June 16, 2024

–  డా. ఖాలిద్ ముబష్షిరుజ్జఫర్, అమీరె హల్ఖా, తెలంగాణ
(హజ్ యాత్రికులను ఉద్దేశించి చేసిన ప్రసంగం నుంచి)

దైవం ఆరాధనల వ్యవస్థను మన సంస్కరణ కోసం ఇచ్చాడు. నమాజు చదవడం వల్ల మనిషి చెడులకు దూరంగా ఉంటాడు. మనిషి దైవ సాన్నిహిత్యాన్ని పొందుతాడు. జకాత్ ఇవ్వడం వల్ల మన సంపద పరిశుభ్రమవుతుంది. ప్రక్షాళన అవుతుంది. ఉపవాసాలు, రోజా వల్ల మన శరీరమే కాదు, మన మనోవాంఛలు కూడా అదుపులో ఉంటాయి. శారీరక, మానసిక శిక్షణ లభిస్తుంది. అయితే ఈ మూడు ఆరాధనల సమగ్రరూపం హజ్ యాత్ర. హజ్ యాత్రలో మనిషి మూడు విధాలుగా, అంటే నమాజులో మాదిరిగా శారీరకంగాను, జకాత్ లో మాదిరిగా ఆర్థికంగాను, రోజాలో మాదిరిగా మానసికంగాను చేయవలసిన ఆరాధన. అన్నివిధాల త్యాగాలు చేయవలసిన ఆరాధన. ఆర్థికంగా చూస్తే ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఇది అనేక సంవత్సరాల పొదుపు చర్యలతో, హజ్ యాత్ర కోసం కూడబెట్టిన సొమ్ముతో, చాలా కాలంగా ప్రణాళికాబద్దంగా చేసిన ప్రయత్నాలతో హజ్ యాత్ర సాధ్యమవుతుంది.

సాధారణంగా మధ్యతరగతి ముస్లిములందరు ఇలాగే చేస్తారు. ఒకటికి రెండు సార్లు హజ్, ఉమ్రా యాత్రలు చేయగలిగిన వారు చాలా తక్కువ మంది మధ్యతరగతిలో ఉంటారు. కష్టపడి సంపాదించిన సొమ్ములో కొంత భాగం హజ్ యాత్ర కోసం దాచుకుని హజ్ యాత్రకు వెళతారు. ఈ క్రమంలో డబ్బు పొదుపు చేయడానికి చాలా త్యాగాలు చేస్తారు. కాబట్టి ఈ హజ్ యాత్ర లక్ష్యాన్ని అర్ధం చేసుకోవడం అవసరం. హజ్ యాత్రలో గడిపే రోజుల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఆ విధంగా హజ్ యాత్రను ఆధ్యాత్మిక అనుభూతిగా మార్చుకోగలం. నేను 2017లో హజ్ యాత్ర చేసే అదృష్టం లభించింది. కాబట్టి నేను హజ్ యాత్ర గురించి అనుభవపూర్వకంగా మీకు చెప్పగలను.
హజ్ యాత్రకు బయలుదేరినప్పుడు మనలో ఉండే ఆధ్యాత్మిక సంకల్పం, స్ఫూర్తి, ఆ తర్వాత అక్కడికి చేరుకున్నప్పుడు ఎదురయ్యే సవాళ్ళు వీటన్నింటి గురించి నాకు తెలుసు. ఈ సవాళ్ళు ఎదురైనప్పుడు చాలా సందర్భాల్లో మనం అసలు లక్ష్యాన్ని మరిచి చిన్న చిన్న కంప్లయింటులు, ఫిర్యాదులు చేయడంలో నిమగ్నమైపోతాం. కాబట్టి మనం హజ్ యాత్ర లక్ష్యాన్ని మన గుండెల్లో నింపుకోవడం అవసరం. అల్లాహ్ హజ్ యాత్రను ఎందుకు విధిగావించాడంటే, మనం అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాలకు కృతజ్ఞతలు చెప్పడానికి. హజ్ యాత్రలో మొత్తం ప్రపంచంలోని ముస్లిములు ఒక్కచోట సమావేశమవుతారు. అందరి నోట అల్లాహ్ ఔన్నత్యాన్ని కొనియాడే తల్బియా ఉంటుంది. లా షరీకలహు… అంటే నీ ఔన్నత్యంలో నీ దైవత్వంలో ఇంకెవ్వరినీ భాగస్వాములు చేసేది లేదని ప్రకటిస్తాం. లబ్బైక్.. అంటే హాజరయ్యాను ప్రభూ అంటూ పలుకుతాము. లక్షలాది మంది దైవదాసులు అక్కడ లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ అని పలుకుతున్న ఆ దృశ్యాన్ని చూసినప్పుడు, ఆ తల్బియా విన్నప్పుడు మన మనసుల్లో ఉన్న ఫిర్యాదులు, సమస్యలు, కంప్లయింటులు, చెడులు, చెడుభావాలు, ఈర్ష్యాసూయలు అన్ని కడిగివేయబడినట్లు తొలగిపోతాయి. కంట నీరు పెల్లుబుకుతుంది. గుండెను కడిగేస్తుంది. హజ్ యాత్ర ఒక ఆరాధనగా చాలా ఎక్కువ వ్యవధిలో జరిగే ఆరాధన. అంటే మనం నమాజు చదివితే కొన్ని నిముషాల ఆరాధనాసమయం. మనం జకాత్ ఇస్తుంటే అది కూడా కొన్ని నిముషాల ఆరాధనా సమయమే. మనం రోజా ఉంటే అది కొన్ని గంటల ఆరాధనాసమయం. కాని హజ్ యాత్ర కొన్ని రోజుల ఆరాధనాసమయం ఉన్న ఆరాధనారూపం. ఇది అల్లాహ్ ఔన్నత్యాన్ని కొనియాడడం, అల్లాహ్ కారుణ్యాలకు కృతజ్ఞతలు తెలుపడం. ఒకే ఒక్క దైవం అల్లాహ్ అన్న ఏకేశ్వరోపాసనను చాటి చెప్పడం. ప్రపంచాన్ని వదిలి భాగస్వాములు ఎవ్వరు లేని ఒకే ఒక్క దైవం సన్నిధిలో హాజరయ్యానని ప్రకటించడం.
మనం ఇక్కడి నుంచి బయలుదేరుతున్నప్పుడు మన ఇంటి సమస్యలు, పిల్లల చదువులు, మనుమలు, అక్కాచెల్లెళ్ళు, అన్నాదమ్ములు వాళ్ళ సమస్యలు, వాళ్ళ వ్యవహారాలు అన్నింటిని ఇక్కడే వదిలి వెళ్ళాలి. అల్లాహ్ మీకు తన సన్నిధిలో హాజరయ్యే అవకాశాన్నిచ్చాడు. కాబట్టి సూటిగా అల్లాహ్ నే వేడుకోండి. అల్లాహ్ పైనే నమ్మకం పెట్టుకోవాలి. హజ్ యాత్ర సౌభాగ్యం అదృష్టం కొద్ది లభిస్తుంది. ఈ సమయాన్ని పూర్తిగా అల్లాహ్ కే అంకితం చేయండి. హజ్ యాత్రలో అల్లాహ్ గృహాన్ని సందర్శించడం, అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ (స) నగరానికి వెళ్ళడం ఇంతకన్నా సౌభాగ్యం ఏముంటుంది. కాబాగృహంలో నమాజు చేయడం, ఆ తర్వాత మదీనాలో నమాజు చేయడం అత్యంత పుణ్యప్రదం. కాబట్టి ఈ సమయం పూర్తిగా ఆరాధనలకే అంకితం చేయాలి. ప్రతి క్షణం అల్లాహ్ స్మరణలో గడపాలి.
