October 5, 2024

ఆయన మీ కోసం మీజాతి నుండే జీవిత భాగస్వాము(స్త్రీ)లను సృజించాడు, వారి దగ్గర మీరు సౌఖ్యం పొందడానికి. ఇంకా ఆయన మీ మధ్య ప్రేమానురాగాలు, దయా దాక్షిణ్యాలను కూడా జనింపజేశాడు. ఇది కూడా ఆయన సూచనల్లోనిదే. యోచించే వారికి ఇందులో అనేక నిదర్శనాలున్నాయి. (అర్‌-రూమ్‌: 21)

కొంచెం తీపి, కొంచెం చేదు, కొంచెం వగరు, కొంచెం పులుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు….ఈ షడ్రుచుల లాగే- మన జీవితం సకల అనుభూతుల సమ్మేళనం. సంతోషం, దుఃఖం, శాంతం, కోపం, అలక, బుజ్జగింపు, మాట, మౌనం, నవ్వు, ఏడుపులాగే మన జీవితం సకల భావోద్వేగాల సమ్మిశ్రమం… అన్నీ కలగలిస్తేనే జీవితం అందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. అయితే అవన్నీ సమపాళ్లలో ఉంటేనే శ్రేయస్కరం, క్షేమమూను. ఇక అన్ని పరిస్థితులలోలను స్థితప్రజ్ఞతను అలవరచుకోవడం మనందరి కర్తవ్యం.

– సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమ్రీ

అలక
ఒక పనిని సాధించేందుకు కోపం వహించడం. ఈ కోపం తెచ్చుకున్నదే అయి ఉంటుంది. ఆవేశంతో కూడిన కోపం కాదు. చిన్నపిల్లలు తామనుకున్నది సాధించేందుకు, పెద్దవాళ్ళను ఒప్పించేందుకు అలుగుతారు. ఆ విషయానికొస్తే.. అలకకి కారు ఎవరూ అతీతం.
అసలు అలకంటే తెలియని వ్యక్తి ఉంటారా? చెప్పండి! అలక కేవలం ఆడవారి సొంతమా? మగవారిలో అలక ఉండదా? అంటే ఉంటుంది. అయితే తేడా వెలిబుచ్చే రీతుల్లోనే ఉంటుంది. కోపం తెచ్చుకోవటం, రంకెలేయడం, నాలుగు మాటలు అని ఊరుకోవడం మగవాళ్ళు చేసే పనయితే నా మనుసుని నొప్పించిన విషయమిది అని నోరు తెరిచి చెప్పుకోలేక మౌనంగానే తమ మనోగతాన్ని అలక ద్వారా తెలియజేస్తుంటారు ఆడవాళ్లు. అమ్మ అరిచిందని, తాత ఏదో అన్నాడని, అమ్మమ్మ, నాన్నమ్మ తిట్టిందని, పిన్ని కొట్టిందని, మామ మిఠాయి కొనిపెట్టలేదని పిల్లలు చూపే అలుకలు, కొడుకు పట్టించుకోవడం లేదని, కూతురు కాల్‌ చేయడం లేదని, కోడలు మర్యాద ఇవ్వడం లేదని, మనవళ్లు మాట్లాడటం లేదని, నవతరంలో వినయం లేదని, తనవారయిన ఎవ్వరూ తమను పట్టించుకోవట్లేదని పెద్దలు చూపే అలకలన్నీ ప్రేమను చాటుకొనే చిరుజల్లులే…! అర్థం చేసుకోవాలే గాని, అనురాగపు సంద్రం అలక. అనుబంధపు సుగంధం అలక. ఇంత చదివాక ఇకపై మనమూ అలక బూనాల్సిందేనని అన్పించక మానదు.
అనుభవజ్ఞుల మాటల్లో అలక
– అలగడం, రాజీ పర్చుకోవడం అనే ఈ చిలిపి కయ్యంలో ప్రేమ ఉప్పొంగుతుంది.
