మనిషి ప్రస్థానం ఎక్కడి నుండి ఎక్కడ వరకు మొదలైంది, మానవ నాగరికత పరిణామ క్రమంలో మనిషి ‘‘నిప్పును’’ కనిపెట్టిన తర్వాతే, అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అనంతరం ‘‘చక్రం’’ ఆవిష్కరించిన తర్వాత ఆధునిక సమాజాలు వెలిశాయని ప్రముఖ చరిత్రకారుడు ‘‘గోర్డన్ చైల్డ్’’ అంటాడు. అంటే మనిషి లక్షల సంవత్సరాలుగా నిరంతరం ఎదో ఒక దానితో పోరాటం చేయటం నిత్యకృత్యమై నది, ఇప్పుడు మనం భౌతికంగా అనుభవిస్తున్నదంతా మన పూర్వీకులు లేదా మన కన్నా రెండు లేదా మూడు తరాలకు పూర్వం వారు అనుభవించలేకపోయారు అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
ఇటీవలె ప్రపంచం అబ్బురపడేలా ఆగ్రదేశమైన అమెరికాకు సాధ్యంకాని చంద్రుని దక్షిణ దృవంపై మన శాస్త్రవేత్తలు చంద్ర మండలంపై చంద్రయాన్- 3 ఉపగ్రహాన్ని దింపి చంద్రునిపై అన్వేషణకు పరిశోధనలు చేయటం మొదలుపెట్టారు. ఇదంత ఒక రాత్రికి రాత్రే జరిగింది కాదు. ఎంతోమంది కొన్ని సంవత్సరాల సమిష్టి కృషికి నిదర్శనం అది. ఇవన్ని మనిషి సాధించిన విజయా లకు చిహ్నాలు మాత్రమే కాని మనిషి అప్పుడప్పుడు ఆదిమ సమాజంలోని లక్షణాలను, మధ్యయుగాలలోని భావజాలాన్ని ప్రదర్శించి సమాజానికి అంతరాయం కల్గించటం ఏమిటి? అనేది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. ఇక అసలు విషయంలోకి వస్తే ఈ వ్యాసంలో కొద్దిమందిని వారు పేర్కొన్న వివాదాస్పద విషయాలను ప్రస్తావించదలిచాను ఉదయనిధి స్టాలిన్ ఇటీవల ఓ వేదికలో ‘‘సనాతన ధర్మం’’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోని వ్యక్తిగా, వివాదాస్పదమైన రాజకీయనేతగా వార్తలోకి ఎక్కిన ఫలితంగా సాంప్రదాయవాదులందరు తిరుగుబాటు చేసి దేశవ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు దిష్టిబొమ్మ దహనాలు చేసి నిరసన వ్యక్తం చేయటం అందరికి తెలిసిన విషయమే. చెన్నైలో ఒక రోజు బంద్ ప్రకటించారు. ఇక రెండవ వ్యక్తి ‘‘బైరి నరేష్’’ గత సంవత్సరము ఓ వేదికలో మాట్లాడుతూ అయ్యప్ప స్వామి గూర్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అయ్యప్ప స్వాములు దాడిచేస్తే చివరికి అరెస్టై జైలుకి వెళ్ళి, బెయిల్ పై వచ్చిన విషయం అందరికి తెలిసినదే, బైరి నరేష్ వివాదం పెద్ద మొత్తంలో అలజడి సృష్టించింది. ఇక మూడవ వ్యక్తి బి.జే.పి. అధికార ప్రతినిధి ‘‘నుపూర్ శర్మ’’ ఓ టీవి చర్చా వేదికలో ముహమ్మద్ ప్రవక్త(స)పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్జా తీయంగా పెద్ద దుమారం రేపాయి, తద్వారా బి.జే.పి. కేంద్ర కమిటీ నుపూర్ శర్మను పార్టీ నుండి సస్పెండ్ చేయటం తెలిసిందే. ఈ సంఘటన తర్వాత అరబ్ దేశాల నుంచి ఒత్తిడి వచ్చింది. కర్నాటకలోని ఓ విద్యా సంస్థలో రేగిన ‘‘హిజాబ్’’ వివాదం దేశవ్యాప్తంగా సమస్యగా మారి చివరికి సుప్రీంకోర్టు మెట్లెక్కి వివాదం సద్దుమణిగిన విషయం విధితమే. ఇతరుల మతాన్ని గౌరవించని వ్యక్తికి ఇతరులు తన మతాన్ని గౌరవించాలని కోరుకోవటం అవివేకం.
