May 16, 2024

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు: గర్భంలో ఒక బిందువు ప్రవేశించగానే మనిషి పుట్టుక మొదటి మజిలీ మొదలవుతుంది. ఆ బిందువు క్రమక్రమంగా నెత్తుటి ముద్దలా ఏర్పడుతుంది. తదుపరి మాంసపు ముద్దలా తయారవు తుంది. 120 రోజుల ఈ కాలక్రమం తర్వాత మనిషి పుట్టుక ఒక రూపాన్ని దాలుస్తుంది. అప్పుడు అల్లాహ్ తన దైవదూతను పంపిస్తాడు. ఆ దైవదూతను ఆ మాంసపు ముద్దలో ప్రాణం పోసి, నాలుగు విషయాలను గురించి వ్రాయమని ఆదేశించడం జరుగుతుంది. ఉపాధి, ఆయుష్షు, ఆచరణ, అతను మంచి వ్యక్తిగా మారుతాడా లేక దుర్మార్గునిగా తయారవుతాడా ఇత్యాదివి.

తఖ్దీర్‌ (తలరాత ,అదృష్టం) అంటే శాబ్దిక అర్ధం అంచనా వేయడం. ఇస్లాం పరిభాషలో  సర్వ సృష్టికర్త అయిన అల్లాప్‌ా తన సంపూర్ణ జ్ఞానంతో మనిషి గురించి అతని అదృష్టాన్ని రాస్తాడు. అది అల్లాహ్ రచించాడు కాబట్టి అందులో ఏమాత్రం లోపం ఉండదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు  ఇలా ప్రవచించారు : మనిషి ఆచరణ ఒక్కోసారి చూడ్డానికి స్వర్గానికి అర్హుడు  అయ్యేలా  ఉంటుంది. ఒక్కోసారి నరకానికి అర్హుడు అయ్యేలా  ఉంటుంది. ఇలానే జీవితం కొనసాగుతూ ఉంటుంది. కానీ చివరి రోజులలో అతని ఆచరణలో మార్పు సంభవిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే అల్లాప్‌ా తాను సంపూర్ణ  జ్ఞాని అయినప్పటికీ మనిషికి స్వేచ్ఛను ప్రసాదించాడు. కాబట్టి మనిషి అర్హతను అతని ఆచరణ మాత్రమే నిర్ణయిస్తుంది.

అందుకే మనిషి తన ముగింపును గురించి భయపడుతూ ఉండాలి. స్వర్గానికి అర్హత సంపాదించే ఆచరణతోనే తనకు మృత్యువు సంభవించాలని నిత్యం ప్రార్థించుకోవాలి. దీనినే ఈమాన్‌ బిల్‌ ఖద్ర్‌ (అదృష్టాన్ని విశ్వసించడం) అంటారు. మౌలానా సులైమాన్‌ నద్వీ (రహ్మ) గారు దీని గురించి అత్యుత్తమమైన మాటలు రచించారు.

