October 30, 2024

గూగుల్‌ ఇటీవల ఒక నిర్ణయం తీసుకుంది. పాస్‌ వర్డు స్థానంలో పాస్‌ కీ ఉపయోగించాలని చెబుతోంది. ఈ నిర్ణయానికి కారణ మేమిటంటే, పాస్‌ వర్డు చాలా మంది మరిచిపోతుంటారు, చాలా మంది పాస్‌ వర్డు పోగొట్టుకుంటారు, ఎక్కడ రాసిపెట్టింది గుర్తుండదు, అందువల్ల పాస్‌ కీ తీసుకొచ్చామంటున్నారు. నిజానికి ఈ టెక్‌ కంపెనీలు పాస్‌వర్డు పెట్టడానికి అనేక ఆంక్షలు పెడుతుంటాయి. ఎనిమిది, పదక్షరాలుండాలి, నెంబర్లుండాలి, పాత పాస్‌ వర్డు వాడరాదు, సింబల్స్‌ ఉండాలి ఇలా అనేక ఆంక్షలతో పాస్‌వర్డు తయారు చేసుకోవడమే కష్టం.

తర్వాత దాన్ని గుర్తుంచుకోవడం ఇంకా కష్టం. ఒక్క గూగుల్‌ మాత్రమే కాదు, అనేక పాస్‌వర్డులు, ఫేస్‌బుక్‌ పాస్‌వర్డు, ఆన్‌ లైన్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డు, ట్విటరు పాస్‌వర్డు, మనిషి జీవితం పాస్‌వర్డులను నిర్వహించుకోవడమెలా అన్నది తేల్చుకోలేని పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు పాస్‌వర్డు సమస్య మీకెందుకు, మీరు పాస్‌ కీ తీసుకోండి అంటున్నాయి. పాస్‌ కీ అంటే మీ బయోమెట్రిక్‌ గుర్తింపు. మీ వేలిముద్రలు, మీ కనుపాపల ఇమేజ్‌ వగైరా. ఇప్పుడు పాస్‌ వర్డు బదులు ఫింగర్‌ ప్రింటుతో లాగిన్‌ కావచ్చు. మన మొబైల్‌ కూడా ఇప్పుడు ఫింగర్‌ ప్రింటుతో ఓపెన్‌ అవుతుంది కదా. పాస్‌వర్డు కాలం పోయింది. ఇప్పుడు లాగిన్‌ అవ్వడానికి పాస్‌వర్డు అక్కర్లేదు. కేవలం ఫేసియల్‌ రికగ్నిషన్‌ లేదా ఫింగర్‌ ప్రింటుతో లాగిన్‌ అయిపోవచ్చు. పాస్‌వర్డులు గుర్తుంచుకునే సమస్యే లేదు. లైఫ్‌ ఈజ్‌ ఈజీ అయిపోయిందా?
పాస్‌ కీ వద్దు పాస్‌వర్డు బాగానే ఉందనుకుంటే పాస్‌ వర్డుతోనే పని చేసుకోండి. కాని కంపెనీలు తమ విధానాలను మార్చు కుంటూనే ఉంటాయి. పాస్‌వర్డు ప్రతి మూడు నెలలకు ఒకసారి మార్చాలంటాయి, కొత్త పాస్‌వర్డు తయారు చేయడం ఒక ప్రహసనం. నెంబర్లు, కేపిటల్‌ లెటర్స్‌, సింబల్స్‌ ఎనిమిదక్షరాలు, పాత పాస్‌వర్డు పని చేయదు వగైరా ఆంక్షలతో ప్రతి మూడు నెలలకు ఒకసారి పాస్‌ వర్డు మార్చడం కంటే పాస్‌ కీ తీసుకుంటే పోదా అనే స్థితికి మనం వచ్చేస్తాం. చివరకు జరిగేదేమిటంటే, మన ఫింగర్‌ ప్రింట్స్‌, మన కనుపాపల ఇమేజ్‌ వగైరా బయో మెట్రిక్స్‌ ఈ కంపెనీలకు ఇవ్వక తప్పని స్థితికి వచ్చేస్తున్నాం.
