May 29, 2024

ఉత్తరప్రదేశ్ లో మదరసా విద్యార్థులకు ఇప్పుడు కాస్త ఊరట లభించింది. ఉత్తరప్రదేశ్ మదరసా ఎడ్యుకేషన్ బోర్డు చట్టం రాజ్యంగవిరుద్దమైందంటూ హైకోర్టు ఆ చట్టాన్ని రద్దు చేసింది. అలహాబాద్ హైకోర్టు తీర్పుతో ఉత్తరప్రదేశ్ లో మదరసా విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంలా మారింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కొంత ఊరట లభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జే.బి. పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ స్టే ఇచ్చింది. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై ఐదు స్పెషల్ లీవ్ పిటీషన్లు సుప్రీంకోర్టులోకి వచ్చాయి. వీటిని విచారిస్తూ సుప్రీంకోర్టు ఈ కేసులో హైకోర్టు పొరబడిందని, చట్టంలోని నిబంధనలను సరిగా అర్థం చేసుకోలేదని వ్యాఖ్యానించింది.
అసలు సుప్రీంకోర్టు కన్నా ముందు అలహాబాద్ హైకోర్టులో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.
అలహాబాద్ హైకోర్టు ఉత్తరప్రదేశ్ మదరసా ఎడ్యుకేషన్ చట్టాన్ని రద్దు చేయడం వల్ల దాదాపు 10వేల మంది మదరసా టీచర్లు, దాదాపు 26 లక్షల మంది మదరసా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యింది. ఈ విద్యార్థులందరినీ ఉత్తరప్రదేశ్ లోని ఆదిత్యనాథ్ సర్కారు ప్రభుత్వ స్కూళ్ళలో చేర్పించాలని కోర్టు చెప్పింది. అందుకు అవసరమైన కొత్త స్కూళ్ళను ఏర్పాటు చేయడం, టీచర్లను నియోగించడం వగైరా చేయాలని చెప్పింది. ఇది జరిగే పనేనా? ఈ తీర్పు మార్చి 22వ తేదీన వచ్చింది. ఉత్తరప్రదేశ్ లో 16,513 మదరసాలున్నాయి. ఇందులో 560 ప్రభుత్వ ఎయిడ్ లభిస్తున్న మదరసాలు. 8400 కన్నా ఎక్కువగా ప్రభుత్వ గుర్తింపు లేని మదరసాలున్నాయి. హైకోర్టు తీర్పు వల్ల గుర్తింపు పొందిన మదరసాల్లో చదువుతున్న 19.5 లక్షల మంది విద్యార్థులు, గుర్తింపు లేని మదరసాల్లో చదువుతున్న 7 లక్షల మంది విద్యార్థుల చదువుకు సున్నా పెట్టినట్లయ్యింది. ఇంతకీ మదరసాలపై ఈ వేటు ఎందుకు వేసారంటే, హైకోర్టు తీర్పులో చెప్పిందేమిటంటే, ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు ఆధునిక విద్య, నాణ్యమైన విద్య లభించడం లేదంట. అది రాజ్యాంగంలోని ఉచిత నిర్బంధ విద్యా విధానానికి విరుద్దం అని పేర్కొంది.