ఈమాన్‌ బిల్‌ ఖద్ర్‌ అర్థం ఏమిటంటే ఈ ప్రపంచంలో ఏదైతే ఇప్పటి వరకు సంభవించిందో, ఇక ముందు సంభవిస్తుందో, ప్రస్తుతం సంభవిస్తున్నదీ అంతా అల్లాహ్ జ్ఞాన పరిధిలో ఉన్నదే.  ఏ విధంగానైతే ఒక ఇంజనీర్‌ ఇంటిని నిర్మించే ముందు ఆ స్థలాన్ని  పరిశీలించి ఒక డిజైన్‌ రూపొందించుకుంటాడో, అదే డిజైన్‌కు అనుగుణంగా కార్మికులు ఆ నిర్మాణాన్ని పరిపూర్తి చేస్తారో, అదేవిధంగా సర్వసృష్టి  ఇంజనీర్‌ అయిన అల్లాహ్ సృష్టిని సృష్టించే మునుపే దాని పరిపూర్తి, నియమ నిబద్ధతలను, ఇతర ముఖ్యమైన విషయాలను నిర్ణయించి ప్రతి విషయానికి గాను ఒక తుది నిర్ణయాన్ని రాసి పెట్టేసాడు. ఇప్పుడు దాని ప్రకారంగానే ఈ సృష్టి, సంఘటనలు అన్నీ జరుగుతున్నాయి. జీవన్మరణాలు, కలిమి లేములు,  జయాపజయాలు,  సుఖ దుఃఖాలు, కష్టనష్టాలు` ప్రతి విషయం మొదటి నుంచే నిర్ణయించబడి ఉంది. దాని ప్రకారంగానే అది అమలు అవుతుంది.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దైవదౌత్యంలో  ఈ అదృష్టాన్ని కేవలం సిద్ధాంతంలా పరిగణించి వదిలి వేయబడ లేదు. దానికి  భిన్నంగా పలుమార్లు ఈ విషయాన్ని ప్రస్తావించి దానిని విశ్వాసంగా పరిగణించడం జరిగింది. ఈ విశ్వాసం దృఢమైన నమ్మకంలా మనిషి నరనరాల్లో  చొచ్చుకుని పోవాలి. ఇలా ఎందుకంటే మనిషి జీవితంలో సంభవించే కష్టాలు, సంఘటనలు, ప్రమాదాలు అన్నీ దైవ నిర్ణయమే అని అతను విశ్వసించాలి. ఇది ఒక ప్రయోజనకరమైన బోధనారూపం దాల్చాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు చేర వేయబడిన దైవవాణిలో అదృష్టాన్ని రెండు పదాలతో పేర్కొనడం జరిగింది.

1) ఖద్ర్‌ అంటే అంచనా

2) ఖజా అంటే నిర్ణయం

మేము ప్రతి వస్తువునూ ఒక విధి నిర్ణయంతో పాటు సృష్టించాము.    (అల్‌ ఖమర్‌ : 49)

ఆయనే మిమ్మల్ని మట్టితో సృజించాడు. తరువాత మీ కొరకు ఒక జీవన వ్యవధిని నిర్ణయించాడు. (అన్‌ ఆమ్‌ :2)

ఈ రెండు పదాలు స్వయంగా ఇస్లాంలో అదృష్టాన్ని విశ్వసించడం పట్ల ఉన్న వాస్తవాన్ని పూర్తిగా విశ్లేషిస్తున్నాయి. ఉద్దేశం ఏమిటంటే సృష్టిలోని ప్రతి వస్తువుకు సంబంధించి అల్లాప్‌ా తన అంచనా ప్రకారం వారి తలరాతల గురించి ప్రతి విషయంలో తుది నిర్ణయం  చేసేశాడు. దీని ప్రకారం ఈ సృష్టి  నడుస్తుంది. ఇందులో అల్లాప్‌ా ఆజ్ఞ లేనిదే  కొద్దిపాటి మార్పు కూడా సంభవించదు. ఆకాశాన్ని ఏ విధంగానైతే సృజించాడో , సూర్యుణ్ణి ఎంత వెలుతురుతో సృష్టించాడో, చంద్రునికి సంబంధించి ఏ నియమాలనైతే  నిర్ణయించాడో,  నక్షత్రాలు  ఎప్పుడు    ఉదయించాలో, ఎప్పుడు అస్తమించాలో దాని గురించిన ఏ ఆజ్ఞల నైతే జారీ చేశాడో, జీవన్మరణాలు, వినాశనాలు, ఉత్థాన పతనాలు` ఈ విధంగా సృష్టికి సంబంధించిన ప్రతి కోణం గురించి అల్లాహ్ ఏవైతే నిర్ణయించాడో  వాటి ప్రకారంగానే అవి మనుగడ  కొనసాగిస్తున్నాయి.

ప్రతి వస్తువు గురించి ఏదైతే అల్లాహ్ నిర్ణయించి ఉంచాడో దానినే అందరూ ప్రకృతి నియమంగా పిలుచుకుంటారు. ఇదేవిధంగా అల్లాహ్ సృష్టిలోని  ప్రతి భాగంలో, ప్రతి కోణానికి సంబంధించి తమ ఆదేశాలను జారీ చేసాడు. దానిని  అనుసరించడం తప్పనిసరి. మనిషి ఉత్థాన పతనాలు, జీవన్మరణాలు, ఆరోగ్య అనారోగ్యాలు, కలిమి లేములు, సుఖదుఃఖాలు, పాప పుణ్యాలు ప్రతి విషయంలో నియమ నిబంధనలు జారీ చేశాడు.