‘‘రెంజర్ల రాజేశ్’’ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల విషయానికొస్తే సరస్వతి దేవి మీద చేసిన ఆరోపణలు అందరికి తెలిసిన విషయమే. రాజేశ్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యల వల్ల కూడా పెద్ద మొత్తంలో నిరసనలు కొనసాగాయి. పదిహేను రోజుల పాటు ప్రసార మధ్యమాంలో అదే చర్చ కొనసాగింది బి.జే.పి. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఓ సమావేశంలో ప్రసంగిస్తు ఓ వర్గం వారి ప్రార్ధన స్థలాలను తవ్వండని వ్యాఖ్యానించి పెద్దదుమారం లేపారు. ఇటీవలె జరిగిన శాసన సభ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుండి పోటీచేసి ఓడిపోవడం కొసమెరుపు. ఇక గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గూర్చి కొత్తగా చెప్పాల్సింది ఏమి లేదు. సమయం వచ్చినప్పుడల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం వార్తల్లో నిలవటం నిత్యం మనం చూస్తూనే ఉన్నాం, ప్రోటెం స్పీకర్‌గా నియమించబడిన అక్బరుద్దీన్ ఒవైసీ చేత బి.జే.పి. శాసన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయమన్నారు. మరోచోట ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో ఓ ఉపాధ్యాయురాలు తరగతి గదిలో ఓ మతానికి సంబంధించిన విద్యార్ధిపై మతపరమైన వ్యాఖ్యలు చేసి తోటి విద్యార్ధులతో చెంపదెబ్బలు కొట్టించిన ఘటనపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని సదరు ఉపాధ్యాయు రాలు విద్యార్ధులకు ఎలాంటి విద్యను నేర్పిస్తున్నారు అని ప్రశ్నిస్తు జరిగిన సంఘటనపై దర్యాపు జరిపేందుకు వారంలోగా ఐపియస్ అధికారిని నియమించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆధేశించిన విషయం కూడా మనం ఐక్కడ ప్రస్తావించాల్సిన అవసరం వుంది. ఇక్కడ మరొక అంశం ప్రస్తావించాలి నిజామబాద్ లో నరేష్ అనే అధ్యాపకుడు పాఠం భోదించే సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడన్న కారణంతో బలవంతంగా క్షమాపణ చెప్పించిన సంఘటన కూడా మనం చూశాం.
ఇక ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లా పర్సారాలోని సమేయా మన్సూర్ పబ్లిక్ స్కూల్ లో 11వ తరగతి చదువుతున్న విద్యార్ధి ఒకరు ‘‘ముహమ్మద్ అదాన్’’ అనే ఉపాధ్యాయుడ్ని ‘‘రాంరాం’’ అంటూ విష్ చేయగా తిరిగి ‘‘రాంరాం’’ అంటూ బదులివ్వని ఆ ఉపాద్యాయుడు ఇలాంటివి ఎందుకు అంటూ మందలించినందుకు అదికాస్తా మతపరమైన వివాదంగా రాజుకొని కొద్దిమంది పాఠశాల గేటు ముందు ధర్నాచేసి హనుమాన్ చాలీసా పఠించడంతో విషయం ముదురుతుందని గమనించిన పాఠశాల ప్రిన్సిపాల్ సదరు టీచర్‌ను ఉద్యోగం నుండి ‘‘డిస్మిస్’’ చేయటం ఆశ్చర్యకరమైన విషయం. తరగతి గదిలోకి కులాన్ని, మతాన్ని, మూఢనమ్మకాలను, మత విద్వేషాల విషప్రచారాలను, అర్ధం లేని వాదాలను వ్యక్తిగత పైత్యాలను మోసుకొచ్చే వారు తీవ్రవాదుల కంటే అత్యంత ప్రమాదకరం. తరగతి గది సమాజానికి ప్రతిబింబం అలాంటి తరగతి గదిని విషపూరితం చేయాలనుకోవడం అవివేకం అనాలోచిత చర్య కూడా. మన దేశం పటిష్టమైన లౌకిక వ్యవస్థపై ఆధారపడి ఉందన్న ప్రాధమిక విషయాన్ని మరిచి ప్రవర్తించడం అజ్ఞానానికి నిదర్శనం.
