July 27, 2024

ఈరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రయీసీ ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ ప్రమాదానికి గురయ్యిందన్న వార్త మే 19వ తేదీన వచ్చింది. కేవలం హెలీకాప్టర్ ప్రమాదానికి గురయ్యిందన్న వార్త మాత్రమే వచ్చింది. ఎవరెవరు మరణించారన్న నిర్ధారణలేవీ రాలేదు. పైగా హెలీకాప్టరు క్రాష్ కాలేదేమో, కొండల్లో ఎలాగోలా దిగి ఉంటుందన్న ఊహాగానాలు కూడా జరుగుతున్నప్పుడు ఇస్రాయీల్ అధికారికంగా ఒక ప్రకటన చేసింది. రయీసీ మరణంలో తమ ప్రమేయం ఏమీ లేదన్నది ఆ ప్రకటన. అసలు రయీసీ మరణించారో లేదో ఇంకా తెలియనప్పుడే ఇస్రాయీల్ చేసిన ఈ ప్రకటన చాలా మందిలో అనుమానాలకు కారణమయ్యింది. పైగా రయీసీ హెలికాప్టరు ప్రమాదానికి గురైన ప్రదేశం ఇస్రాయీల్ గూఢచార సంస్థ మొస్సాద్ కార్యకలాపాలకు పేరుమోసిన ప్రదేశం.
ఈరాన్ అధ్యక్షుడి హెలీకాప్టర్ ప్రమాదానికి గురైన తర్వాత 15 గంటల పాటు ఆ కొండల్లో జల్లెడ పట్టి చివరకు హెలీకాప్టర్ ప్రమాదానికి గురైందని, అందులో ప్రయాణిస్తున్న రయీసీతో పాటు విదేశాంగ మంత్రి అమీర్ అబ్దుల్లాహియన్ మరో ఏడుగురు మరణించారని ఈరాన్ ప్రకటించింది. ఈరాన్ కు ఇది చాలా విషాదకరమైన సందర్భం.
ఇబ్రాహీం రయీసీ ఇటీవల చాలా దేశాలు సందర్శించారు. ఈ క్రమంలో ఆయన ఆజర్ బైజాన్ వెళ్ళి వస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఆజర్ బైజాన్ తో కలిసి ఈరాన్ ఖిజ్ ఖలాసీ డ్యాము నిర్మించింది. ఈ డ్యాము అరస్ నదిపై కట్టిన డ్యాము. ఈరాన్, అజర్ బైజాన్ మధ్య ఉంది. ఆజర్ బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ తో కలిసి ఈరాన్ అధ్యక్షుడు రయీసీ ఈ డ్యామును ప్రారంభించారు. అక్కడి నుంచి రయీసీ ఈరాన్ లోని తబ్రేజ్ కు తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో ఆయన ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ కొండప్రాంతంలో ప్రమాదానికి గురైంది. మొత్తం మూడు హెలీకాప్టర్లు ప్రయాణిస్తున్నాయి. రయీసీ ఉన్న హెలికాప్టరుతో పాటు మరో రెండు హెలీకాప్టర్లు ఈ కాన్వాయ్ లో ఉన్నాయి. కాని మిగిలిన రెండు హెలీకాప్టర్లు సురక్షితంగా చేరుకున్నాయి.
ఈరాన్ అధ్యక్షుడి హెలీకాప్టరు ప్రమాదానికి గురికావడం, ఆయన మరణించడం ఈ సంఘటన జరిగిన టైమింగ్ కూడా చర్చల్లోకి వస్తుంది. అమెరికాలోని వాల్ స్ట్రీట్ జర్నల్ లో ఇటీవల వచ్చిన వ్యాసం ఈరాన్, రష్యా దేశాల్లో ప్రభుత్వాలను పడగొట్టాలని అప్పుడే యుద్ధాన్ని గెలవగలమని ఆ వ్యాసంలో రాశారు. స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో పై మే 15వ తేదీన హత్యాయత్నం జరిగింది. ఆయన రష్యాకు మిత్రుడు. నాటోలో ఉక్రెయిన్ సభ్యత్వాన్ని అడ్డుకుంటానని ప్రకటించిన నాయకుడు. ఆ తర్వాత ఇప్పుడు ఈరాన్ అధ్యక్షుడి హత్య జరిగింది. మరో రెండు నెలలోగా ఈరాన్ లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి.
