November 21, 2024

దేశంలో దాదాపు 20 కోట్ల ముస్లిం జనాభా ఉంది. ముస్లిములందరినీ చొరబాటుదారులని ప్రధానిమోడీ ఎలా చెప్పగలిగారు? వీర్ అబ్దుల్ హమీద్ వంటి సైనికులు, అబ్దుల్ కలామ్ వంటి శాస్త్రవేత్తలు ముస్లిములే, వీళ్ళు చొరబాటుదారులు కాదని ఆయనకు తెలియదా? ఆయన పార్టీలోనే ఉన్న ముక్తార్ అబ్బాస్ నక్వీ వంటి వారు కూడా చొరబాటుదారులు కాదని ఆయనకు తెలియదా? ఆయనకు బాగా తెలుసు… అయినా ఆయన ఈ మాటలు చెబుతారు..? ముస్లిములను ఉద్దేశించి అధికసంతానం కలిగిన వాళ్ళని కూడా ఆయన చెప్పారు. దేశజనాభా వృద్ధిరేటు, ముస్లిముల వృద్ధిరేటు గణాంకాలు ఆయనకు తెలియవా? చాలా మంది ఈ విశ్లేషణలు చేశారు. ఆయనకు బాగా తెలుసు. అయినా ఆయన ఈ అబద్దాలు నిర్లజ్జగా, నిస్సంకోచంగా చెబుతారు…?
ఎన్నికల కమీషన్ తననేమీ చేయదన్న ధైర్యంతో చెబుతున్నారనడం సరయిన విశ్లేషణ కాదు. ఎందుకంటే, ఎన్నికల కమీషన్ ఏమీ చేయకపోవచ్చు, కాని ఇలాంటి అబద్దాలు విన్న ఓటర్లు ఊరుకుంటారా? పచ్చి అబద్దాలను ఏవగించుకుని ఎన్నికల్లో బుద్ధి చెబుతారన్న భయం ఉంటే ఆయన ఇలాంటి అబద్దాలు చెప్పే సాహసం చేసేవారు కాదు. కాని దేశంలో పరిస్థితి విభిన్నంగా ఉంది.
ఆయన మాదిరిగానే దేశంలో సగటు మోడీ అభిమానులకు కూడా  నిజాలు, నిజనిర్ధారణలు పట్టవు. దేశంలో ప్రధాన ప్రతిపక్షం, కాంగ్రెసుపార్టీ దేశంలోని హిందూ మహిళల మంగళసూత్రాలను కూడా  లాక్కుని సంపద అంతా ముస్లిములకు పంచిపెడుతుందని ఒక ప్రధాని చెప్పడం ఎంత హాస్యాస్పదం. దేశంలోని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెసు హిందువులకు హనుమాన్ చాలిసా కూడా చదవకుండా నిషేధిస్తుందని చెబితే దేశప్రజలు నమ్ముతారా …. నమ్ముతారనే ఆయన బలంగా నమ్ముతున్నారు. తాను ఏం చెప్పినా, ఆధారాలు లేకపోయినా, హాస్యాస్పదంగా ఉన్న, పచ్చి అబద్దాలైనా ప్రజలు నమ్మేస్తారని ఆయన బలంగా నమ్ముతున్నారు. తానేం చేసినా … ఆహా… ఓహో … అనే ఒక ఓటుబ్యాంకు తనకు ఉందని ఆయనకు తెలుసు. అందుకే ఒక సభలో ముస్లిములను చొరబాటుదారులని చెప్పి, మరో సభలో తాను ముస్లిములకు చాలా చేశానని, హజ్ కోటా పెంచానని ముస్లిములను ఆకట్టుకునే ప్రసంగం చేయడానికి ప్రయత్నించినా … ఈ వైరుధ్యాన్ని తనను గుడ్డిగా నమ్మే ఓటు బ్యాంకు ఎన్నడూ ప్రశ్నించదని కూడా ఆయనకు బాగా తెలుసు.