సాధారణంగా అక్కడికి చేరుకున్న తర్వాత మొదటి ఒకట్రెండు రోజులు బడలిక తీరడానికి చాలా మంది విశ్రాంతి తీసుకుంటారు. నేను హజ్ యాత్ర చేసినప్పుడు నా హోటలు గదికి పక్కన ఉన్న గదిలో ఒక అరవయ్యేళ్ళు దాటిన వృద్ధమహిళ ఉన్నారు. నేను మూడవ రోజున ఆమె కలిసినప్పుడు ఆమెతో మీరు ఉమ్రా చేసారా? అని అడిగాను. ఆమె బదులిస్తూ పన్నెండు సార్లు చేసాను బాబు అన్నారు. ఆమె ఆరవయ్యేళ్ళు దాటిన వయసులో, శారీరక అలసటను లెక్కచేయక, బహుశా ఆమెకు కొన్ని ఆరోగ్యసమస్యలు కూడా ఉండి ఉండవచ్చు, అయినా ఆమె వాటన్నింటిని పక్కన పెట్టి దైవారాధనలో ఎంతగా నిమగ్నం అయిపోయారో చూసి నేను ఆశ్చర్యపోయాను. కాబా ఆరాధన… ప్రదక్షిణ (తవాఫ్) చాలా ముఖ్యం. కాబా ప్రదక్షిణకు ఒక ఉదాహరణ చెబుతాను. దీపం చుట్టు దీపపు పురుగులు ప్రదక్షిణ చేయడం చూశారా? ఇది అలాంటిదే. ఆ కాంతినిలయం చుట్టు మనం ప్రదక్షిణలు చేయడం మన సాఫల్యానికి చేసే ప్రయత్నం. కాబట్టి ప్రారంభంలోనే, అలసట అంతగా లేనప్పుడే ఎన్ని సార్లు సాధ్యమైతే అన్ని సార్లు కాబా ప్రదక్షిణ చేయండి. హజ్ యాత్ర తర్వాత కూడా ఎన్ని సార్లు వీలయితే అన్ని సార్లు తవాఫ్ చేయండి. అలాగే మదీనాలో ప్రవక్త మస్జిదులో నమాజు చేయడం చాలా పుణ్యప్రదం. అక్కడ ఎన్ని నమాజులు చదవగలిగితే అన్ని చేయండి. సున్నతులు, నఫీల్ నమాజులు ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి.  అక్కడ ఒక్క నమాజు యాభైవేల నమాజులకు సమానం.
ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాం. లబ్బైక్, అల్లాహుమ్మ లబ్బైక్, లాషరీక లక లబ్బైక్… అని పలుకుతూ మనం చేసే ఈ హజ్ యాత్ర ఏమిటో అర్ధం చేసుకోవాలి. ఓ అల్లాహ్ నేను హాజరయ్యాను. అల్లాహ్ నీకు భాగస్వాములు ఎవరు లేరు. నేను హాజరయ్యాను. సకల స్తోత్రాలు నీకే.. సమస్త అధికారాలు నీవే. హజ్ యాత్రకు బయలుదేరిన సోదరసోదరీమణులారా దైవభక్తి, దైవభీతి ఇవే మన సాఫల్యానికి దారులు. కాబట్టి మనం తఖ్యా అంటే దైవభక్తి, దైవభీతి వీటిని అర్థం చేసుకోవాలి. లేకపోతే మనం హజ్ యాత్ర స్ఫూర్తిని పొందలేం. తఖ్వాకు సంబంధించి ఒక ఉదాహరణ చెబుతాను. హజ్రత్ ఉమర్ (రజి) కాలంలో ఒక ప్రవక్త సహచరులు మరో సహచరునితో తఖ్వా అంటే ఏమిటని అడిగారు. దానికి ఆయన జవాబిస్తూ మీరు ఒక ఇరుకైన దారిలో నడుస్తుంటే, దారికి రెండువైపులా ముళ్ళ చెట్లు కొమ్మలు చాచి ఉంటే, మీరు వదులైన దుస్తులు ధరించి నడుస్తుంటే ఏం చేస్తారు? మీ దుస్తులను శరీరానికి దగ్గరగా చేసుకుని, ముళ్ళలో ఇరుక్కుని దుస్తులు చిరిగిపోకుండా జాగ్రత్తపడుతూ నడుస్తారు. ప్రపంచంలో ఇలా జీవించడమే తఖ్వా అన్నారు. కాబట్టి హజ్ యాత్రలో మీరు ఇలాగే జాగ్రత్తగా గడిపితే, ఆగ్రహం, కోపావేశాలు, దుర్భాష, అనవసర ఫిర్యాదులు, అనుచిత పదాలు మీ నోట వెలువడకుండా ఉండాలి. అలా జరిగితే మీరు ప్రపంచంలోని ముళ్ళ నుంచి రక్షణ పొందినట్లే భావించాలి. ఇదే తఖ్వా. మీ మనసులో చెడు ఆలోచనలు రాకూడదు. ఏదన్నా కష్టం కలిగినా ఫిర్యాదు చేయకుండా, అల్లాహ్ పై భారం వేయాలి. ఇలా హజ్ యాత్ర సహనం, ఓరిమితో పూర్తయితే అప్పుడు హజ్ యాత్ర తర్వాత మీరు అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ (స) చెప్పినట్లు అప్పుడే పుట్టిన శిశువుమాదిరిగా స్వచ్ఛంగా మారిపోగలరు.