ఇక్కడ చాలా మంది అడుగుతున్న ప్రశ్న గమనించదగింది. ఈరాన్, ఆజర్ బైజాన్ ల మధ్య సంబంధాలు బాగోలేవు. ఆజర్ బైజాన్ మిత్రదేశం కాదు. పైగా ఇస్రాయీల్ తో ఆజర్ బైజాన్ కు సత్సంబంధాలున్నాయి. కేవలం ఒక డ్యాము ప్రారంభోత్సవానికి రయీసీ అక్కడికి ఎందుకు వెళ్ళి ప్రమాదం కొని తెచ్చుకున్నారు? ఆజర్ బైజాన్, ఆర్మేనియాల మధ్య 2023లో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఈరాన్, రష్యా దేశాలు ఆర్మేనియాకు మద్దతుగా నిలబడ్డాయి. ఆజర్ బైజాన్ కు ఇస్రాయీల్ సహాయం చేసింది. ఇప్పుడు ఇస్రాయీల్ గాజాపై బాంబులతో విరుచుకుపడుతుంది. గాజాలో ఈ మారణకాండ ముగిశాయ ఈరాన్ పై దాడి చేసే ఆలోచనలో ఇస్రాయీల్ ఉందా? ఆజర్ బైజాన్ కూడా ఇస్రాయీల్ కు మద్దతిస్తుందన్న సమాచారమేమైనా ఈరాన్ కు చేరిందా? అందువల్లనే రయీసీ ఆజర్ బైజాన్ వెళ్ళి అక్కడి అధ్యక్షుడితో మాట్లాడడం అవసరమనుకున్నారా? ఇస్రాయీల్ పక్షాన నిలబడకుండా నిరోధించడానికి వెళ్ళారా? ఆజర్ బైజాన్ ఒకప్పుడు ఈరాన్ అంతర్భాగం అన్నది కూడా గుర్తించాలి. ఈరాన్, ఆజర్ బైజాన్ల మధ్య స్పర్థలు చాలా ఉన్నాయి.
ఈ ప్రమాదం తర్వాత రష్యా వెంటనే ప్రతిస్పందించింది. రష్యా నుంచి సహాయదళాలు వెంటనే ప్రమాదస్థలానికి చేరుకున్నాయి. మే 19 ప్రమాదం ఎలా జరిగిందన్నది విచారించడంలో పూర్తి సహాయం చేస్తామని ప్రకటించింది. కాని గమనించవలసిన విషయమేమిటంటే, ఈరాన్ చాలా మౌనంగా ఉంది. సాధారణంగా ఈరాన్ ఇలా వ్యవహరించడం జరగదు. వెనువెంటనే ఇస్రాయీల్ పై ఆరోపణలు చేయడం, అమెరికాను కూడా సవాలు చేయడం జరగాలి. ఈరాన్ గత చరిత్రను పరిశీలిస్తే ఈరాన్ ప్రతిస్పందనలు ఇలాగే ఉన్నాయి. తక్షణం ఈరాన్ నుంచి ప్రకటనలు వచ్చేవి. ఉదాహరణకు అణు శాస్త్రవేత్త ముహిసిన్ ఫకీర్ జాదేను ఇస్రాయీల్ హతమార్చినప్పుడు, ఈరాన్ సైన్యాధికారి ఖాసిం సులైమానీని ఇస్రాయీల్ హతమార్చినప్పుడు ఈరాన్ తీవ్రస్వరంతో మాట్లాడింది. ఇస్రాయీల్ ను నిలదీసింది. విదేశీవ్యవహారాల్లో శషభిషలు లేకుండా మాట్లాడడం ఈరాన్ ప్రత్యేకత. పైగా, ఖాసీం సులైమానీ, ముహిసిన్ ఫకీర్ జాదేల హత్యలు ఈరాన్ కు కోలుకోని దెబ్బ తీసిన హత్యలు. అప్పుడు స్పష్టంగా ఇస్రాయీల్ పేరు చెప్పి హెచ్చరికలు జారీ చేసిన ఈరాన్ ఇప్పుడు మాత్రం మౌనంగా ఉండడం చాలా మందిని అయోమయానికి గురి చేస్తోంది. ఈ మౌనం వెనుక వ్యూహాత్మక నిర్ణయాలున్నాయా? లేక రయీసీ హత్య వెనుక ఈరాన్ లోనే అంతర్గత కుట్ర జరిగిందని ఈరాన్ ప్రభుత్వం భావిస్తుందా?