గతంలో ముస్లిములను ఉద్దేశించి దుస్తులు చూసి వారిని గుర్తించవచ్చని చెప్పింది కూడా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు బాహాటంగా, నిర్లజ్జగా ఇస్లామోఫోబిక్ వ్యాఖ్యలు చేయడం ద్వారా తన పార్టీలోని చిన్నా చితక నాయకులందరికీ ఆయన ఒక స్పష్టమైన సందేశం ఇచ్చేశారు. ఇక అందరూ ఈ బాటనే నడవాలన్నది ఎన్నికల వ్యూహంగా చెప్పేశారు.
అమెరికాలోని డిసి ల్యాబ్ రిసెర్చి గ్రూప్ ప్రకారం 2023లో 668 విద్వేష ప్రసంగాలు జరిగాయి. అబద్దాలు, చరిత్ర వక్రీకరణలతో నిస్సిగ్గుగా మతతత్వ వ్యాఖ్యలు బాహాటంగానే వినిపించాయి. ఆదిత్యనాథ్ కాంగ్రెసు అధికారంలోకి వస్తే షరియా రూల్ వస్తుందని అన్నాడు. కర్నాటకలో బీజేపీ సోషల్ మీడియా ప్రచారం పచ్చి అబద్దాలను వైరల్ చేస్తోంది. కాంగ్రెసు మేనిఫెస్టోలో బలవంతంగా హిజాబ్ అమలు, ముస్లిములకు సంపద అంతా పంచిపెట్టడం ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. ఇవేవీ కాంగ్రెసు మేనిఫెస్టోలో లేవన్నది ఎవరైనా మేనిఫెస్టో చూసి తెలుసుకోవచ్చు. మోదీ భక్తజనానికి కూడా తెలుసు. అయినా ఇవన్నీ మేనిఫెస్టోలో ఉన్నాయని వాళ్ళు నమ్మడమే కాదు, అందరినీ నమ్మించడానికి చూస్తారు. ఎందుకంటే ఇలాంటి మాటలను విని నమ్మడానికి సిద్ధంగా ఉన్న పెద్ద సమూహం వారికి కనిపిస్తుంది. ఈ సమూహం ఇలాంటి అబద్దాలను ఇంతకు ముందు వినడమే కాదు నమ్మి ఓట్లు కూడా వేసింది.
హఠాత్తుగా ఈ మతతత్వ ప్రచారం ఎందుకు పెంచారన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. మొదటి విడత పోలింగు చూసి భయపడ్డం వల్ల చేస్తున్నారా? లేక కాంగ్రెసు మేనిఫెస్టోలో ఉన్న గ్యారంటీలు, ప్రజసంక్షేమం చూసి ఇలా చేస్తున్నారా అన్నది తేల్చడం కష్టం. కాని మతతత్వ ప్రచారం లాభదాయకం అన్నది బీజేపీకి బాగా తెలిసిన విషయం. ఈ ప్రచారంతో చాలా సార్లు లాభాలు పొందిన చరిత్ర కూడా ఉంది. దేశ ఆర్థికవ్యవస్థ జెట్ స్పీడులో అభివృద్ధి చెందుతుందంటారు. కాని ఆ అభివృద్ధి మొత్తం దేశసంపదను తమ గుప్పిట పెట్టుకున్న ఒక్కశాతం కుబేరులకే దక్కుతుందని, మోడీ కాలంలో దేశం బిలియనీర్ రాజ్ గా మారిందని, సగటు ప్రజలు అప్పుల పాలవుతున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో సంక్షోభం ఉందని, నిరుద్యోగం భయపెడుతుందని చెప్పినా చాలా మంది నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే దేశం విశ్వగురుగా మారిపోయిందన్న మోడీ మాటల్ని మాత్రమే నమ్మే స్థితికి చేరుకున్నారు. చైనాపై కళ్ళెర్రజేశానని ఆయన చెబితే చాలు నమ్మేస్తారు. చైనా మన సరిహద్దుల్లో చొరబడిందా లేదా అన్నది అనవసరమైన విషయంగా చాలా మందికి మారిపోతుంది. పాకిస్తాన్ విషయంలో ఇంట్లో జొరబడి కొట్టానని చెబితే నమ్మేస్తారు. ఒక్క ఫోను కొట్టి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేశానని చెబితే చాలు నమ్మేస్తారు. అలా జరగలేదని ప్రభుత్వమే చెప్పినా సరే నమ్మరు.