సోదరులారా, మీరు మీ కాలంలో కొంత సమయాన్ని దైవగృహానికి వెళ్ళి చేసే ఆరాధనలో గడపబోతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీరు సగటు మనోవైకల్యాలకు, కోపావేశాలకు గురయితే ఏం లాభం? కాబట్టి ఈ విషయం గుర్తుంచుకోండి.
అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చేయవలసిన పనుల్లో కొన్ని ముఖ్యమైన పనులను మీకు చెబుతాను. ముఖ్యంగా నాలుగు రోజులు కాస్త కష్టంగా ఉండవచ్చు. ఈ రోజుల్లో మీకు లభించిన బస కాస్త దూరంగా ఉండవచ్చు. సయీ చేయడానికి, షైతానుకు కంకరరాళ్ళతో కొట్టే ఆచరణ కోసం మీరు కాలినడకన కాస్తదూరం నడవవలసి రావచ్చు. కొన్ని సార్లు మీరు నిద్రించడానికి కేవలం సమాధి స్థలమంత చోటు మాత్రమే లభించవచ్చు. ఆరడుగుల పొడవు, మూడడుగుల వెడల్పు ఉన్న ప్రదేశం మాత్రమే దొరకవచ్చు. ఇలాంటి సందర్భాల్లో అల్లాహ్ చెప్పిన మాటలు గుర్తుంచుకోవాలి… ‘‘వారు తమకన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇతరులకు ఇస్తారు’’. ఇది హజ్రత్ తల్హా (రజి) గురించిన సంఘటన. ఆయన ఇంటికి ఒక అతిథి వచ్చినప్పుడు ఆయన ఇంట్లో తినడానికి చాలా తక్కువ ఉంది. తల్హా (రజి) శ్రీమతి పిల్లలకు భోజనం పెట్టకుండానే నిద్రపుచ్చుతారు. రాత్రి భోజనం దీపం లేకుండానే అతిథి ముందు పెడతారు. నిజానికి తల్హా (రజి)  పళ్ళెం ఖాళీగా ఉంటుంది. కేవలం అతిథికి మాత్రమే వడ్డించారు. ఈ సంఘటన తర్వాత అల్లాహ్ తరఫు నుంచి ఈ వాక్యం అవతరించింది. ఇది విశ్వాసుల లక్షణం. ఈ లక్షణంతో మన హజ్ యాత్ర చేస్తే ఇన్షా అల్లాహ్ మన హజ్ యాత్ర అత్యున్నత స్థానం పొందుతుంది. మనం మనకన్నా ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వాలి. కాబాగృహం పరిశుభ్రత కూడా చాలా ముఖ్యమైన విషయం. అత్యధిక సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నప్పుడు పరిశుభ్రత దెబ్బతింటుంది. కాబట్టి యువకులు అక్కడ స్వచ్ఛందసేవకులుగా మారాలి. హజ్ యాత్ర చేస్తూనే అక్కడ పరిశుభ్రతను కాపాడ్డానికి సేవలందించాలి. వ్యాధిగ్రస్తులకు, ముసలివారికి, మహిళలకు సహాయపడాలి. మీ దగ్గర ఒక ముసలివ్యక్తి ఉంటే, మీరు పడకపై నిద్రించే బదులు, క్రింద పడుకుని ఆ పడకను ఆ వ్యక్తికి ఇవ్వగలగాలి. నిజానికి సౌదీ ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు అద్భుతమైన స్థాయిలో చేస్తుంది. అయినప్పటికీ కొన్నిసార్లు మనకు తగిన సౌలభ్యం లభించకపోవచ్చు. ఇంటివద్ద ఉన్నట్లు అన్ని సదుపాయాలు లభించవు. ఇక్కడ భారతప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని సార్లు సదుపాయాలు అనుకున్నట్లు ఉండకపోవచ్చు. అప్పుడు కూడా సహనం చూపి ఆరాధనల్లోనే గడపితే మన ఈ హజ్ యాత్ర గొప్ప ఆరాధనగా మారుతుంది.
