.
పాలస్తీనాకు ఒక ప్రత్యేకదేశం హోదాను ఐక్యరాజ్యసమితి సాధారణ సభ నవంబర్ 2012లోనే గుర్తించింది. అప్పుడే పాలస్తీనాకు సభ్యత్వం లేని పరిశీలక హోదాను కూడా ఇచ్చింది. ఇప్పుడు పాలస్తీనాకు పూర్తిస్థాయి సభ్యత్వం ఇవ్వాలన్న తీర్మానాన్ని ఆల్జీరియా ప్రతినిథి ప్రవేశపెట్టారు.
ఏప్రిల్ 18వ తేదీ ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వం ఇవ్వాలనే తీర్మానంపై ఓటింగ్ జరిగింది. అమెరికా సహజస్వభావాన్ని మరోసారి ప్రదర్శించింది. రెండు దేశాల పరిష్కారం గురించి, ప్రపంచంలో మానవహక్కులు, ప్రజాస్వామ్య విలువల గురించి ప్రసంగాలు చేసే అమెరికా జియోనిస్టు లాబీల ఉక్కు పాదాల క్రింద బతుకుతున్నానని రుజువు చేసుకుంది. ఈ తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. పాలస్తీనాను 140 దేశాలు గుర్తించాయి. భద్రతామండలిలో ఉన్న 15 సభ్య దేశాల్లో 12 దేశాలు పాలస్తీనా సభ్యత్వానికి అనుకూలంగా ఓటు వేశాయి. బ్రిటన్, స్విట్జర్లాండ్ దేశాలు ఓటింగులో పాల్గొనలేదు. ఒకే ఒక్క దేశం అమెరికా ఈ తీర్మానాన్ని వ్యతిరేకించడమే కాదు, వీటో కూడా చేసి పాలస్తీనాకు సభ్యత్వం లభించకుండా అడ్డుకుంది. చివరకు అమెరికా మిత్రదేశాలైన ఫ్రాన్సు, జపాన్, దక్షిణ కోరియాలు కూడా ఈ తీర్మానాన్ని బలపరిచాయి. కాని అమెరికాకు యూదలాబీని కాదని ఈ తీర్మానాన్ని బలపరిచే ధైర్యం లేదు. అమెరికా ఎన్నికల్లో నేతలకు కావలసిన నిధులు ఈ యూదలాబీ నుంచే లభిస్తాయన్నది మరిచిపోరాదు.
పాలస్తీనాకు ఒక ప్రత్యేకదేశం హోదాను ఐక్యరాజ్యసమితి సాధారణ సభ నవంబర్ 2012లోనే గుర్తించింది. అప్పుడే పాలస్తీనాకు సభ్యత్వం లేని పరిశీలక హోదాను కూడా ఇచ్చింది. ఇప్పుడు పాలస్తీనాకు పూర్తిస్థాయి సభ్యత్వం ఇవ్వాలన్న తీర్మానాన్ని ఆల్జీరియా ప్రతినిథి ప్రవేశపెట్టారు.
ఐక్యరాజ్యసమితిలో ఇస్రాయీల్ రాయబారి మాట్లాడడం ప్రారంభించగానే రష్యా వాకౌట్ చేసి నిరసన ప్రదర్శించింది. రష్యా రాయబారి అమెరికా వైఖరిని తీవ్రంగా నిరసించారు. గాజాలో నరమేధం ప్రారంభమైన తర్వాత ఇప్పటికి ఐదుసార్లు ఐక్యరాజ్యసమితిలో అమెరికా వీటో అధికారాన్ని ఉపయోగించిందని, పాలస్తీనా పట్ల అమెరికా వైఖరి ఏమిటో దీనివల్ల స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక దేశాలు, ప్రజలు పాలస్తీనాను సమర్థిస్తున్నారని కూడా ఆయన చెప్పారు. చరిత్ర గమనాన్ని ఆపడానికి ఇప్పుడు అమెరికా చేసిన ఈ వీటో ప్రయత్నం చివరకు నిష్ఫలంకాక తప్పదని కూడా ఆయన అన్నారు. ప్రపంచంలో ఒక్క అమెరికా తప్ప మరెవ్వరు ఇప్పుడు ఇస్రాయీల్ ను సమర్థించడం లేదని విమర్శించారు. పాలస్తీనా భూభాగాన్ని యూదులకిచ్చి ఇస్రాయీల్ ఏర్పాటు చేసిన బ్రిటన్ బయటి దేశాల నుంచి యూదులు వచ్చి అక్కడ స్థిరపడే అవకాశాలు కల్పించడమే కాదు, ఇస్రాయీల్ కు ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కూడా వచ్చేలా ఈ అగ్రరాజ్యాలు చేశాయి. కాని ఈ భూభాగానికి అసలు వారసులయిన పాలస్తీనా ప్రజలపై నరమేధం కొనసాగిస్తున్నారు. 1947లోనే ఐక్యరాజ్యసమితి ఈ భూభాగాన్ని రెండు దేశాలుగా గుర్తించాలని తీర్మానం చేసింది. 1948 నుంచి ఇస్రాయీల్ కు పూర్తిస్థాయి సభ్యత్వం ఉంది. పాలస్తీనాకు పూర్తిస్థాయి సభ్యత్వం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ తీర్మానాన్ని వీటో చేసినా తాము నిరాశ చెందేది లేదని పాలస్తీనా ప్రతినిధులు ప్రకటించారు.
