్ణాల్లోని పేదలకు మాత్రమే ఈ 10 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ జనాభా ఇప్పటికే ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో అధిక ప్రాతినిథ్యం కలిగి ఉంది. ఇందులో మధ్యతరగతిలో మెరిట్ లిస్టులో రాలేని వారికి ఇప్పుడు ఈ పదిశాతంలో అవకాశాలు లభిస్తాయి.

గమనించవలసిన విషయం ఏమిటంటే షెడ్యూల్డ్ తరగతుల్లో 40 శాతం మంది నిరుపేదలు. షెడ్యూల్డ తెగలకు లభిస్తున్న రిజర్వేషన్లు 7.5 శాతం మాత్రమే. కాబట్టి షెడ్యూల్డ్ తెగల్లో రిజర్వేషన్లు పొందలేని పేదలకు ఇప్పుడు రిజర్వేషన్లు లేవు. ఎందుకంటే, మీ వాళ్ళందరికీ ఏడున్నర శాతం ముందే ఇచ్చాం కాబట్టి మీరు పేదలైనా, మహాపేదలైనా సరే ఇందులో మీకు రిజర్వేషన్లు లేవని చెప్పడమే.

ఇప్పటి వరకు రిజర్వేషన్లు కొన్ని వర్గాలకు, సముదాయాలకు, కులాలకు ఉండేవి. రిజర్వేషన్లకు ఆధారం కులంగా ఉండేది. ఇందులో క్రీమీ లేయర్ నిబంధన ద్వారా పేదలకు రిజర్వేషన్ సౌకర్యం లభించేలా చేశారు. కాని ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రిజర్వేషన్ వ్యవస్థ మౌలిక స్వభావం మారింది. పేదరికం ఆధారంగా కుటుంబాలకు రిజర్వేషన్ కల్పించే కొత్త మార్పు ఇది.

ఏది ఏమైనా చాలా రాజకీయ పార్టీలు కూడా ఈ మార్పును స్వాగతించాయి. ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్, మజ్లిస్, డిఎంకే పార్టీలు మాత్రమే పార్లమెంటులో వ్యతిరేకించాయి. విచిత్రమేమిటంటే కులప్రాతిపదికన రిజర్వేషన్లను సైద్ధాంతికంగా కోరుకునే పార్టీలు కూడా ఈ రిజర్వేషన్లను సమర్థించాయి. 2019లో బహుజనసమాజ్ పార్టీ ఈ నిర్ణయాన్ని సమర్థించింది. సమాజవాది పార్టీ, జనతాదళ్ యునైటెడ్ వగైరా పార్టీలు కూడా దీన్ని సమర్థించాయి.

ఇక్కడ ఆలోచించవలసిన విషయమేమిటంటే, దేశంలో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలవుతున్నాయి. పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో రిజర్వేషన్లు ఎన్నడూ భాగం కాదు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదరికాన్ని పారద్రోలడానికి ప్రభుత్వాలు పనిచేస్తుంటాయి. రిజర్వేషన్ల ఉద్దేశ్యం వేరు. వివక్ష కారణంగా వెనుకబడిన సముదాయాల ప్రాతినిథ్యాన్ని పెంచడానికి ఉద్దేశించినవి. రిజర్వేషన్లు ఇంతవరకు కులప్రాతిపదికన ఉండేవి. ఇప్పుడు కుటుంబ ఆర్థిక స్థితి కొత్త ప్రాతిపదికగా వచ్చి చేరింది. కులప్రాతిపదికన ఇస్తున్నరిజర్వేషన్లపై వీటి ప్రభావం పడకపోవచ్చు. ఎందుకంటే ఈ పదిశాతం రిజర్వేషన్లు జనరల్ కోటా నుంచి కేటాయిస్తామంటున్నారు. కాని జనరల్ కోటా నుంచి పదిశాతం అగ్రవర్ణాల్లోని పేదలకు కేటాయించడం వల్ల జరిగేదేమిటి? నిజానికి అగ్రవర్ణ ప్రాతినిథ్యం ప్రభుత్వ ఉద్యోగాల్లోను, విద్యాసంస్థల్లోను వారి జనాభాశాతానికి మించి ఉందన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. ఇప్పుడు 8 లక్షల ఆర్థిక పరిమితితో అగ్రవర్ణ పేదలకు కేటాయించిన రిజర్వేషన్లు ఈ సముదాయాల్లోని మధ్యతరగతికి ఉపయోగపడడం వల్ల వాటి ప్రాతనిథ్యం పెరుగుతుంది. అయినప్పటికీ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, మండల్ పార్టీలుగా, అంబేద్కర్ పార్టీలుగా పేరుపడిన వారు కూడా వీటికి మద్దతిస్తున్నారు.