మదరసాలపై ఈ ఫిర్యాదు చేసిందెవరన్నది కూడా ఒకసారి చూద్దాం. అంషుమన్ సింగ్ రాథోడ్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజక వ్యాజ్యంపై హైకోర్టు ఈ తీర్పు చెప్పింది. ఈ అషుమన్ రాథోడ్ ఒక న్యాయవాది. ఈ కేసులో హైకోర్టు 86 పేజీల తీర్పు చెప్పింది. మదరసాల్లో విద్యా ప్రభుత్వ స్కూళ్ళలో విద్యతో పోల్చితే నాణ్యమైనది కాదని అభిప్రాయపడింది. మదరసాల్లో ఖురాను ఇస్లామీయ విద్యను అందిస్తున్నారంటూ వ్యాఖ్యానించింది. ఆల్ ఇండియా టీచర్స్ అసోసియేషన్జనరల్ సెక్రటరీ వహీదుల్లా ఖాన్ ఈ విషయమై ప్రతిస్పందిస్తూ మదరసాల్లో కేవలం ఇస్లాం గురించి బోధించడం మాత్రమే జరుగుతుందనడం పొరబాటని అన్నారు. కేవలం ఇస్లామీయ విద్యాబోధన జరుగుతున్నందువల్లనే గ్రాంట్లు ఇస్తున్నారనడం కూడా తప్పని చెప్పారు. మదరసాల్లో ఓరియంటల్ భాషలను బోధించడం జరుగుతోంది. ఓరియంటల్ భాషలంటే అరబి, ఫార్సీ, సంస్కృతం వగైరా భాషలు. ఈ భాషలను బోధిస్తున్నందుకు గ్రాంట్లు ఇస్తున్నారు. వేదపాఠశాలలు కూడా దేశంలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో వేదపాఠశాలలను ప్రభుత్వ విద్యాశాఖ నిర్వహిస్తోంది. కాని ఉత్తరప్రదేశ్ లో మదరసాల నిర్వహణ 1996 నుంచి మైనారిటీ వ్యవహారాల శాఖ చూస్తోంది. మొదట్లో అరబీ ఫార్శీ బోర్డు క్రింద ఈ మదరసాలు ఉండేవి. తర్వాత దాన్ని మదరసా బోర్డు క్రింద మార్చారు. మదరసాల్లో కేవలం ఇస్లాం గురించి బోధించడం మాత్రమే కాదు ఈ ప్రాచ్యభాషలను బోధించడం కూడా జరుగుతుంది. అంతేకాదు, ప్రభుత్వ స్కూళ్ళు చేరుకోలేని ప్రాంతాల్లో కూడా మదరసాలు చాలా కాలంగా నడుస్తు పిల్లలకు విద్యాను అందిస్తున్నాయి. కోర్టు తీర్పు తర్వాత టీచర్లకు జీతాలు దొరకని పరిస్థితి, పిల్లలకు చదువు ఆగిపోయిన పరిస్థితి. వేలాది టీచర్లు, లక్షలాది విద్యార్థులు. పైగా ఈ తీర్పులో మదరసాలపై వేటు వేయాలన్నదే ముఖ్యంగా కనబడుతుంది. ఒకవేళ ఈ చట్టంలో రాజ్యాంగానికి విరుద్దమైన అంశాలుంటే చట్టాన్ని సంస్కరించేలా సూచనలు ఇవ్వవచ్చు కదా. మదరసాలపై వేటు వేయడం ఎందుకు అనే ప్రశ్నలు చాలా మంది వేశారు. పైగా ఈ లక్షలాది మంది విద్యార్థులను ప్రభుత్వ స్కూళ్ళలో చేర్చాలని చెప్పడం విచిత్రం. ఎందుకంటే, ప్రభుత్వ స్కూళ్ళలో సదుపాయాల కొరత, టీచర్ల కొరత, భవనాల కొరత వంటి అనేక సమస్యలున్నాయి. నిజానికి చాలా మదరసాల్లో విద్యార్థులకు ఉచిత విద్య మాత్రమే కాదు, భోజనసదుపాయం, వైద్యసదుపాయాలు కూడా కల్పిస్తారు. 2018 తర్వాతి నుంచి ఉత్తర్ ప్రదేశ్ మదరసాలు ఎన్సీయీఆర్టీ సిలబసును కూడా అనుసరిస్తున్నాయి.
