April 13, 2024

సాధారణ ఎన్నికలు శరవేగంగా వస్తున్నాయి. బీజేపీ మరోసారి గెలుపు నమోదు చేయడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగమే కొందరు ముస్లిము ప్రముఖులు భారతీయ జనతాపార్టీ విషయంలో ముస్లిములు పునరాలోచించాలని, ముస్లిముల పట్ల బీజేపీ ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపించడం లేదని వాదిస్తున్నారు. ఈ వాదన ఇటీవల చేసిన వారిలో తారిఖ్ మన్సూర్ పేరు చెప్పుకోవాలి.

ఫిబ్రవరి ఒకటవ తేదీన  ఆయన ఒక వ్యాసం రాసి మరీ తన వాదన వినిపించారు. ఆయన వాదనేమిటో చూసే ముందు ఒకసారి తారిక్ మన్సూర్ ఎవరనేది ఆలోచిద్దాం. హిందూస్తాన్ టైమ్స్ పత్రిక జులై 30, 2023, వెబ్ఎడిషన్ లో వచ్చిన వార్తప్రకారం బీజేపీ నాయకులు తారిక్ మన్సూర్ ద్వారా ముస్లిం విద్యావంతులను, ముస్లిముల్లో వెనుకబడిన వర్గాలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు బీజేపీ ప్రారంభించింది. తారిక్ మన్సూర్ ఎవరంటే అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సలర్ గా చేశాడు. ఆయన్ను బీజేపీ ఉత్తప్రదేశ్ లో ఎమ్మెల్సీగా కూడ నామినేట్ చేసింది. ఆయన్ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా నియమించారు. కాబట్టి బీజేపీకి అనుకూలంగా తారిక్ మన్సూర్ చేసిన వాదన వెనుక కారణాలను ఊహించడం కష్టం కాదు.
తారిక్ మన్సూర్ లాంటి మేధావుల వాదనలను చూస్తే బీజేపీ ప్రత్యేకంగా ముస్లిముల్లో వెనుకబడిన వర్గాల వారి పట్ల, సూఫీ ముస్లిముల పట్ల శ్రద్ధ చూపిస్తోంది. ముస్లిములు కూడా బీజేపీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందుతున్నారనేది మరో వాదన. అస్సలు 2014 తర్వాత ఎలాంటి మతఘర్షణలు లేవని దేశం 50 ఏళ్ళలో ఎన్నడూ లేనంత ప్రశాంతంగా ఉందని కూడా వాదిస్తున్నారు.
ఈ వాదనలను నిశితంగా పరిశీలిస్తే ఎలాంటి పస లేని వాదనలన్నది స్పష్టంగా అర్థమవుతుంది. సగటు ముస్లిములు నేడు వివక్ష, ముస్లిం విద్వేష రాజకీయాల బాధితుడన్నది అందరికీ తెలిసిన వాస్తవం. 2014 తర్వాత మతఘర్షణలు లేవనే వాదనలో వాస్తవముందా? ఢిల్లీ అల్లర్లను మరిచిపోయారా? షాహిన్ బాగ్ నిరసన ప్రదర్శనలను అడ్డుకోడానికే కదా ఈ మతఘర్షణలు జరిగాయి. స్వయంగా ఒక మంత్రి రంగంలోకి దిగి గోలీమారో అంటూ ప్రజలను రెచ్చగొట్టింది నిజం కాదా? ఈ ఘర్షణల్లో చనిపోయిన మొత్తం 51 మందిలో 37 మంది ముస్లిములు అన్నది నిజం కాదా?
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నేడు తరచు వినిపిస్తున్న పదం బుల్ డోజర్. ఎవరి ఆస్తులు కూల్చివేతలకు గురవుతున్నాయి. బుల్డోజర్లతో ముస్లిముల ఆస్తులను కూల్చడం నిజం కాదా? బీజేపీ పాలిత రాష్ట్రాల మధ్య ఎవరు ఎక్కువగా ముస్లిములకు నష్టం చేయగలరనే పోటీ నడుస్తున్నట్లు కనిపిస్తోంది.
