July 15, 2024

బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుటుంబ నియంత్రణ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై గగ్గోలు చెలరేగింది. ఆయన సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారని డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ అన్నారు. బీజేపీ నేతలు ఇప్పుడు నితీష్ కుమార్ వ్యాఖ్యలపై గగ్గోలు చేస్తున్నారు. కాని దేశంలో చాలా మంది గ్రామీణ నిరుపేద మహిళలకు గర్భనిరోధ సాధనాలు అందుబాటులో లేవన్నది కూడా అంతే నిజం. కాని నితీష్ కుమార్ వ్యాఖ్యలపై స్వయంగా ప్రధాని కూడా దండెత్తారు. ఇంకెంత దిగజారిపోతారు, ఇండియా కూటమి నేతలు ఇంకెంత దిగజారిపోతారంటూ ధ్వజమెత్తారు.

నితీష్ కుమార్ వ్యాఖ్యల్లో ఔచిత్యం గురించింది వేరే చర్చ. ఆయన లేవనెత్తిన సమస్య తీవ్రమైందా కాదా అన్నది వేరే చర్చ. కాని ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు.
నితీష్ కుమార్ వ్యాఖ్యలు అసభ్యంగా ఉన్నాయని దాడులు చేస్తున్న బీజేపీనేతలు బీజేపీ ప్రముఖ నాయకుడు నిశికాంత్ దూబే తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రాను నగరవధు అని తిట్టిన విషయం మరిచిపోయారా? నగరవధు అనే మాటకు అర్థమేమిటి? వాడవదిన అనే తెలుగు మాటకున్న అర్థమే కదా. ఇంతకన్న విడమర్చి ఈ మాటలకు అర్థాలు చర్చించడం మర్యాదను అతిక్రమించడమే అవుతుంది. కాని ఇలాంటి మాటలు నిజానికి నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యల కన్నా తీవ్రమైనవి కావా? అప్పుడు ఈ నీతులు చెప్పేవారు ఎవరైనా నిశికాంత్ దూబేకు నీతులు చెప్పారా? సోనియాగాంధీని కాంగ్రెస్ కి విధవా అని పిలిచినవారిని ఏమనాలి?
ఢిల్లీ వీధుల్లో మన మహిళా మల్లయోధులు లైంగిక వేధింపులపై నిరసనలు తెలిపిన సంఘటనలు గుర్తున్నాయా? బ్రజ్ భూషన్ సింగ్ మహిళా క్రీడాకారిణులను లైంగికంగా వేధించడానికి ఎలాంటి అవకాశమూ వదిలేవాడు కాదని పోలీసులు కూడా చెప్పలేదా? ఈ విషయంలో ప్రధాని నోరిప్పారా? బీజేపీ నేతలెవరైనా నోరిప్పారా?
మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన తర్వాత బీజేపీ నేతలెంతమంది నోరిప్పారు?
మహిళలను గౌరవిస్తున్న మహా సంస్కారవంతులుగా ముందుకు వస్తున్న వాళ్ళు తమ పార్టీ విషయమై ఎందుకు నోరిప్పరు?
నితీష్ కుమార్ వ్యాఖ్యలు పురుషాహంకార వ్యాఖ్యలుగా విమర్శిస్తున్నవారు గతంలో తమ పార్టీ నేతలు చెప్పిన అనేక మాటలపై మౌనం వహించినవారే.
మౌనం అనేది అనేక విషయాల్లోను మన ముందుకు వస్తోంది. ఇటీవల డెహ్రాడూన్ లో ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగేశ్వర్ థామ్ బాబా ధీరేంద్రశాస్త్రితో పాటు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిములపై, క్రయిస్తవులపై విద్వేష వ్యాఖ్యలు బాహాటంగా చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి తలవంపులు తెచ్చే సంఘటన కాదా? ఇది మొదటి సంఘటన కూడా కాదు. ధర్మసంసద్ లలో ఇలాంటి విద్వేషం బాహాటంగా వినిపించింది. పురుషాహంకారపు వ్యాఖ్యలు ఎవరైనా చేయడం ఎంత తప్పో, ఒక మతాన్ని, కులాన్ని కించపరుస్తూ ఎవరైనా మాట్లాడినా అంతే తప్పు. ఇలాంటి వ్యాఖ్యలపై మీడియా నోరెత్తడం లేదు ఎందుకని?
ఏది ఏమైనా నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యల్లో తప్పు ఉంటే తప్పక నిందించవలసిందే. తప్పన నిలదీయవలసిందే. తప్పక ఖండించవలసిందే. కాని అదేవిధంగా పురుషాహంకారంతో మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యానించే ప్రతి నాయకుడిని నిలదీయాలి.   నగరవధు లాంటి వ్యాఖ్యలు చేసేవారు, ఇంట్లోపోయి అంట్లు తోముకో రాజకీయాలెందుకు అంటూ వ్యాఖ్యలు చేసినవారు ఏ పార్టీ వాళ్ళయినా వారిని కూడా ఖండించాలి. అలాగే మత దురుహంకారం ప్రదర్శిస్తూ ఒక సముదాయాన్ని వెలివేస్తున్నామని ప్రకటనలు చేసేవారు, ఒక సముదాయంపై విద్వేష వ్యాఖ్యలు చేసేవారందరినీ ఖండించాలి. మీడియాలో ఇప్పుడు నితీష్ కుమార్ వ్యాఖ్యలపై గగ్గోలు చేస్తున్న యాంకర్లు, నేతలు ఇలాగే వ్యవహరిస్తున్నారా? ప్రతి సారి తప్పును నిలదీస్తున్నారా? లేక తమ స్వంత వారి విషయంలో కళ్ళుమూసుకుంటున్నారా? ప్రజలే ఆలోచించాలి.