మదరసాలు నాణ్యమైన విద్యను అందించడం లేదనడం కూడా సత్యదూరం. మదరసాల్లో చదువుకున్న వాళ్ళు సివిల్స్ రాసి ఉత్తీర్ణులవుతున్నారు. ఐఏయస్ అధికారులవుతున్నారు. న్యాయవాదులుగా, డాక్టర్లుగా ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నారు. అలాంటి చాలా ఉదాహరణలున్నాయి. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం, జామియా మిల్లియా ఇస్లామియా వంటి అనేక యూనివర్శిటీల్లో మదరసాల్లో చదువుకున్న విద్యార్థులు ప్రొఫెసర్లుగా కూడా కనిపిస్తారు. అలహాబాద్ హైకోర్టు తీర్పులో పేర్కొన్న అనేక అంశాలను చాలా మంది విమర్శించారు.
స్వతంత్రం తర్వాత ఉత్తరప్రదేశ్ లో ప్రైవేటు మదరసాలు అలాగే చాలా కాలం కొనసాగాయి. ప్రభుత్వం వాటిని రెగ్యులేట్ చేయడం లేదా గుర్తింపునివ్వడం జరగలేదు. 1969లో మొదటి సారి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమాలు రూపొందించింది. ‘‘రూల్స్ ఆఫ్ రికగ్నిషన్ ఆఫ్ అరబిక్ అండ్ పర్షియన్ మదరసాస్, ఉత్తరప్రదేశ్’’ నిబంధనలు వచ్చాయి.  ఆ తర్వాత 1987లో ఈ విద్యాసంస్థలను రెగ్యులేట్ చేయడానికి శాసనేతర నిబంధనలను మరోసారి రూపొందించారు. 1995లో మైనారిటీ సంక్షేమ శాఖ ఏర్పడింది. అప్పుడు మదరసాలు ప్రభుత్వ విద్యాశాఖ క్రింద ఉన్నాయి. మైనారిటీ సంక్షేమ శాఖ ఏర్పడిన తర్వాత మైనారిటీలకు సంబంధించిన పథకాలతో పాటు మదరసాలను కూడా ఈ శాఖ నిర్వహణలోకి తెచ్చారు. ఆ తర్వాత 2004లో మదరసా చట్టాన్ని తీసుకువచ్చారు. స్వాతంత్ర్యానికి ముందు నుంచి కొనసాగుతున్న మదరసా విద్యను రెగ్యులేట్ చేసే ప్రయత్నాలే ఇవన్నీ. కాని అకస్మాత్తుగా అలహాబాద్ హైకోర్టు మదరసాలపై వేటు వేసింది.
ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ తీర్పుపై స్టే విధించింది. మదరసాల వల్ల దేశంలో లౌకికవాదం దెబ్బతింటుందన్న అభిప్రాయం తప్పని సూటిగా చెప్పింది. హైకోర్టు తీర్పు వల్ల లక్షలాది విద్యార్థుల చదువు దెబ్బతింటుందన్న వాస్తవాన్ని కూడా ఉన్నతన్యాయస్థానం గుర్తించింది. మదరసాల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన చదువు లభించాలన్నదే అసలు ఉద్దేశ్యమైతే అందుకు అవసరమైన ఉత్తర్వులు ప్రభుత్వానికి ఇస్తే సరిపోయేదని, చట్టాన్ని రద్దు చేయవలసిన అవసరం ఏముందని కోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు తీర్పును అనేకమంది స్వాగతించారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్ఢు సభ్యుడు మౌలానా ఖాలిద్ రషీద్ ఫారంగీ మహాలీ హర్షం వ్యక్తం చేశారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతి నుంచి మదరసాలను లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. మదరసాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో విచారించడానికి యోగీ ప్రభుత్వం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును ఏర్పాటు చేసింది. గత మూడు సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్ లోని 80 మదరసాలకు దాదాపు 100 కోట్ల రూపాయల విదేశీ నిధులు అందాయని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మదరసా బోర్డ్ చట్టంపై ప్రజాప్రయోజకవ్యాజ్యం రావడం, వెంటనే అలహాబాద్ హైకోర్టు ఆ చట్టాన్నే రద్దు చేసి, మదరసా విద్యార్థులు, ఉపాధ్యాయుల భవిష్యత్తును అయోమయానికి గురి చేయడం వంటి సంఘటనలు జరిగాయి.