– బంధం, అనుబంధం అంటేనే ఒకరు అలగడంలో పర్ఫెక్టుగా ఉంటారు, ఒకరు రాజీ పర్చుకోవడంలో నిష్ణాతులై ఉంటారు.
– భార్య అలిగితే మంచి భర్తకు ఇష్టమట. ఎందుకంటే ఆ అలుక నుంచే అతను సాంత్వనం పొందుతాడు.
– కోపం ఒకంతటికి తగ్గని మానసిక జాడ్యం. అలుక – కోపం లాంటి చిరు కోపం కాని ఒక చిన్న చిలిపి కయ్యం.
– కోపానికి తెలిసిన భాష – అతిక్రమణం. అలుక నేర్చిన భాష- మౌనం.
– ప్రతి వస్తువు స్థాయి, నాణ్యతను కొలవడానికి స్కేల్‌, మీటర్‌ ఉన్నట్లే. ప్రేమ మీటర్‌ అలక.
– నిజంగా- అలిగే వ్యక్తికీ తనను రాజీ పరుచుకునే వారు ఉంటారు అని ఎంతో నమ్మకం ఉంటుంది. రాజీ పరుచుకునే క్రమంలో కొన్ని గత తీపి జ్ఞాపకాలు చిగుళ్లు పోసుకుంటాయి. ప్రేమలో, అనురాగంతో, అన్యోన్య దాంపత్యం ఈ చిర్రుబుర్రులు, చిలిపి చేష్టలు ఉంటేనే అందం.
– జీవన ప్రయాణంలో చాలా తక్కువ వ్యక్తులే తోడు ఉంటారు. వారు గనక అలిగితే వారిని రాజీ పర్చుకోవడాని ఎలాంటి వస్తువునయినా సరే తృణప్రాయంగా త్యాగం చేసేయాలనిపిస్తుంది. సంసారం అన్నాక ఆ మాత్రం సర్దుకుపోవాలి మరి.
ఆడువారి అలకలకు అర్థాలే వేరులే
అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలె. చొరవ చేసి రమ్మనుచో మరియాదగా పొమ్మనిలె అంటాడు ఓ కవి. అలిగి అలివేణి అలకపాన్పుపై మూడంకె వేస్తే. ఆ భర్తకు ఆమెను మారాం చేయడానికి తల ప్రాణం తోకకొస్తోంది.. తను ఎందుకు అలిగిందో తెలియక జట్టు పీక్కుంటాడు… అసలు నేనేధైనా చేసినందుకా? నేనెధైనా చెయ్యనందుకా? నేనేదైనా అనినందుకా? నేనేదైనా అననందుకా? నేనేదైనా అనకూడని విధంగా అననందుకా? అన్నందుకా? ఎందుకు?
అలకకు కారణాలు
మీ భాగస్వామికి మీపై కోపం వచ్చేందుకు సాధారణంగా ఇలాంటి కారణాలు కావొచ్చు. తను ఏదైనా కోరుకుంటే.. అవి మీరు నెరవేర్చకపోతే లేదా మీరు మీ భాగస్వామిపై కోపం చూపించడం వంటివి చేస్తుంటారు. తను మీ నుండి ఏదైనా విలువైనదాన్ని ఆశిస్తుంటే.. మీరు దాన్ని అందించలేకపోతే.. అందుకు గల కారణమేంటో స్పష్టంగా వివరించాలి. దీంతో వారు మిమ్మల్ని కాస్త అర్థం చేసుకుని మీపై అలక మానే అవకాశం ఉంటుంది.
