May 17, 2024

అనాథగా జన్మించిన ఆమినా,  అబ్దుల్లాహ్ దంపతుల పుత్రరత్నం అసాధారణమైన కీర్తిని సొంతం చేసుకున్నారు. నేటికీ కోట్ల ప్రజల గుండె చప్పుడు ఆయన(స).  తరతరాలుగా,  యుగ యుగాలుగా హృదయాల విజేతగా నిలిచిన ఏకైక వ్యక్తి ఆయన (స).  ఆయన  బోధనలు, ఆయన నడవడిక, ఆయన వ్యక్తిత్వం, ఆయన ప్రేమ,  ఆయన గడిపిన ప్రతీ క్షణం ప్రజలకు గుణపాఠాలే… ఆచరణ యోగ్యమైన హితబోధలు ఆయనవి. అజ్ఞానం, మూఢత్వ బానిస  బంధాలను త్రెంచి విజ్ఞానపు తేటతెల్లని కాంతి పుంజాలను  చూపి స్వేచ్ఛను  ప్రసాదించిన మహానుభావుడు ఆయన(స).

బీద`ధనిక, స్వేచ్ఛా`బానిస, అరబ్బు` అరబ్బేతరుడు, అల్ప` అధిక కులమనే తారతమ్యాలను శాశ్వతంగా చెరిపివేసి మానవ సమానత్వాన్ని స్థాపించిన మహా మనీషి ఆయన(స). సమస్త చెడుగులకు వ్యతిరేకి ఆయన(స). సమస్త సత్కార్యాలకు మద్దతుదారుడు ఆయన(స).  మంచి  కార్యాలు చేస్తూ, ప్రజలను మంచి వైపునకు ఆహ్వానించమని, చెడు  కార్యాలకు  దూరంగా  ఉంటూ చెడు కార్యాల నుండి ప్రజలను ఆపాలని ప్రబోధించారు ఆయన(స).

ప్రతీ ఒక్కరూ దైవప్రవక్త  ముహమ్మద్‌(స) జీవిత చరిత్రను ఖచ్చి తంగా  అధ్యయనం  చెయ్యాలి.  ఎందుకంటే, ఈ పుడమిపై ఆయన(స) వంటి ప్రభావవంతమైన సంస్కర్త, ఆదర్శవంతుడు గత 1450 సంవత్సరాల్లో పుట్టనే లేదు. ప్రళయం వరకూ పుట్టరు కూడాను. ఆయన (స)  జీవితం  ముస్లింలకే కాదు, ప్రపంచ మానవులందరికీ  మార్గదర్శకం.  ఆయన(స) అడుగుజాడల్లో నడవడం వల్ల ఇహపరాల గౌరవాన్ని, విజయాన్ని సొంతం చేసుకో వచ్చు. ఇది చరిత్ర ఇస్తున్న సాక్ష్యం. దీన్ని ఏ ఒక్కరూ విస్మరించే వీలులేదు. దైవప్రవక్త(స) సహచరులు, మన పూర్వీకులు ఇప్పటికీ కీర్తించబడుతూనే ఉండటం మనం చూస్తూనే ఉన్నాము కదా..

ఒక చిన్న బాలుడు ఏడుస్తున్న షార్ట్‌ వీడియో ఒకటి బాగా వైరల్‌ అయ్యింది. ఆ పిల్లవాడు దైవప్రవక్త(స) పరమపదించారు అనే విషయం తెలుసుకుని కన్నీరు మున్నీరయ్యాడు. దైవప్రవక్త(స) జీవిత చరిత్ర  అధ్యయనం  చేస్తున్న కొద్దీ ఆయన(స)పై ప్రేమ, వాత్సల్యం  అమాంతం పెరిగిపోయి  ఒక  రకమైన ఎమోషనల్‌ బంధం ఏర్పడిపోయింది. ఆయన(స)  జీవిత  చరిత్ర ముగింపు దశకు చేరుకున్నప్పుడు బాధాతప్త హృదయంతో కళ్ళు చెమ్మగిల్లు తాయి. ఇది ప్రతి విశ్వాసి జీవిత అనుభవమే. ఒక్కొక్కసారి ఆయన(స) భౌతికంగా, ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు ఉంటే ఎంత బాగుండేది, ఆయన(స)ను కళ్ళతో చూసుకుని ఆనంద పడేవాళ్ళం కదా అని అన్పిస్తూ ఉంటుంది. ఆయన(స)ను కలలో తప్ప ఇక మనం చూడలేము, దైవప్రవక్త(స)ను కలలో చూసిన వారు అదృష్టవంతులు.

