July 15, 2024

మతరాజకీయాలు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఒక గొప్ప ఆలోచనతో ముందుకు వచ్చారు. దేశంలోని 130 కోట్ల మంది భారతీయులు కరెన్సీ నోట్లపై గణపతి, మహాలక్ష్మీ బొమ్మలు కోరుకుంటున్నారని అన్నాడు. మన కష్టపడి పనిచేస్తున్నప్పటికీ ఫలితాలు రావాలంటే దైవాశిస్సులు కావాలని సెలవిచ్చారు.

త్వరలో గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. పంచమహల్ జిల్లాలో ఒక ర్యాలీలో మాట్లాడుతూ కేజ్రీవాల్ తన మాటలు మరోసారి చెప్పారు. దేశం ఆర్థికంగా పురోగమించాలంటే లక్ష్మీదేవి బొమ్మలు కరెన్సీ నోట్లపై ముద్రిస్తే సమస్యలు తీరిపోతాయా?

గుజరాత్ రాష్ట్రంలో పరిపాలన, అభివృద్ధిల గురించి ఇటీవల జరిగిన ఒక సర్వేలో ప్రజల ఆర్థిక ఇబ్బందులు స్పష్టంగా ముందుకు వచ్చాయి. సియస్డిస్ ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్న వారు స్పష్టంగా అధికధరలు, నిరుద్యోగం ముఖ్య సమస్యలని చెప్పారు. ఈ రెండింటిలోను అధికధరలు మరీ ముఖ్యమైన సమస్యగా పేర్కొన్నారు. ఆర్థిక సమస్యలు కమ్ముకుంటున్న ప్రస్తుత నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ తన గొప్ప ఐడియాతో ముందుకు వచ్చారు.

కరెన్సీ నోట్లపై గణపతి, లక్ష్మీదేవి బొమ్మలుంటే దేశం పురోగమిస్తుందని చెప్పారు. అయితే ఈ బొమ్మలు వేసినంత మాత్రాన సరిపోదని, మనం కూడా కష్టపడి పనిచేసి ప్రగతి సాధించాలని కూడా అన్నారు. కాని ఎంత కష్టపడి పనిచేసిన దైవాశిస్సులు లేకపోతే ఫలితాలు లభించవని ముక్తాయించారు. దైవాశిస్సుల కోసం కరెన్సీ నోట్లపై దేవతల బొమ్మలు ముద్రించాలని చెప్పారు.

అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదనను కాంగ్రెసు, బీజేపీ పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. బీజేపీ కేజ్రీవాల్ ను విమర్శిస్తూ కేజ్రీవాల్ తన హిందూవ్యతిరేకతను దాచిపెట్టడానికి గుజరాత్ ఎన్నికల ముందు ఇలాంటి ప్రతిపాదనలు చేస్తున్నారని విమర్శించింది. ఈ విమర్శలను కేజ్రీవాల్ పట్టించుకోవడం లేదు.

గుజరాత్ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేసి గెలిస్తే తమ పార్టీ పంజాబులో మాదిరిగా అవినీతిని గుజరాత్ నుంచి తరిమేస్తామని చెప్పారు. అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా సరే ఊచలు లెక్కపెట్టేలా చేస్తామన్నారు. దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం గుజరాత్. ఈ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తాము గెలిస్తే కరంటు బిల్లు ప్రజలు కట్టనవసరం లేదని ఉచిత కరంటు అందిస్తామన్నారు. ప్రధానమంత్రి ప్రకటించిన 30 వేల కోట్ల రూపాయల ప్యాకేజి గుజరాత్ ప్రజలకు అందలేదని, రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్ళిపోయిందని చెప్పారు. తాము గెలిస్తే గుజరాత్ ప్రజలకు 30వేల కోట్ల రూపాయల ప్యాకేజి ఆశలు చూపించే బదులు ప్రతి కుటుంబానికి నెలకు కనీసం 30వేల రూపాయల ప్రయోజనాలు అందిస్తామని అన్నారు. ఉచిత విద్య, ఉచిత కరంటు అందిస్తామన్నారు.