అడపదడప ఇద్దరు అలిగితనే అందం / అలక తీరి కలిసేదే అందమైన బంధం
వాన వెలిశాక ఎంత హాయిగా ఉంటుందో భాగస్వామి అలక మానాక అంతే హాయిగా ఉంటుంది. భాగస్వామి అలిగినప్పుడే అనుకోని అతిథులు వచ్చారంటే ఇక వారిముందు పడే బాధలు చెప్పలేనివి. అరువు తెచుకున్న చిరునవ్వుని పంచే భార్య మీద భర్త కృతజ్ఞత చూపిస్తే ఆ చిరునవ్వు సొంతమైపోదూ. నా కోసం కాదు, పరువు కోసమే కదా ఆమె అలా నటించింది అనేది అతని మాటయితే అది అగ్నికి ఆజ్యాన్నే చేరుస్తుంది. అతిథిలొచ్చినప్పుదు అలిగిఉన్న దంపతులు వారి ముందు సఖ్యతగా ఉన్నట్లు నటించినప్పటికీ అందులో దాగి ఉన్నది పరస్పర ప్రేమే కదా.
హజ్రత్‌ ఆయిషా (ర.అ) ఇలా సెలవిచ్చారు: ఒక రోజు అల్లాప్‌ా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాతో ఇలా అన్నారు, నువ్వు నాతో ఎప్పుడు సంతోషంగా ఉంటావో, ఎప్పుడు చిరు కోపంగా ఉంటావో నాకు తెలుసు. భార్యాభర్తలు సహజంగా ఏదో ఒక విషయంలో చిరు కోపం కలిగి ఉన్నట్టే, నువ్వు ఏదైనా ప్రాపంచిక విషయంలో నాపై కోపంగా ఉన్నప్పుడు అది కూడా నాకు తెలిసిపోతుంది.
నేను అన్నాను, ‘‘ఓ అల్లాప్‌ా ప్రవక్తా! మీరు దీన్ని ఎలా పసి గడతారు? నా మనోగతం తమరికేలా అర్థమైపోతుంది? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు. నువ్వు నాతో సంతోషంగా ఉన్నప్పుడు, ‘‘అవును నిజమే, ముహమ్మద్‌ ప్రభువు సాక్షిగా! అంటావు. అదే నువ్వు చిరుకోపంతో అలకబూని ఉంటే – కాదు కాదు, ఇబ్రాహీం ప్రభువు సాక్షిగా! అంటావు.
హజ్రత్‌ ఆయిషా (ర) అంటున్నారు, ఇది విన్న తర్వాత నేను ‘‘అవును, ఓ అల్లాప్‌ా ప్రవక్తా!’’ మీరు చెప్పింది సత్యం, కానీ నేను అలకబూనినప్పుడు మీ పేరును మాత్రమే ప్రస్తావించను అంతే తెలుసా? (అంటే ఆ సమయంలో నా నోటితో మీ పేరును ప్రస్తావించను గానీ, మీరంటే నాకెంతో ఇష్టం తెలుసా? మీ ప్రేమతో నా మది ఎప్పుడు పొంగిపొర్లుతూనే ఉంటుంది) (ముత్తఫఖున్‌ అలైహి)
మనసెరిగితే జీవితం మకరందమయం
ప్రవక్తలందరి నాయకులు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌(స) అంతటి మహామహులే అలక తరువాత ఆనందాల గురించి చెప్పారు. కాని మనలాంటి సామాన్య మానవ మాత్రుల్లో మాత్రం అలక చిలికి చిలికి గాలి వానవుతుంది.
ఇప్పుడున్న బిజీలైఫ్‌కి అలకలు, ఊరడిరపులు కరువయి పోతున్నాయి. భార్య అలిగిందని భర్త సముదాయించే సమయం గాని, భర్త అలిగాడని భార్య గమనించే పరిస్థితి గాని ఉండడం లేదు. ఎవరి అవసరాలు వారివి, ఎవరి ఆదుర్దా వారిదే. పర్యావసానం ఊహకందనిదే అవుతుంది. ఇక్కడ కావలసింది కేవలం లాలన, పలకరింపు, ఒక చిన్న బహుమతి, ఒకరంటే ఒకరికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలుపుకునే ఒక ఉత్తరం, ఒక ఎసెమ్మెస్‌, ఒక ఇ-మెయిల్‌ ఇలా మీ కమ్యూనికేషన్‌ని పెంచే అంశం ఏదైనా కావచ్చు. లోలోపల ఒకరి మీద ఒకరికి దాగి ఉన్న ప్రేమను బలపరిచే కారణం అలకే అవుతుందంటే ఆ ఆనందాన్ని అందరూ సొంతం చేసుకోవాల్సిందే.
