November 25, 2024

జగత్తుకి జీవనాడి ఖుర్ఆన్

శక్తివంతమైన జాతి వద్ద ఉన్న గ్రంథం కాదు ఖుర్‌ఆన్‌, జాతుల్ని శక్తివంతం చేసే గ్రంథం ఖుర్‌ఆన్‌‌. సుహుఫ్‌ – తౌరాత్, జబూర్‌, ఇంజీల్‌ – దైవ గ్రంథాలే, కానీ అన్నీ కాలాల్లో ఆచరణీయాలు కావు. ఎందుకంటే – అన్ని గ్రంథాల సారాంశాన్ని సంరక్షించే గ్రంథరాజం ఒకటుంది-  అదే అల్లాహ్ అంతిమ గ్రంథం ఖుర్‌ఆన్‌.

తౌరాత్‌లో మేము యూదులకు ఈ ఉత్తర్వు జారీ చేశాము:

….  వినండి,  అల్లాహ్  నిర్దేశించిన చట్టంప్రకారం పరిష్కారం చేయనివారే దుర్మార్గులు. (మాయిదహ్: 45)

ఆ ప్రవక్తల  తర్వాత  మేము మర్యం కుమారుడు ఈసాను పంపాము.  అతను  తనకు పూర్వం నుండీ వున్న తౌరాత్‌ను ధృవీకరించేవాడు. అతనికి మేము కాంతి, సన్మార్గం గల ఇన్జీల్‌ని ప్రసాదించాం. అది కూడా  గతంలో  వచ్చిన తౌరాత్‌ను ధృవీకరిస్తుంది. అది దైవభీతిపరుల పాలిట వెలుగుబాట, హితోపదేశం. ఇన్జీల్‌ ప్రజలు అందులో  అల్లాహ్  నిర్దేశించిన చట్టం ప్రకారమే పరిష్కరించుకోవాలని  మేము  ఆదేశించాం. కనుక అల్లాహ్  నిర్దేశించిన చట్టం ప్రకారం పరిష్కారం చేయనివారే దుర్జనులు.  (మాయిదహ్: 46-47)

చివరికి మేము సత్యపూరితమైన ఈ గ్రంథం (ఖుర్‌ఆన్‌)  నీపై అవతరింపజేశాం. ఇది ఇంతకు పూర్వం వచ్చిన దివ్యగ్రంథాలను ధృవీకరిస్తోంది. వాటన్నిటి సారాంశం కలిగి ఉంది. కనుక నీవు దేవుడు నిర్దేశించిన చట్టం ప్రకారమే ప్రజల వ్యవహారాలు పరిష్కరించు. నీ దగ్గరకు వచ్చిన సత్యాన్ని వదిలేసి వారి మనో కాంక్షలను అనుసరించకు. (మాయిదహ్: 46-47)

మేము మీలో ప్రతి సముదాయానికి ఓ ప్రత్యేక ధర్మశాస్త్రాన్ని, ఓ ప్రత్యేక ఆచరణ విధానాన్ని నిర్ణయించాం. అల్లాహ్  తలచుకుంటే మిమ్మల్నందర్నీ ఒకే సముదాయంగా కూడా చేయగలడు. కాని ఆయన మిమ్మల్ని పరీక్షించడానికి విభిన్న సముదాయాలుగా చేశాడు. కనుక మీరు సత్కార్యాల్లో ఒకర్నొకరు మించిపోవడానికి ప్రయత్నించండి. చివరికి మీరంతా అల్లాహ్ సన్నిధికే చేరుకో వలసి ఉంది. తర్వాత  మీరు ఏ విషయాల్లో పరస్పరం విభేదించు కున్నారో వాటి వాస్తవికతను ఆయన మీకు తెలియజేస్తాడు.  (మాయిదహ్: 48)

ఖుర్‌ఆన్‌- అది మార్గం మరచిన మానవాళికి మార్గదర్శిని. కరుణ, జాలి, దయ, ఆప్యాయత, అనురాగం, మమకారం మరచిన జాతికి అది కారుణ్యప్రదాయిని. ఆర్ధిక, ఆధ్యాత్మిక, నైతిక, సామాజిక రుగ్మతలతో అల్లాడిపోతున్న మానవాళికి అది దివ్య ఔషధీ, నిత్యం నేరాలతో, ఘోరాలతో, అఘాయిత్యాలతో, అస్పృ శ్యతా భావాలతో కుతకుతలాడుతున్న  బడుగు  బలహీన ప్రజలకు అది శుభవార్త. అది ఎవరూ ఆర్పడం సాధ్యం కానీ అల్లాహ్ జ్యోతి.