ఇస్రాయీల్ ఏది కోరుతుందో అమెరికా అదే చేస్తుందన్నది మరోసారి రుజువయ్యింది. కాని పైకి మాత్రం రెండు దేశాల పరిష్కారం అంటూ నీతులు చెబుతుంది. మరోవైపు ఇస్రాయీల్ ప్రత్యేక పాలస్తీనా దేశం ఏర్పడకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అమెరికా దానికి సహాయం చేస్తూనే ఉంటుంది.
కాని ఈ ప్రయత్నాలను ప్రపంచం గమనిస్తూనే ఉంది. పాలస్తీనాకు అనుకూలంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లోనే ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు ఇస్రాయీల్ చేసిన దాడుల్లో గాజాలో 35 వేల మంది మరణించారు. మరణించిన వారిలో అత్యధిక సంఖ్యలో పిల్లలు, మహిళలు ఉన్నారు. ఇది యుద్ధం కాదు. నరమేధం. గాజాపై యుద్ధం ప్రారంభించిన ఇస్రాయీల్ హమాస్ ను తుడిచేస్తానని చెప్పింది. కాని హమాస్ బలం ఎలాంటిదలాగే ఉందని వార్తల వల్ల తెలుస్తోంది. ఇస్రాయీల్ యుద్ధం పేరుతో చేస్తున్నది సాధారణ ప్రజలను చంపడం. ఆసుపత్రులపై బాంబులు వేసి చేసిన నరమేధం ప్రపంచం గుర్తించింది. ఇప్పుడు ఇస్రాయీల్ ప్రధానిపై యుద్ధనేరాల కేసు నడుస్తోంది. గాజాలో ఇస్రాయీల్ చేస్తున్న మారణహోమాన్ని యావత్తు ప్రపంచం నిరసిస్తోంది. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన ఈ నిరసన ప్రదర్శనల్లో దాదాపు 16వందల మంది విద్యార్థులు అరెస్టయ్యారు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ నిరసనలు పెల్లుబుకుతున్నాయి.
కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన పాలస్తీనా అనుకూల నిరసనలు కార్చిచ్చులా వ్యాపిస్తున్నాయి. ఈ నిరసనలను పరిశీలిస్తే అమెరికా సమాజంలో తరాల అంతరం తెలుస్తుంది. ముఖ్యంగా ఇస్రాయీల్ కు మద్దతు విషయంలో పాత తరానికి, కొత్త తరానికి మధ్య విభేదాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. నేటి యువతరం పాలస్తీనాపై జరుగుతున్న ఘోరాలను గుర్తిస్తున్నారు. పాలస్తీనాకు మద్దతుగా గొంతు విప్పుతున్నారు. ఈ నిరసనల సెగ డెమొక్రటిక్ పార్టీకి చెందిన అధ్యక్షుడు జో బిడెన్ కు కూడా తగలక తప్పదని రాజకీయ వ్యాఖ్యాతలు భావిస్తున్నారు. అంతేకాదు ఇస్రాయీల్ విషయంలో గుడ్డిగా మద్దతిచ్చే అమెరికా రాజకీయ నాయకులపై కూడా దీని ప్రభావం పడుతుంది. కొత్తతరం ఈ అన్యాయాలను సహించడం లేదు. కొలంబియా విశ్వవిద్యాలయంలో పాలస్తీనా అనుకూల నిరసనకారులు అక్కడే శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. వారిని అరెస్టు చేయగానే ఈ నిరసనలు ఇతర విశ్వవిద్యాలయాలకు వ్యాపించాయి. విద్యార్థులను, అధ్యాపకులను అరెస్టు చేయడంలో పోలీసులు ప్రదర్శించిన జులుం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. ఇస్రాయీల్ సైన్యానికి అమెరికా విశ్వవిద్యాలయాలకు సంబంధమేమిటన్నది ప్రశ్న. చాలా సంబంధం ఉంది. ఇస్రాయీల్ మిలటరీతో సంబంధం ఉన్న ఆయుధాల తయారీ సంస్థల నిధులను వెంటనే ఉపసంహరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
అమెరికాలో యువతరం పాలస్తీనాను సమర్థించడం చాలా కాలంగా ఉంది. చాలా ఒపీనియన్ పోల్స్ లోను ఈ విషయం తెలిసింది. పాతతరంలో ఇంకా ఇస్రాయీల్ పట్ల సానుభూతి ఉంది. కాని కొత్త తరం ఇస్రాయీల్ దౌర్జన్యాలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నారు.