ఏ ఆపద అయినా అల్లాహ్ అనుమతి లేనిదే ఎన్నటికీ రాదు.  (అత్‌ తగాబున్‌ 11)

ఖజా, ఖద్ర్‌` ఈ రెండిరటి వాస్తవ ఉద్దేశం విశ్వాసం, నైతిక విలువలు అని ఖుర్‌ఆన్‌ వివరించింది. మనిషి తన చిరు ప్రయత్నంతో ఏదైనా విజయాన్ని సాధిస్తే గర్వానికి  పోతాడు. ఎప్పుడైనా అపజయం పాలైతే పూర్తిగా నిరాశ చెందుతాడు. ఈ నైతిక పతనం ఎందుకు కలిగి ఉంటాడంటే తన జీవితంలో సంభవించే మంచీచెడులు తన కృషి ద్వారానే సంభవిస్తాయని భావించడమే. ఒక్కోసారి తన కృషితో సాధిస్తే గర్వాహంకారిగా మారిపోతాడు. ఒక్కోసారి నిరాశ పరునిగా మారిపోతాడు. ఈ రెండు పరిస్థితులు మనుష్యుల ఓర్పును, స్థిరత్వాన్ని నాశనం చేస్తాయి.

అందుకే మనిషి జయాపజయాల పరిస్థితులలో, సంతోషంలోనూ, దుఃఖంలోనూ వినయ వినమ్రతలతో మెలిగేటటువంటి ఒక నమ్మకం, విశ్వాసం కావాలి. అదే ఈ అదృష్టంపై విశ్వాసం.

ఈ విశ్వాస ఆంతర్యం ఏమిటంటే మనకు ఏదైనా విజయం లభిస్తే అది మన ప్రయత్న ప్రతిఫలం కాదు, అల్లాహ్ అనుగ్రహం. అందుకే మనం గర్వాతిశయానికి పోవడం తగదు. అదే విధంగా ఏదైనా నష్టం వాటిల్లితే ఇది కూడా అల్లాహ్ వివేకం,విజ్ఞతలతోనే  సంభవించింది అని మనం భావించాలి. మన ప్రతి పని వెనుక కూడా సర్వసృష్టికర్త నిర్ణయాలు ఉన్నాయని భావించాలి .మరలా మన ప్రయత్నంలో నిమగ్నమవ్వాలి.

భూమిపై గాని లేదా స్వయంగా మీ ఆత్మలపై గాని అవతరించే ఏ ఆపద అయినా సరే దానిని మేము ఉనికిలోకి తీసుకువచ్చే ముందు ఒక గ్రంథం (అంటే భాగ్య గ్రంధం)లో వ్రాసి పెట్టకుండా ఉండలేదు. అలా చేయటం అల్లాహ్ కు చాలా సులభం. (ఇదంతా ఎందుకంటే) మీకు ఎలాంటి నష్టం జరిగినా, దానికి మీరు బాధపడకుండా ఉండాలని, అల్లాహ్ మీకు ఏదైనా ప్రసాదిస్తే, దానికి మీరు మిడిసిపడకుండా ఉండాలని. తమని తాము గొప్ప వారమని భావించి, అహంభావం ప్రదర్శించే  వారిని అల్లాహ్ ప్రేమించడు. (అల్‌ హదీద్‌ 22)