ఒక్కొక్కసారి ఆయన (స)  ఫోటో  అయినా ఉంటే బాగుండేది అన్పిస్తూ ఉంటుంది. కనీసం అలా అయినా ఆయన(స) ముఖార విందాన్ని దర్శించేవాళ్ళం అన్పిస్తుంది. దైవప్రవక్త(స) భార్యలైన ఉమ్మె సలమా(రజి), ఉమ్మె హబీబా(రజి) హబ్షా (ఇథియోఫియా)కు వలస వెళ్ళిన సహాబాల్లోని వారు. దైవప్రవక్త(స) జీవిత  చరమాంకంలో జబ్బుపడ్డారు. ఆ సమయంలో ఆ ఇద్దరు భార్యలు  దైవప్రవక్త(స) ఫొటోను గీయించాలనే సలహా ఇస్తూ ఈ విధంగా అన్నారు : దీన్ని ఆయిషా(రజి) ఇలా ఉల్లేఖించారు : దైవప్రవక్త(స) జబ్బు పడినప్పుడు, ఆయన (స) భార్యలో కొందరు ఇథియోఫియాలో చూసిన ఒక చర్చి, దాని పేరు మారియా గురించి ప్రస్తావించారు. ఉమ్మె సలమా(రజి), ఉమ్మె హబీబా (రజి)లు ఇథియోఫియాలో ఉన్నప్పుడు ‘మారియా’ పేరు గల చర్చిలో బొమ్మలు, చిత్రాలున్న విషయాన్ని దైవప్రవక్త(స) ముందు ప్రస్తావించారు. అప్పుడు దైవప్రవక్త(స) ఇలా అన్నారు : ‘‘వారిలో ఎవరైనా  ఒక  మహనీయుడు చనిపోయిన తర్వాత వారు అతని సమాధిపై ప్రార్థనా మందిరం నిర్మిస్తారు.  అందులో  వారి బొమ్మలు (చిత్రాలు) వేస్తారు. వీరు ప్రళయదినాన దేవుని దృష్టిలో అతి నీచమైన సృష్టితాలుగా పరిగణించబడతారు’’ (సహీహ్ బుఖారీ)

దైవప్రవక్త(స) తమ చిత్రాన్ని గీయించుకోవటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే, ప్రేమాభిమానాల స్థాయి నుండి ప్రజలు ఆ చిత్రాన్ని ఆరాధనా స్థాయికి చేరుస్తారనే వాస్తవాన్ని ఆయన(స) ముందే గుర్తించారు. యూదులు, క్రైస్తవులకు ఏక దైవారాధన చెయ్యాలనే క్లారిటీ ఉన్నా కూడా దైవప్రవక్తలు, మత గురువుల చిత్రాలకు, విగ్రహాలకు ప్రార్థనా స్థాయిని ఇచ్చి తమ విశ్వాసాన్ని కొళ్ళబొడుచు కున్నారు. ముస్లిం సమాజం కూడా అలాంటి వలయంలో చిక్కు కుని విశ్వాసానికి తూట్లు పొడుచుకోకుండా దైవప్రవక్త(స) జాగ్రత్త పడ్డారు.

దైవప్రవక్త(స) నిజ జీవితపు హీరో. ఆయన(స) భర్తల్లోకెల్లా  ఉత్తమమైన భర్త. భార్యలను గృహ హింసకు, అరాచకాలకు గురి చేయకుండా ప్రేమాభిమానాలతో చూసుకునేవారు. ఆయన(స) ఉత్తమమైన తండ్రి. తమ బిడ్డలకు ఉత్తమ నడవడికను నేర్పి ఆదర్శ వనితలుగా తీర్చిదిద్దారు. ఆయన(స) ఉత్తమమైన అల్లుడు.  తమ  మామ గార్లను ఎంతో గౌరవంతో చూసేవారు. వారి నుండి ఎలాంటి డబ్బు, దస్కం డిమాండ్‌ చేసేవారు కాదు. ఆయన(స) ఉత్తమమైన మామ గారు. అల్లుళ్ళను సొంత కొడుకుల్లా చూసుకునేవారు. ఆయన(స) ఒక ఉత్తమమైన పౌరుడు. ఎల్లప్పుడూ బీదలు, అనాథలు, వితంతువులు, బానిసలు, బాటసారులను ఆదుకునేవారు. వారి అవసరాలను తీర్చేందుకు తమ సకల సంపదనూ ధారపోసేవారు.