దివ్యఖుర్ ఆన్ లోని సూరా బఖరలో హజ్ యాత్రకు ప్రయాణసామగ్రి వెంటపెట్టుకున వెళ్ళండి, అయితే అత్యుత్తమమైన ప్రయాణసామగ్రి తఖ్వా అని చెప్పడం జరిగింది. తఖ్వా గురించి ఇంతకు ముందు చెప్పుకున్నాం, జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం. అయితే తఖ్వా విస్తృతభావం కలిగిన పదం.   సాధారణంగా తఖ్వా అంటే దైవానిక భయపడడం అని భావిస్తాం. కాని తఖ్వాకు సంబంధించి ఇది పూర్తి భావం కాదు. నిజానికి తఖ్వాపదం తాను అత్యధికంగా ప్రేమించే దైవం కోసం, దైవానికి అయిష్టమైన వాటన్నింటిని త్యజించడం, దైవానికి ఇష్టమైన వాటన్నింటినీ స్వీకరించడం. కాబట్టి దైవానిక భయపడుతూనే కాదు, దైవం పట్ల అపారమైన ప్రేమతో దైవానికి అయిష్టమైనవాటన్నింటికీ దూరం ఉంటూ ఈ హజ్ యాత్ర పూర్తి చేయాలి. ఆ విధంగా తఖ్వా నిర్వచనాన్ని మనలో ప్రతిబింబించేలా చేయాలి. హజ్ యాత్ర తర్వాత మనిషిలో వచ్చిన మార్పు తర్వాతి జీవితంలో ప్రతిఫలించాలి.
అంటే హజ్ యాత్ర ఒక శిక్షణ వంటిది. హజ్ యాత్రలో లభించిన శిక్షణ తర్వాత కూడా మన గుండెల్లో తఖ్వా లేకపోతే, దైవప్రేమ, దైవభీతి లేకపోతే, అల్లాహ్ ప్రవక్త (స) పట్ల ప్రేమ కేవలం నోటితో పలికే నినాదంగా మారిపోతే అలాంటి హజ్ యాత్ర వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. లక్షలాది మంది హజ్ యాత్ర చేస్తారన్నది ఎంత వాస్తవమో, అందులో ఎంతమంది హజ్ యాత్ర స్వీకరించబడుతుందో చెప్పలేమన్నది కూడా అంతే వాస్తవం. ముఖ్యంగా మహిళలు, జీవితాంతం భర్తకు, పిల్లలకు సేవలు చేశారు. మీరు చేసినంత సేవ ఎవ్వరు చేయలేరు. ఈ హజ్ యాత్రలో మీ సేవానిరతి అత్యున్నతస్థాయిలో ఉండడం అవసరం. మీరు అత్యంత పవిత్రస్థానానికి వెళుతున్నారు. మీ భర్త, తల్లిదండ్రులు, అత్తమామలు ఎవరైనా గాని వారి విషయంలో మీరు ఎలాంటి సందర్భంలోను దయచేసి చికాకు ప్రదర్శించకండి. మనం స్వచ్ఛందంగా ఈ హజ్ యాత్రకు వెళుతున్నాం. ఒక గొప్ప ఆరాధనకు వెళుతున్నాం. కాబట్టి ఎలాంటి సందర్భంలోను ఎవరిపైనా మీరు చికాకు చూపవద్దు.  గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ హజ్ యాత్రలో మన నోట ఎల్లప్పుడు అల్లాహ్ వాక్యాలు, అల్లాహ్ తో దుఆ, ప్రవక్త ముహమ్మద్ (స) పై దురూద్ ఉండాలి. కాబాగృహం వద్ద దివ్యఖుర్ఆన్ పారాయణం ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవం. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ (స) చెప్పిన ఒక హదీసు ఇక్కడ ప్రస్తావించడం అవసరం. మనిషి మూడు చోట్ల తన మనసును పరిశీలించాలి. ఒకటి ఒంటరిగా ఉన్నప్పుడు, రెండు  దివ్యఖుర్ఆన్ పారాయణం చేస్తున్నప్పుడు, మూడు అల్లాహ్ ను స్మరిస్తున్నప్పుడు అంటే నమాజులో. దివ్యఖుర్ఆన్ పారాయణంలో మనసు నిమగ్నం కాకపోతే, నమాజులో మనసు నిమగ్నం కాకపోతే, హజ్ యాత్రలో ఉన్నప్పుడు కూడా నమాజులో మనస్సు