అమెరికా విశ్వవిద్యాలయాలు దేశంలో కీలకమైన మార్పులకు కారణమైన చరిత్ర ఉంది. ఉదాహరణకు దక్షిణాఫ్రికాలో జాత్యాహంకార ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1950లలో ప్రారంభమైన ఉద్యమం చివరకు 1980ల్లో జాత్యాహంకార వ్యతిరేక నిరసనలుగా మారింది. చివరకు దక్షిణాఫ్రికాలో జాత్యాహంకార నిర్మూలనకు ఈ ప్రదర్శనలు తోడ్పడ్డాయి. 1960ల్లో పౌరహక్కుల ప్రదర్శనలు జరిగాయి. ప్రజాభిప్రాయాన్ని మలచడంలో అమెరికా విశ్వవిద్యాలయాలు తమ పాత్ర పోషించిన చరిత్ర ఉంది.
పాలస్తీనా అనుకూల నిరసనలపై పోలీసుల బలప్రదర్శన కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. బాహాటంగా నిరసనకారులు హమాస్ కు మద్దతివ్వడం కూడా చర్చకు వచ్చింది. ప్రభుత్వ దమననీతి ముందు విద్యార్థులు కూడా తలొగ్గడం లేదు. ప్రదర్శనలు మరింత పెరుగుతున్నాయి.
అక్టోబర్ 7వ తేదీన ఇస్రాయీల్ పై హమాస్ దాడి చేసిన తర్వాతి నుంచి అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఇస్రాయీల్, పాలస్తీనాల చర్చ జరుగుతోందన్నది కూడా గమనించాలి. ఇస్రాయీల్ గాజాపై దాడి చేసి హమాస్ ను అంతం చేస్తానని చెప్పింది. కాని ఇస్రాయీల్ దాడుల్లో వేలాది పిల్లలు, మహిళలు చనిపోతున్నారే కాని హమాస్ బలం ఎలాంటిది అలాగే ఉందన్నది కూడా చాలా మంది విశ్లేషించారు. ఇస్రాయీల్ చేస్తున్నది యుద్ధం కాదు పాలస్తీనా ప్రజలను నిర్మూలించే జాతి నిర్మూలన అని చాలా మంది ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా విశ్వవిద్యాలయాల్లో గాజాకు అనుకూలంగా ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి.
ఈ ప్రదర్శనలను అణిచేయడానికి జియోనిస్టు శక్తులు రంగంలోకి దిగాయి. విశ్వవిద్యాలయాలను టెర్రరిస్టుల అడ్డాలుగా ప్రచారం చేయడం, యాంటి సెమిటిక్ ప్రదర్శనలుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారు.
అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఇప్పుడు జరుగుతున్న పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు అరవైల్లో వియత్నాం యుద్ధంలో జరిగిన యుద్ధవ్యతిరేక ప్రదర్శనలను గుర్తుకు తెస్తున్నాయి. ఈ నిరసనలు, ప్రదర్శనలు అమెరికా సమాజం ఇప్పుడు రెండుగా చీలిపోయిందని చెబుతున్నాయి. అమెరికా ప్రభుత్వం, రాజకీయ నాయకులు ఇస్రాయీల్ కు గుడ్డిగా ఇస్తున్న మద్దతును వేలెత్తి చూపించడమే కాదు, నిర్భయంగా ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలు ప్రపంచవేదికపై పాలస్తీనాను సరికొత్తగా పరిచయం చేస్తున్నాయి. ప్రపంచం మరిచిపోయిన అన్యాయాలు, దౌర్జన్యాలు, ఏడు దశాబ్దాల అణిచివేతలు, జాతిహననాలు, ఊచకోతలు, నిర్బంధాలు అన్ని ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఈ చర్చ న్యాయం చేస్తుందని ఆశిద్దాం.