రెండేళ్ళ క్రితం రామనవమి సందర్భంగా అనేక రాష్ట్రాల్లో మతఘర్షణలు రెచ్చగొట్టింది ఎవరు? ఈ ఘర్షణల సాకుతో మధ్యప్రదేశ్ ఖార్గోన్ లోని ముస్లిముల ఆస్తులను బుల్డోజరుతో కూలగొట్టలేదా? మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రికి బుల్డోజర్ మామా అని పేరు పెట్టారు. బుల్డోజర్ బాబా పేరుతో మరో ముఖ్యమంత్రి ప్రసిద్ధుడయ్యాడు. అమ్నెస్టి ఇంటర్నేషనల్ ఈ బుల్డోజర్ కార్యకలాపాలను, ముస్లిముల ఆస్తుల అక్రమ కూల్చివేతలను వేలెత్తి చూపింది నిజం కాదా? ఫిబ్రవరి 12వ తేదీన వచ్చిన వార్త ప్రకారం మధ్యప్రదేశ్ హైకోర్టు బుల్డోజర్ కార్యకలాపాలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. సరయిన ప్రక్రియ లేకుండా బుల్డోజర్లతో కూలగొట్టడం ఇప్పుడ ఫ్యాషన్ గా మారిందని వ్యాఖ్యానించింది. బాధితులకు లక్షరూపాయల నష్టపరిహారం చెల్లించాలని కూడా ఆదేశించింది. ఉత్తరాఖండ్ హల్దోనీలో ముస్లిములు భయాందోళనల్లో బతుకుతున్న వార్తలు వస్తున్నాయి. మస్జిదును, మదరసాను ప్రభుత్వం అక్రమంగా కూల్చిందని నిరసన తెలిపిన వారిపై ప్రభుత్వం దమనకాండకు పూనుకుంటుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలన్నీ ఏం చెబుతున్నాయి. ఈ బాధితులంతా ఎవరు? నేరకార్యకలాపాల్లో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో బుల్డోజరు ప్రయోగించి ఇళ్ళు కూలగొట్టడం ఎక్కడి న్యాయం? ఇదే విషయాన్ని ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ.పి.షా కూడా చెప్పారు. ఇవన్నీ అందరూ చూస్తున్నవే కదా. మరోవైపు గోరక్షక దళాల పేరుతో జరుగుతున్న దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వదిలేసిన పశువులు పొలాల్లో పడి మేయడం, రోడ్లపై ప్రమాదాలకు కారణమైన వార్తలు ఒకవైపు వస్తుంటే మరోవైపు ముహమ్మద్ అక్లాక్ మొదలు అనేక కేసుల్లో మూకదాడులు, మూకహత్యల దాడులు ముస్లిములే.
సెప్టెంబర్ 23, 2023వ తేదీ న్యూస్ క్లిక్ వార్తాసంస్థలో వచ్చిన కథనం ప్రకారం ఆల్ ఇండియా పస్మాందా ముస్లిం మహాజ్ వ్యవస్థాపకుడు అలీ మునవ్వర్ పస్మాందా లేదా వెనుకబడిన ముస్లిం సముదాయాల గురించి మాట్లాడుతూ మూకహత్యలు, బుల్డోజర్ దాడుల బాధితుల్లో అత్యధికులు పస్మాందా ముస్లిములు లేదా వెనుకబడిన సముదాయాలకు చెందిన ముస్లిములే అన్నాడు. పస్మాందా ముస్లిములు ఒక్కటై మతతత్వ శక్తులను రాజకీయంగా ఓడించాలని కూడా ఆయన పిలుపునిచ్చాడు.