ఈ వివరాలన్నీ అప్పనంగా ఈ కంపెనీలకు ఇచ్చేసిన తర్వాత మనిషి పూర్తిగా ఈ కంపెనీల నియంత్రణలోకి వెళ్ళిపోయినట్లే. ఎక్కడికి వెళ్ళినా గూగుల్‌ మ్యాప్‌ మిమ్మల్ని వెంటాడుతుంది. మీరు వెళ్ళి వచ్చిన రెస్టారెంట్‌ మీకు తరచు మళ్ళీ రండని గుర్తు చేసే సందేశాలు పంపిస్తూ ఉంటుంది. అలాగే కంప్యూటర్‌ విజన్‌ ఎక్కడున్నా మిమ్మల్ని చూస్తూనే ఉంటుంది. మీపై నిరంతర నిఘా కొనసాగించడం చాలా సులభం అవుతుంది. గూగుల్‌ తర్వాత ఎక్స గతంలో ట్విటర్‌ కూడా బయోమెట్రిక్‌ డాటా సేకరించే పని మొదలు పెట్టేసింది. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే, మన సెర్చ్‌ హిస్టరీ, కేలండర్‌ ఈవెంట్స్‌, ఎక్కడెక్కడికి వెళ్ళారు, కాంటాక్ట్స్‌, మైక్‌ ద్వారా స్వరం రికార్డింగ్‌, మ్యూజిక్‌ ఫైల్స్‌, ఆడియో ఫైల్స్‌ ఒకటేమిటి చివరకు ఫైనాన్షియల్‌ డాటా అన్నీ ఈ కంపెనీలు సేకరిస్తున్నాయి.
ఈ డాటా సేకరించడానికి చాలా యూరపు దేశాలు ఒప్పుకోలేదు. అందువల్ల అక్కడ ఈ పనులు జరగడం లేదు. ఈ కంపెనీలు అక్కడ కూడా ఈ పని చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. మనదేశంలో కూడా ఐ.టి చట్టం ఉంది. ప్రయివసీ నియమాలున్నాయి. జర్మనీ, స్పెయిన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, ఐర్లాండ్‌, బెల్జియం ఈ దేశాల్లో మెటా థ్రెడ్స్‌ అడుగుపెట్టలేదు. ఈ దేశాలు ఒప్పుకోలేదు. ఎందుకంటే ప్రయివసీ, డాటా సమస్యల కారణంగా ఈ దేశాలు ఒప్పుకోలేదు. కాని మన దేశంలో సులభంగానే అడుగుపెట్టేసింది. డాటా ప్రయివసీకి సంబంధించి చూస్తే ఇన్‌స్టా గ్రాంకు 68.5 మిలియన్‌ డాలర్ల జరిమానా విధించడం జరిగింది. డాటా లీక్‌ చేసినందుకు ఈ జరిమానా విధించారు. ఇది ఔట్‌ ఆఫ్‌ కోర్ట్‌ సెటిల్మెంట్‌ అమెరికాలో జరిగింది.
ఈ డాటాను ఎలా వాడుకుంటారన్నది గమనించడం కూడా అవసరం. హంకాంగ్‌లో నిరసనకారులను అదుపు చేయడానికి చైనా ప్రభుత్వం ఫేసియల్‌ రికగ్నిషన్‌ ఉపయోగించింది. ప్రదర్శనలో పాల్గొన్న వ్యక్తులు తర్వాత ఏ వీధిలో ఉన్నా గుర్తుపట్టి నిర్బంధంలోకి తీసుకుంది. ఫేస్‌ రికగ్నిషన్‌ ఉపయోగించి రైల్వే స్టేషన్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉన్న వేలాది ప్రజల్లో వాంటెడ్‌ ఎవరున్నారో వెంటనే గుర్తుపట్టడం సాధ్యపడుతుంది. ఇంటర్నెట్‌ మన ప్రతి కదలికను ట్రాక్‌ చేస్తుందన్నది గుర్తించాలి. పాలస్తీనా ప్రజల సమస్య ఇదే. ఇస్రాయీల్‌ ఫేస్‌ రికగ్నిషన్‌ ద్వారా వారి ప్రతి కదలికపై నిఘా ఉంచింది. పట్టుకుని నిర్బం ధించింది.
