జులై 21వ తేదీ భారత చరిత్రలో చారిత్రకంగా నిలిచిపోతుంది. భారతదేశంలో మొట్టమొదటి ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు హార్దిక శుభాభినందనలు.
ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నిక కావడం వల్ల భారతదేశంలో ఆదివాసీ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు చిగురిస్తాయా అన్నది వేచి చూడాలి. కాని నిస్సందేహంగా ఒప్పుకోవలసిన ఒక వాస్తవమేమిటంటే, ఒక ఆధునిక, బహుళసంస్కృతి ప్రజాస్వామ్యదేశంగా భారతదేశం తన ప్రత్యేకతను చాటుకుంది. ముర్ము విజయం దానికి నిదర్శనం. ఆదివాసీ సముదాయం నుంచి ఒక రాష్ట్రపతి ఎంపిక కావడం, ఒక మహిళ ఎంపిక కావడం ఇవి రెండు భారత ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉందో చాటి చెప్పే అంశాలు.
ఆదివాసీ ప్రజలు దేశంలో ఎదుర్కుంటున్న సమస్యల గురించి కొత్తగా ప్రస్తావించవలసినదేమీ లేదు. పారిశ్రామికీకరణ వల్ల ఆదివాసీలు అడవులను కోల్పోతున్నారు. త్వరలో అటవీ చట్టానికి సవరణలు తీసుకువస్తున్నారు. దీనివల్ల ఆదివాసీలు హక్కులు కోల్పోతారన్న భయాలున్నాయి. ఆదివాసీ హక్కుల సంఘాలు ఇప్పటికే ఈ భయాలను వెలిబుచ్చాయి.
మరో ముఖ్యమైన విషయమేమిటంటే, విద్యావ్యవస్థ, న్యాయవ్యవస్థ, మీడియా, బ్యూరోక్రసీలలో ఆదివాసీల ప్రాతినిథ్యం చాలా తక్కువగా ఉంది. ఈ ప్రాతినిథ్యాన్ని పెంచవలసిన అవసరం కూడా ఉంది. గత కొంతకాలంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, బహుజనసమాజ్ పార్టీ, ఝార్ఖండ్ ముక్తి మోర్చా వంటి పార్టీల వల్ల జాతీయ రాజకీయాల్లో ఆదివాసీల గురించి చర్చ ప్రారంభమయ్యిందని చెప్పాలి. ఆదివాసీ ఓట్ల కోసం రాజకీయ ఎత్తుగడలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో ముర్ము రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషించదగిన విషయం. అనేక సమస్యల పరిష్కారానికి, ఆదివాసీల ప్రాతినిథ్యం పెంచడానికి ఈ పరిణామం ఎంతైనా ఉపయోగపడుతుందనే ఆశలున్నాయి. రాష్ట్రపతిగా ఆమె తన అధికారాలను ఉపయోగించి ఆదివాసీలకు మేలు చేస్తారని చాలా మంది నమ్మకాలు నిజమవుతాయని ఆశిద్దాం.
రాష్ట్రపతిగా ఎన్నికైన ముర్ము జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం చాలా మందిని ఆకట్టుకుంది. ఆమె తన ప్రసంగంలో అనేకమంది స్వత్రంత్ర సమరయోధుల పేర్లను ప్రస్తావించారు. స్వతంత్రం కోసం పోరాడిన ఈ యోధుల గురించి ప్రస్తావిస్తూ, వారి దేశభక్తిని కొనియాడుతూ, బాపూజీ స్వరాజ్, స్వదేశీ, స్వచ్ఛత, సత్యాగ్రహల గురించి చెప్పారని, భారతదేశ సాంస్కృతిక ఆదర్శాలను మనకు చూపించారని అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, నెహ్రూజీ, సర్దార్ పటేల్, బాబాసాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజగురు, చంద్రశేఖర్ వంటి స్వతంత్రపోరాట వీరుల పేర్లు ప్రస్తావించారు. అలాగే రాణీ లక్ష్మీబాయీ, రాణీ వేలూ నచియార్, రాణీ చెన్నమ్మ వంటి సాహస మహిళలు మహిళా శక్తిని చాటి చెప్పారన్నారు. సంతాల్, పైకా, కోల్, భిల్ తిరుగుబాట్ల గురించి ప్రస్తావించారు. కాని ఆమె ప్రసంగంలో ఎక్కడా ఒక్క ముస్లిం స్వతంత్ర పోరాటయోధుడి పేరు కూడా వినబడలేదు.