ప్రేమగా దగ్గరకు తీసుకుని..
కొన్నిసార్లు మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు.. మీ భాగస్వామిపై కోపం చూపించినట్లయితే.. మీ కోపం కొంత తగ్గాక తనను దగ్గరకు తీసుకుని ‘సారీ డార్లింగ్‌’ ఈరోజు నా మనసేం బాగోలేదు. అదే సమయంలో నువ్వొచ్చి మాట్లాడేసరికి నాకు కోపం పెరిగింది. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అని నెమ్మదిగా చెబితే.. ముఖ్యంగా వారిని దగ్గరకు తీసుకుని చెబితే ఇట్టే కరిగి పోతారు. అలిగితివా సఖీ ప్రియా కలత మానవా…. వెలిగించవే చిన్ని వలపు దీపం- ఎందుకే నా మీద ఇంత కోపం’ ‘గోరొంక కెందుకో కొండంత అలక.. వంటి కవితలతో వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు.
మంచి భార్యగా మీరూ సర్‌ ప్రైజ్‌ చేయండి..
మీ భాగస్వామి ఎప్పుడైనా ఏదైనా విషయం గురించి అలిగితే గనుక మీరు ఈ పద్ధతిని ఫాలో అయితే కచ్చితంగా ఫలితం ఉండొచ్చు. అదేంటంటే.. తనను సర్‌ ప్రైజ్‌ చేయడం.. ఉదాహరణకు మీవారికిష్టమైన వంటలను వండి పెట్టడం లేదా వారి దగ్గరకు వెళ్లి ప్రేమగా తినిపించడం.. అలా చేస్తూనే ‘నాపై కోపం ఇంకా తగ్గలేదా’ ఈ సారికి మన్నించు డియర్‌ అంటూ మాట్లాడితే చాలు వారి కోపం క్షణాల్లో ఎగిరిపోతుంది. వారికి నచ్చిన పనులు చేయడం.. వారితో ఎక్కువ సమయం గడపడం వంటివి చేస్తే.. వారి అలకను సులభంగా తీర్చొచ్చు. అలాగే – పిలువకురా అలుగకురా…నలుగురిలో నను ఓ రాజా.. పలుచన సలుపకురా..వంటి పాటతో వారి మనసు దోచెయ్యచ్చు.
అలక తీర్చే బాధ్యత ఇద్దరిది
మీ భాగస్వామి అలకకు మీరే కారణమైతే… అందుకు ఓపెన్‌గా మీరు తప్పు ఒప్పుకోవాలి. ఒకవేళ మీరు వారిపై తీవ్రంగా అసహనం చూపి ఉంటే గనుక.. వారు నార్మల్‌ స్టేజ్‌కి రావడానికి కొంత ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మాములూగా మీరు సారీ చెప్పడం.. ఇదొక్కసారికి మన్నించు అని అడిగితే ఫలితం ఉండకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో మీరు మీ భాగస్వామిని బాగా బుజ్జగించాలి. ‘నా బంగారం.. నా డార్లింగ్‌.. అంటూ.. ఈ సారికి క్షమించొచ్చు కదా..’ అంటే మీ పరిస్థితిని వివరిస్తే.. వారి కోపం త్వరగా చల్లారొచ్చు. అన్నీ మరచిపోతారు.. మీ భాగస్వామి అలక తీర్చే సమయంలో మీరు వారి మనసును బాధపెట్టి ఉంటే.. అలాంటి సమయంలో మీరు ఏదైనా పాత విషయాలను మాట్లాడటం, బాధ పెట్టే మాటలను గుర్తు చేయడం వంటివి అస్సలు చేయొద్దు. దీని వల్ల వారి కోపం మరింత పెరగొచ్చు. కాబట్టి ఇలాంటివి చేయకుండా మీరు వారి అలక తీర్చే మార్గాలను వెతికితే.. వారు అన్నీ మరచిపోయి మిమ్మల్ని త్వరగా క్షమించేస్తారు.