డాటా లీకేజ్‌ ఎలాంటి సమస్యలు సృష్టిస్తుందంటే, ఒక వ్యక్తి ఒక కారు కొన్నాడు. కారు కొంటున్నప్పుడు తన డాటా ఇచ్చాడు. ఆ డాటా ఇచ్చిన తర్వాత లీక్‌ అయ్యింది. ఆ తర్వాత ఆ వ్యక్తికి ఒక ఫోను వచ్చింది. మీరు కారు కొన్నారు. మీకు లక్కీ డ్రాలో ప్రైజు వచ్చింది అని చెబుతారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని మోసగించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. డాటా లీకేజ్‌ వల్ల తలెత్తే అనేక ప్రమాదాల్లో ఇదొకటి. ఈ కంపెనీలు ఫింగర్‌ ప్రింట్స్‌తో సహా అన్ని వివరాలు సేకరిస్తున్నాయి. ఫింగర్‌ ప్రింట్స్‌ వాడుకుని బ్యాంకు ఖాతా ఖాళీ చేయవచ్చు. ఇటీవల అలాంటి ఒక వార్త కూడా మన ముందుకు వచ్చింది. హర్యానాలో ఒక వ్యక్తికి సంబంధించిన వార్త ఇది. ఆ వ్యక్తి తల్లికి సంబంధించిన ఆధార్‌ కార్డు నెంబరు, బయోమెట్రిక్‌ డాటాను ఉపయోగించి ఆమె బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ చేసేశారు. ఆమె ఖాతాలో భూమి అమ్మిన తాలుకు డబ్బు ఉంది. రిజిస్ట్రేషన్‌ కోసం ఉపయోగించిన డాక్యుమెంట్ల నుంచి కూడా ఫింగర్‌ ప్రింట్స్‌ దొంగిలించడం సాధ్యమే అంటున్నారు. ఆధార్‌ నెంబరును కూడా ఇలాగే సంపాదిస్తారు. ఆ తర్వాత బ్యాంకు ఖాతా ఖాళీ చేయడం వాళ్ళకు కష్టం కాదు. ఇది వ్యక్తిగతంగా జరిగే నష్టం.

బయోమెట్రిక్‌ డాటా లీకేజ్‌ వల్ల వ్యక్తిగతంగా జరిగే నష్టం మాత్రమే కాదు. సామాజికంగా కూడా చాలా నష్టం ఉంది. ఇప్పుడు పాలస్తీనాలో జరుగుతున్నది అదే. ఇస్రాయీల్‌ చాలా తేలిగ్గా పాలస్తీనీయులను గుర్తించి వారిని వేధిస్తోంది. కంపెనీలు సేకరించే డాటా కంపెనీలు లీక్‌ చేయవచ్చు. లేదా అక్కడ లీక్‌ జరగవచ్చు. కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా లీకేజ్‌ గురించి అందరికీ తెలిసిందే. ఈ డాటా లీక్‌ అయితే ఎన్నికల్లో పార్టీలు ఈ డాటా ఆధారంగా వివిధ గ్రూపులను తయారు చేసి కస్టమైజ్‌ మెస్సేజిలు పంపవచ్చు. ఫలానా వర్గం వల్ల మీకు ప్రమాదం ఉందని రెచ్చ గొట్టే వాట్సప్‌ సందేశాలు చక్కర్లు కొట్టవచ్చు. మిమ్మల్ని కాపాడేది ఫలానా పార్టీ మాత్రమే మాకే ఓటేయండి అని ప్రచారం చేయ వచ్చు. మతవిద్వేషాలు రెచ్చగొట్టవచ్చు. సోషల్‌ ఇంజనీరింగ్‌ ప్రయత్నాలు ప్రారంభం కావచ్చు. ప్రొఫైలింగ్‌ ద్వారా టార్గెటెడ్‌ సందేశాలు పంపించవచ్చు.
డాటా లీకేజ్‌ వల్ల తలెత్తే ఈ సమస్యలే కాదు ఇప్పుడు మరో పెద్ద సమస్య మన ముందుకు వస్తోంది. అది డీప్‌ ఫేక్‌ సమస్య.

బయోమెట్రిక్‌ డేటా అనేది గుర్తింపు కోసం ఒక వ్యక్తి ప్రత్యేకమైన శారీరక చిహ్నాలకు సంబంధించింది. ఇందులో వేలిముద్రలు, కనుపాప నమూనాలు, ముఖ లక్షణాలు, స్వరం వగైరా ఉంటాయి. ఒక వ్యక్తి గుర్తింపును ధృవీకరించడానికి వీటిని ఉపయోగిస్తారు. ఈ బయోమెట్రిక్‌ డాటాను కంపెనీలు సేకరిస్తున్నాయి.