మానవులారా! మీ ప్రభువు నుండి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది.  ఇది  మీ హృదయ రుగ్మతలకు నివారిణి. దీన్ని స్వీకరించేవారికి ఇది మార్గదర్శిని, కారుణ్యప్రదాయిని. ప్రవక్తా! వారికిలా తెలియజెయ్యి: ‘‘ఈ మహాభాగ్యాన్ని దేవుడు మీకోసం పంపాడంటే  ఇది ఆయన అనుగ్రహం, దాతృత్వాలే. దానిపై వారు ఆనందోత్సవాలు జరుపుకోవాలి. ఇది ప్రజలు కూడబెడ్తున్న దానికంటే ఎంతో శ్రేష్ఠమైనది. (దివ్య ఖుర్‌ఆన్‌ 10: 57-58)

ఈ యదార్థాన్ని గ్రహించని ప్రజలు నాడే కాదు నేడు సయితం – ఈ  మహద్గ్రంథం  యెడల అనుచితంగా వ్యవహరిస్తూనే  ఉన్నారు. ఈ నేరస్తుల కుట్రలను అల్లాహ్ తిప్పి కొడుతూనే  ఉంటాడు.  ‘‘చూడండి ఇప్పుడు అల్లాహ్  దాన్ని ఎలా విచ్ఛిన్నం చేస్తాడో. ఆయన  దుర్మార్గుల  పనిని నెరవేరనీయడు. దురాత్ములకు ఎంత వెగటు కలిగినా అల్లాహ్  తన నిదర్శనాలతో సత్యాన్ని సత్యంగా నిరూపించి తీరుతాడు.’’ (దివ్య ఖుర్‌ఆన్‌  10: 80-82)

ఎవరికి ఎంత వెగటు కలిగినా,  ఎవరికీ ఎంత నచ్చకపోయినా, ఎవరు ఎంతగా  అసహ్యించుకున్నా అల్లాహ్  తన  జ్యోతిని వెలిగించే ఉంచుతాడు. ‘‘వారు తమ నోటితో అల్లాహ్  జ్యోతిని  (సత్యధర్మం) ఆర్పివేయ గోరుతున్నారు. కాని సత్యతిరస్కారులకు ఎంత వెగటు  కలిగినా అల్లాహ్ మాత్రం  తన  జ్యోతిని  నేల నాలుగు చెరగులా ప్రసరింపజేయనిదే వదలిపెట్టడు.

అది సవ్యమైన బాట వైపునకు మానవాళిని నడిపిస్తుంది. అది చూపే రాచబాట ప్రారంభం ఇహంలో ఉంటె, దాని గమ్యం స్వర్గం. అది  పండితులు మొదలు పామరుల వరకు, రాజులు మొదలు సామాన్య ప్రజల వరకు, ధర్మాత్ములు మొదలు దుర్మార్గుల వరకు –  అందరికి స్పష్టంగా అర్థమయ్యేలా  సత్యాసత్యాలను, ధర్మాధర్మాలను, న్యాయాన్యాయాలను  విశదపర్చే  అద్భుత దైవ శాస్త్రం. కానరాక, శాంతి లభించక గాఢాంధకారాల్లో కొట్టుమిట్టాడుతున్న జనావళికి  వెలుగు  వెన్నెల స్నానాలు చేయించడానికి అవతరించిన తేజోన్మయ గ్రంథం అది. అసత్య ధ్వజవాహకులు, అధర్మ అధినాయకులు, అల్లరి మూకల  నేతలు దానికి మసి పూయడానికి, కళంకితం చేయడానికి నిత్యం శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తూనే ఉంటారు. అంత మాత్రాన దాని ప్రభ తగ్గిపోతుందనుకోవడం ఒట్టి భ్రమ.

సముద్రానికి చమురు పూస్తే జిడ్డు పడుతుందా?

హిమనగానికి బొగ్గుపూస్తే నల్లబడుతుందా?

అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:  ‘‘సత్యధర్మం బహుదైవారాధకులకు ఏమాత్రం  నచ్చకపోయినాసరే  ఇది  యావత్తు జీవన వ్యవస్థలపై ఆధిక్యత పొందడానికి ఆ అల్లాహ్  తన (అంతిమ) ప్రవక్తకు సత్యాన్ని, హితబోధను ఇచ్చి పంపాడు.’’ (32-33)

ఆకాశ నక్షత్రాలు రాలి పోయినా ఆకాశ గ్రంథమైన ఖుర్‌ఆన్‌ తన అమృత  చినుకుల్ని కురిపిస్తూనే ఉంటుంది.  దాన్ని తన ధన, మాన,  ప్రాణాల కన్నా  భావించే  ప్రజల శరీరం చివికి మట్టిలో  కలిసిపోతుంది,   గుర్తుపట్టలేనంతగా మట్టిగా మారి పోతుంది. కానీ  అది  బోధించిన జీవిత సత్యాలు, ఆశయాలు జీవించే వుంటాయి.

అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ‘‘నిశ్చయంగా ఈ హితోపదేశ గ్రంథాన్ని  మేమే అవతరింపజేశాం. దాన్ని పరిరక్షించేవాళ్ళం కూడా మేమే. (దివ్య ఖుర్‌ఆన్‌` అల్‌ హిజ్ర్‌: 09)

ఇదొక శక్తిమంతమైన  గ్రంథం.  దుష్టశక్తులు దానిపై ముందు నుంచీ దాడి చేయలేవు, వెనుక నుంచీ దాడి చేయలేవు. ఇది మహా వివేకవంతుడు, స్వతహాగా ప్రశంసనీయుడయిన అల్లాహ్ నుండి అవతరించిన (అద్భుత)వాణి. (హామీమ్‌: 42)

వారికి చెప్పు: ‘‘యావత్తు  మానవులు,  జిన్నులు ఏకమయి కఠోరంగా పరిశ్రమించినా, పరస్పరం సహకరించుకున్నా, ఖుర్‌ఆన్‌లాంటి గ్రంథాన్ని ఎన్నటికీ రచించలేరు.’’ (88)

పవిత్ర  ఖుర్‌ఆన్‌  మానవాళి  పాలిట  ఓ మహాదానుగ్రహం. ప్రపంచంలోని మరే అనుగ్రహం  దీనికి సరితూగదు. ఈ గ్రంథంలో భూత, భవిష్య, వర్తమానానికి సంబంధించిన సమాచారమూ ఉంది. సృష్టి, సృష్టి నిర్మాణం, సూర్యచంద్రనక్షత్ర భ్రమణ వివరాలూ ఉన్నాయి. గత జాతుల, ప్రవక్తల ఆదర్శాలూ ఉన్నాయి.  విశ్వాసుల  మధుర ఫలం స్వర్గం,  అవిశ్వాసుల దుష్ఫలం నరక ప్రస్తావనలూ ఉన్నాయి.  ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి ఇహపరాల సాఫల్యాలు, సభ్యతా సంస్కా రాలు, గౌరవోన్నతులు, నీతినడవడికలు-అన్నీ ఈ ఉద్గ్రంథంతోనే ముడిపడి ఉన్నాయి. రాజాధిరాజు  అయిన  అల్లాహ్ ఈ గ్రంథరాజం గురించి ఇలా సెలవిస్తున్నాడు: ‘‘ఓ ప్రవక్తా! మేము ఈ గ్రంథాన్ని  నీపై  అవతరింపజేశాము. అందులో  ప్రతీ విషయం విశదీకరించబడింది. విధేయత చూపేవారికి ఇది మార్గదర్శకం, కారుణ్యం, శుభవార్త’’. (నహల్ : 89)

పవిత్ర ఖుర్‌ఆన్‌ ఓ మహాసాగరం. ఈ  గ్రంథాన్ని విజ్ఞులు, వివేచనాపరులు, పండితులు  శోధించినకొద్దీ వారి తృష్ణ పెరుగు తూనే ఉంటుంది    దాని లోతుల్లోకి పోయిన కొద్దీ ముత్యాలు, పగడాలు, మణిమాణిక్యాలు దొరుకుతూనే  ఉంటాయి. అదో అంతం కాని జ్ఞానఖని. విజ్ఞానగని.  ఈ గ్రంథంలో అల్లాహ్ పవిత్ర నామాలు, గుణగణాలతోపాటు, అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన ప్రవక్తలను, ఆయన గ్రంథాలను విశ్వసిం చండి అన్న పిలుపు కూడా ఉంది.

‘‘తన ప్రభువు తరపున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా సత్యమని నమ్మారు. వారంతా అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను విశ్వసించారు.’మేము ఆయన పంపిన ప్రవక్తల మధ్య ఎలాంటి వివక్ష, భేదభావాన్ని పాటించము’ అనంటారు. అలాగే ‘‘మేము విన్నాము విధేయులయ్యాము మా ప్రభూ!  మేము  నీ  క్షమాభిక్షను అర్థిస్తున్నాము, కడకు మేము మరలి రావలసింది  నీ వద్దకే’’  (అని  దీనాతిదీనంగా వేడు కుంటారు.) (బఖరా:285)

