అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ముస్లిం గ్రూపులు చీలిపోయినట్లు కనిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను సమీపిస్తున్న తరుణంలో, ముస్లిం సమాజం భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ మధ్య ఎవరి వైపు మొగ్గాలో తెలియని అయోమయానికి గురవుతోంది. బీఆర్‌ఎస్ ఎన్నికల హామీలను నెరవేర్చలేదనే విమర్శ ఉంది. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ వంటి విషయాల్లో బిఆరెస్ విఫలమైందని విమర్శిస్తున్నారు. వైస్ చాన్సలరుగా ఒక్క ముస్లిం కూడా లేకపోవడం, సర్వీస్ కమీషన్‌లో ముస్లిములకు ప్రాతినిథ్యం లేకపోవడం వంటి అనేక అసంతృప్తులున్నాయి.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో పోల్చుతూ బీఆరెస్ కూడా అలాంటిదేనని, ప్రత్యామ్నయం కాంగ్రెస్ అంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం ఫ్రంట్ వాదిస్తోంది. మరోవైపు యునైటెడ్ ముస్లిం ఫోరమ్ మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వ అంకితభావాన్ని ప్రశంసిస్తూ బీఆర్‌ఎస్‌కు తన మద్దతునిచ్చింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మైనారిటీ సంక్షేమానికి అత్యధిక బడ్జెట్‌ను కేటాయించి, మైనారిటీల సామాజిక, ఆర్థిక స్థితిగతులకు గణనీయంగా ప్రయోజనం చేకూర్చే పథకాలను ప్రారంభించినందుకు బిఆర్‌ఎస్‌ను యునైటెడ్ ముస్లిం ఫోరమ్ ప్రశంసించింది. రెసిడెన్షియల్ పాఠశాలల స్థాపన, ‘షాదీ ముబారక్’ పథకం మైలురాళ్లుగా యునైటెడ్ ముస్లిం ఫోరమ్ పేర్కొంది. తమ ప్రయోజనాలు ఎవరు కాపాడతారన్న చర్చ ముస్లిం సముదాయంలో పెద్దస్థాయిలో జరుగుతోంది. ఇది రాజకీయ చైతన్యానికి నిదర్శనం. ముస్లిం ఓట్ల మొగ్గు ఎటువైపు ఉంటుందో దాన్ని బట్టి ఎన్నికల ఫలితాలు కూడా ఉంటాయని చాలా మంది భావిస్తున్నారు.