మరోవైపు, డీప్‌ ఫేక్‌ అనేది నిజమైనవిగా భ్రమింపజేసే నకిలీ వీడియోలు లేదా ఆడియో. ఇలాంటి మోసపూరిత కంటెంట్ను సృష్టించడానికి బయోమెట్రిక్‌ సమాచారాన్ని దుర్వినియోగం చేయవచ్చు. ఇప్పటికే ఫేక్‌ వార్తల వరదల్లో బతుకుతున్నాం. ఏది సత్యం? ఏదసత్యం?? అనే అయోమయం అనుక్షణం మనల్ని వెంటాడే వాతావరణంలో బతుకుతున్నాం. ఈ అయోమయాన్ని సృష్టించింది మరెవరో కాదు, ఐటి సెల్‌ లేదా సోషల్‌ మీడియా ప్రచారం. సోషల్‌ మీడియా ద్వారా మన వద్దకు వచ్చే ఫోటో లేదా వీడియో అసలైనదో నకిలీయో మనకు తెలియదు. ప్రతిరోజు చాలా ప్రచారం వచ్చి పడుతుంటుంది. ప్రతి సమాచారాన్ని నిర్ధారించుకోవడం సగటు మనిషికి సాధ్యం కాదు. మధ్యప్రదేశ్‌లో పోలింగ్‌ జరుగుతున్నప్పుడు చాలా ఫేక్‌ వీడియోలు వచ్చాయనే వార్త తెలిసిందే. గత కొన్ని సంవత్సరా లుగా ఫేక్‌ వార్తల ప్రచారం అనేది పెద్ద ఎత్తున కొనసాగుతోంది. వాట్సప్‌ సందేశాల్లో వందలాది అబద్ధాలు చక్కర్లు కొడు తున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఒక అబద్ధాల మాయాజాలం మన చుట్టు అల్లుకుపోతోంది.
మహాభారతంలోని ఒక సంఘటన ఇక్కడ గుర్తుకువస్తోంది. ద్రోణాచార్యుడిని యుద్ధంలో ఎలా నిలువరించాలో అర్థం కాని స్థితిలో అశ్వత్థామ హతః కుంజరః అని పలికిన మాటలు గుర్తొస్తు న్నాయి. అశ్వత్థామ మరణించాడనుకున్న ద్రోణాచార్యుడి మనో బలం కుప్పకూలింది. అశ్వత్థామ ద్రోణాచార్యుడి కుమారుడు. కాని అశ్వత్థామ అనే పేరున్న ఒక ఏనుగు కూడా ఉంది. మరణించింది ఏనుగు. కుంజరము అంటే ఏనుగు. కాని ఈ మాటలు వినిపించీ వినిపించకుండా చెప్పారు. అశ్వత్థామ అనే పదాన్ని గట్టిగా చెప్పారు. నిజానికి అబద్దం చెప్పలేదు. కాని నిజం కూడా వినిపించకుండా చేశారు. ద్రోణాచార్యుడు తన కుమారుడు మరణించాడని క్రుంగిపోయాడు. యుద్ధాల్లో అబద్దాల ప్రచారం మామూలే. ఇప్పుడు భారత రాజకీయాల్లో ఇది మరింత ఎక్కువయ్యింది.
ఇప్పుడు అబద్దాలు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటి వరకు అబద్దాలను, ఫేక్‌ వార్తలను ఖండిరచడానికి కొన్ని మీడియా సంస్థలు ఫాక్ట్‌ చెక్‌ చేసి వాస్తవాలు వెల్లడిస్తూ వచ్చాయి. కాని అసంఖ్యాకంగా వస్తున్న ఫేక్‌ వార్తల సముద్రాన్ని వడపోయడం సాధ్యమా? ఇప్పుడు అబద్దాలు ఎలాంటి విశ్వరూపం ధరిస్తున్నా యంటే, నిజనిర్ధారణ కూడా సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఇటీవల వచ్చిన డీప్‌ ఫేక్‌ అసలేదో ఫేక్‌ ఏదో చెప్పలేని స్థితిని సృష్టించింది.
