November 22, 2024

మూఢత్వం, మూర్ఖత్వంతో సకల చెడులకు ఆలవాలమై అజ్ఞాన అంధకారం  రాజ్యమేలుతున్న మక్కా నగరంలో హజ్రత్‌ అబ్దుల్లాహ్ ఆమినా పుణ్య దంపతులకు క్రీస్తు శకం 571లో సంవత్సరం ఏప్రిల్‌ 20న జన్మించారు ప్రవక్త ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం.

అమ్మ కడుపులో ఉండగానే తండ్రిని,  5  సంవత్సరాల పసి ప్రాయంలో తల్లిని కోల్పోయి అనాథగా  తన  జీవన పయనం మొదలుపెట్టిన మహనీయుడు ఆయన.

తోటి యువత మద్యం,  జూదం,  వ్యభిచారం గాన బజానాల మైకంలో మునిగి తేలుతున్నా, తాను మాత్రం గంజాయి వనంలో తులసి  మొక్కలా  సత్యసంధుడు (సాదిక్‌),  నిజాయితీ పరుడి (అమీన్‌)గా సకల సద్గుణ  సంపన్నుడుగా పెరిగి పెద్దవాడు అయ్యాడు ఆయన.

ఇరువై  అయిదు  సంవత్సరాల నిండు యవ్వనంలో, నలభై సంవత్సరాల వితంతువు హజ్రత్‌ ఖదీజాను వివాహమాడి, వితంతు వివాహానికి  ఆచరణాత్మక  సంస్కరణకు ప్రాణం పోసిన ఆద్యుడు ఆయన.

నలభై సంవత్సరాల వయస్సు వరకు నిరాడంబరంగా నిజాయితీ పరుడిగా, నీతిమంతుడిగా, యావత్‌ అరేబియాలో ఒక విలక్షణ మైన వ్యక్తిగా జీవించారు.

తన  నలభయ్యవ యేట  సృష్టికర్త అయిన అల్లాహ్ ఆయనను తన సందేశహరుడిగా సమాజ సంస్కరణ కోసం ఎన్నుకున్నాడు.

హిరా కొండగుహలో ‘‘ఇఖ్ర బిస్మి రబ్బికల్లజీ ఖలఖ్‌ ’’ (చదువు సృష్టించిన నీ ప్రభువు పేరుతో) అన్న ఖురాన్‌ మొట్టమొదటి వాక్యం అవతరణతో ప్రారంభమై, ఇరువై మూడు సంవత్సరాల కాలంలో రాబోయే ప్రళయ కాలం వరకు చావు పుట్టుకల నడుమ మానవ జీవిత మర్మాన్ని వివరించి, సృష్టి రహస్యాన్ని  శాస్త్రీయంగా  వివరించి,  మానవాళిని  సంస్కరించి దైవభీతి ఆధారంగా సత్‌ సమాజ నిర్మాణం కోసం కావలసిన ఆదేశాల గ్రంథం  ఖుర్‌ఆన్‌ ఆయనపై అవతరించింది.

మంచి, మానవత విలువ మరచి,  కులం, మతం, జాతి, వర్గం, వర్ణం, ధనికులు,పేదలు అన్న వివక్షతో జీవిస్తున్న అరబ్బులను 23 సంవత్సరాల స్వల్ప కాలంలో మంచికి మానవతకు మారు పేరుగా విశ్వ విజేతలుగా తీర్చిదిద్దిన కృషీవలుడు ఆయన.

సర్వ మానవ సౌభ్రాతృత్వం సమానత్వం

మానవులంతా  ఒకే  సృష్టికర్త అయిన అల్లాహ్ దాసులే. మానవు లందరూ ఒకే జంట  ఆదం  హవ్వాల  సంతానం. పరస్పరం సోదరులు.  కుల, మతం, వర్గం, వర్ణం, ప్రాంతం  జాతి  రీత్యా  ఎవరూ గొప్ప వారు కారు. ఎవరైతే నైతికంగా నిష్టాపరులో, దైవం పట్ల అత్యంత భయభక్తులు కలిగి ఉంటారో వారే గొప్పవారు అని చాటి చెప్పారు.