ఈరాన్ లోనే అంతర్గతంగా ఈ కుట్ర జరిగిందని భావించినా అందులో ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. విచారణలో ఈ కుట్ర వివరాలు ఎలాగూ బయటకు వస్తాయి. గమనించవలసిన మరో విషయమేమిటంటే, రయీసీ ప్రయాణానికి ఉపయోగించిన హెలీకాప్టర్ చాలా పాతది. అమెరికాలో తయారైన బెల్ 212 హెలీకాప్టర్ లో ఆయన ప్రయాణం చేశారు. 1968లో ఈరాన్ ఈ హెలీకాప్టర్ ను అమెరికా నుంచి కొనుగోలు చేసింది. ఇంత పాత హెలీకాప్టర్ ను అధ్యక్షుడి ప్రయాణానికి ఎలా కేటాయించారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. పైగా ఈరాన్ పై అమెరికా ఆంక్షల కారణంగా ఈ హెలీకాప్టర్ విడిభాగాలేవీ ఇప్పుడు ఈరాన్ కు దొరకడం లేదు. మరో విషయం వాతావరణ పరిస్థితులను కూడా ఈ ప్రయాణంలో పరిగణనలోకి తీసుకోలేదని కూడా తెలియవచ్చింది.
హెలీకాప్టర్ ప్రమాదం తర్వాత తెలిసిన మరో వార్త, సహాయక బృందాలను తప్పుదారి పట్టించారన్న వార్త. ప్రమాదం జరిగిన ప్రదేశం వైపునకు కాకుండా మరో వైపుకు సహాయకబృందాలను పంపించారని తెలిసింది. టర్కీ డ్రోన్ల సహాయంతో తర్వాత ప్రమాద ప్రదేశాన్ని పసిగట్టడం జరిగింది. ప్రమాదంలో అందరి శరీరాలు కాలిపోయాయి. శరీరభాగాలు చెల్లాచెదరయ్యాయి. ఇది కేవలం హెలీకాప్టర్ క్రాష్ అవ్వడం వల్ల జరుగుతుందా? లేక మిస్సయిల్ ఢీకొనడం వల్ల జరిగిందా? లేక లేసర్ దాడి కావచ్చా? లేక డ్రోన్ దాడి కావచ్చా? ఇలాంటి అనేక అనుమానాలున్నాయి. ప్రమాదం ఎంత హఠాత్తుగా జరిగిందంటే, పైలట్ కనీసం మే డే సిగ్నల్ కూడా పంపించే సమయం లభించలేదు. ఇది కేవలం ప్రమాదమేనా?
