December 6, 2024

అయోథ్యలో బాబరీ మస్జిదు తర్వాత మరో 16వ శతాబ్ధం నాటి మస్జిదుపై మతతత్వ శక్తుల దృష్టి పడింది. ఉత్తరప్రదేశ్, సంభాల్ లోని జామా మస్జిదుపై వివాదం రాజేస్తున్నారు. సంభాల్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో విష్ణు శంకర్ జైన్ అనే న్యాయవాది పిటీషన్ వేసిన మూడు గంటల్లోనే జడ్జిగారు ఆ మస్జిదులో సర్వే ఆదేశించారు. పోలీసు బందోబస్తుతో సర్వే నిర్వహించారు.
ఈ మస్జిదు 500 సంవత్సరాల చరిత్ర ఉన్న మస్జిదు. అక్కడ రోజువారి నమాజులు కూడా జరుగుతున్నాయి. సర్వేలో అక్కడ ఏమీ దొరకలేదు. మందిరాన్ని కూల్చి బాబర్ కాలంలో ఈ మస్జిదు కట్టారని, హరిహర మందిరాన్ని కూల్చి 1529లో ఈ మస్జిదు కట్టారని వివాదం రాజేస్తున్నారు. అయోథ్య వివాదం నుంచి పిండుకోవలసిన రాజకీయ ప్రయోజనాలన్నీ పిండుకున్నారు కాబట్టి ఇప్పుడు కొత్త వివాదాలు రాజేస్తున్నారు.
బాబార్ పాలించింది ఐదేళ్ళే. 1526 నుంచి 1530 మధ్య కాలంలో బాబర్ కట్టించిన మస్జిదులు మూడే. అవి అయోథ్యలో బాబరీ మస్జిదు, సంభాల్ లో జామా మస్జిదు, పానిపట్ లో మరో మస్జిదు కట్టించాడు, అది ఇప్పుడు శిధిలావస్థలో ఉంది. సంభాల్ జామా మస్జిదు సర్వే కోసం అధికారులు రావడంతో అక్కడి పార్లమెంటు సభ్యుడు జియా వుర్రహ్మాన్ జోక్యం చేసుకుని స్థానికంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితిని చల్లబరిచారు. జియావుర్రహ్మాన్ మాట్లాడుతూ ఎలాంటి నోటీసు లేకుండా హడావిడిగా ఈ సర్వే కోసం రావడమేమిటని ప్రశ్నించారు. పైగా ఈ మస్జిదు ఆరాధనాలయాల స్థలం 1991 క్రింద భద్రత పొందుతున్న మస్జిదు. ఈ మస్జిదుపై పిటీషన్ వేసిన హరి శంకర్ జైన్ ఎవరో కాదు, వారణాసి, మధుర మస్జిదులపై పిటీషన్లు వేసింది కూడా ఈయనే. ఒక పథకం ప్రకారం దేశంలో మస్జిదులపై పిటీషన్లు వేయించి, మతఉద్రిక్తతలు రాజేసే ప్రయత్నాలు ఇప్పుడు జోరందుకున్నాయి.
మజ్లిస్ నాయకుడు ఒవైసీ మాట్లాడుతూ బాబరీ మస్జిద్ తీర్పు తర్వాత మతశక్తులు పేట్రేగిపోతున్నాయని చెప్పారు. పిటీషన్ వేసిన మూడు గంటల్లోనే న్యాయమూర్తి సర్వేకు ఆదేశాలిచ్చారని, ఇతర కేసుల్లో ఎప్పుడైనా ఇంత వేగంగా న్యాయస్థానం స్పందించడం జరిగిందా అన్నారు.
గమనించవలసిన మరో విషయమేమిటంటే, ఉత్తరప్రదేశ్ లో ప్రతిష్ఠాత్మకస్థాయిలో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఉపఎన్నికల పోలింగ్ కు కేవలం కొన్ని గంటల ముందు ఈ సర్వే ఆదేశాలు వచ్చాయి. సర్వే జరిగింది. ఎన్నికలకు ఈ సర్వే ఆదేశాలకు సంబంధం ఉందని, ఓటర్లను ప్రభావితం చేయడానికి ఇదొక కుట్ర అనే వాదన ప్రచారంలో ఉంది.
కాస్త వెనక్కి వెళితే 2014లో ఎన్నికలప్పుడు కూడా ఈ వివాదం రాజేసారన్నది గుర్తుకు వస్తుంది. అప్పుడు కూడా ఎన్నికలకు ముందే ఈ వివాదాన్ని రాజేశారు. ఇప్పుడు కూడా ఎన్నికలకు ముందే ఈ వివాదాన్ని రాజేసారు. గమనించవలసిన ఆసక్తికరమైన విషయమేమిటంటే, అప్పట్లో సమాజవాది పార్టీ తరఫున పార్లమెంటుకు షఫీకుర్రహ్మాన్ బార్క్ పోటీ చేశాడు. అప్పట్లో మతతత్వశక్తుల ప్రాబల్యం ఉధృతంగా ఉండడంతో బీజేపీ అభ్యర్థి సత్యపాల్ సింగ్ సైని గెలిచాడు. అప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వ్యక్తి ఆచార్య ప్రమోద్ కృష్ణం. ఈ ప్రమోద్ కృష్ణం అప్పట్లో ఈ వివాదం గురించి మాట్లాడుతూ కల్కి అవతారానికి కావలసిన సానుకూల పరిస్థితులు కేవలం సంభాల్ లోనే ఉన్నాయని చెప్పిన విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ ప్రమోద్ కృష్ణం తర్వాత ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తిన సంగతి కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ ప్రమోద్ కృష్ణం సంభాల్ లోనే కల్కి థామ్ నిర్మించారు. ఈ కల్కిథామ్ ప్రారంభోత్సవానికి మోడీ కూడా హాజరయ్యారు. కాంగ్రెసు పార్టీలో ఇలాంటి నేతలు చాలా మంది ఉన్నారు. అవసరమైనప్పుడు తమ మతతత్వ ముఖాన్ని చూపిస్తుంటారు. కాంగ్రెసు పార్టీ ఈ నేతలను వదిలించుకుంటుందా లేక సాఫ్ట్ హిందూత్వ బాటనే నడుస్తుందా అనేది వేచి చూడాలి.
ఏది ఏమైనా సంభాల్ లో మరో బాబరీ వివాదానికి పునాదులేస్తున్నారు. వారణాసి, మధుర వివాదాలు మరోవైపు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వివాదాలు ఎంత కాలం మతతత్వ శక్తులకు గెలుపునందిస్తాయో కాలమే చెప్పాలి.