మణిపూర్ విషయానికొద్దాం ప్రస్తుతం మణిపూర్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూద్దాం. ‘‘కుకీలు’’, ‘‘మైతేయులు’’ తెగల మధ్య జరుగుతున్న సంఘర్షణలు సభ్య సమాజానికి తలవంపు తెచ్చేలా వున్నాయ్ మహిళల్ని నగ్నంగా ఊరేగించి అత్యచారంచేసి చంపిన సంఘటన నాగరిక సమాజం ఏది కూడా క్షమించని పాశవిక చర్య. డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్య్ర దేశంలో నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించుకొని అందులో ‘‘మహిళా రిజర్వేషన్ల బిల్లు’’ ఆమోదించిన వేళ, మణిపూర్ లాంటి సంఘటనలు మహిళల భద్రతను ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. చట్ట సభలలో మహిళలకు ప్రవేశం కల్పించినంత మాత్రాన సగటు మహిళకు రక్షణ కల్పించలేని చట్టసభల ప్రాతినిధ్య చట్టం ఎందుకు? చట్ట సభలలో మహిళ ప్రాతినిధ్యం పెరిగినంత మాత్రాన మహిళలపై జరుగుతున్న హింస తగ్గుముఖం పడుతుందా? పురుషుల ధోరణి మారుతుందా? అన్నది ఆలోచించాలి. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా వారిపట్ల జరుగుతున్న నేరాల సంఖ్య పెరుగుతుందే కాని తగ్గకపోవటం ఆందోళన కల్గించే విషయం. ఇక హర్యానా రాష్ట్రంలో జరిగిన దారుణాల గురించి తెలుసు కుందాం ఇటీవలె హర్యానలో జరిగిన మత ఘర్షణలు సభ్య సమాజం తల దించుకునేలా చేశాయి. ఇప్పుడిప్పుడే హర్యానా కోలుకుంటోంది. మూడు నెలల క్రితం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి 15 కి.మీ.ల దూరంలో వున్న చాద్‌నగర్ రోడ్డులో 16 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి అర్ధనగ్నంగా రోడ్డుపై అగంతకులు వదిలివేయగా బాధిత బాలిక హృదయవిదారకంగా సహాయం కోసం ఇల్లు ఇల్లు తిరగటం నాగరిక సమాజానికి సిగ్గుచేటు. ఇటీవలే పార్లమెంటులో 128వ రాజ్యంగ సవరణ ద్వారా మహిళలకు చట్ట సభల్లో 33% శాతం ప్రాతినిధ్యం కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదింపజేసుకున్న కొద్దిరోజుల వ్యవధిలోనే దేశంలో ఇలాంటి సంఘటన జరగడం దారుణం, ఆలోచించదగిన విషయం కూడా.
మొన్నటి వరకు మండిన మణిపూర్‌లో మళ్ళీ అగ్గి రగులుకుంది ఇటీవలె విద్యార్ధులు, పిల్లల్ని చంపిన సంఘటనతో నిప్పు మళ్ళీ రాజుకుంది. ఒక వైపు చైనా చొరబాట్లు, కాశ్మీర్ సరిహద్దులో ఉగ్రవాదుల దాడి, అంతర్గతంగా ఎన్నో సమస్యలు. అసలు ఈ దేశం ఎటుపోతుంది. పాలకులు ఎటువైపు తీసుకొని వెళ్ళాలను కుంటున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగా ‘‘దేశం క్లిష్ఠ పరిస్థితుల్లో ఉందా’’? ఉండబోతుందా? మనం భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాం? అనేది ఇక్కడ మనల్ని మనం తర్కించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక మనకు మన రాజ్యంగం కల్పించిన వెసులుబాట్లు ఒకసారి చూద్దాం, రాజ్యాంగంలోని ‘‘19వ నిబంధన’’ దేశంలోని పౌరులందరికీ ‘‘భావ ప్రకటన స్వేచ్చ’’, ‘‘వాక్ స్వాతంత్య్రము’’ను కల్పించింది. కాని కొన్ని పరిమితులున్నాయి.