ఈ వాక్యంలో ఖజా, ఖద్ర్‌లు ఎంతగా విశ్లేషించబడ్డాయంటే వాటికి మరింత వివరణ అవసరం లేదు. ఈ విశ్వాస ప్రతిఫలమే సహాబా (రజి) వారి శిరస్సులు విజయ పతాకాలను ఎగురవేసిన పరిస్థితులలో అల్లాప్‌ా ముందు సాష్టాంగ పడేవి. అపజయాల పరిస్థితులలో వారు ఆత్మ విమర్శనకు సమాయత్తమయ్యేవారు. వారి దైనందిన  జీవితంలో ఏది తారసపడినా అది తన తరఫునుంచి కాదు అల్లాహ్ తలిస్తేనే ఇది సంభవిస్తుందని మౌనం వహించేవారు. ఆర్థిక సంక్షోభం,  రాజకీయ ఆపదలు, ప్రియమైన వారి ఎడబాటు, యుద్ధాలలో పరాజయం ఇత్యాది సందర్భాలలో వారు అల్లాప్‌ా కారుణ్యం పట్ల నిరాశ చెందేవారు కాదు.  అత్యంత ప్రమాదకరమైన పనికై వారు నడుం బిగించేవారు. వారి విశ్వాసం ఏమిటంటే మరణం కచ్చితంగా నిర్ణీత సమయంలో సంభవిస్తుంది. ఏది జరగాలో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందుకే వారి హృదయాలలో ఎటువంటి లక్ష్యం వారు కలిగి  ఉండే వారంటే ఏ శక్తి  కూడా దాన్ని ఆపలేదు.  ఏ ఆపదల తుఫాను, ఏ మండుతున్న అగ్ని జ్వాలలు ఆ లక్ష్యాన్ని చిన్న బుచ్చేవి కావు.

ఈ విశ్వాసమే ముస్లింలను ఎంతో మనోస్థైర్యాన్ని , మనోనిబ్బరాన్ని, పటిష్టమైన లక్ష్యాన్ని,  నిర్భయ శక్తిని ప్రసాదించే రహస్యం. కొందరు కొన్ని అపోహలతో ఈ విశ్వాసాన్ని కలిగి ఉండడం వలన మనిషి ఒత్తిడికి లోనవుతాడని, ఎటువంటి స్వేచ్ఛ లేకుండా జీవిస్తాడని భావించారు. తద్వారా మనిషి తన  నుదుటిరాతపై నమ్మకం  ఉంచుకొని ఓర్పుతో, కృతజ్ఞతతో బద్దకంగా, నిర్లక్ష్యంగా తన జీవితాన్ని గడపాలి అని ద్యోతకమవుతుందని భావించారు. కానీ ఇదే ఒకవేళ నిజమైతే ప్రవక్తల పరంపర అవసరమే ఉండేది కాదు. ఆకాశ గ్రంథాలను అవతరింప చేయాల్సిన అవసరమే  ఉండేది కాదు.  సందేశ ప్రచారాలు, సంస్కరణలో ఇవేవీ అవసరమే ఉండేవి కావు. దీనికి భిన్నంగా అల్లాప్‌ా లక్ష పైచిలుకు ప్రవక్తలను పంపించాడు. ఎన్నో ఆకాశ గ్రంధాలను అవతరింపజేశాడు. కొన్ని కోట్ల సందేశ ప్రచారకులు ఇస్లాం సందేశాన్ని అందజేశారు. మార్గదర్శనం పై మాటిమాటికి తాకీదు చేయబడిరది. ప్రజల వద్దకు సందేశాలు చేరవేయబడ్డాయి. సంస్కరించడం ముస్లింల విధిగా ఖరారు చేయబడిరది. నిరంతర కృషి చేయాలని ప్రతి ముస్లింకి సూచించబడిరది .ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం  వారి నిరంతర కృషితో నిండిన జీవితం మనందరికీ ఆదర్శప్రాయం.

వాస్తవం ఏమిటంటే ఒకవేళ నిజంగానే మనిషి స్వేచ్ఛా జీవి కాకపోయి ఉంటే ఏవిధంగానైతే ఇతర  జీవరాసులు మంచీ చెడుల విచక్షణ జ్ఞానాన్ని కలిగి లేవో, అవి ప్రళయ దినాన స్వర్గనరకానికి అర్హులు కావో. మనిషి జీవితం కూడా అదే విధంగా ఉంది అని భావించాల్సి వస్తుంది. కాబట్టి మనిషి తన జీవిత లక్ష్యాన్ని గుర్తించి కేవలం తన అదృష్టంపై భరోసా  పెట్టుకుని జీవితాన్ని గడపకుండా నిరంతర కృషితో తన మంచి ఆచరణతో స్వర్గానికి అర్హత సంపాదించాలి.

  • – ఆలియా బిన్తె మునీర్ షర్ఫియా