ఆయన(స) ఉత్తమమైన బిజినెస్‌ మ్యాగ్నేట్‌. నీతి నిజాయితీతో వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారు. ఆయన(స) ఉత్తమమైన శ్రేయోభిలాషి.  ప్రజల  హితమే ఆయన(స)కు ప్రియమైనది. ఆయన(స) ప్రజలకు  మంచి సలహాలను ఇచ్చేవారు. ప్రజలను చెడుల నుండి ఆపేవారు, మంచివైపునకు ఆహ్వానించేవారు.

ఆయన(స) ఉత్తమమైన ముస్లిం, మోమిన్‌. ఆయన(స) జీవితం దైవాదేశాలకు 100 శాతం కట్టుబడి ఉండేది. దైవ శాసనాలను ఆయన(స) వంద శాతం అమలుపరిచేవారు.  దైవారాధనలో అలసత్వానికి తావే ఉండేది కాదు. ఖుర్‌ఆన్‌కు అనుగుణంగానే ఆయన(స) జీవితం గడిచేది. దైవమార్గంలో ఎన్నో కష్టాలను కడగండ్లను ఎదుర్కొని కూడా విశ్వాసంపై స్థిరంగా నిలబడ్డారు. ఫలితంగా అల్లాహ్ కు ఎంతో ప్రీతికరమైన దైవదాసుల్లో స్థానాన్ని దక్కించుకున్నారు. దైవాభీష్టమే తమ అభీష్టంగా జీవించారు. దైవం ముందు జవాబు చెప్పాలనే జవాబుదారీ తనాన్ని కలిగి ఉండేవారు.

ఆయన(స) ఉత్తమమైన పాలకుడు. ప్రజా ప్రయోజనాలకే పెద్ద పీఠ వేసేవారు.  న్యాయాన్ని  స్థాపించారు.  అన్యాయాన్ని అరి కట్టారు.  నిష్పక్షపాతంగా  వ్యవహరించేవారు. ప్రజా ధనాన్ని అక్రమంగా కాజేయడం గాని,  దుర్వినియోగం చేయడం గాని, సొంత ప్రయోజనాలకై ఖర్చు పెట్టడం గాని ఎన్నడూ చెయ్యలేదు. మద్యం,  జూదం,  వ్యభిచారం, దొంగతనం లేని ఒక సత్సమాజం ఆయన(స) ద్వారా  ఉనికిలోకి  వచ్చింది. ప్రజా ధనంతో అద్భుతమైన కట్టడాల్లో, భోగవిలాసాల్లో జీవితాన్ని గడపలేదు. ఎల్లప్పుడూ సాదాసీదా జీవితాన్నే గడిపారు. హంగులు, ఆడంబరాలకు ఆమడ దూరాన ఉండేవారు. సాధారణ దుస్తులు ధరించేవారు. సాధారణ తిండి తినేవారు, సాధారణ ఇంట్లో నివసించేవారు. ఆయన(స) వద్ద ఎంత సిరిసంపద వచ్చినా దాన్ని ఇతరుల్లో పంచేవారు. ఆయన (స) పరమపదించేటప్పుడు ఆయన(స) వద్ద ఏ ఆస్తిపాస్తులు, సిరిసంపదలూ లేవు.

ఆయన(స) జీవితంలోని ప్రతీ కోణం అద్భుతమే. ఈ భూమిపై జన్మించిన అరుదైన ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ ఆయన(స). మానవ జాతి మొత్తం గర్వించదగ్గ వ్యక్తిత్వం ఆయన(స)ది. ఆయన(స) అడుగు జాడల్లో నడిస్తేనే మన జీవితం సార్థకం అవుతుంది.

 

  • తస్నీమ్‌జహాన్‌ ఖాన్‌