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మదరసాలపై కత్తికట్టిందన్నది అందరికీ స్పష్టంగా కనబడుతున్న వాస్తవం. దాదాపు 4000 మదరసాలకు విదేశీనిధులు అందుతున్నాయని ఒక వార్త ప్రచారంలో పెట్టారు. చాలా మదరసాలకు చట్టబద్దమైన పత్రాలేవీ లేవని కూడా వార్తలు ప్రచారంలో పెట్టారు. మదరసాలు పూర్తిగా విరాళాలపై నడుస్తాయి. ముఖ్యంగా జకాత్ ద్వారా, సదకాల ద్వారా లభించే నిధులతో నడుస్తాయి. చాలా మదరసాల్లో టీచర్లకు ఆరేడు నెలల వరకు జీతాలు లభించని పరిస్థితి కూడా ఉంటుంది. అయినా  మదరసాలను నడపడం ఒక సంప్రదాయంగా విద్యాకార్యక్రమంగా ముస్లిం సముదాయంలో కొనసాగుతోంది. ఈ సంవత్సరం జనవరిలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మదరసాల్లో ఆధునిక సబ్జెక్టులు బోధిస్తున్న టీచర్లకు గౌరవవేతనాన్ని రద్దు చేసింది. నిజానికి ఈ స్కీము కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన స్కీము. ఉత్తరప్రదేశ్ లోని 7742 మదరసాల్లో 21 వేల మంది టీచర్లను నియమించి ఆధునిక శాస్త్రాలను బోధించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన స్కీము. ఆ తర్వాత ఈ స్కీమును అటకెక్కించారు. నిధులు విడుదల చేయడం ఆపేశారు. చివరకు రాష్ట్రప్రభుత్వం కూడా గౌరవవేతనాలు ఆపేస్తున్నామని తెలియజేసేసింది. గత సంవత్సరం అక్టోబరులో వచ్చిన వార్త ప్రకారం ఉత్తరప్రదేశ్ లోని మదరసాలు సంబంధిత పత్రాలు చూపించాలని లేదా రోజుకు పదివేల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారిచేసింది.
విచిత్రమేమిటంటే, మదరసాలపై కత్తికట్టిన యోగీ ప్రభుత్వం వాస్తవాలు ముందుకు వచ్చిన తర్వాత మదరసా బోర్డు చట్టం రద్దు చేయడాన్ని వ్యతిరేకించక తప్పలేదు. ఎందుకంటే, హైకోర్టు తర్పు తర్వాత దాదాపు 17 లక్షల మంది మదరసా విద్యార్థులకు ప్రభుత్వ స్కూళ్ళలో అవకాశం కల్పించడమంటే 1096 కోట్ల రూపాయల ఖర్చు రాష్ట్రప్రభుత్వం భరించవలసి వస్తుంది. అందువల్ల హైకోర్టు తీర్పుపై స్టే కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రయత్నించింది. దేశంలో గురుకులాలు ఉన్నాయని, సంస్కృత పాఠశాలలు నడుస్తున్నాయని కాబట్టి సెక్యులరిజానికి వచ్చిన నష్టమేమీ లేదని వాదించారు. గమనించవలసిన మరో విషయమేమిటంటే, మరో వార్త ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది. యోగీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మదరసాల లైసెన్సులు రద్దు చేసిందని, ఈ మదరసాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఇప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వ స్కూళ్ళకు వెళ్ళవలసిందేనన్నది ఆ వార్త. ఏది ఏమైనా ఉత్తరప్రదేశ్ లో బీజేపీ రాజకీయమంతా మదరసాల చుట్టే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది.

– వాహెద్