ప్రధాని మోడీ ప్రజాదరణకు ముఖ్యమైన కారణం ఏమిటి? ఆయన సగటు మనిషికి చేసింది ఏదీ లేదు. నిరుద్యోగం హిందువులను కూడా వేధిస్తుంది. అధికధరలు హిందువులను కూడా బాధపెడుతున్నాయి. గుజరాత్ లో ఆయన గొప్ప అభివృద్ధి సాధించింది ఏదీ లేదని అనేక విశ్లేషణలు వచ్చాయి. అయినా ఈ ప్రజాదరణకు కారణం ఏమిటి అన్నది ఆలోచించవలసిన ప్రశ్న.  దీనికి కారణం ఒక్కటే,  దేశంలోని మతతత్వ శక్తులు సుదీర్ఘకాలంగా దేశప్రజల్లో ప్రచారంలో పెట్టిన ముస్లిం విద్వేషం చాలా మందిలో గూడుకట్టుకుని ఉంది. గుజరాత్ అల్లర్ల తర్వాత ముస్లిములకు గుణపాఠం నేర్పిన నాయకుడిగా ఆయన్ను వీళ్ళంతా గుర్తిస్తున్నారు. ముస్లిములను అణిచి, బుద్ధి చెప్పే నేతగా ఆయన అవతరించాడు. మీడియా ఆయన్ను హిందూ హృదయసామ్రాట్ చేసేసింది. ఇప్పుడు వీళ్ళందరికీ ఆయన భగవత్సమానుడు. కరోనా కాలంలో గంగానదిలో శవాలు ప్రవహించడం వంటి ఎన్ని వైఫల్యాలు ఆయన ఖాతాలో ఉన్న వీళ్ళెవ్వరు పట్టించుకోరు. ఆయన హామీల్లో ఒక్కటి కూడా అమలు కాకపోయినా వీళ్ళు ప్రశ్నించరు. నోట్లరద్దు వల్ల సాధించిందేమిటని అడగరు? ఎలక్టోరల్ బాండ్ల అవినీతి గురించి ఆలోచించడానికి కూడా ఇష్టపడరు. కొందరయితే పెట్రోలు లీటరు ఐదొందలైనా, గ్యాస్ సిలిండరు ఐదు వేల రూపాయలకు చేరుకున్నా ఫర్వాలేదు మోడీయే మళ్ళీ రావాలంటున్నారు.
ఈ వాతావరణంలో ప్రజాప్రయోజనాలు, సంపదపంపిణీ, ప్రజాసంక్షేమం, బడుగు బలహీనవర్గాల సాధికారత, మహిళల హక్కులు, విద్యా వైద్య సదుపాయాలు, ఉపాధి కల్పన, సమ్మిళిత అభివృద్ధి వంటి మాటలు కేవలం మాటలుగా మాత్రమే మిగిలిపోతాయి. ఈ మాటలు మోడీ కూడా చెబుతారు. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు, ఆయన మరో మాస్టర్ స్ట్రోక్ కొట్టాడని మోడీ అభిమానులు అనుకుంటారు. అది మాస్టర్ స్ట్రోక్ అని ముందే అనుకున్నారు కాబట్టి ఇచ్చిన హామీలు చునావీ జుమ్లాలని ముందే తెలుసు కాబట్టి దానిపై ప్రశ్నించవలసిన అవసరం లేదనుకుంటారు. కాబట్టి ఎప్పుడు ప్రశ్నించరు.
ఈ పరిస్థితి మారుతుందా? నిజమైన శ్రేయోరాజ్యం దిశగా మనం అడుగులు వేస్తామా?