ఆలోచన మంచిదే.. కానీ
పైన చెప్పిన చిట్కాలన్నీ మీ భాగస్వామి అలిగిన సమయంలో ఒకేసారి ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు వెంటనే బుజ్జగించడం, సారీ చెప్పడం, కారణాలు చెప్పడం వంటివి చేస్తే ప్రతికూల ఫలితం రావొచ్చు. ఒంటరిగా వదిలేయండి.. మీ భాగస్వామి అలక తీర్చడం అనే ఆలోచన చాలా మంచిది. కానీ మీరు కాస్త ఓపిక పట్టాలి. ముఖ్యంగా వారిని కాసేపు ఒంటరిగా వదిలేయండి. వారి కోపం కాస్త తగ్గితే ఆ తర్వాత మీరు పైన చెప్పిన మార్గాలను ప్రయత్నిస్తే ఫలితం రావొచ్చు.
మిత అలక ప్రమోదం – అతి అలక ప్రమాదం
అలక శ్రుతిమించినా తరచు ఇలానే జరుగుతూ ఉన్నా, మనసులు విరిగిపోయే ప్రమాదం ఉంది. ఒకరి మీద ఒకరికి నమ్మకం పోయిందంటే, భార్యాభర్తల మధ్య దూరం మరింత పెరిగే అవకాశం ఉంది. అలకని ఆయుధంగా ఎంచుకున్న వారికి దాన్ని ఎప్పుడు ఎలాంటి విషయంలో ఉపసంహరించుకోవాలో తెలిసుండాలి. అలా కాకుండా దాన్ని ఇగో ప్రాబ్లెమ్స్‌గా మార్చు కుంటే ఆ చిక్కును విడదీయడం ఎవరితరమూ కాదు. ఎదుటి వ్యక్తీ మానసిక ప్రవర్తనను గమనించి అలకను ప్రదర్శించాలి. అలక మీద ఉన్నవారు పూర్తి స్థాయిలో ముడుచుకుపోయి మౌనంగా ఉండటం అలక కాదు. ఎదుటి వారితో సంభాషిస్తూనే తాము ఏ విషయంలో హర్ట్‌ అయ్యారో తెలియచేయాలి. అలా అంటే అలక ఆటవిడుపు అయ్యి ఇద్దరు వ్యక్తుల ఆనందాన్ని పెంచుతుంది.
భాగస్వామి అలిగిందన్న విషయం గుర్తించకుండా ఎవరి ధోరణి వారిదే అయితే తనకేం కావాలనే విషయాన్ని కనీసం గుర్తించలేని స్థితిలో ఉన్నారని కోపం ఎక్కువైతే అనర్ధాలకు అది దారి తీస్తుంది.
సాధించే భాగస్వామి ఉంటే ప్రతీ విషయానికీ ఇలాగే జరుగు తుంది. మాట మాట అనుకుంటూ ఉంటే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్‌ తగ్గిపోయే అవకాశమూ ఉంది. కొందరు తాము అలిగితే ఆ విషయం ఎదుటివారికి తెలియాలని తమకి నష్టం చేసుకుంటారు. ఉదాహరణకి తిండి తినకుండా మానేయటం, శరీరాన్ని గాయపర్చుకోవడం వంటివి ఎన్నో, ఇలాంటివి కూడదు.
