September 17, 2024

విశ్వంలోని కోటానుకోట్ల నక్షత్రాలు ఖచ్చితమైన సమతుల్యంతో కదులుతున్నాయి. విశ్వంలో తమకు నిర్దేశించిన కక్ష్యల్లో మార్గాల్లోనే తిరుగుతున్నాయి. నక్షత్రాలు, గ్రహాలు, గ్యాలక్సీలు తమ కక్ష్యల్లో ప్రయాణించడమే కాదు, తమ చుట్టు తాము కూడా తిరుగుతున్నాయి. ఇవన్నీ ఒక మహావ్యవస్థలో భాగంగా కదులుతున్నాయి. కొన్ని గ్యాలక్సీల్లో 20 నుంచి 30 కోట్ల నక్షత్రాలుంటాయి. ఇంత భారీ గ్యాలక్సీలు ఒక దాని మార్గాన్ని ఒకటి దాటడం కూడా జరుగుతుంది. కాని అవి ఢీకొనవు. అవి కనుక ఢీకొంటే విశ్వం అతలాకుతలమైపోతుంది. విశ్వంలోని క్రమబద్దత చెల్లాచెదరవుతుంది. ఇది మనమంతా ఆలోచించవలసిన మిరకిల్. ఒక మహత్యం కాకపోతే మరేమిటి?

 

విశ్వావిర్భవానికి సంబంధించి శాస్త్రవేత్తలు ఏమంటారంటే, మొదట వేడిగాలి ఉండేది. ఈ వేడిగాలి సాంద్రత పెరుగుతూ పోయింది. సాంద్రత పెరుగుతూ కుచించుకు పోతున్నప్పుడు ఇది చిన్న చిన్న భాగాలుగా విడిపోయి గాలక్టిక్ పదార్థం ఏర్పడింది. అలా గ్యాలక్సీల నుంచి ఈ పదార్థం మరింత కుచించుకుపోయి నక్షత్రాలు ఏర్పడ్డాయి. గ్రహాలు ఏర్పడ్డాయి. మరోవిధంగా చెప్పాలంటే, మన భూమి, ఈ నక్షత్రాలు ఇవన్నీ ఒకే పదార్థం నుంచి వేరుపడ్డాయి. అది వేడిగాలి రూపంలో ప్రారంభంలో ఉన్న పదార్థం. అందులోనుంచే నక్షత్రాలు ఏర్పడ్డాయి. మన సూర్యుడు ఒక నక్షత్రమే. దీని చుట్టు ఉన్న గ్రహాలను కలిపి సూర్యకుటుంబం అంటున్నాం. ఇలాగే నక్షత్రాలకు కూడా గ్రహమండలాలు ఉన్నాయి. అంటే అనేక సూర్యకుటుంబాలు విశ్వంలో ఏర్పడ్డాయి. అనేక గ్యాలక్సీలు ఉన్నాయి. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఈ విశ్వం ప్రారంభంలో ’’రత్ఖ్‘‘ అనే రూపంలో ఉండేది. రత్ఖ్ అంటే ఫ్యూజన్, అన్ని కలిసిపోయి సమైక్యంగా ఒకేచోట ఉండడం. ఆ తర్వాత ఇది ’’ఫతాఖా‘‘ దశలోకి ప్రవేశించింది. ఫతాఖా అంటే విడిపోవడం. అనేక భాగాలుగా విడిపోవడాన్ని ఫతాఖా అంటారు. విశ్వం ఎలా ఏర్పడింది? విశ్వావిర్భావం ఎలా జరిగింది అనే విషయాలను దివ్యఖుర్ఆన్ చాలా స్పష్టంగా వివరించింది. చాలా ఖచ్చితంగా వర్ణించింది. నేడు వైజ్ఞానిక ఆవిష్కరణలు దివ్యఖుర్ఆన్ లో ప్రస్తావించిన ఈ వర్ణనను ఆమోదిస్తున్నాయి.

ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం చూద్దాం. ఒక పదార్థం అనేకభాగాలుగా విడిపోతున్నప్పుడు, కొన్ని కణాలు చెల్లాచెదురు అవుతాయి. అవి ఏ భాగంలోను చేరకుండా మిగిలిపోతాయి. అలాగే రోదసిలో వేడిగాలుల ప్రాథమిక పదార్థం సాంద్రత పెరిగి కుచించుకుంటూ అనేక భాగాలుగా విడిపోతున్న ప్రక్రియలోను చెల్లాచెదరై పోయిన కణాలు కూడా చాలా ఉన్నాయి. ఈ కణాలను సైన్సులో ఇంటర్ గాలక్టిక్ మెటీరియల్ అంటారు. అంటే గ్యాలక్సీల మధ్య మిగిలిపోయిన పదార్థం. అలాగే నక్షత్ర రాసుల మధ్య కూడా మిగిలిపోయిన పదార్థం చాలా ఉండిపోయింది. ఈ పదార్థంలో 60 శాతం హైడ్రోజన్, 38 శాతం హీలియం, 2 శాతం ఇతర మూలకాలుంటాయని సైన్సు చెబుతోంది. ఇంటర్ స్టెల్లార్ మ్యాటర్ అంటే నక్షత్రాల మధ్య మిగిలిపోయిన ద్రవ్యంలో 99 శాతం వాయువులే ఉన్నాయి. మిగిలిన 1 శాతం ధూళి కణాలున్నాయి. ఇందులో భారమూలకాలు అంటే హెవీ ఎలిమెంట్స్ ఉంటాయని సైన్సు చెబుతుంది. ఈ భారమూలకాలు 0.0001 నుంచి 0.001 మి.మి.వ్యాసం కలిగి ఉండవచ్చు. ఆస్ట్రో ఫిజికల్, అంతరిక్ష భౌతికశాస్త్రంలో కొలమానాల విషయంలో ఈ కణాలు చాలా కీలకమైనవిగా శాస్త్రవేత్తలు భావిస్తారు. ఈ కణాలు చాలా చిన్నవి కాబట్టి వీటిని ధూళికణాలుగా చెప్పవచ్చు. లేదా పొగ లేదా వాయుకణాలుగా కూడా చెప్పవచ్చు. ఈ కణాలు చాలా చిన్నవే కాని, నిజానికి ఇవి చాలా ఎక్కువ. వీటన్నింటిని కలిపితే చాలా ద్రవ్యం ఉంటుంది. అంతరిక్షంలో ఉన్న గ్యాలక్సీలన్నింటిలో ఉన్న ద్రవ్యం కన్నా, ఈ ధూళికణాలు అన్నింటిని కలిపితే ఉండే ద్రవ్యం ఎక్కువ. గ్యాలక్సీల మధ్య ఈ ద్రవ్యరాశి చిన్న చిన్న కణాల రూపంలో ధూళికణాలుగా ఉందన్నది 1920లో కనిపెట్టిన విషయం. కాని వందల సంవత్సరాల క్రితం దివ్యఖుర్ఆన్ ఈ ద్రవ్యాన్ని ప్రస్తావించింది. ఖుర్ఆన్ లోని ’’మాబైనహుమా‘‘ అంటే ’’వాటి మధ్య ఉన్న సమస్తం‘‘ అనే  మాటలు దీనికి సంబంధించినవే.

విశ్వంలో ఒక ఖచ్చితమైన సమతుల్యం కూడా మనకు కనిపిస్తుంది. ఇదే విషయాన్ని దివ్యఖుర్ఆన్ 67వ సూరా అల్ ముల్క్ లో 3వ వాక్యం, 4వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు.

’’ఆయన పొరలుగా ఏడు ఆకాశాలను సృష్టించాడు. అనంతకరుణామయుడి సృష్టిలో నీవు ఎలాంటి లోపాన్ని చూడలేవు. మరోసారి చూడు అందులో నీకేమైనా లోపం కనిపిస్తున్నదామళ్లీ మళ్లీ చూడునీ చూపులు అలసిపోయి విఫలమై వెనుకకు తిరిగి వస్తాయి.‘‘  (దివ్యఖుర్ఆన్ : 67:3-4)

విశ్వంలోని కోటానుకోట్ల నక్షత్రాలు ఖచ్చితమైన సమతుల్యంతో కదులుతున్నాయి. విశ్వంలో తమకు నిర్దేశించిన కక్ష్యల్లో మార్గాల్లోనే తిరుగుతున్నాయి. నక్షత్రాలు, గ్రహాలు, గ్యాలక్సీలు తమ కక్ష్యల్లో ప్రయాణించడమే కాదు, తమ చుట్టు తాము కూడా తిరుగుతున్నాయి. ఇవన్నీ ఒక మహావ్యవస్థలో భాగంగా కదులుతున్నాయి. కొన్ని గ్యాలక్సీల్లో 20 నుంచి 30 కోట్ల నక్షత్రాలుంటాయి. ఇంత భారీ గ్యాలక్సీలు ఒక దాని మార్గాన్ని ఒకటి దాటడం కూడా జరుగుతుంది. కాని అవి ఢీకొనవు. అవి కనుక ఢీకొంటే విశ్వం అతలాకుతలమైపోతుంది. విశ్వంలోని క్రమబద్దత చెల్లాచెదరవుతుంది. ఇది మనమంతా ఆలోచించవలసిన మిరకిల్. ఒక మహత్యం కాకపోతే మరేమిటి?

