November 21, 2024

లవ్ జిహాద్ గగ్గోలుతో మత రాజకీయాలు

డిసెంబర్‌ 8, 2023వ తేదీన కేరళలో అశోకన్‌ తన కుమార్తె కనబడడం లేదని కేరళ హైకోర్టులో హేబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. త్వరలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. అశోకన్‌ దేశంలో మరోసారి లవ్‌ జిహాద్‌ చర్చను ప్రారంభించాడు. అశోకన్‌ ఆరోపణల్లో మతపరమైన కోణాలున్నాయి, ఇది ముస్లిం వ్యతిరేక భావాలను, బిజెపికి అనుకూలంగా ఓట్ల ధృవీకరణకు ఉద్దేశించిన చర్యగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ అశోకన్‌ మరెవరో కాదు, లవ్‌ జిహాద్‌ గగ్గోలుకు కారణమైన ‘‘హాదియా కేసు’’లో హాదియా తండ్రి ఈయన. అశోకన్‌ సాధారణ ఎన్నికలు వస్తున్నప్పుడు తన కేసు వేశాడు. దేశంలో లవ్‌ జిహాద్‌ చర్చ, హిందూ ముస్లిం రాజకీయాలను రెచ్చగొట్టి, విభజన రాజకీయాలు నడిపేవారికి కావలసినంత అవకాశం కల్పించాడు.

2014 నుండి, ‘లవ్‌ జిహాద్‌’ ప్రచారం జరుగుతోంది. కాని లవ్‌ జిహాద్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఎవ్వరు ఎక్కడా చూపించ లేదు. ఈ ప్రచారంతో ముస్లిం పురుషులపై బురద జల్లుతున్నారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవని ప్రభుత్వ విచారణ సంస్థలు, న్యాయస్థానాలు కూడా పలుమార్లు స్పష్టం చేశాయి. కాని అబద్దాన్ని నిజంగా భ్రమింపజేసే గోబెల్స్‌ ప్రచారం వల్ల దీన్ని చాలా మంది నమ్మే పరిస్థితి దాపురించింది. ఫలితంగా ముస్లిం పురుషులకు వేధింపులు, సామాజిక బహిష్కరణ, చట్టపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితి దేశంలో నెలకొన్న మతతత్వ వాతావరణాన్ని ప్రతిఫలిస్తోంది. సామాజిక సామరస్యాన్ని ప్రభావితం చేస్తోంది. సమాజంలో అపనమ్మకాలు, భయ సందేహాలను పెంచుతోంది.
హాదియా అనే అమ్మాయి ఇస్లాం స్వీకరించింది, ఆ తర్వాత ఆమె ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది. అప్పటి నుంచి ఆ దంపతులకు వేధింపులు మొదలయ్యాయి. ఒక సుదీర్ఘ న్యాయ పోరాటం చేయవలసి వచ్చింది. ఆమె తండ్రి పెట్టిన కేసు వల్ల ఆమెను ‘లవ్‌ జిహాద్‌’ బాధితురాలిగా పేర్కొంటూ కేరళ హైకోర్టు 2017లో ఆమె వివాహాన్ని రద్దు చేసింది. అయితే, హదియా వెనక్కి తగ్గలేదు. తాను స్వతంత్రంగా, స్వేచ్ఛగా ఈ పెళ్ళి చేసుకున్నానని చెప్పింది. ఈ కేసు చివరకు సుప్రీంకోర్టుకు వెళ్ళింది, సుప్రీంకోర్టు ఎన్‌ఐఏ దర్యాప్తు చేయాలని ఆదేశించింది. 2018లో సుప్రీంకోర్టు ఆమె వివాహాన్ని చట్టబద్దమేనని ప్రకటిం చింది, ఆమెకు తన మత విశ్వాసాన్ని ఎంచుకునే హక్కు ఉందని, భాగస్వామిని ఎన్నుకునే హక్కు ఉందని ధృవీకరించింది. ఈ కేసు మత స్వేచ్ఛ, మహిళల స్వయంప్రతిపత్తి భారతదేశంలో ‘లవ్‌ జిహాద్‌’ ప్రచారం వంటి సమస్యలను చర్చకు తీసుకు వచ్చింది.
2023 డిసెంబర్‌ 10న హదియా ఒక వీడియో విడుదల చేసింది. తన తండ్రి చేసిన ఆరోపణలను ఖండిరచింది. తనను చట్ట విరుద్ధంగా నిర్బంధించి ఉంచారన్న వాదనను ఖండిరచింది. తాను తన మొదటి భర్త షఫీన్‌ జహాన్‌ నుండి విడిపోయానని, వివాహం చేసుకోవడానికి, విడాకులు తీసుకోవడానికి తనకు అన్ని హక్కులు ఉన్నాయని, తన ఇష్టానుసారం మరో వివాహం చేసుకున్నామని ఆమె స్పష్టం చేసింది. తన వ్యక్తిగత జీవితం పట్ల పరులు అనవసరమైన ఆసక్తి చూపడాన్ని వేలెత్తి చూపించింది. సంఫ్‌ు పరివార్‌ ఒత్తిడి వల్లనే తన తండ్రి ఈ కేసు పెట్టాడని, తన జీవితంలో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని చెప్పింది. సైబర్‌ దాడులతో సహా తనకు ఇబ్బందులను సృష్టించడంలో ఆయన ప్రమేయం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె కేసులో మొదట ఆమె తండ్రి ‘లవ్‌ జిహాద్‌’ ఆరోపణ చేశాడు. ఆమె మొదటి వివాహాన్ని హైకోర్టు రద్దు చేసింది, 2018లో సుప్రీంకోర్టు ఆమె వివాహాన్ని పునరుద్ధరించింది. నచ్చిన మతాన్ని, నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు ఆమెకు ఉందని స్పష్టం చేసింది. ఎన్‌ఐఏ దర్యాప్తులో బలవంతంగా మతమార్పిడి చేసినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదు. హదియా విడుదల చేసిన వీడియో, ఆమె ఇచ్చిన వివరణలు, తన హక్కుల గురించి నొక్కిచెప్పడం వల్ల మతఉద్రిక్తతలు తలెత్తే పరిస్థితిని ఆమె నివారించారు. ఆమె తండ్రి చేసిన ఆరోపణలు మీడియా ప్రచారాలవల్ల సమాజంలో ఉద్రిక్తపరిస్థితి తలెత్తకుండా ఆమె ముందుకు వచ్చి తన హక్కుల గురించి నొక్కి చెప్పింది. ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న చాలా మందికి ఆమె వైఖరి ఇప్పుడు ఒక ఉదాహరణగా మారింది. ఆశాజనకంగా పనిచేస్తుంది