జమాఅతె ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా జనాబ్ ముహమ్మద్ రఫీఖ్ మరోసారి ఎన్నికయ్యారు. 2023 నుంచి 2027 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ప్రత్యేక శాఖలుగా ఏర్పడినప్పుడు 2014లో ఆయన తొలిసారి ఆంధ్రప్రదేశ్ జమాఅతె ఇస్లామీ హింద్ ఉపాధ్యక్షులుగా ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ అమీరె హల్ఖా జనాబ్ అబ్దుస్సలామ్ దస్తగీర్ మరణానంతరం అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు.
అంతకు ముందు జనాబ్ ముహమ్మద్ రఫీఖ్ విద్యార్థి విభాగం యస్.ఐ.ఓ.లోను కీలక బాధ్యతలు నిర్వర్తించారు. జమాఅత్‌లో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న రఫీఖ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఉన్నప్పుడు ఎస్.ఐ.ఓ. రాష్ట్ర సలహా మండలి సభ్యులుగా, రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించారు. జమాఅత్ సందేశ విభాగానికి అసిస్టెంట్ సెక్రటరీగా కూడా పని చేశారు. ఎస్.ఐ.ఓలో ఉన్నప్పుడు ఆయన రచించిన ‘‘మిత్రమా! నీ జీవిత పయనమెటు?’’ చిరుపుస్తకం బాగా ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం 2023-2027 వ్యవధికి గాను మరోసారి ఆంధ్రప్రదేశ్ జమాఅతె ఇస్లామీ హింద్ అధ్యక్షునిగా ఎన్నికైన జనాబ్ ముహమ్మద్ రఫీఖ్‌కు దైవం తన పదవీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించే శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని జమాఅతె ఇస్లామీ హింద్ జాతీయ అధ్యక్షులు జనాబ్ సాదతుల్లా హుస్సేనీ దైవాన్ని ప్రార్థించారు. గత నాలుగు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లో జమాఅత్‌ను పటిష్టపరచడంలో జనాబ్ ముహమ్మద్ రఫీఖ్ తనదైన పాత్ర సమర్ధ వంతంగా పోషించారు.