October 5, 2024

 

హోంమంత్రి అమిత్‌ షా గతంలో ఒక సభలో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు మహిళలు సురక్షితంగా ఉన్నారని, అర్థరాత్రయినా స్కూటరుపై, నగలు ధరించి కూడా క్షేమంగా ప్రయాణించే పరిస్థితులున్నాయని చెప్పారు. ఇంత గొప్ప పరిపాలన అందిస్తున్న బీజేపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ను తప్పక ప్రశంసించాల్సిందే. కాని విచిత్రంగా ఒకవైపు దేశ హోం మంత్రి ఈ మాటలు చెబితే, మరోవైపు ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం నవంబర్‌ 22వ తేదీన ఒక ఉత్తర్వు జారీ చేస్తూ, ఉత్తరప్రదేశ్‌లో ప్రయివేటు కోచింగ్‌ సంస్థలు రాత్రి పూట క్లాసులు నడపరాదని, అమ్మాయిలు ఇంటికి సురక్షితంగా చేరుకునే బాధ్యత కోచింగ్‌ సంస్థలే తీసుకోవాలని చెప్పింది. ఇప్పుడు ఎవరి మాటలు నమ్మాలి.
ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అమ్మాయిలు రాత్రిపూట కోచింగ్‌ క్లాసులకు హాజరు కావడం కుదరదు. ఎందుకంటే వారి భద్రత సమస్య ఉంది. ఇలాంటి భద్రత సమస్య ఉన్నప్పుడు మరోవైపు అమిత్‌ షా ఎందుకు ఉత్తరప్రదేశ్‌లో అమ్మాయిలు మహిళలు ఎంత రాత్రయినా సురక్షితంగా తిరగ్గలరని చెప్పినట్లు? జాతీయ నేరగణాంకాల సంస్థ ప్రకారం గత సంవత్సరం ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 49,385 నేరాలు మహిళలపై జరిగాయి.
ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు జరిగినప్పుడు అమిత్‌ షా ఆ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ కూడా ఉత్తరప్రదేశ్‌లో అమ్మాయి ఒంటరిగా, నగలు ధరించి స్కూటీపై క్షేమంగా అర్థరాత్రి వెళ్ళే సురక్షిత వాతావరణం ఉందని చెప్పారు. ఎన్నికలు ముగిశాయి, ప్రజలు బీజేపీకే జై కొట్టారు. యోగీ ఆదిత్యనాథ్‌ మళ్ళీ ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాని ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే, లేట్‌ ఈవెనింగ్‌, అంటే కాస్త పొద్దుగుంకిన తర్వాత కోచింగ్‌ క్లాసులకు అమ్మాయిలు వెళ్ళరాదని ఉత్తర్వులు జారీ చేసే పరిస్థితి ఉంది.
మహిళల సురక్షకు సంబంధించి కాని, మహిళల మర్యాదకు సంబంధించి కాని బీజేపీ నేతల రికార్డు ఏమంత గొప్పగా లేదు. బ్రిజ్‌ భూషణ్‌ ఉదంతం మనందరికీ తెలిసిందే. మొన్నీ మధ్య మధ్యప్రదేశ్‌ సత్నాలో ఒక బీజేపీ నాయకుడు ఒక కాలేజీ అమ్మాయికి లిఫ్టు ఇస్తానని చెప్పి అసభ్యంగా వ్యవహరించిన కేసులో అరెస్టయ్యాడు. బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ బీజేపీ ప్రముఖ నాయకుడు. ఇతనిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది ఎవరో కాలేజీ అమ్మాయిలు కాదు. దేశానికి మెడల్స్‌ సాధించిన క్రీడాకారిణులు ఈ ఆరోపణలు చేశారు. రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఢల్లీి పోలీసులు చివరకు కేసు నమోదు చేసి చార్జి షీటు దాఖలు చేయకతప్పలేదు. చార్జిషీటులో సాక్ష్యాలున్నాయి. కాని ఇప్పటి వరకు ఈ బ్రిజ్‌ భూషణ్‌పై ఎలాంటి చర్యలు ఎవరు తీసుకోలేదు. ప్రధానమంత్రి నోరు విప్పలేదు. పెద్ద పెద్ద నాయకులే ఇలా వ్యవహరిస్తున్నప్పుడు సత్నాలాంటి ప్రాంతంలో చిన్న చితక నాయకుడు కూడా రెచ్చిపోయి ఇలా వ్యవహరించడంలో ఆశ్చర్యమేముంది?
అత్యాచారం కేసు రుజువై నేరానికి శిక్ష అనుభవిస్తున్న రామ్‌ రహీమ్‌ బాబాను పెరోల్‌ పై విడుదల చేశారు. ఈయన శిక్షాకాలంలో అనేక సార్లు పెరోల్‌పై వస్తూ పోతున్నాడు. ఇప్పు డెందుకు విడుదల చేశారంటే రాజస్థాన్‌ లోని గంగానగర్‌ లో పోలింగ్‌ జరుగుతుంది కదా. రామ్‌ రహీమ్‌ ఈ గంగానగర్‌ కు చెందినవాడే. ఈయన వల్ల ఓట్లు పడవచ్చు. చాలా మందికి ఇప్పుడు గుర్తుందో లేదో, కాని జమ్ములోని కథువాలో ఏడేళ్ళ పసిబాలికపై అత్యంత అమానుషంగా జరిగిన హత్యాచారం కేసులో నిందితుల పక్షాన ర్యాలీ తీసింది కూడా బీజేపీ నేతలే. ఈ ర్యాలీలో చిన్నా చితక బీజేపీ నేతలు కాదు, ఇద్దరు మంత్రులు కూడా అప్పుడు పాల్గొన్నారు.

వాస్తవాలు ఇలా ఉంటే బీజేపీ పరిపాలనలో అమ్మాయిలు నగలు ధరించి కూడా అర్థరాత్రి స్కూటీపై సురక్షితంగా తిరగ్గలరని హోం మంత్రి చెప్పిన మాటలు వింటే ఏమనిపిస్తుంది. ఇప్పుడు అదే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అమ్మాయిలు పొద్దుపోయిన తర్వాత కోచింగ్‌ క్లాసులకు వెళ్ళరాదని ఉత్తర్వులు జారీ చేయడం చూస్తే ఏమనిపిస్తుంది? ఇదేదో ఉత్తరప్రదేశ్‌లోని మారుమూల గ్రామంలో కాదు, నోయిడాలో అంటే ఢిల్లీ కి దగ్గరగా, ఐటి హబ్‌గా పేరుపొందిన ప్రదేశంలో ఈ ఉత్తర్వులు జారీ చేసే పరిస్థితి. ఈ పరిస్థితి చూస్తే ఏమనిపిస్తోంది. మహిళల భద్రత గురించి బీజేపీ నేతలు చెప్పే మాటలు కూడా చునావీ జుమ్లా అనిపించడం లేదా?