గుజరాత్ లో బీజేపీకి ఇప్పటి వరకు కొద్దోగొప్పో పోటీ ఇస్తున్న పార్టీ కాంగ్రెసు. అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెసు ఓట్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. కాంగ్రెసు పార్టీలో సగం మంది ఇప్పటికే బీజేపీలో చేరిపోయారని, మిగిలిన వారు కూడా ఎన్నికల తర్వాత బీజేపీలోకి ఫిరాయిస్తారని, కాంగ్రెసుకు ఓటు వేయడం వల్ల ఓట్లు వ్యర్థమవుతాయి కాబట్టి ఆప్ పార్టీకే ఓట్లు వేయాలని అన్నారు. అంటే కేజ్రీవాల్ కు బీజేపీ ఓట్లను తనవైపు తిప్పుకోవడం సాధ్యపడదనే భయముందా? ఎందువల్ల కేవలం కాంగ్రెసు ఓట్లపైనే ధృష్టి పెట్టారన్నది ఆలోచించవలసిన ప్రశ్న.

అరవింద్ కేజ్రీవాల్ కరెన్సీ నోట్లపై దేవతల బొమ్మలు ముద్రించాలని చెప్పిన మాట రాజకీయ దుమారానికి కారణమయ్యింది. అనేకమంది హిందూ స్వామీజీలు ఈ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నారు. దేవీ దేవతలు గుళ్ళలో ఉంటారని వారి చిత్రాలు కరెన్సీ నోట్లపై ముద్రించడం సముచితం కాదంటున్నారు. కరెన్సీ నోట్లపై దేవీదేవతల బొమ్మలు ముద్రించడాన్ని ఈ స్వామీజీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాని అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఈ విషయమై ప్రధాని మోదీకి కూడా లేఖ రాశారు.

గుజరాత్ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ హిందూప్రేమ మేల్కొందా అని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. రాజ్యాంగంలోని లౌకికవిలువలకు కేజ్రీవాల్ ప్రకటన విరుద్దమైనదని కాంగ్రెసు మండిపడుతోంది. హిందూత్వ రాజకీయాలు తమ స్వంతంగా ఇప్పటి వరకు బీజేపీ భావిస్తూ వస్తోంది. ఇప్పుడు ఆప్ పార్టీ సరికొత్త వ్యూహాలతో అవే రాజకీయాలను అమలు చేయడానికి సమాయత్తమవుతోంది.

ఆప్ ప్రతిపాదనను వ్యతిరేకించేవారు అసురులంటూ కేజ్రీవాల్ ఘాటుగా జవాబిస్తున్నారు. బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుందంటూ నిలదీస్తున్నారు. సావర్కర్ ఫోటో వేయాలని బీజేపీ భావిస్తోందని అందుకే వ్యతిరేకిస్తుందని ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ అన్నారు. ఆప్ నేత ఆతిషీ మరో అడుగు ముందుకు వేసి బీజేపీ నేతలు కేజ్రీవాల్ ను ద్వేషిస్తే ద్వేషించారు కాని హిందూ దేవీదేవతలను ద్వేషించడమేమిటి అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ఆప్ ప్రతినిధి సౌరభ్ భరధ్వజ్ మాట్లాడుతూ బీజేపీ నాయకులకు లక్ష్మీదేవి, గణపతి దేవతలతో సమస్య ఉందా అంటున్నారు. ముస్లిం నేతలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించడం లేదు కాని ఈ బీజేపీ నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ నిలదీస్తున్నారు.

ముస్లిం దేశమైన ఇండోనేషియాలో కరెన్సీనోట్లపై గణపతి బొమ్మ ఉందని, 85 శాతానికి పైగా ఇండోనేషియాలో ముస్లిములన్నారని, అలాంటి దేశంలో కరెన్సీ నోట్లపై గణపతి బొమ్మ ముద్రించినప్పుడు మనం ఎందుకు చేయరాదని కూడా అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించాడు.

అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన ఈ మాటల్లో నిజముంది. ఇండోనేషియన్ ఇరవై వేల రూపాయల నోటుపై గణపతి బొమ్మ ఒకవైపు ఉంటుంది. ఇండోనేషియాలో హిందూ జనాభా 1.6 శాతం మాత్రమే. సాధారణంగా ప్రతి దేశం తమ దేశానికి సంబంధించిన అంశాలను కరెన్సీ నోట్లపై ముద్రిస్తుంది. ఇండోనేషియాకు భారతదేశంతో ప్రాచీన కాలం నుంచి సంబంధాలున్నాయి. ఈ సంబంధాల వల్లనే బౌద్ధం, హిందూ మతాలు అక్కడ విస్తరించాయి. అరబ్బు వర్తకుల రాకపోకల వల్ల అక్కడ ఇస్లాం విస్తరించింది. అక్కడి జావా స్థానిక మతం ఉంది. శతాబ్దాలుగా అక్కడ ఈ మతస్తులందరూ శాంతియుతంగా జీవిస్తున్నారు. ఒకప్పుడు చోళ సామ్రాజ్యంలో ఇండోనేషియా భాగంగా ఉండేది. ఈ సాంస్కృతిక సంబంధాలను ఇండోనేషియా గౌరవిస్తుందనడానికి చిహ్నం అక్కడి నోట్లపై ఈ చిత్రాలు. శతాబ్దాలుగా ఇండోనేషియా మార్పును ప్రతిఘటించలేదు. మంచి మార్పును ఆహ్వానించింది.

ఏది ఏమైనా అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన రాజకీయాల్లో దుమారాన్ని రేకెత్తించింది. బీజేపీ పైకి విమర్శలతో ఆప్ పై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ బీజేపీ నేతలకు కేజ్రీవాల్ ప్రకటన వల్ల తమకు జరిగే డేమేజి ఏమిటో తెలుసు.

అరవింద్ కేజ్రీవాల్ కు సన్నిహితుడిగా ఒకప్పుడు ఆప్ పార్టీలో ఉన్న కుమార్ విశ్వాస్ ఈ రాజకీయాలను విశ్లేషిస్తూ అఖిలేష్ యాదవ్, మమతాబెనర్జీ, నితీష్ కుమార్ వంటి నాయకులు ఒకవైపు మైనారిటీ ఓట్లను పొందాలని చేస్తున్న ప్రయత్నాలు కేజ్రీవాల్ కు తెలుసు. దేశంలోని హిందూ ఓట్లలో సగం ఓట్లను తనవైపు తిప్పుకున్నా చాలు కేజ్రీవాల్ బీజేపీకి బలమైన సవాలుగా మారతారు. ఎందుకంటే మైనారిటీ ఓట్లు బీజేపీకి వ్యతిరేకంగానే ఉంటాయి. అరవింద్ కేజ్రీవాల్ హిందూ కార్డు వాడడం ఇదే మొదటిసారి కాదు.

ఇంతకు ముందు మునిసిపల్ కార్పోరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ నాయకులు రామరాజ్యం గురించి మాట్లాడారు. అరవింద్ కేజ్రీవాల్ రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక టీవీ కార్యక్రమంలో హనుమాన్ చాలీసా తాను ఎంత బాగా చదవగలడో చదివి వినిపించాడు. జమ్ము కశ్మీర్లో అధికరణ 370 రద్దును బలపరిచిన మొదటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్. మార్చి 2021లో అరవింద్ కేజ్రీవాల్ పిల్లలకు దేశభక్తి పాఠాలు చెప్పడం అవసరమని ఆ విధంగా పిల్లలను దేశభక్తులుగా మార్చాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే కేజ్రీవాల్ చేస్తున్నది బీజేపీతో బీజేపీ శైలిలో తలపడడం.