వాస్తవాలు ఇలా ఉంటే తారిక్ మన్సూర్ వంటి సోకాల్డ్ మేధావులు ముస్లిములకు బీజేపీ గురించి పునరాలోచించాలని పిలుపునిస్తున్నారు. భారతదేశంలోని ముస్లిం సముదాయంలో 80 శాతం ముస్లిం వెనుకబడిన వర్గాలే అని స్వయంగా తారిక్ మన్సూర్ రాసిన వ్యాసంలోనే పేర్కొన్నాడు. అలాంటప్పుడు మూకదాడులకు, బుల్డోజర్ దాడులకు గురవుతున్న వాళ్ళెవరు? ఈ వెనుకబడిన ముస్లిం సముదాయాల కోసమే ప్రధాని మోడీ చాలా ఆలోచించేస్తున్నారని చెప్పే తారిక్ మన్సూర్ వంటి మేధావులు ఈ మూకదాడులపై ఎప్పుడైనా నోరెత్తారా? ఎప్పుడైనా ప్రశ్నించారా? ఎప్పుడైనా ఆలోచించారా? బీజేపీ మతతత్వ రాజకీయాల బాధితులు ఎక్కువ మంది పస్మాందా ముస్లిములే అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు వారందని ఆదుకునే అవతారమెత్తుతున్నామని చెబుతున్నారు.
పస్మాందా ముస్లిముల కోసం పనిచేస్తున్నామని చెప్పుకునే బీజేపీ బిల్కిస్ బానో గురించి ఏం చెబుతుంది? బిల్కిస్ బానో కూడా పస్మాందా సముదాయాలకు చెందిన మహిళే. ఆమె మొత్తం కుటుంబాన్ని, చిన్నారి కూతురుని  హతమార్చిన నేరస్తులకు గుజరాత్ బీజేపీ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసింది నిజం కాదా? మూకహత్యకు గురైన తబ్రేజ్ అన్సారీ పస్మాందా ముస్లిం కాదా? అలీముద్దీన్ అన్సారీని మూకహత్య చేసిన నేరస్తులను బీజేపీ మంత్రి హోదాలో జయంత్ సిన్హా పూలమాలలు వేసి సత్కరించింది మరిచిపోయారా?  అలీముద్దీన్ అన్సారీ కూడా పస్మాందా ముస్లిమే. వాస్తవాలు ఇలా ఉంటే పస్మాందా ముస్లిములను ఉద్ధరించేది బీజేపీ అంటూ తారిక్ మన్సూర్ వంటి వాళ్ళు చెప్పే మాటలకు అర్థముందా?
లవ్ జిహాద్ పేరుతో గగ్గోలు ఎంత జరిగింది? జరుగుతోంది? లవ్ జిహాద్ నిరూపించే ఒక్క కేసు ముందుకు వచ్చిందా? లవ్ జిహాద్ కు తోడు యుపియస్సీ జిహాద్, ల్యాండ్ జిహాద్, కరోనాజిహాద్ … ఇలా ప్రతి దానికి జిహాద్ తగిలించి దేశంలో మతతత్వ రాజకీయాలు నడుపుతున్న వాళ్ళు, ముస్లిముల పట్ల విద్వేషం రెచ్చగొట్టడం ద్వారా మాత్రమే రాజకీయ ఉనికి నిలబెట్టుకుంటున్నవాళ్ళు ముస్లిముల బాగు కోసం పనిచేస్తారని మాట్లాడడం వింటే ఏమనిపిస్తుంది?
