November 21, 2024

ఇండియాటుడే ఇటీవల ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ముఖ్యంగా ఆర్థికవ్యవస్థపై ప్రజల అభిప్రాయాలకు అద్దం పడుతుంది. సాధారణంగా ఒపినియన్ పోల్స్ జరుగుతుంటాయి. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ముందుగా చెప్పే ప్రయత్నాలవి. కాని ఈ సర్వేలు ప్రజలు ఏ విషయాల గురించి ఆలోచిస్తున్నారో ప్రకటిస్తాయి. ఇండియాటుడే చేసిన సర్వే ప్రకారం ఒకవేళ సాధారణ ఎన్నికలు జులై 15 నుంచి 31 మధ్య తారీఖుల్లో జరిగి ఉంటే ఎన్డీయే కూటమికి దాదాపు 307 స్థానాలు వచ్చి ఉండేవి. గత ఎన్నికల్లో ఎన్డీయేకు 353 వచ్చాయన్నది గుర్తించాలి. ఇప్పుడు సాధారణ ఎన్నికలకు కనీసం 20 నెలల సమయముంది. కాబట్టి ఇప్పుడు సాధారణ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంచనాలకు అర్థం లేదు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే బీహారులో నితీష్ కుమార్ ఎన్డీయేకు బై బై చెప్పక ముందు జరిగిన సర్వే ఇది. అయినప్పటికీ ఈ సర్వేలో కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. వాటిపై దృష్టిపెట్టడం పాలకపక్షానికి మాత్రమే కాదు, ప్రతిపక్షాలకు కూడా చాలా అవసరం. ఎందుకంటే, పాలకపక్షానికి ఈసర్వే ఒక ప్రమాదఘంటికను వినిపిస్తోంది. ప్రతిపక్షాలకు ఈ సర్వే కొత్త అవకాశాల ఆశలు కల్పిస్తోంది.

భారతదేశంలో అతిపెద్ద సమస్య ఏదనే ప్రశ్నకు 27 శాతం మంది అధికధరలు అని జవాబు చెప్పారు. 25 శాతం మంది నిరుద్యోగమన్నారు. 7 శాతం మంది పేదరికమన్నారు. ఏది ఏమైనా ఆర్థిక అంశాలే అందరూ ప్రస్తావిస్తున్నారు. ఆర్థికవ్యవస్థ విషయంలో ఆలోచిస్తే అధికధరలు అందరినీ పీడిస్తున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గిందని లెక్కలు చెబుతున్నా ధరలు దిగి రావడం లేదు. నిరుద్యోగం విషయంలో 56 శాతం మంది చాలా సీరియస్ సమస్యగా భావిస్తున్నారు.

నిజానికి భారతీయులు ఆశావహ దృక్పథం కలిగి ఉన్నవారు. దశాబ్దాలుగా అనేక సర్వేల్లో ఈ విషయం స్పష్టంగా తెలిసిన విషయం. కాని ఈ సారి మాత్రం అలాంటి ఆశావహ దృక్పథం కనిపించడం లేదు. దాదాపు 34 శాతం మంది భారత ఆర్థిక పరిస్థితి పట్ల నిరాశ వ్యక్తపరిచారు. 31 శాతం మంది పరిస్థితి మెరుగుపడుతుందని ఆశవాహ దృక్పథం వ్యక్తపరిచారు.

సాధారణంగా ఇలాంటి సర్వేల్లో అభిప్రాయాలు వ్యక్తపరిచే వారు దేశం మొత్తం ఆర్థికపరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం జరగదు. కేవలం తమ కుటుంబంలో ఆర్థిక పరిస్థితిని మాత్రమే దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతారు. దేశం మొత్తం ఆర్థిక పరిస్థితి గురించి ఎవరు ఎన్ని మాటలైనా చెప్పవచ్చు. భిన్నాభిప్రాయాలు ముందుకు రావచ్చు. కాని స్వంత కుటుంబం ఆర్థిక పరిస్థితి గురించి ప్రతి వ్యక్తికి చాలా బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాదోపవాదాలకు తావులేదు. ఇండియాటుడే గత ఆరేళ్ళుగా ఇలాంటి సర్వేల్లో ఒక ప్రశ్న అడుగుతోంది. నరేంద్రమోడీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? అనేది ఆ ప్రశ్న. ప్రత్యేకంగా మోడీ పేరుతో అడుగుతున్న ప్రశ్న కాబట్టి, ఆయన చాలా ప్రజాదరణ ఉన్న నాయకుడు కాబట్టి సహజంగానే చాలా మంది తమ ఆర్థికపరిస్థితి బాగుపడిందని జవాబు చెప్పాలి. కాని అలా జరగలేదు. 36 శాతం మంది తమ ఆర్థిక పరిస్థితి దిగజారిందని చెప్పారు. 28 శాతం మంది తమ ఆర్థిక పరిస్థితి మెరుగయ్యిందన్నారు.

ఇప్పుడు ఆలోచించవలసిన మరో ప్రశ్న ఏమిటంటే, ఆర్థికపరిస్థితి దిగజారడానికి ప్రభుత్వం కారణమని భావిస్తున్నారా? లేదా అన్నది. మోడీ ప్రభుత్వానికి పాజిటివ్ రేటింగ్స్ 48 శాతం లభించాయి. గతంలో కన్నా ఇది తక్కువ. రేటింగ్స్ పడిపోతున్నాయి. మోడీ ప్రభుత్వ వైఫల్యాల గురించి అడిగినప్పుడు అధికధరలు, నిరుద్యోగం, ఆర్థిక ప్రగతి గురించి చాలా మంది మాట్లాడారు. కాని గమనించవలసిన విషయమేమిటంటే, ప్రజల మద్దతు ప్రభుత్వానికి తగ్గలేదు. కశ్మీర్, రామమందిరం వంటి సమస్యలే కాదు, ప్రజలు అవినీతి, కోవిడ్ విషయంలో కూడా ప్రభుత్వ చర్యల పట్ల సంతృప్తి కలిగి ఉన్నారు. ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. కాని ద్రవ్యోల్బణం, నిరుద్యోగాల పరిస్థితి గమనిస్తే ప్రజాభిప్రాయం మారడానికి ఇవి దారితీయవచ్చు.

ఏది ఏమైనా వ్యక్తిగతంగా మోడీ ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదన్నది స్పష్టం. ప్రజాదరణ విషయంలో ప్రతిపక్ష నేతలెవ్వరు ఆయనకు దరిదాపుల్లో లేరు. మోడీ ప్రభుత్వ వైపల్యాల గురించి మాట్లాడేవారి సంఖ్య పెరిగినప్పటికీ, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని వాదించేవారి సంఖ్య పెరిగినప్పటికీ మోడీ విషయంలో ప్రజల మద్దతు తగ్గలేదన్నది స్పష్టం.

బీహారులో మారిన రాజకీయాలు, ఆర్థికపరిస్థితి, నిరుద్యోగం, అధికధరల వంటి అంశాలు ప్రతిపక్షాలకు ఎంత వరకు ఉపయోగపడతాయన్నది భవిష్యత్తులో మాత్రమే తెలుస్తుంది.