ఇటీవల ఒక సినిమా హీరోయిన్‌ రష్మికా మంథానా వీడియో వచ్చింది. ఆ వీడియో అర్థనగ్నంగా ఉంది. అది ఆమె వీడియో కాదు. అది డీప్‌ ఫేక్‌ వీడియో అని తెలిసింది. ఈ వీడియోలో ఉన్నది రష్మికా కాదు, బ్రిటన్‌కు చెందిన భారత సంతతి నివాసి జరా పటేల్‌ వీడియో అది. ఆ తర్వాత ఆలియా భట్‌కు సంబం ధించిన డీప్‌ ఫేక్‌ వీడియో వచ్చింది. చాలా మంది డీప్‌ ఫేక్‌ పై ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే డీప్‌ ఫేక్‌ వీడియోను గుర్తుపట్టడం చాలా కష్టం. అసలు అవునో కాదో చెప్పడం కష్టం. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌, కత్రినా కైఫ్‌ వీడియోలు కూడా వచ్చాయి. ఇప్పుడు డీప్‌ ఫేక్‌ టెక్నాలజీతో ఏమైనా చేయవచ్చు. షారుక్‌ ఖాన్‌ తో కూర్చుని సినిమా చూస్తున్నట్లు వీడియో తయారు చేసుకోవచ్చు. డీప్‌ ఫేక్‌ వీడియోలు చాలా వచ్చాయి.

ఇప్పుడు రాజకీయాలను కాస్త పరిశీలిద్దాం. యుపియే ఓడిపోవ డానికి ముఖ్యమైన కారణం సోషల్‌ మీడియాను ఉపయోగించు కోలేకపోవడం. అప్పట్లో అంటే 2014లో సోషల్‌ మీడియాను అత్యంత బలంగా వాడుకున్న బీజేపీ అధికారానికి రాగలిగింది. బీజేపీ ఐటి సెల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫేక్‌ వార్తల ప్రచారం కూడా ఆ తర్వాత ఎక్కువయ్యింది. ఇప్పుడు టెక్నాలజీ మరింత పెరిగింది. ఫేక్‌ మాత్రమే కాదు ఇప్పుడు డీప్‌ ఫేక్‌ వచ్చింది. ఇప్పుడు కేవలం బీజేపీ మాత్రమే కాదు, అన్ని పార్టీలు టెక్నాలజీని, సోషల్‌ మీడియాను బలంగా వాడుకోవడం కూడా ఎక్కువయ్యింది. ఈ పరిస్థితి బీజేపికి కాస్త ఇబ్బందిగా మారే అవకాశాలున్నాయి. ఇటీవల ప్రధాని మోడీ డీప్‌ ఫేక్‌ పై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. తన వీడియో కూడా డీప్‌ ఫేక్‌తో సృష్టించారని చెప్పుకున్నారు. ఆ వీడియోలో ప్రధాని గర్బా కార్యక్రమంలో డాన్సు చేస్తు కనిపిస్తున్నారు. కాని నిజానికి అది డీప్‌ ఫేక్‌ వీడియో కాదు. అది డీప్‌ ఫేక్‌ వీడియో అని మోడీ చెప్పిన మాట నిజం కాదు. ఆ వీడియో ఒరిజినల్‌ వీడియో. కాని అందులో ఉన్నది ప్రధాని మోడీ కాదు, ఆయనలా కనిపించే ఒక వ్యక్తి ఒక గర్బా కార్యక్రమంలో పాల్గొని డాన్సు చేసిన వీడియో. ఆ వ్యక్తి మోడీలా కనిపిస్తున్నందువల్ల, ఆయనలా దుస్తులు ధరించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. చాలా మంది ఆయన్ను వివిధ కార్యక్రమాలకు పిలుస్తుంటారు. అలా అతను ఒక గర్బా కార్యక్రమంలో పాల్గొన్న వీడియో అది. ఆ వ్యక్తి స్వయంగా ముందుకు వచ్చి ఆ వీడియో తనదేనని, అది డీప్‌ ఫేక్‌ కాదని స్పష్టం చేశాడు.