తొంభయ్యవ దశకంలో మండల్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఓబిసిలకు రిజర్వేషన్ల సమస్య మొందుకు వచ్చింది. మండల్ పార్టీలు, అంబేద్కర్ పార్టీలు ముందుకు వచ్చాయి. కులప్రాతిపదికన రాజకీయ సమీకరణాలు కూడా ప్రారంభమయ్యాయి. కాని ఇప్పుడు ఈ పార్టీలు కూడా పదిశాతం అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల పక్షాన ఉన్నాయంటే దేశంలో మారుతున్న రాజకీయ కథనానికి ఇది నిదర్శనం. ఉదాహరణకు ఈ తీర్పు తర్వాత రాష్ట్రీయ జనతాదళ్ పై బీజేపీ దాడి ప్రారంభించింది. ఆర్థికంగా బలహీనవర్గాలకు రాష్ట్రీయ జనతాదళ్ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తుందని ప్రచారం ప్రారంభించింది. వెనుకబడిన వర్గాల కోసం పనిచేసే రాజకీయ పార్టీలకు అగ్రవర్ణాల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నట్లు మాట్లాడుతున్నారు. వెంటనే రాష్ట్రీయ జనతాదళ్ డ్యామేజీ కంట్రోల్ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల పట్ల తమకు అప్పుడు కాని, ఇప్పుడు కాని అభ్యంతరం లేదని ప్రకటించింది. ఎందుకంటే రాష్ట్రీయ జనతాదళ్ రాజకీయప్రయోజనాలకు అగ్రవర్ణాలు దెబ్బతీసే ప్రమాదం ఉంది కాబట్టి. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీని వెనుకబడిన వర్గాల పార్టీగా నడిపించారు. కాని ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ పార్టీని ఆర్థిక పురోగతి కోసం పనిచేసే పార్టీగా ప్రజల్లో గుర్తింపు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాలకు దెబ్బ తగలకుండా జాగ్రత్త పడుతున్నారు. సామాజిక న్యాయం దశ ఇప్పుడు రాజకీయాల్లో లేదని తేజస్వీ ఒకసారి చెప్పారు.

తొంభయ్యవ దశకం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. అప్పట్లో మండల్, కమండల్ రాజకీయాలు హోరాహోరిగా సాగాయి. కాని తర్వాత మండల్ రాజకీయాలు నిర్విర్యమైపోయాయి. ఇప్పుడు కేవలం కమండల్ రాజకీయాలే ఎన్నికల్లో ఉపయోగపడే పరిస్థితులున్నాయి. మండల్ పార్టీల ఓట్లను బీజేపీ కొల్లగొట్టింది. ఒక్క తమిళనాడులో మాత్రమే బీజేపీకి ఈ విషయంలో ప్రతిఘటన ఉంది. మరెక్కడా లేదు. నిజానికి ఇప్పుడు రాజకీయాలు మొదటి దశకు చేరుకున్నాయి. అంటే మండల్ కు ముందు దశ. అప్పట్లో కాంగ్రెసు బలంగా ఉండేది. దళితులు, బలహీనవర్గాలతో పాటు అగ్రవర్ణ హిందువులు కూడా కాంగ్రెసుతో ఉండేవారు. మైనారిటీలు కూడా కాంగ్రెసుపక్షాన ఉండేవారు. మండల్ రాజకీయాల తర్వాత కాంగ్రెసు దళిత బలహీనవర్గాల ఓట్లను మండల్ పార్టీలకు కోల్పోయింది. ఇప్పుడు కాంగ్రెసు స్థానంలో బీజేపీ దళిత, బలహీనవర్గు, అగ్రవర్ణాలు అందరి పార్టీగా మారింది. ఒక్క మైనారిటీ ఓట్లు తప్ప. కులరాజకీయాలకు ఇప్పుడు కాలం చెల్లింది. తమిళనాడులో కూడా స్టాలిన్ భాషా ప్రాతిపదికన కమండల్ రాజకీయాలను ఎదిరిస్తున్నారే కాని కులరాజకీయాలు కాదని గుర్తించాలి.