ఆల్ ఇండియా ముస్లిమ్ మజ్లిస్ ముషావరత్ అధ్యక్షుడు నవాయిద్ హామిద్ ఈ విషయం గురించి మాట్లాడుతూ రాష్ట్రపతి ముర్ము అనేకమంది స్వతంత్ర సమరయోధుల పేర్లు, బిర్సా ముండా నుంచి భగత్ సింగ్ వరకు అనేకమంది పేర్లను ప్రస్తావించారు కాని ఒక్క ముస్లిం పేరు కూడా చెప్పలేదని, అష్ఫాఖుల్లా ఖాన్, అబుల్ కలామ్ ఆజాద్, డా. జాకిర్ హుస్సేన్ వంటి ప్రముఖుల పేర్లలో ఒక్క పేరు కూడా ఆమె ప్రసంగంలో వినబడలేదని అన్నారు.
నిజానాకి స్వతంత్రపోరాటంలో అనేకమంది ముస్లిముల పేర్లు మన ముందుకు వస్తాయి. సరిహద్దు గాంధీగా పేరుపడిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాన్ని మొట్టమొదట వినిపించిన మౌలనా హస్రత్ మొహానీ, సైమన్ గో బ్యాక్, క్విట్ ఇండియా నినాదాలు వినిపించిన యూసుఫ్ మెహ్రాలీ, అలాగే మహిళల్లో అవథ్ రాణీ బేగం హజ్రత్ మహల్ బ్రిటీషువారిని గడగడలాడించిన చరిత్ర ఉంది. సావిత్రిబాయీ ఫూలేతో పాటు ఫాతిమా షేక్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు మన ముందుకు వస్తాయి. కాని ఒక్కపేరు కూడా ప్రసంగంలో వినిపించకపోవడం నిర్ఘాంతపరుస్తోంది.
రాష్ట్రపతి ప్రసంగమంటే, ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని మాత్రమే చదువుతారు. జాతిని ఉద్దేశించి చేసే మొదటి ప్రసంగంలో మరిచిపోవడం అనేది ఉంటుందా? భారత స్వతంత్రసంగ్రామ చరిత్రలో ముస్లిముల పేర్లేవీ ప్రసంగాన్ని తయారు చేసిన వారికి గుర్తురాలేదా? ఈ ప్రసంగ ప్రతిని చూసిన తర్వాత ముర్ము ఇందులో ముస్లిం స్వతంత్ర యోధుల పేర్లు విస్మరించడం జరిగిందన్నది గుర్తించలేదా అని కూడా చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
ఏది ఏమైనా, ముర్ము చెప్పినట్లు ఒక పేద ఆదివాసీ సముదాయానికి చెందిన ముర్ము, వార్డు కౌన్సిలర్ స్థాయి నుంచి భారత రాష్ట్రపతిగా ఎంపిక అయ్యారంటే అది భారత ప్రజాస్వామ్యం సాధించిన విజయం. భారతదేశంలో అత్యంత పేదకుటుంబంలో జన్మించిన వ్యక్తి కూడా, మారుమూల ఆదివాసీ సముదాయంలో జన్మించిన వ్యక్తి కూడా తన ప్రతిభతో అత్యున్నత పదవిని అందుకోగలడని నిరూపించారామె. మరోసారి రాష్ట్రపతి ముర్ముకు శుభాభినందనలు.