విశ్వంలో  వేగం అనేది చాలా చాలా ఎక్కువ. మనం నమ్మలేని వేగాలున్నాయి. భూమిపై వేగంతో దాన్ని పోల్చలేము. నక్షత్రాలు, గ్రహాలు, గ్యాలక్సీలు, అనేక గ్యాలక్సీలున్న సముదాయాలు వాటి పరిమాణం మనం ఊహలకు అందనిది. ఎంత బరువుంటాయన్నది కూడా ఊహించలేం. కోటానుకోట్ల టన్నుల బరువని చెప్పగలమేమో. ఈ భారీ నిర్మాణాలు గొప్ప వేగంతో విశ్వంలో కదులుతున్నాయి.

ఉదాహరణకు, మన భూమిని తీసుకుందాం. భూమి తన చుట్టు తాను తిరుగుతోంది. ఎంత వేగంతో తిరుగుతుందో తెలుసా? గంటకు 1670 కి.మీ. వేగంతో తిరుగుతోంది. ఇంత వేగంగా ప్రయాణించే వాహనం ఏదైనా భూమిపై ఉందా? లేనే లేదు. అత్యంత వేగంగా వెళ్ళే బుల్లెట్ గంటకు 1800 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. భూమి ఎంత వేగంగా తన చుట్టు తాను తిరుగుతుందో దీన్ని బట్టి ఊహించవచ్చు.

భారీ పరిమాణంలో ఉన్న భూమి ఇంత వేగంగా తన చుట్టు తాను తిరగడమే కాదు, సూర్యుని చుట్టు కూడా తిరుగుతోంది. భూమి సూర్యుని చుట్టు తిరిగే వేగం ఇంకా చాలా చాలా ఎక్కువ. అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ కన్నా 60 రెట్లు ఎక్కువ వేగంతో భూమి సూర్యుని చుట్టు తిరుగుతోంది. అంటే భూమి సూర్యుని చుట్టు 1,08,000 కి.మీ.వేగంతో తిరుగుతోంది,.

ఇంత వేగంతో ప్రయాణించే వాహనాన్ని మనం తయారు చేయగలిగితే భూమి చుట్టు ఒకసారి తిరిగి రావడానికి కేవలం 22 నిముషాలు పడుతుంది. ఇవి కేవలం భూమికి సంబంధించిన వేగాలు మాత్రమే. సౌరకుటుంబంలో కనిపించే వేగాలు మనం ఊహించలేనివి. విచిత్రమేమంటే విశ్వంలో పరిమాణంలో పెద్దదైన ప్రతి నిర్మాణం వేగంలోను మిగిలిన వాటి కన్నా ఎక్కువ వేగం కలిగి ఉంటోంది. మన సౌరకుటుంబాన్నే తీసుకుందాం. ఇందులో సూర్యుడు, దాని చుట్టు తిరిగే గ్రహాలు, తోకచుక్కలు అన్నీ కలిసి ఉన్నాయి. ఈ మొత్తం సౌరకుటుంబం కూడా ఇది ఉన్న గ్యాలక్సీ పాలపుంత కేంద్రం చుట్టు తిరుగుతోంది. ఎంత వేగంతో తెలుసా? గంటకు 7,20,000 కి.మీ. వేగంతో తిరుగుతోంది. మన సౌరకుటుంబం ఉన్న గ్యాలక్సీ పేరు పాలపుంత. ఇందులో దాదాపు 20 కోట్ల కన్నా ఎక్కువ నక్షత్రాలున్నాయి. ఈ మొత్తం గ్యాలక్సీ కూడా ప్రయాణిస్తోంది. ఎంత వేగంతోనో తెలుసా? గంటకు 9,50,000 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.

ఇంత సంక్లిష్టమైన వ్యవస్థలో, ఇంత వేగంగా నిర్మాణాలు కదులుతున్న వ్యవస్థలో ఒకదాన్నొకటి ఢీకొనే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాని అలా జరగడం లేదు. మనం సురక్షితంగా భూమిపై బతుకుతున్నాం. ఎందువల్లనంటే విశ్వంలో అన్నీ ఖచ్చితమైన సమతుల్యంతో వ్యవహరిస్తున్నాయి. ఈ సమతుల్యాన్ని ప్రసాదించింది అల్లాహ్. అందువల్లనే ఇంతకు ముందు చెప్పుకున్న దివ్యఖుర్ఆన్ వాక్యంలో ’’ఇందులో ఎలాంటి లోపం చూడలేరు‘‘ అని అల్లాహ్ తెలియజేశాడు.

’’ఆయన పొరలుగా ఏడు ఆకాశాలను సృష్టించాడు. అనంతకరుణామయుడి సృష్టిలో నీవు ఎలాంటి లోపాన్ని చూడలేవు. మరోసారి చూడు అందులో నీకేమైనా లోపం కనిపిస్తున్నదామళ్లీ మళ్లీ చూడునీ చూపులు అలసిపోయి విఫలమై వెనుకకు తిరిగి వస్తాయి.‘‘  (దివ్యఖుర్ఆన్ : 67:3-4)

–      రుఫైదా