ఈ అనుమానాల వల్లనే బహుశా ఈరాన్ మౌనంగా ఉంది. ఎందుకంటే, ఈ అనుమానాలు ఈరాన్ లోనే అంతర్గతంగా ఇస్రాయీల్, అమెరికా అనుకూల శక్తులు, కుట్రదారులు ఉన్నారని చెబుతున్నాయి. ఈరాన్, ఆజర్ బైజాన్లలో ఇస్రాయీల్, అమెరికా గూఢచారులు తిష్ఠవేసుకుని కూర్చున్న పరిస్థితి ఇది సూచన. ఈ పరిస్థితి కొత్త కాదు. ఈరాన్ అణు శాస్త్రవేత్త ముహిసిన్ ఫకీర్ జాదే హత్య కూడా ఇదేవిధంగా జరిగింది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కున్న చరిత్ర ఈరాన్ కు ఉంది. ఇప్పుడు అణుశక్తిగా ఈరాన్ మారబోతున్న పరిస్థితుల్లో ఈ సంఘటన ఈరాన్ కు కొత్త సవాళ్ళను విసురుతోంది. ఈరాన్ అధ్యక్షుడిగా రయీసీ ఇలాంటి అంతర్గత సమస్యలను పరిష్కరించిన నేతగా కూడా గుర్తింపు పొందారు. ఇప్పుడు ఈ అంతర్గత శక్తుల నెట్వర్క్ బలంగా ఉందని తెలియడం ఒక పెద్ద సవాలు. ఇది కేవలం ఈరాన్ కు మాత్రమే కాదు మధ్యప్రాచ్యంలోని ప్రభుత్వాలన్నీ ఇప్పుడు ఈ సవాలును ఎదుర్కోక తప్పదు. మధ్యప్రాచ్యంలోని ఏ ప్రభుత్వాధినేతపై అయినా దాడి చేయించగలం అనే సందేశాన్ని దీనిద్వారా అమెరికా, ఇస్రాయీల్ ఇస్తున్నాయా అనే అనుమానాన్ని కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఆ విధంగా మధ్యప్రాచ్యంలోని ప్రభుత్వాధినేతలను భయాందోళనలకు గురి చేయడం ద్వారా తామకు విధేయంగా ఉంచాలనుకుంటున్నారా?
ఇక్కడ గమనించవలసిన మరో విషయమేమిటంటే, రష్యాలో మార్చి 22వ తేదీన ఒక ఉగ్రదాడి జరిగింది. మాస్కో శివార్లలోని క్రోకస్ మాల్ పై జరిగిన ఆ దాడికి ముందు అమెరికా తన పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు, ఈ దాడి జరుగుతున్నప్పుడు ఈ దాడికి ఉక్రెయిన్ కు సంబంధం లేదని అమెరికా ప్రకటించింది. కాని విచారణలో రష్యా ఈ దాడిలో ఉక్రెయిన్ ప్రమేయం ఉందని తేల్చింది. ఈ దాడిలో 140 మంది సాధారణ పౌరులు మరణించారు. ఇంకో విషయమేమిటంటే, ఫిబ్రవరి 22వ తేదీన అమెరికా మంత్రి విక్టోరియా నూలాండ్ రష్యాకు హెచ్చరికలు చేస్తూ, రష్యా నిర్ఘాంతపోయే సంఘటనలు జరుగుతాయని చెప్పిన నెలకే ఈ దాడి జరిగింది.