తారిక్ మన్సూర్ తన వ్యాసంలో మోడీ సాధించిన విజయంగా త్రిపుల్ తలాక్ నిషేధం గురించి కూడా మాట్లాడాడు. కాని త్రిపుల్ తలాక్ చట్టం వల్ల ఎవరికైనా ప్రయోజనం కలిగిందా? ఇండియా టుడేలో నాజిమా పర్వీన్ జూన్, 21, 2023లో రాసిన వ్యాసం ప్రకారం ఈ చట్టం పురుషులకే ఎక్కువగా ఇప్పుడు ఉపయోగపడుతోంది. అటు విడాకులు ఇవ్వకుండా, ఇటు కాపురానికి తీసుకోకుండా వదిలేస్తున్న సంఘటనలు ముందుకు వచ్చాయి. ఇప్పుడు త్రిపుల్ తలాక్ కేసులు రావడం లేదు, భర్తలు వదిలేస్తున్న కేసులు వస్తున్నాయి. ఇవి ప్రతి సముదాయంలోను ఉండేవే కాబట్టి త్రిపుల్ తలాక్ ను లేకుండా చేశాం అని గొప్పలు చెప్పుకోడానికి మాత్రమే ఈ చట్టం ఉపయోగపడుతుంది. అంటే తలాక్ ఇచ్చి విడిపోవడం కన్నా ఎలాంటి సంబంధమూ లేకుండా, మాట్లాడకుండా, లేదా పుట్టింట్లోనే ఉండిపోయేలా వదిలేయడం ఎక్కవయ్యింది.
ఇస్లామోఫోబియా ఇప్పుడు పరాకాష్ఠకు చేరుకుంది. నగరాల్లో ముస్లిముల ఘెట్టోలు పెరుగుతున్నాయి. అద్దె ఇళ్ళు ముస్లిములకు దొరకడం లేదు. విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబాటు పెరుగుతోంది. మరోవైపు వివక్ష కొనసాగుతోంది. మౌలానా ఆజాద్ ఫెలోషిప్ ను రద్దు చేశారు. దీనివల్ల నష్టపోయింది ఉన్నత చదువులు చదవాలనుకునే ముస్లిం విద్యార్థులే.
నేషనల్ రిజీష్టర్ ఆఫ్ ముస్లిం సిటీజన్స్ లేదా ఎన్నార్సీ కత్తి ఇంకా వేలాడుతోంది. అవసరమైన కాగితాలు సమర్పించలేని పరిస్థితిలో ఉండేది పేదసాదలైన వెనుకబడిన సముదాయాల సముదాయాలకు చెందిన ముస్లిములే. వారందరి పౌరసత్వం ఇప్పుడు ప్రమాదంలో పడుతుంది. మతం ప్రాతిపదికన పౌరసత్వాన్ని నిర్వచిస్తున్న పౌరసత్వ సవరణ చట్టం కూడా వచ్చింది. అస్సాములో ఏం జరిగింది. 19 లక్షల మంది ఎన్నార్సీలో పేరు కోసం తగిన పత్రాలు సమర్పించలేకపోయారు. ఇందులో చాలా మంది హిందువులే. కాని పౌరసత్వ సవరణ చట్టం ఉంది కాబట్టి వారికి ఈ చట్టం ప్రకారం పౌరసత్వం వచ్చేస్తుంది. కాని ఈ జాబితాలో ఉన్న ముస్లిముల పరిస్థితి ఏమిటి? వారిని నిర్బంధ శిబిరాలకు తరలించే కార్యక్రమం మొదలవుతుంది. వారి ఓటు హక్కు రద్దవుతుంది. ఇదే యావద్దేశంలో అమలు చేసే తతంగం ప్రారంభించే ఆలోచనలు నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో పస్మాందా ముస్లిములు నెట్టేయబడే అవకాశం లేదని బీజేపీ నేతలు చెప్పగలరా? బీజేపీ గురించి వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్న తారిక్ మన్సూర్ వంటి మేధావులు పౌరసత్వ సవరణ చట్టంలో పస్మాందా ముస్లిములకు కూడా మినహాయింపు లభించేలా చేయగలరా?
సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒకవైపు రామమందిర నిర్మాణం పేరుతో జరుగుతున్న కార్యక్రమాలు, మరోవైపు మతతత్వ రాజకీయాల నేపథ్యంలో ముస్లిములకు రాజకీయ ప్రాతినిథ్యం రోజు రోజుకు తగ్గిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ముస్లిముల్లో పస్మాందా ముస్లిములంటూ నడుస్తున్న రాజకీయాల నిజస్వరూపాన్ని అందరూ అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది.

– వాహెద్