May 21, 2024

మనిషి తన వంతు ప్రయత్నం చేయకుండానే తనకున్న సమస్య పరిష్కారమై పోతుందని, తన బతుకు బాగుపడిపోతుందని ఆశిస్తే అంతకన్నా ఆత్మవంచన మరొకటి వుండదు. పరివర్తన అనేది మనిషి దగ్గర్నుంచే ప్రారంభం కావాలి. దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చారు :‘‘ఏ జాతి అయినా స్వయంగా తన ఆచరణ తీరు మార్చుకోనంత వరకు దైవం కూడా వారి స్థితిని మార్చడు.’’ (దివ్య ఖుర్‌ఆన్‌ 8: 53)నేడు సమాజంలో అధిక శాతం ప్రజల పరిస్థితి ఎలా వుందంటే, ఏదైనా ఆపద, సమస్య వారిపై వచ్చినప్పుడు ఎవరో ఒకరు వచ్చి తమ సమస్యను పరిష్కరిస్తే బాగుంటుందని ఆశిస్తారు. ఆ సమస్యను పరిష్కరించే దిశలో కనీసం ఒక అడుగు ముందుకు వేద్దామని ఆలోచించేవారు బాగా అరుదు. చివరికి వారు విధిగా చేయవలసిన పనిని సైతం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తారు.‘‘మీలో మంచి వైపునకు పిలిచేవారూ, మేలు చెయ్యండి అని ఆజ్ఞాపించేవారూ, చెడు నుండి వారించే వారూ కొందరు తప్పకుండా ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యం పొందు తారు.’’ (ఆలి ఇమ్రాన్‌ : 104)వాస్తవానికి సమాజంలో మంచిని బోధిస్తూ, చెడును నిర్మూలించాల్సిన బాధ్యత ముస్లిం సమాజంపై ఉంది. కానీ ముస్లింలు తమ అసలు బాధ్యతను గాలికొదిలేసి కేవలం ప్రదర్శనాబుద్ధి (రియాకార్‌)కి అంకితమవుతున్నారు. నలుగురి ముందు తాము గొప్ప సంఘ సేవకులం అని కొందరు బడాయిలు చెప్పుకుంటారు. సమాజం కోసం ఎంతో కృషి, ఎన్నో త్యాగాలు చేస్తున్నామని కూడా చెప్పుకుంటారు. కానీ వాస్తవంగా వారివన్నీ బడాయిలే. ఇలాంటి కపటుల గురించి దివ్య ఖుర్‌ఆన్‌ హెచ్చరిస్తుంది.‘‘మీరు మీ నిజాయితీ గురించి గొప్పలు చెప్పుకోకండి. మీలో నిజంగా దైవభీతి పరుడెవరో దైవానికి బాగా తెలుసు.’’ (అన్‌ నజ్మ్‌ 53: 32)కొందరు అనవసరమైన వృధా ఖర్చులతో ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాప్‌ా ఇలా ఆదేశించారు:‘‘వృధా ఖర్చులు చేయకండి. దుబారా చేసేవారు షైతాన్‌ సోదరులు’’ (బనీ ఇస్రాయీల్‌ 17: 26)సమాజంలో అన్ని రకాలుగా వెనుకబడిన వర్గం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వార్థం కోసం అక్రమాలకు పాల్పడేవారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిని దైవం దివ్య ఖుర్‌ఆన్‌లో ఇలా హెచ్చరిస్తున్నాడు‘‘మీరు ఒకరి సొమ్మును మరొకరు అన్యాయంగా తినేయకండి. పరస్పర ఆమోదంతో వ్యాపార లావాదేవీలు జరుపుకోండి.’’ (అన్‌నిసా : 29)అయితే నేడు సమాజంలో కొంతమంది ఎన్నో నీతులు బోధిస్తారు. కానీ వాటిని స్వయంగా వారే ఆచరించరు. అలాంటి వారిని దైవం దివ్య ఖుర్‌ఆన్‌లో ఇలా హెచ్చరిస్తున్నాడు.‘‘ఏమిటీ, మీరు మంచి పనులు చేయమని ఇతరులకు బోధిస్తారు. కానీ మీరు ఆచరించడం మాత్రం మర్చిపోతున్నారే?’’ (అల్‌ బఖర: 44)దైవం స్పష్టంగా మంచిని చేయండని ఆదేశించాడు. దైవాదేశాలు పాటించడమే మనిషి సాఫల్యానికి ఏకైక మార్గం.

ముహమ్మద్ వహీదుద్దీన్