ఇదే విషయాన్ని  ఖుర్‌ఆన్‌లో సృష్టి కర్త అయిన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

‘‘మానవులారా! మేము మిమ్మల్ని ఒకే స్త్రీ పురుషుని జంట నుండి సృజించాము.  తరువాత  మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగానూ, తెగలుగానూ చేశాము. వాస్తవానికి మీలో అందరి కంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవపాత్రుడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞానం  కలవాడు,  సకల  విషయాలూ తెలిసిన వాడూను’’. (49: 13)

ఈ సూత్రం ఆధారంగా విశ్వ మానవాళిని, నల్లవారు  తెల్లవారు, ఉన్నత వంశానికి చెందిన వారు, అధమ శ్రేణికి చెందిన వారు అన్న బేధ భావం లేకుండా మానవాళిని ఒకే జాతిగా మలిచారు. అగ్రకులాల ఖురైషీ ధనవంతుల ముందు నీగ్రో జాతికి చెందిన బానిస హజ్రత్‌  బిలాల్‌ను పవిత్ర కాబా గృహం మీదకు ఎక్కించి అజాన్‌ పిలుపును  ఇప్పించి  సర్వమానవులు సృష్టి కర్త ముందు ఒక్కటే అని చాటి చెప్పిన ధీరోదాత్తుడు ఆయన.

అంతే కాదు సృష్టి కర్త ముందు ధనికులు పేదలు అన్న  వివక్ష లేకుండా భుజానికి భుజం కలిపి ప్రతి రోజూ ఐదుసార్లు నమాజ్‌ చేసే విధానం ప్రవేశ పెట్టారు.

హజ్‌ ఆరాధన సమయంలో ప్రపంచ  నలుమూలల నుంచి వచ్చే దాసులు` వారు ఎలాంటి వారైనా, రాజైనా, బంటు అయినా, అందరూ ఒకే రకమైన వస్త్రాలు (తెల్లని దుప్పట్లు) ధరించి ఆరాధన చేసే విధానం ప్రవేశ పెట్టారు.

తద్వారా సర్వమానవులు ఒక్కటే, అల్లాప్‌ా ముందు ఒకరు గొప్ప మరొకరు తక్కువ అన్న నిమ్నోన్నతల విధానం లేనే లేదు అని క్రియాత్మకంగా నిరూపించారు.

ఈ మానవ సమానత్వపు ఆరాధన  ఇస్లాంలో  తప్ప  మరే ఆరాధనలోనూ కానరాదు.

అందుకే సుప్రసిద్ధ  భారతదేశ  కవయిత్రి సరోజిని నాయుడు ‘‘ఇస్లాం ఆరాధనలో ప్రబోధించే ఏకత్వపు  భావన  చూసి  నేను అనేక సార్లు ప్రభావితురాలి నయ్యాను’’  అని అన్నారు.

జగతిన విజ్ఞానం కాంతులు వెదజల్లిన మహా జ్ఞాని

సృష్టికర్త ఒక్కడే, మానవులంతా ఒక్కటే,  చావు పుట్టుకల నడుమ మానవ జీవిత మర్మాన్ని తెలుసుకోవాలి. అంటే జ్ఞానం ఎంతైనా అవసరం అని చాటి చెప్పి 1450 సంవత్సరాల క్రితమే విద్యాభి వృద్ధికి బీజం వేసారాయన.

‘‘తల్లితండ్రులు తమ సంతానానికి ఇచ్చే అత్యున్నత బహుమానం మంచీ చెడుల విచక్షణా జ్ఞానం తెలిపే చక్కని చదువు సంస్కారాలే’’.

‘‘జ్ణాన సముపార్జన కోసం  ఎంత దూరం పయనం చేయవలసి వచ్చినా,  ఎన్ని  బాధలు  కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయరా ద’’న్నారు.

ఒక పురుషుని చదువు అతనొక్కడికే పరిమితం. స్త్రీ చదువు తరతరాల వరకు ఉపయోగపడుతుంది.

ఎందుకంటే తల్లి ఒడి మనందరికీ  మొదటి బడి అని తెలిపి 15 శతాబ్దాల క్రితమే మహిళల చదువుకు పెద్ద పీట వేసిన మహాను భావుడు ఆయన.

స్త్రీ జనోద్ధారకుడు ఆయన

ఆడపిల్ల పుట్టడమే అరిష్టంగా భావించి, ఆడపిల్ల పుట్టిందని తెలిస్తే సజీవంగా పాతిపెట్టేవారు ఆ కాలంలో.

ఇద్దరు  లేదా  ముగ్గురు  అమ్మాయిలను లేదా చెల్లెళ్ళను పోషించి వారి కాళ్ళ మీద వారు నిలబడేలా చేస్తే అల్లాప్‌ా వారికి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు అని తెలిపి శిశు హత్యలకు ఆనాడే అడ్డుకట్ట వేశారు.