ఆడవారి కోపంలో అందమున్నది, అనర్థమూ ఉన్నది
పంతానికి పోయేంత, సంబంధాలను త్రెంచేంతటి అలకను అల్లాప్‌ా సుతరామూ ఇష్టపడడు. అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం అన్నట్టు అలక ఆనందదాయకమే కాదు అనర్థదాయకం కూడా. ఆడ గయ్యాళి ఆయిన ఓ అందమైన స్త్రీ అలుక వహించి, అలుక తీర్పవచ్చిన తనను మోహించించిన రాజుతో మహా మహితాత్ములైన యహ్యా(అ) గారి తల బహుమానంగా తెమ్మని అడిగింది. ప్రియురాలి అలక తీర్చాలన్న ఆరాటంలో ఆ పరమ పాపి ఏకంగా ఆ మహాత్ముని తలనే పళ్లెంలో పెట్టి ఆ ఆడ దెయ్యం అలక తీర్చాడు. ప్రతిగా అల్లాప్‌ా ఆగ్రహానికి గురయ్యాడు. (ఇమామ్‌ తబరీ (రహ్మ) గారి చరిత్ర గ్రంథం)
ఆఫీసులో అలక కూడదు
ఆఫీసన్నాక భిన్న మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు ఉన్నవారితో కలిసి పని చేయాల్సి ఉంటుంది. మాట పట్టింపులు, చిన్న తగాదాలు సాధారణమే! కొందరి తీరు వల్ల పనిపైనా ప్రభావం పడుతుంది.
ఇంట్లో చిన్న చిన్న తగాదాలు సాధారణమే కదా! అప్పుడేం చేస్తాం.. వీలైతే సర్దుకుపోతాం లేదంటే అలక చూపిస్తాం. ఆఫీసులో అలకంటే కష్టమే! దూరంగా ఉండటమూ సాధ్యం కాదు. కాబట్టి, సమస్య ఎంత పెద్దదో ఆలోచించుకోండి. వ్యక్తిగతం కాదనిపిస్తే అంతటితో వదిలేయడమే మేలు. వాదనకు దారితీసిన అంశంపై మళ్లీ మాట్లాడుకోకపోతే ఇంకా మంచిది.

– ‘మనకు పిల్లలు, ఇంటి బాధ్యతలుంటాయి. అవి ఇతరులకీ అర్ధమవ్వాలనేంలేదు. దీంతో ఏ సమయంలోనైనా అందుబాటులో ఉండాలని ఆశిస్తుంటారు. లేకపోతే విభేదాలు. వాళ్లే అర్థం చేసుకోవాలి అనుకున్నంత కాలం పరిస్థితిలో మార్పుండదు. కాబట్టి నోరు తెరవండి.
– ఎంతసేపు మన కోణంలోనే ఆలోచిస్తేనే తేడాలొచ్చేది. అవతలి వాళ్ల గురించీ ఆలోచించాలి. అందరినీ కలుపుకొంటూ వెళ్లాలి. నేను సాయపడను కానీ అందరూ నాకు సహకరించాలన్న తత్వం పనిలోనే కాదు.. పక్కవారితో బంధం ఏర్పరచడంలోనూ చేటే చేస్తుంది.
– అన్నింటికీ ఫిర్యాదు చేయడం మంచిది కాదు. నిజమే.. కానీ అవతలి వాళ్లు మిమ్మల్ని టార్గెట్‌ చేస్తున్నా.. అధికార బలంతో ఇబ్బంది పెడుతున్నా.. అదనపు భారం వేస్తున్నా పై అధికారి లేదా పరిష్కరించగలిగే వ్యక్తికీ ఫిర్యాదు చేయండి. అప్పుడు సర్దుకుపోవద్దు.
చివరి మాట
అలుగుటయే ఎరుగని మహా మహితాత్ములు మహనీయ ముహమ్మద్‌(స) వారే అలిగినారు. ఆయన సహచరుల శిక్షణార్థం ఆయన ఎన్నో సందర్భాల్లో చిరు కోపాన్ని ప్రదర్శించారు. వారికి కావాల్సిన శిక్షణ ఇచ్చి మానవ జాతి రత్నాలుగా వారిని తీర్చిదిద్దారు. జగమంతా ఇంటింటా కోపాలు లేకుండా ప్రేమ దీపాలు వెలిగించుకుంటే అప్పుడే నిజమైన సంతోషం.