సుప్రీంకోర్టు తీర్పు గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి కలిసి వచ్చే అంశం. పాటిదార్లు ఎప్పటి నుంచో రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారు. 2015లో పాటిదార్ అనామత్ అందోళన ద్వారానే హార్తిక్ పటేల్ రాజకీయాల్లోకి వచ్చాడు. పాటిదార్ ఆందోళనకు ముందు రాజస్థాన్ లో గుజ్జర్లు రిజర్వేషన్ల కోసం ఉద్యమించారు. గుజరాత్ లో పాటిదార్లు 20 శాతం ఉన్నారు. 1995 నుంచి 2017 వరకు గుజరాత్ లో బీజేపీ గెలుపు వెనుక పాటిదార్లే ఉన్నారు. పాటిదార్ల రిజర్వేషన్ల సమస్య తర్వాత సౌరాష్ట్రలో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ తర్వాత బీజేపీ పాటిదార్లను బుజ్జగించడం ప్రారంభించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పాటిదార్లు బీజేపీ కి పూర్తి మద్దతు ఇస్తారు. హార్దిక్ పటేల్ కూడా ఇప్పుడు బీజేపీలోనే ఉన్నాడు.

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మహారాష్ట్రలో కూడా రాజకీయాలు మారుతున్నాయి. మరాఠాలు రిజర్వేషన్లు అడుగుతున్నారు. ఇప్పుడు ఈ రిజర్వేషన్లలో మరాఠాలతో పాటు ముస్లిములకు కూడా రిజర్వేషన్ల హక్కు లభించింది.

భారతదేశంలో రిజర్వేషన్ల చరిత్ర చాలా పాతద. బ్రిటీషు కాలంలోను రిజర్వేషన్లు ఉన్నాయి. 1909లో బ్రిటీషు రాజ్ రాజకీయ రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది. వెనుకబడిన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చారు. 1932లో బ్రిటీషు వారు కమ్యునల్ అవార్డు ప్రకటించారు. ఇవి కూడా రాజకీయ రిజర్వేషన్లు. ముస్లిములకు, సిక్కులకు, భారత క్రయిస్తవులకు, ఆంగ్లో ఇండియన్లకు, యూరోపియన్లకు కల్పించిన రిజర్వేస్లు ఇవి. ఆ తర్వాత భారతదేశం స్వతంత్రం పొందింది. యస్సీ, యస్టీలకు రిజర్వేషన్లు కల్పించారు కాని బ్రిటీషువారు ముస్లిములకు ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేశారు. తర్వాత మండల్ కమీషన్ వచ్చింది. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు వచ్చాయి. కాని ఎవ్వరు ముస్లిముల రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు.

ఇప్పుడు అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఇందులో ముస్లిములకు కూడా అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. కాని ఎంతవరకు ఈ రిజర్వేషన్లు ఉపయోగపడతాయో వేచి చూడాలి. కాని ఒకటి మాత్రం నిజం భారతదేశంలో రిజర్వేషన్ల స్వరూప స్వభావాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి.