November 12, 2024

ఈ వారం ఫేక్ వార్తలను గమనిస్తే, నవంబర్ 4వ తేదీన బూమ్ వార్తసంస్థలో సుజిత్, అన్మోల్ అల్ఫోన్సోలు ఒక ఫేక్ వీడియో గుట్టు రట్టు చేశారు.  ఇజ్రాయెల్‌లోని యుఎస్ ఎంబసీపై హమాస్ దాడి చేసిందన్నట్టు చూసించే ఒక ఫేక్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం ప్రారంభించింది.

వాస్తవానికి, ఈ వీడియో మే 30, 2020న అమెరికా, వర్జీనియాలో ఉన్న డొమినియన్ ఎనర్జీ పాత ప్రధాన కార్యాలయాన్ని కూల్చివేసిన సంఘటనకు సంబంధించింది. ఆ కూల్చివేత అధికారికంగా, నిపుణుల నియంత్రణలో జరిగిన కూల్చివేత. ఫేస్‌బుక్, యూట్యూబ్, టిక్ టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ తప్పుడు సమాచారం ప్రచారం చేశారు. అక్టోబరు 7 హమాస్ దాడి తర్వాత గాజా స్ట్రిప్ పై  ఇజ్రాయెల్ వైమానిక దాడుల నేపథ్యంలో ఈ ఫేక్ వార్త వచ్చింది. ఇస్రాయీల్ దాడుల్లో అమాయకపౌరులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్న వార్తల నేపథ్యంలో ఈ ఫేక్ వార్తను చూడాలి. ఇస్రాయీల్ దాష్టికాలకు పరోక్ష సమర్థింపునిచ్చేలా ప్రజాభిప్రాయాన్ని మలచడానికి ఉద్దేశించిన ఫేక్ వార్తలివి. సున్నితమైన సమయాల్లో ఉద్రిక్తతలను పెంచి, ప్రజలను తప్పుదారి పట్టించే ఫేక్ ప్రచారం ఇది.. తప్పుడు సమాచారం వ్యాప్తిని ఎదుర్కోవడంలో బాధ్యతాయుతమైన జర్నలిజం ఆవశ్యక్తను చాటి చెబుతున్నయి ఈ సంఘటనలు.

మరో ఫేక్ వార్త చూద్దాం…

ఈ వార్త కేరళకు సంబంధించింది. కేరళలో పాలస్తీనా అనుకూల ర్యాలీలో తిరువనంతపురం పార్లమెంటు సభ్యుడు శశి థరూర్ తీవ్రవాద సంస్థ హమాస్‌కు మద్దతు ఇస్తున్నట్లు మాట్లాడినట్లు వీడియో ప్రచారంలోకి వచ్చింది. అక్టోబర్ 26న కోజికోడ్ బీచ్‌లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) నిర్వహించిన ర్యాలీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియా పోస్ట్‌లలో వక్రీకరించి చూపించారు. నిజానికి థరూర్ హమాస్, ఇజ్రాయెల్ రెండింటి చర్యలను ఖండించారు, హమాస్ ను ఉగ్రవాదులుగా పేర్కొంటూ హమాస్  అక్టోబర్ 7 దాడికి ప్రతిస్పందనగా ఇస్రాయీల్ పాలస్తీనాలో సృష్టిస్తున్న రక్తపాతాన్ని కూడా ఆయన విమర్శించారు.  ప్రకటనలు యుద్ధ చట్టాలు, జెనీవా ఒప్పందాలను ఉల్లంఘించడాన్ని థరూర్ వేలెత్తి చూపించారు. అమాయక పౌరుల రక్షణ గురించి నొక్కి చెప్పారు. థరూర్ ప్రసంగాన్ని తప్పుగా చూపించి, రెచ్చగొట్టే కథనాలతో అగ్నికి ఆజ్యం పోసేలా వాస్తవాలను వక్రీకరించడం ఈ ఫేక వార్తలు ప్రచారం చేస్తున్న వారి ముఖ్య ఉద్దేశ్యం. ఇటువంటి చర్యలు ప్రజలను తప్పుదారి పట్టించడమే కాకుండా వ్యక్తులను, సంస్థలను అన్యాయంగా కించపరుస్తాయి, ఉద్రిక్తతలను రేకెత్తిస్తాయి. నవంబర్ 3న  క్వింట్ వార్తా సంస్థ ఈ ఫేక్ ప్రచారం వాస్తవాన్ని బట్టబయలు చేసింది. ఇంకో తప్పుడు వార్తను చూద్దాం, అక్టోబర్ 23న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు చెన్నైలోని M.A. చిదంబరం స్టేడియంలో భారత జాతీయ జెండాను నిషేధించారనే తప్పుడు వార్త వైరల్ అయ్యింది. Alt News ఇది తప్పుడు వార్త అని నిర్ధారించింది. ఒక పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ భారత జెండాను డబ్బాలోంచి తీసి పోలీసు వ్యాన్‌లో ఉంచుతున్నట్లు చూపించే వీడియో ద్వారా ఈ పుకారు మొదలు పెట్టారు. ఇది డిఎంకె ప్రభుత్వం,  తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టిఎన్‌సిఎ)ల ప్రతిష్ఠను దెబ్బతీయడానికి తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె. అన్నామలై తదితరులు పన్నిన కుట్రగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారత జెండాను స్టేడియంలోకి తీసుకెళ్లడంపై ఎలాంటి నిషేధం లేదని ట్రిప్లికేన్ డిప్యూటీ కమిషనర్ దేశ్‌ముఖ్ శేఖర్ సంజయ్ స్పష్టం చేశారు. ఈ సంఘటన ఒక సబినస్పెక్టరు అత్యుత్సాహం వల్ల చోటు చేసుకుంది. అతన్ని విచారణ తర్వాత కంట్రోల్ రూమ్‌కు బదిలీ చేశారు. గ్రేటర్ చెన్నై పోలీసులు కూడా ట్విట్టర్‌లో  ప్రతిస్పందించారు, చాలా మంది ప్రేక్షకులు స్వేచ్ఛగా స్టేడియం లోపల భారత జెండాను తీసుకువెళుతున్నారని, ఎలాంటి నిషేధాలు లేవని ప్రకటించారు. తప్పుడు సమాచారం ఎంత వ్యాగంగా వ్యాప్తి చెందుతుందో ఈ సంఘటన వల్ల తెలుస్తోంది. సమాచారాన్ని నమ్మే ముందు, ఫార్వార్డ్ చేసే ముందు ధృవీకరించుకోవడం ఎంత అవసరమో దీన్ని బట్టి తెలుస్తోంది.

ఆస్ట్రేలియా వెళ్లడానికి బదులుగా పొరపాటున ఆస్ట్రియా వెళ్ళిన వారికి ఆస్ట్రియాలోని సాల్జ్‌బర్గ్ విమానాశ్రయంలో  ప్రత్యేక డెస్క్‌ని ఉందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయ్యింది. ఆన్‌లైన్‌లో ఈ వార్త చాలా మందిని ఆకర్షించింది. ది క్వింట్ వార్తా సంస్థ వార్త పచ్చి అబద్దంగా తేల్చి చెప్పింది.

ఆస్ట్రియా విమానాశ్రయం అధికారులు,  సెక్యూరిటీ మరియు కమ్యూనికేషన్ కంపెనీ కమెండ్ ఇంటర్నేషనల్ తదితరులు అటువంటి డెస్క్ లేదా బటన్ ఎప్పుడూ ఉనికిలో లేదని ధృవీకరించారు. ఆస్ట్రియా, ఆస్ట్రేలియాల మధ్య తరచు అంతర్జాతీయ ప్రయాణీకులు ఎదుర్కునే అయోమయంపై హాస్యం కోసం ఎవరో పెట్టిన పోస్టు ఇది. హాస్యాన్ని తప్పుగా అర్థం చేసుకుని కొందరు తప్పుదారి పట్టించేలా ప్రచారం చేసే ప్రమాదాన్ని ఈ సంఘటన సూచిస్తోంది. ఇంకో ఫేక్ వార్త చూద్దాం, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కమల్ నాథ్ తాను ఎన్నికైతే లాడ్లీ బెహనా పథకాన్ని రద్దు చేస్తానని చెప్పారంటూ ఒక కథనం వైరల్ అయ్యింది. ఇది ఒక ఆడియో క్లిప్. సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం, అర్హులైన మహిళలకు నెలవారీ స్టైఫండ్‌ను అందిస్తుంది, ఇటీవల ఈ పథకం క్రింద లభించే మొత్తాన్ని రూ.1,250కి పెంచారు. మధ్యప్రదేశ్ లో నవంబర్ 17న ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి. ఈ నేపథ్యంలో ప్రజలను  తప్పుదారి పట్టించేలా ఈ వీడియో వచ్చింది. కమల్ నాథ్ మహిళల సంక్షేమాన్నినిర్లక్ష్యం చేస్తారన్నట్లు  రెచ్చగొట్టే క్యాప్షన్ లతో దీన్ని ప్రచారంలో పెట్టారు. BOOM వార్తా సంస్థ నిజనిర్ధారణలో ఈ వార్త పెద్ద అబద్దమని బట్టబయలు అయ్యింది. ఆడియోను సూపర్ ఇంపోజ్ చేశారని, కమల్ నాథ్ మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో చేసిన అసలు ప్రసంగంలో అసలు ఈ లాడ్లీ  పథకం గురించి ప్రస్తావనే లేదని స్పష్టమయ్యింది. ఆయన తన కాలంలో సాధించిన విజయాలను, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను తన ప్రసంగంలో వివరించారు. రాజకీయ స్వార్త ప్రయోజనాల కోసం అసలు ప్రసంగాన్ని మార్చి  నకిలీ వార్తలు ప్రచారంలో పెట్టి బీజేపీకి లాభం చేకూర్చే ప్రయత్నం ఈ ఫేక్ వార్త వెనుక ఉంది. ముఖ్యంగా ఎన్నికల వంటి సున్నితమైన సమయాల్లో సమాచారాన్ని వెరిఫై చేయడంలో తగిన శ్రద్ధ తీసుకోవాల్సిన  అవసరాన్ని చాటి చెప్పే సంఘటన ఇది. ఈ పేక్ వార్త ప్రచారంలోకి వచ్చిన తర్వాత మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌ కార్యదర్శి రాకేష్‌ సింగ్‌ యాదవ్‌ వేగంగా చర్యలు తీసుకున్నారు. ఈ ఫేక్ వార్తకు వ్యతిరేకంగా క్రిమినల్ ఫిర్యాదును దాఖలు చేశారు.