డీప్‌ ఫేక్‌ వీడియో సాధారణంగా చేసే మార్ఫింగ్‌ కాదు డీప్‌ ఫేక్‌. కనుపాపల కదలికలు, లైటింగ్‌ ఇలా అనేక అంశాలతో జరిగే ఈ మార్ఫింగ్‌ ను కనిపెట్టడం అంత తేలిక కాదు. రివర్స్‌ సెర్చ్‌ ద్వారా కనిపెట్టడానికి ప్రయత్నించడంలో ప్రయివసీ సమ స్యలు ఎదురవుతాయి. డీప్‌ ఫేక్‌ ఎలాంటిదంటే ఒక ఉదాహరణ చూద్దాం. ఒక నకిలీ రిపోర్టరును డీప్‌ ఫేక్‌ తో సృష్టించడం జరిగింది. మెస్సి కన్లే అని పేరు కూడా పెట్టారు. లింక్డిన్‌ ప్రొఫైల్‌ కూడా తయారు చేసేశారు. ఆమె ఎక్కడ పనిచేస్తుందో అది కూడా చెప్పారు. అంటే ప్రపంచంలో అస్సలు లేని వ్యక్తిని సృష్టిం చేశారు. డోనాల్డ్‌ ట్రంప్‌ను పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టినట్లు, ఆయన ఖైదీల దుస్తుల్లో ఉన్నట్లు చూపించారు. అది కూడా డీప్‌ ఫేక్‌.ఇప్పటి వరకు వచ్చిన డీప్‌ ఫేక్‌ వీడియోలు చాలా వరకు పెద్ద సమస్యాత్మకమైనవి కావు. సినిమా తారలను డీప్‌ ఫేక్‌ చేయడం వంటివి వ్యక్తిగతంగా ఆ తారలకు చాలా మనోవ్యధను కలిగి స్తాయి, కాని సమాజంపై ఈ వీడియోల ప్రభావం పెద్దగా ఉండదు. సామాజిక సమస్యను ఇవి సృష్టించలేదు. ఇంతవరకు జరిగినవి నిజానికి అల్లరిచిల్లరి పనులు మాత్రమే. కాని డీప్‌ ఫేక్‌ ను ఉపయోగించి ఒక నకిలీ సంఘటనను సృష్టిస్తే, ఒక నకిలీ భవన సముదాయాన్ని సృష్టిస్తే, ప్రముఖ రాజకీయ నాయకులు, మంత్రులు, ప్రధాని వీడియోలు డీప్‌ ఫేక్‌ ముందుకు వస్తే, ముఖ్యంగా ఎన్నికల సమయాల్లో ఇలాంటివి ముందుకు వస్తే, నిజనిర్ధారణ అంత తేలిక కాదు. దేశంలో ఫేక్‌ వార్తలు ఏ స్థాయిలో ప్రచారంలోకి వస్తున్నాయో తెలియంది కాదు. కరోనా సమయంలో తబ్లీగీ జమాఅత్‌ గురించి ఎలాంటి ఫేక్‌ వార్తలు వచ్చాయో అందరికీ తెలిసిందే. ఫేక్‌ వార్తలతో ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు ఎంతగా జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. ఫేక్‌ వార్తలతో రాజకీయ ప్రయోజనాలు సాధించుకునే ప్రయత్నాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే, ఇలాంటి నేపథ్యంలో డీప్‌ ఫేక్‌ వంటి సాంకేతికతను ఉపయోగించి డీప్‌ ఫేక్‌ సంఘటనలను, డీప్‌ ఫేక్‌ వీడియోలను సృష్టించి ప్రచారం చేస్తే ఎలాంటి వాతావరణం ఏర్పడుతుందో ఊహించవచ్చు.