ఇరవై అయిదు సంవత్సరాల నిండు యవ్వనంలో, నలభై సంవత్సరాల వితంతువు హజ్రత్‌ ఖదీజా (రఅ)ను వివాహం చేసు కుని, వితంతువు వివాహాలను ప్రోత్సహించిన సంస్కర్త.

1450 సంవత్సరాల క్రితమే ఆడపిల్లకు తల్లితండ్రుల ఆస్తిలో వాటా పొందే హక్కును కల్పించే ఆదేశం ఇవ్వడం జరిగింది.

ఇది జరిగిన పన్నెండు వందల సంవత్సరాల తరువాత, 1881వ సంవత్సరంలో ఇంగ్లాండులో ఆ చట్టం చేయడం జరిగింది.

స్త్రీ పురుషులలో పుట్టుక రీత్యా ఇరువురు సమానులే. కాకపోతే శారీరక మానసిక స్థితిని బట్టి వారి వారి పరిధిలో పని చేసే ఆదేశం ఇవ్వడం జరిగింది.

మానవ సంక్షేమ పథకాలు

నేటి ఆసరా,  పింఛను,  అంగన్వాడీ లాంటి అనేక పథకాలు ఆ కాలంలోనే రూపుదిద్దుకున్న సంక్షేమ పథకాలు.

అనాథల,  వితంతువుల,  అగత్యపరుల సేవలో  నిమగ్నమై   ఉన్న వారు రాత్రంతా ఆరాధనలో నిమగ్నమైన వారితో, పగలంతా ఉపవాసం పాటించేవారితో దైవం మార్గంలో ప్రాణాలు అర్పించిన వారితో సమానం అని తెలిపి సాటి మానవుల అవసరాలు తీర్చేలా ప్రోత్సహించారు.

‘‘పొరుగు వారు పస్తులుండగా కడుపునిండా తిని నిదురపోయే వారు విశ్వాసులే కారు’’ అన్నారు.

‘‘నేల మీద ఉన్న  వారిని  కరుణించండి నింగినున్న వాడు మిమ్మల్ని కరుణిస్తాడు’’ అని ఉపదేశించారు.

ఏ ఇంటిలోనైతే  అనాథలకు  ఆశ్రయం  కల్పించబడుతుందో, తమ పిల్లల్లా వారు పోషించబడతారో ఆ ఇల్లు అన్ని ఇండ్ల కన్నా ఉత్తమ ఇల్లు. వారిపై దైవ కారుణ్యం కురుస్తుంది అని తెలిపి అనాథల పోషణలో పోటి పడేలా చేసారు.

ఇలా అనేక బోధనలతో దైవభక్తి, ఆరాధన అంటే కేవలం పూజా పురస్కారాలే కాదు, సాటి మానవుల అవసరాలు తీర్చడమే అని ప్రబోధించారు ఆ మహనీయుడు.

ఆర్థిక సమానత్వం

మిగులు ధనంలో జకాత్‌ చెల్లించి సమాజ సంక్షేమ పనులకు ఉపయోగపడేలా చేశారు.

వెండి, బంగారం, మిగులు పైకంపై ప్రతి ఒక్కరూ 2.5 శాతం విధిగా జకాత్‌ ఇవ్వాలి.

‘‘అల్లాహ్ మార్గంలో  అంటే  సాటి మానవుల అవసరాలు తీర్చ డానికి ఖర్చు చేస్తే అల్లాహ్ దానికి ఏడు వందల రెట్లు అధికంగా ఇస్తాడు’’.

ఇలా ధనం ఒకే చోట పోగు కాకుండా, సమాజంలో ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చడానికి ఖర్చు చేసేలా చేశారు.

శాంతి, సహనం, క్షమాగుణం

మానవులందరూ ఒకే సృష్టి కర్త అయిన అల్లాహ్ దాసులు.

‘‘యావత్‌  మానవులు  అల్లాప్‌ా వసుదైక కుటుంబం. ఎవరైనా అల్లాహ్  దాసులకు కష్టం నష్టం కలిగిస్తే అల్లాప్‌ాకు కష్టం కలిగించినట్లే’’.

పంట పొలాలను నాశనం చేయడం, చెట్లను నరకడం, కాల్చి వేయడం కూడా మహా పాపమని, దీనికి గాను మరణానంతరం పరలోకంలో జవాబు చెప్పుకోవాల్సి  వస్తుందని  సహచరులను హెచ్చరించారు.