లగ్నం కాలేకపోతే, ఒంటరిగా ఉన్నప్పుడు మీ నోట అల్లాహ్ స్మరణ లేకపోతే అప్పుడు మనిషి అల్లాహ్ తో తనకు ఒక మంచి మనసును ప్రసాదించమని దుఆ చేయాలన్నారు ప్రవక్త మహనీయులు. సోదరసోదరీమణులారా, జిక్ర్ లేదా అల్లాహ్ స్మరణ అనేది మన నోట ఉన్నప్పుడే దాని ప్రభావం మన మనసుపై ఉంటుంది. మీకు గుర్తున్న దుఆలన్నీ పలుకుతూ ఉండండి. మీకు గుర్తున్న జిక్ర్ లన్నీ చదువుతూ ఉండండి. బిగ్గరగా చదవండి. జిక్ర్ ఎంతగా మనం చేస్తే అంతగా మనకు మనోల్లాసం లభిస్తుంది. దుఆ మన విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. జిక్ర్ మనిషిని దుఆ వైపునకు తీసుకువస్తుంది. దుఆ ఏదైనా కావచ్చు, అల్లాహ్ నా ఇహపరలోకాల్లో సాఫల్యాన్ని ప్రసాదించమనే దుఆ కావచ్చు. ఆర్థిక ఇబ్బందులను తొలగించమని చేసే దుఆ కావచ్చు. అన్నింటికి మించి సంతానం ధర్మానికి కట్టుబడాలనే దుఆ, స్వయంగా ధర్మబద్దుడిగా జీవించే సౌభాగ్యం ప్రసాదించాలని దుఆ, ఆరాధనల్లో మనస్సు లగ్నమయ్యేలా చేయాలని దుఆ, ప్రవక్త మహనీయుల ప్రేమ మనసులో పెంపొందాలని దుఆ, దైవప్రసన్నత కోసం దుఆ, ఇలా అన్ని విధాలుగా దుఆ చేయండి. దుఆ మనస్ఫూర్తిగా చేయండి. అల్లాహ్ ప్రసన్నతే మన లక్ష్యం. తన సన్నిధిలో మొరపెట్టుకుంటున్న దాసుడి దుఆ ఆయన తప్పక వింటాడు.
కాబట్టి సోదర సోదరీమణులారా హజ్ యాత్ర లక్ష్యాన్ని ఎల్లప్పుడు దృష్టిలో ఉంచుకోండి. అల్లాహ్ ఔన్నత్యాన్ని ప్రకటించడానికి, మనసులో తఖ్వా పెంపొందించుకోడానికి, దైవప్రసన్నత పొందడానికి, ఇహపరలోకాల్లో సాఫల్యం సాధించడానికి, అప్పుడే పుట్టిన శిశువుమాదిరి స్వచ్ఛతను పొందడానికి వెళుతున్నారన్నది ఎల్లప్పుడు దృష్టిలో ఉండాలి. అనవసరమైన ఫిర్యాదులు, కంప్లంయింటులు, రుసరుసలు, కోపతాపాల్లో సమయాన్ని వృధా చేయకండి. సదుపాయాలు లభించలేదని, ఉక్కపోతగా ఉందని, కరంటు లేదని… ఇలాంటివన్నీ పక్కన పెట్టండి. మీకు సదుపాయాలు కల్పించవలసిన వారు చేయలేకపోతే వారిని క్షమించండి. మీకు లభించిన దానికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి కోసం కూడా దుఆ చేయండి. అనేకమంది మీ హజ్ యాత్రకు సదుపాయాలు కల్పించే సేవలు అందిస్తున్నారు. హజ్ కమిటీ ఈ సేవల్లో ఉంది. కాబట్టి ఎల్లప్పుడు హజ్ యాత్ర లక్ష్యమే మీ దృష్టిలో ఉండాలి. గుర్తుంచుకోండి. మన ఖుర్బానీలో అల్లాహ్ వద్దకు ఖుర్బానీ చేసిన పశువు రక్తమాంసాలేవీ చేరవు. కేవలం మన తఖ్వా అంటే దైవభీతి మాత్రమే కాదు, దైవం పట్ల మన ప్రేమ మాత్రమే దైవం చూస్తాడు. మన త్యాగనిరతిని మాత్రమే దైవం చూస్తాడు. కాబట్టి గుర్తుంచుకోండి, పశువును ఖుర్బానీ ఇవ్వడానికి సిద్ధమై, మన మనోవాంఛలు, మన మనోకాంక్షలు, మనోభావాలు, మన భావావేశాల ఖుర్బానీకి సిద్ధం కాకపోవడం ఎంత దురదృష్టం? కాబట్టి మనం ఈ హజ్ యాత్రలో విశ్వప్రభువు ప్రసన్నత పొందడమే లక్ష్యంగా వ్యవహరించాలి.