రామాయణంలో ఉన్నదే హిందూత్వ అని ఒకసారి చెప్పారు. దళితులపై మూకదాడులు జరుగుతున్నాయని ఒకసారి ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిములపై జరిగిన మూకహత్యలు, దాడులపై ఆయన పెదవి విప్పినట్లు గుర్తులేదు. ఏది ఏమైనా బీజేపీతో బీజేపీ భాషలోనే తలపడాలన్నది కేజ్రీవాల్ వ్యూహంగా కనిపిస్తున్నది. ఒక్క కేజ్రీవాల్ మాత్రమే కాదు దేశంలోని పార్టీలన్నీ ఈ బాటలోనే నడుస్తున్నాయనవచ్చు. బీజేపీ చాలా గర్వంగా రామమందిరాన్ని నిర్మిస్తామని మానిఫెస్టోలో రాసుకుంది. ఆ పని చేస్తున్నది కూడా. ఇప్పుడు పార్టీలన్నీ హిందూత్వ బాటలోనే నడవడం రాజకీయంగా ప్రయోజనకరమని భావిస్తున్నాయి. కొందరు నాయకులు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు. వామపక్షాలు కూడా దీపావళి శుభాకాంక్షలు వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ తన దత్తాత్రేయ గోత్రం గురించి చెప్పుకుంటున్నారు. మమతాబెనర్జీ తన బ్రాహ్మణ గుర్తింపు బయటపెడుతున్నారు. మనీష్ సిసోదియా తాను రాజపుత్ అని గర్వంగా ప్రకటించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చూస్తే అరవింద్ కేజ్రీవాల్ కరెన్సీ నోట్లపై దేవీదేవతల బొమ్మలు ముద్రించాలని కోరడం వెనుక ఉన్న రాజకీయాలను అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు.

కాని అర్థం చేసుకోవలసిన విషయమేమిటంటే కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి చిత్రం ముద్రించినంత మాత్రాన ప్రజల ఇళ్ళల్లో సిరిసంపదల వర్షం కురవదు. ఐదేళ్ళ క్రితం బీజేపీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పుడు జరిగిన సర్వేల్లో ప్రతి ఏడుగురిలో కేవలం ఒక్కరు మాత్రమే అధికధరల గురించి మాట్లాడారు. కాని ఇప్పుడు సగం మంది అధికధరల గురించి మాట్లాడుతున్నారు. దాదాపు 15 శాతం మంది నిరుద్యోగం గురించి వాపోతున్నారు. పేదరికం గురించి బాధపడేవారి సంఖ్య పెరిగింది. అంటే ప్రతి పదిమందిలో కనీసం ఏడుగురు ఇప్పుడు ఆర్థిక సమస్యల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రాన్ని దీర్ఘకాలంగా పాలిస్తున్న బీజేపీ ప్రజలకు చెప్పుకోవలసిన జవాబులు చాలా ఉన్నాయి. ఎన్నికల్లో దీని ప్రభావం ఎలా ఉంటుందన్నది వేచి చూడాలి. గత ఎన్నికల్లో ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో విఫలమయ్యాయి. లేదా ఆర్థిక సమస్యలు ఎన్నికల్లో ఓటింగ్ సరళిని ప్రభావితం చేయలేకపోయాయి. అందువల్లనేనా ఇప్పుడు కేజ్రీవాల్ తదితర నేతలు వ్యూహం మార్చుకుని హిందూత్వ రాజకీయాలను తమదైన శైలిలో అమలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో ఎన్నికల ఫలితాల్లోనే తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రజాసమస్యలు ఎన్నికల్లో చర్చనీయాంశాలు కాకపోతే ఎన్నికల ఫలితాల తర్వాత పరిపాలన కూడా ప్రజాసమస్యలకు బాధ్యత వహించేదిగా ఉండదు.