April 14, 2024

డిసెంబర్‌ 13వ తేదీన కొంతమంది పార్లమెంటులో పొగబాంబులతో ప్రవేశించారు. ఆ పొగ ప్రమాదకరమేమీ కాదు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది. కాని పార్లమెంటులోకి పొగబాంబులతో కొందరు ప్రవేశించడం పార్లమెంటు భద్రత వ్యవస్థ పట్ల ప్రశ్నార్థకమయ్యింది. పైగా ఈ పొగబాంబు దుండగులకు పార్లమెంటులో ప్రవేశించే పాసులు ఇచ్చింది బీజేపీ ఎం.పీ. ప్రతాప్‌ సిన్హా. పార్లమెంటు భద్రతావ్యవస్థ పట్ల తీవ్రమైన ప్రశ్నలు సంధిస్తున్న ఈ సంఘటన పట్ల రాజ్యసభ చైర్మన్‌, లోక్‌ సభ స్పీకర్‌ ఎలా ప్రతిస్పందిస్తారని మనం ఆశిస్తాం. ఇలాంటి దుండగులకు పాసులు ఇచ్చిన సభ్యుడిని ముందు సస్పెండ్‌ చేస్తారని, లోక్‌సభ, రాజ్యసభల్లో హోంమంత్రి వచ్చి ఈ సంఘటన గురించి వివరణ ఇచ్చేలా చేస్తారని ఆశిస్తాం. కాని అలా జరగలేదు. లోక్‌ సభ, రాజ్యసభల నుంచి 141 మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేశారు. ఎందుకు సస్పెండ్‌ చేశారంటే, పార్లమెంటుపై దాడి పట్ల ఈ ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సస్పెండ్‌ అయ్యారు. ఇప్పుడు లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యుల సంఖ్య దాదాపు 70 శాతం తగ్గిపోయింది. ఈ లోగా ప్రభుత్వం ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెట్టింది. ఈ సంఘటనలు నమ్మశక్యంగా ఉన్నాయా? ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇలా జరుగుతుందని ఏదన్నా సినిమాలో చూపించినా నమ్మలేని సంఘటనలివి.
పార్లమెంటులో సభ్యులు నిరసన తెలియజేయడం, వెల్‌ లోకి వెళ్ళడం ఇండియాలో కొత్తదేమీ కాదు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సార్లు బీజేపీ సభ్యులు సభను జరక్కుండా అడ్డుకున్న ఉదాహరణలున్నాయి. సుష్మా స్వరాజ్‌ వంటి సీనియర్‌ బీజేపీ నేత గతంలో ‘‘పార్లమెంటు సమావేశాలను స్తంభించేలా చేయడం కూడా ప్రజాస్వామ్యంలో భాగమే’’ అన్నారు. మరో సీనియర్‌ నేత అరుణ్‌ జైట్లీ గతంలో ఏమన్నారంటే, ‘‘చాలా సందర్భాల్లో పార్లమెంటు కొన్ని ముఖ్యమైన సమస్యలను ఉపేక్షించడం జరగవచ్చు. అలాంటి సందర్భాల్లో పార్లమెంటును స్తంభింపజేయడం కూడా ప్రజాస్వామ్యమే’’ అన్నారు. కాని ఇప్పుడు నిరసనకు దిగిన సభ్యులను ఎందుకు బహిష్కరించారు? బీజేపీకి ఒక రూలు, ఇతరులకు మరో రూలా? నిరసన తెలియజేస్తున్న సభ్యులను భారీసంఖ్యలో సస్పెండ్‌ చేయడం భారత ప్రజాస్వామ్యంలో ఎన్నడూ జరగలేదు. భారత ప్రజాస్వామ్యంలో గతంలో ఎన్నడూ జరగని అనేక సంఘటనలు ఇప్పుడు జరుగుతున్నాయన్నది కూడా వాస్తవమే.
ఎందుకు ఇంతమందిని సస్పెండ్‌ చేశారు? ఈ ప్రశ్నకు చాలా సులభమైన సమాధానం, ప్రభుత్వం వద్ద అధికారముంది కాబట్టి చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాల తర్వాత బీజేపీ ఇప్పుడు తనకు ఎదురు లేదని భావిస్తోంది. వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో మూడోసారి అధికారం చేపట్టడం ఖాయమని అనుకుంటోంది. ప్రతిపక్షాలకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని, ప్రతిపక్షాలు చెప్పే మాటలకు విలువ లేదని నిర్ణయించుకుంది. కాబట్టి ప్రతిపక్షాలకు ప్రశ్నించే అర్హత లేదని భావిస్తోంది.
ప్రజలు ఎలా ప్రతిస్పందిస్తున్నారు? నిజం చెప్పాలంటే పట్టించుకోవడం లేదు. రాజకీయ నాయకుల పట్ల ఏవగింపు ధోరణి ప్రజల్లో ఉంది. ప్రజలు ప్రతిస్పందించరన్నది కూడా బీజేపీకి బాగా తెలుసు. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల రాజకీయాలు మాత్రమే కాదు, ప్రజాస్వామ్య సంస్థలను కాపాడుకోవడం అనే అవగాహన కూడా ప్రజల్లో రానంత వరకు ఇలాంటి నిరంకుశ పోకడలకు కళ్ళెం వేయడం సాధ్యం కాదు.