మక్కానగరంలో తన సహచరులకు చిత్రహింసలు చేసిన వారిని, తనను సైతం ప్రాణాలు తీయడానికి వెనుకాడని వారిని, తనను కన్న తండ్రిలా పెంచి పోషించిన పినతండ్రి హజ్రత్‌ హమ్జా (రజి)ను చంపి కాలేయాన్ని  కసకసా నమిలిన హిందాను ఇంకా ఎందరినో, మక్కా విజయం తరువాత క్షమించి వదిలి వేసిన క్షమాశీలుడు, శాంతి కాముకుడు ఆయన.

న్యాయ ధ్వజవాహకుడు

న్యాయ  ధ్వజవాహకులుగా నిలబడండి. అది మీకు మీ కుటుంబానికి  ఎంతగా  నష్టం  కలిగించినాసరే  అన్న దైవాదేశాన్ని తన అనుచరులు తు. చ తప్పకుండా పాటించేలా తర్ఫీదు ఇచ్చారు.

ఖురైషుల్లోని మఖ్‌జూమ్‌ తెగకు చెందిన ఒక మహిళ దొంగతనం చేసినట్లు రుజువైంది.  ఆమె కోసం తన ప్రియ సహచరుడు సిఫార్సు చేయగా, ఆయన ముఖం ఆగ్రహంతో కందిపోయింది. ‘‘ఈ పక్షపాతం కారణంగానే ఇస్రాయీల్‌ సంతతి వారు నాశనమయ్యారు. వారు కులీనులు తప్పు చేస్తే వదిలిపెట్టి బలహీనులను శిక్షించేవారు. అల్లాహ్ సాక్షిగా! ముహమ్మద్‌ కూతురు ఫాతిమా దొంగతనం చేసినా నేను ఆమె చేతిని నరికి ఉండేవాణ్ణి’’ అని ప్రకటించారు.

‘‘నిత్యావసర వస్తువులను నిల్వ చేసి ధరలు పెరిగేలా చేయడం మహా పాపం’’ అని హెచ్చరించారు.

శ్రమజీవులకు బాసటగా నిలిచిన కార్మిక నేత.

‘‘కూలి వాడి చెమట ఆరక ముందే అతని కూలిని చెల్లించి వేయండి’’ అని తాకీదు చేశారు.

ముగ్గురి పని ఇద్దరితో చేయించకండి. అంటే ఒకరిపై ఎంత పని భారం మోపాలో అంతే మోపాలి.

భోజనం చేసేటప్పుడు మీతో పాటు మీ వంటవాడిని కూడా కూర్చోబెట్టుకోండి. అతను వేడిని భరించి మరీ వంట చేస్తాడు కదా.

ఇలా పదిహేను వందల సంవత్సరాల క్రితమే శ్రామిక సంక్షేమ చట్టాలు చేసిన నేత ఆయన.

ఆయన  ప్రళయం  వరకు  రాబోయే మానవాళికి సరిఅయిన జీవన విధానాన్ని ఆచరణాత్మకంగా జీవించి, అమలు చేసి ఒక ఉత్తమ ఆదర్శం నెలకొల్పారు.

దైవభీతి ఆధారంగా సమాజంలోని సకల రంగాలను సంస్కరిం చిన సంస్కర్త ప్రవక్త ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం.

సకల సిరిసంపదలతో తులతూగుతున్న సువిశాల సామ్రాజ్యానికి చక్రవర్తి, ఆయన తలచుకుంటే సుఖబోగాలు అష్టైశ్వర్యాలు కాళ్ళ వద్దకు వచ్చిపడేవి.

కానీ ఆయన ఈ లోకాన్ని వీడి వెళ్ళేటప్పుడు వంటిమీద అతుకుల బట్టలు, ఇంట్లో దీపం వెలిగించడానికి నూనె లేని పరిస్థితి.

రండి! మానవ జీవిత పరమార్థాన్ని వివరించి, మనిషిగా మన జీవిత లక్ష్యం ఏమిటో శాస్త్రీయంగా వివరించి, సమాజంలో మానవతా విలువలు, సేవా దృక్పథం, శాంతి సామరస్యాలు, నైతిక విలువలు పెంపొందించేలా చేసిన ప్రవక్త ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి తెలుసుకుందాం.

  • – షేక్ అబ్దుల్ బాసిత్, కొత్తగూడెం