విజ్ఞానం శృతి మించి వినాశనం సృష్టిస్తున్న నేటి తరుణంలో, మతం మతి తప్పి మారణ హోమం రగలిస్తున్న నేటి యుగంలో, అస్పృశ్యత, అంటరానితనం, నిమ్నోన్నతా భావం అపశృతులు పలికిస్తున్న నేటి ఆధునికంలో, ఉన్మాదం, ఉగ్రవాదం వెర్రి తలలు వేస్తున్న నేటి కలికాలంలో, మారణాస్త్ర నిర్మూ లనమే సమస్త మానవ వికాసమనీ, అఖిల మానవాభ్యుదయమే విశ్వాస దళ ధ్యేయమని వక్కాణిస్తుంది ఖుర్‌ఆన్‌. అందరినీ ప్రేమించడమే ఇస్లాం అభిమతమని, అదే సుమా ఎప్పటికీ దైవసమ్మతం అని ఉద్ఘాటిస్తుంది. అందుకు భక్తి మార్గమే అన్ని విధాల శ్రేయస్కర మని నొక్కి చెబు తుంది. పుట్టుకరీత్యా ఎవరూ అల్పులు కారని, అందరూ దైవ దాసులేనని, దైవభీతి పరులే దైవానికి ప్రియులని హితవు పలుకుతుంది. ‘‘మానవులారా!  మేము మిమ్మల్ని ఒకే పురుషుడు,  ఒకే స్త్రీ నుంచి సృజించాము.  తర్వాత  మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగా, తెగలుగా చేశాము.  వాస్తవానికి  మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో  ఎక్కువ గౌరవానికి అర్హుడు. నిశ్చయంగా  అల్లాహ్  సర్వ జ్ఞానం కలవాడు. సకల విషయాలు తెలిసినవాడు’’. (అల్‌హుజురాత్‌: 13)

పవిత్ర ఖుర్‌ఆన్‌ ఒక అద్భుత కళాఖండం. అది తన పఠితులను ఉర్రూతలూగించడమే కాక, సృష్టి, సృష్టి రహస్యాల గురించి, తన ఆయతుల  గురించి  ఆలోచించమని  పురిగొల్పుతుంది. వారిలో జిజ్ఞాసను పెంచుతుంది.

ఓ ప్రవక్తా! వారికి చెప్పు: ‘‘ఆకాశాలలో, భూమిలో ఏ వస్తువులైతే ఉన్నాయో వాటిని కాస్త (నిశిత దృష్టితో) చూడండి’’.

(యూనుస్‌:101)

మరో చోట ఇలా ఉంది:  ‘‘ఏమిటి, వారు ఖుర్‌ ఆన్‌ గురించి లోతుగా ఆలోచించరా?  లేక  వారి  హృదయాలపై తాళాలు పడి ఉన్నాయా?’’ (ముహమ్మద్‌ : 24)

ప్రజలారా! ఇది మనందరి కోసం చేయబడుతున్న హితవు – మనం ఆల్లాహ్ యెడల తఖ్వా కలిగి జీవించాలి. తఖ్వా ద్వారానే ముక్తి, మోక్షాలు సాధ్యం.  మనం కలిసి ఉంటేనే బలం. చెల్లాచెదురుగా ఉన్న  మనల్ని ఏకతాటి మీద కట్టి  ఉంచగలిగే, కట్టడి చేయగలిగే సత్తా అల్లాహ్ త్రాడు అని చెప్పబడిన ఖుర్‌ఆన్‌ గ్రంథానికి మాత్రమే ఉంది. మనం అల్లాహ్ త్రాడును గట్టిగా పట్టుకోవాలి. విభేదాల్లో పది విడి పోకూడదు. అన్యదా మన శక్తి మొత్తం  బూడిదలో  పోసిన  పన్నీరయిపోతుంది. తెలుసుకొండి! వాక్యాల్లోకెల్లా సత్య వాక్కు అల్లాహ్ వాక్కయిన ఖురాన్‌. ఆదర్శాల్లోకెల్లా గొప్ప ఆదర్శం మహనీయ ముహమ్మద్‌ (స) వారి ఆదర్శం.  మనం తౌహీద్‌ (ఖురాన్‌) వీడితే ఖచ్చితంగా  షిర్క్‌ అడుసు తొక్కుతాము. అడుసు తొక్కనేల కాలు కడగనేల. అడుసు అంటే బురద – బురదను  ముట్టుకుంటే  అంటుకుంటుంది. ఈ విషయం తెలిసీ దాన్ని తొక్కటం ఎందుకు, తర్వాత అంటుకుంది అని బాధపడి కడుక్కోవటం  ఎందుకు. చేతులు కాలాక  ఆకులు  పట్టుకొంటే  లాభం ఉండదు. మనం సున్నత్‌ (ప్రవక్త (స) వారి ఆదర్శాలను తుంగలో తొక్కేసినట్లయితే తర్వాత మనకు పట్టె దుర్గతికి  ఏ  ఒక్కరూ  తొంగి  కూడా  చూడరు. ఫలితంగా బిద్‌అత్‌  భయంకర  ఊబిలో  లోతుగా  దిగబడి పోతాము, ఎగబడి ఎదిగే అన్ని అవకాశాల్ని కోల్పోతాము.

  • సయ్యద్ అబ్దుస్సలామ్ ఉమరీ