ఫేక్‌ వార్తలను ఎవరు ఎలా ప్రచారం చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉదాహరణకు రాహుల్‌ గాంధీ బంగాళా దుంపలతో బంగారం తయారు చేయవచ్చని చెప్పినట్లు ఒక ప్రచారం జరిగింది. స్వయంగా ప్రధాని మోడీ ఇటీవల కూడా ఈ మాట రాహుల్‌ను ఉద్దేశించి చెప్పారు. నిజానికి రాహుల్‌ గాంధీ అలా చెప్పలేదు. ఆయన ప్రసంగాన్ని ఎడిట్‌ చేసి తమకు కావలసిన భాగాన్ని తీసుకొచ్చి చేసిన అబద్ధపు ప్రచారం అది. అదే ప్రచారాన్ని స్వయంగా ప్రధాని కూడా కొనసాగిస్తున్నారు. ఇలా అనేక సందర్భాల్లో ఎడిట్‌ చేసిన వీడియోలతో ఫేక్‌ వార్తలను ప్రచారం చేయడం జరుగుతున్న కాలంలో డీప్‌ ఫేక్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి అబద్ధాలు ప్రచారం లోకి వస్తాయో ఊహిస్తేనే వణుకు పుడుతుంది. ఇప్పటి వరకు ఫేక్‌ వార్తలు నిజమో కాదో నిర్ధారించుకునే అవకాశాలు ఉన్నాయి. కాని డీప్‌ ఫేక్‌ అలాంటి అవకాశం కూడా లేకుండా చేస్తుంది.
ఇప్పుడు బీజేపీ ఐటి సెల్‌ ఎంత బలంగా ఉందో ఇతర పార్టీల ఐటి సెల్స్‌ కూడా అంతే బలంగా ఉన్నాయి. ఇది 2014 కాదు, 2023. బీజేపీకి ఈ భయం పట్టుకుంది. ఇటీవల మధ్యప్రదేశ్‌ లో ఏబిపి పోల్‌ వీడియోను పూర్తిగా ఫేక్‌ చేసి, కాంగ్రెసు ఘన విజయం సాధిస్తున్నట్లు తయారు చేసి ప్రచారంలో పెట్టారు. బీజేపీ ఖంగుతింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫేక్‌ వార్తలను అడ్డుకోడానికి పెద్దగా ప్రయత్నం చేయలేదు. ఎలాంటి చట్టాలు తీసుకురాలేదు. ఎందుకంటే, ఫేక్‌ వార్తల వల్ల బీజేపీకి ఇంతవరకు ప్రయోజనాలు లభిస్తూ వచ్చాయి. ఐటి చట్టం ఒకటి ఉంది. ఈ చట్టం డీప్‌ ఫేక్‌ను అడ్డుకోగలుగుతుందా?

డీప్‌ ఫేక్‌ ఇప్పుడు కేవలం సినిమా తారలకు మాత్రమే పరిమితమయ్యింది. కాని భవిష్యత్తులో ఇది కేవలం సెలబ్రిటీలకే కాదు సాధారణ ప్రజలు కూడా దీని వల్ల సమస్యలు ఎదుర్కోవచ్చు. సాధారణ ప్రజలు కూడా బ్లాక్‌ మెయిల్‌కు గురికావచ్చు.ఒక వ్యక్తి ముఖం లేదా వాయిస్‌ ఉపయోగించి నకిలీ వీడియోలు డీప్‌ ఫేక్‌ ద్వారా తయారు చేయవచ్చు. వీటిని బయోమెట్రిక్‌ గుర్తింపు ద్వారా నిర్ధారించడం కూడా సాధ్యం కాని విధంగా బయోమెట్రిక్‌ డాటాను ఉపయోగించుకోవచ్చు. కంప్యూటర్‌ విజన్‌ను కూడా మోసగించేలా తయారు చేయవచ్చు. వ్యక్తుల గుర్తింపును దొంగిలించి, నకిలీ వేలిముద్రలు లేదా కనుపాపల నమూనాలతో సింథటిక్‌ బయోమెట్రిక్‌ డేటాను రూపొందించ డానికి డీప్‌ ఫేక్‌ ఉపయోగించవచ్చు. బయోమెట్రిక్‌ భద్రతా వ్యవస్థలను మోసం చేయడానికి దీనిని ఉపయోగించవచ్చు. విస్తృత సోషల్‌ ఇంజనీరింగ్‌ దాడిలో డీప్‌ ఫేక్‌ను వాడుకోవచ్చు. దాడి చేసేవారు డీప్‌ ఫేక్‌ ఉపయోగించి స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడు వంటి విశ్వసనీయ వ్యక్తి వలె నటించి మోసగించవచ్చు. వీటిని అరికట్టాలంటే కఠినమైన చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవడమే కాదు, వాటిని అమలు చేసే నిజాయితీ కూడా అవసరం. 

అబ్దుల్ వాహెద్