September 17, 2024

ముస్తఫా సులైమాన్ గురించి నేడు ముస్లిం యువత తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముస్తఫా సులైమాన్ గురించి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఏమన్నారంటే ‘‘ఆయన పని చూడండి. టెక్నాలజీలో ఒక రోజు పెద్ద పేరు అవుతారు’’ అన్నారు.
సులైమాన్ తండ్రి ఒక టాక్సీ డ్రైవరు. తల్లి ఇంగ్లీషు వనిత. నర్సుగా పనిచేసేవారు. లండనులో పెరిగాడు. అక్కడే చదువుకున్నాడు. ఆక్స్ ఫర్డ్ మాన్స్ ఫీల్డ్ కాలేజీ చదువు మధ్యలోనే మానేశాడు.

పందొమ్మిదేళ్ళ వయసులో ముస్లిం యూత్ హెల్ప్ లైన్ ప్రారంభించాడు. బ్రిటనులో ముస్లిం యువత కోసం ప్రారంభించిన స్వచ్ఛందసేవా సంస్థ. డ్రగ్స్, అశ్లీలం, అనైతికతల నుంచి యువతను దూరంగా ఉంచే కార్యక్రమాలు చేపట్టాడు. అప్పట్లోనే అమెరికాలో ట్విన్ టవర్ల దాడి జరిగింది. ఇస్లామోఫోబియా విపరీతంగా పెరిగింది. ముస్లిం యువత అనేక సమస్యలను ఒత్తిళ్ళను ఎదుర్కుంటున్న కాలంలో ఈ హెల్ప్ లైన్ చాలా సేవ చేసింది. ఇప్పుడు బ్రిటన్ లో ఇది అతి పెద్ద ముస్లిం హెల్ఫ్ లైన్.
ఆ తర్వాత సులైమాన్ లండను మేయరుకు మానవహక్కుల అధికారిగా పనిచేశాడు. ఆ తర్వాత సామాజిక సమస్యలు, వివాదాల పరిష్కారానికి పనిచేసే సంస్థలో పనిచేశాడు. ఐక్యరాజ్యసమితికి, డచ్ ప్రభుత్వానికి కూడా పనిచేశాడు. ఆయన లో మేనేజింగ్ నైపుణ్యాలు గొప్పగా ఉండేవి. 2009లో కోపెన్ హాగన్ లో ఒక పర్యావరణ సదస్సు జరిగింది. నిర్వాహకుల్లో సులైమాన్ కూడా ఉన్నాడు. అడవుల పరిరక్షణ విషయంలో అందరూ ఒక నిర్ణయానికి రాకపోవడం చూసి చాలా నిరుత్సాహానికి గురయ్యాడు. అప్పట్లోనే ఫేస్ బుక్ వచ్చింది. కోటి మంది ఫేస్ బుక్ వాడుతున్నారని తెలిసి ఆశ్చర్యపోయాడు. ఫేస్ బుక్ లాంటి వేదికలు సారూప్య భావాలు కలవారిని ఒక్కటి చేస్తాయన్నది గ్రహించాడు. భవిష్యత్తులో టెక్నాలజీ ఎంత ముఖ్యమో తెలిసివచ్చింది.
ఆ తర్వాత ఆయన కంప్యూటర్ రంగంలో ప్రవేశించాడు. డీప్ మైండ్ అనే కంపెనీని ప్రారంభించాడు. అది కృత్రిమ మేధస్సు పై పరిశోధనలు చేసే కంపెనీ. డీప్ మైండ్ ఏం చేస్తుంది అంటే, సాధారణంగా మనుషులు చాలా సమయం తీసుకుని ఆలోచించి తీసుకునే నిర్ణయాలను డీప్ మైండ్ క్షణాల్లో చెబుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గురించి పద్నాలుగు సంవత్సరాల క్రితమే మాట్లాడిన వాడు సులైమాన్. అప్పట్లో ఆయన్ను చాలా మంది హేళన చేసేవారు. కాని డీప్ మైండ్ ను ఎలాన్ మాస్క్, పేపాల్ కు చెందిన పీటర్ థీల్ తదితరులు గమనించడమే కాదు పెట్టుబడులు కూడా పెట్టారు. 2014లో డీప్ మైండ్ ను గూగుల్ 65 మిలియన్ డాలర్లకు కొనేసింది. అమెరికా బయట గూడుల్ అక్విజిషన్లలో ఇది అతి పెద్ద డీల్.
డీప్ మైండ్ ఏం చేసిందంటే… గూగుల్ కు ప్రపంచవ్యాప్తంగా డాటా సెంటర్లున్నాయి. ఇక్కడ డాటా సెంటర్లను చల్లగా ఉంచడానికి చాలా విద్యుచ్ఛక్తి ఖర్చవుతోంది. ఈ సమస్యకు పరిష్కారం డీప్ మైండ్ కనుక్కుంది. గూగుల్ విద్యుచ్ఛక్తి ఖర్చు నలభై శాతం తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా విద్యుచ్ఛక్తి వినియోగం, పర్యావరణ కాలుష్యాల సమస్యకు ఇదే జవాబు ఇవ్వగలదు.
సులైమాన్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లో ఉన్నారు. కన్సూమర్ ఏఐ యూనిట్ కు సిఈఓ.
టెక్నాలజీ ప్రపంచంలో ముస్లిముల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో సులైమాన్ వంటి వారు టెక్నాలజీ రంగంలో సాధించిన విజయాలు యువతకు స్ఫూర్తిదాయకాలు. టెక్నాలజీలో ముస్లిం యువత తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శించవలసిన అవసరం ఉంది.