ఓ రాజకీయ పార్టీ నుండి పోటీచేసి ఎన్నికల ద్వారా గెలిచి చట్టసభల్లోకి ప్రవేశించే ముందు ‘‘భారత రాజ్యాంగము ద్వారా నిర్మితమైన శాసనము ద్వారా ప్రజాస్వామ్య విలువలను, లౌకిక వ్యవస్థను కాపాడతానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’ అంటూ రాజకీయ ప్రస్తానం ప్రారంభించటం, కానీ ప్రజల భావోద్వేగాలను, మతపరమైన అంశాలైన సున్నిత విషయాలను వివిద వేదికల ద్వార రెచ్చగొట్టె మాటలు మాట్లాడి ప్రజల మధ్య విభజన రేఖలు గీయటం జరుగుతోంది. రాజ్యాంగ బద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులకు ఈ మాత్రం తెలియదా? పొరుగు మతాన్ని గౌరవించని వ్యక్తి చట్టసభలలో లేదా చట్టసభలకు ప్రాతినిధ్యం వహించే అర్హత వున్నట్లేనా? రాజ్యాంగ విలువలను, దాని ఆవశ్యకత ఇప్పుడు తప్పనిసరిగా అందరికి తెలియజేసే సమయం ఆసన్నమైంది. కేవలం తరగతి గదిలోనో లేదా సమయం, సందర్భం వచ్చినప్పుడో చదివి విసిరేసే పుస్తకం కాదు అది. మనల్ని మనం పరిపాలించుకోవడానికి ఉపయోగపడే కరదీపిక, మార్గదర్శి. ‘‘రాజ్యాంగం’’లో అలాంటి గొప్ప విషయాలు అందులో పేర్కొ న్నప్పుడు బాధ్యతారహితంగా మాట్లాడటం తద్వారా దేశంలో అంతర్గతంగా విభజన రేఖలు గీయటం ఇప్పుడు ‘‘ఫ్యాషన్ అయింది’’. లోపం ఎక్కడుంది?
మన విద్య వ్యవస్థలో లోపం ఉందా? బోధించేవారిలో లోపం ఉందా లేదా? మన మెదళ్ళలో లోపం ఉందా? అని ప్రశ్నించు కోవాలి ఒకసారి. ఎప్పుడో బ్రిటిష్ వాడు ప్రయోగించిన ‘‘విభజన’’ మంత్రం ఒంట బట్టించుకొని నేటికి వదలకపోవడం భవిష్యత్ తరాలకి విషం ఎక్కించటం లాంటిదే. తరగతి గదులు విద్యార్ధి జీవితానికి బాటలు వేసే వేదికలు కావాలి కాని పాఠాలు బోధించే వారే ‘‘కులం’’ పేరుతో, ‘‘మతం’’ పేరుతో వివక్షను ప్రదర్శిస్తే ఎంతమంది ‘‘అంబేడ్కర్లు’’ అలాంటి తరగతి గదుల నుండి పుట్టుకొస్తరు.
ఈ సంఘర్షణను నివారించే పాలకులు రానప్పుడు, పైగా మత రాజకీయాలు చేసే శక్తులు వున్నప్పుడు దేశం సుభిక్షంగా, శాంతియుతంగా ఎలా ఉండగల్గుతుంది, ఈ విభజన రేఖలు ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఒకరిపై మరొకరు కత్తులు దూసుకొని రక్తపాతం సృష్టించుకొని సాధించేదేమిటి? సంకుచితపు భావజాలాన్ని ప్రచారం చేసే ఎలాంటి వ్యక్తులనైనా, వారు ఎలాంటి స్థానంలో వున్నా నిరోధించకపోతే భవిష్యత్ తరాలు ఖచ్చితంగా ప్రమాదంలో పడ్తాయి ఇది ముమ్మాటికి నిజం.
‘‘లౌకిక’’ వ్యవస్థను కాపాడే ప్రయత్నం అందరం కల్సికట్టుగా చేసినప్పుడే అన్నదమ్ములవలె అందరం కల్సి ఉండగలం.
-
డాక్టర్ ముహమ్మద్ హసన్, రాజకీయ విశ్లేషకులు