మరో ముఖ్యమైన విషయం గమనించాలి. మధ్యప్రాచ్యంలో ఈరాన్ సౌదీ దేశాల మధ్య ఎప్పటి నుంచో వైరం ఉంది. కాని చైనా చొరవతో ఈ రెండు దేశాలు ఇప్పుడు దగ్గరవుతున్నాయి. అంతేకాదు, ఈరాన్ అణుశక్తి విషయంలో సౌదీకి సహకరించడానికి సుముఖంగా ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. వీటన్నింటి వెనుక రయీసీ ఉన్నారని కూడా చాలా మంది భావిస్తున్నారు. ఈరాన్ అణుకార్యక్రమం గురించి చాలా మందికి తెలియని మరో వాస్తవమేమిటంటే, ఈరాన్ సుప్రీంలీడర్ ఖొమైనీ సూత్రప్రాయంగా అణుబాంబులకు వ్యతిరేకి అనే వార్త. అందువల్లనే ఈరాన్ అణుబాంబు తయారీ ఆలస్యమయ్యిందని, కాని రయీసీ ప్రస్తుత పరిస్థితుల్లో అణుబాంబులు అవసరమని ఖొమైనీకి నచ్చచెప్పి అణుబాంబు తయారీ దిశగా అడుగులు వేయించారని కూడా చాలా మంది చెబుతారు. ఈరాన్ నెలరోజుల్లోగా అణుబాంబు తయారు చేయగలదని వార్తలు కూడా వచ్చాయి. పైగా సౌదీతో సహా ఈ ప్రాంతంలోని దేశాలకు అణుసాంకేతిక పరిజ్ఞానం అందించడానికి ఈరాన్ సంసిద్ధత తెలియజేసింది. వీటన్నింటి వెనుక రయీసీ హస్తం ఉంది. ఈ సంఘటలన్నీ జరుగుతున్న కాలంలోనే ఈరాన్ 300 డ్రోన్లతో ఇస్రాయీల్ పై దాడి చేసి, ఇస్రాయీల్ రక్షణ కవచం ఐరన్ డోమును తుత్తునియలు చేయగలమని ప్రపంచానికి చూపించింది. నిజానికి హామాస్ కూడా ఈ పని చేసి చూపించింది. కాని ఈరాన్ దాడిలో ఇస్రాయీల్ గొప్పగా చెప్పుకునే నెవాటిమ్ ఎయిర్ బేస్ ను దెబ్బతీయడం చాలా మందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. లయన్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ గా ఏప్రిల్ 24న రయీసీ శ్రీలంక సందర్శించడం ఇక్కడ గమనించాలి.
ఇప్పుడు రయీసీ లేకపోతే ఈరాన్ కుప్పకూలుతుందని కొందరనుకుంటున్నారు. కాని ఇది వాస్తవం కాదు. నిజానికి ఖాసీం సులైమానీని ఇస్రాయీల్ హత్య చేసిన తర్వాత కూడా ఇలాగడే అనుకున్నారు. ఖాసీం సులైమానీ లేకపోయినా ఇస్రాయీల్ ఐరన్ డోములు, ఇస్రాయీల్ ఆయుధబలం ఏవీ ఈరాన్ దాడి ముందు నిలబడలేకపోయాయి.
ఇబ్రాహీం రయీసీ 1960లో మషాద్ లో జన్మించారు. 1979లో ఈరాన్ విప్లవం తర్వాతి నుంచి ఆయన రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. 1981లో ప్రాసిక్యూటర్ గా పనిచేశారు. కేవలం పాతికేళ్ళ వయసులో టెహ్రాన్ డిప్యూటీ ప్రాసిక్యూటర్ జనరల్ అయ్యారు. చాలా సందర్భాల్లో రయీసీ నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ఆరోపణలున్నాయి. 1988లో తిరుగుబాటుదారులకు మరణశిక్ష విధించిన కమిటీలో ఆయన కూడా సభ్యుడు. 1989 నుంచి 1994 వరకు టెహ్రాన్ ప్రాసిక్యూటర్ జనరల్ గా సేవలందించారు. 1994 నుంచి 2004 వరకు స్టేట్ ఇనస్పెక్టరేట్ ఆర్గనైజేషన్ అధినేతగా పనిచేశారు. 2004లో న్యాయవ్యవస్థలో ఉన్నతస్థాయి పదవికి ఎంపికయ్యారు. 2014లో అటార్ని జనరల్ గా ఎన్నికయ్యారు. 2017లో అధ్యక్షుడిగా పోటీ చేసి ఓడిపోయారు. 2021లో అద్యక్షుడిగా ఎన్నికయ్యారు. హెలీకాప్టరు ప్రమాదంలో రయీసీ మరణం పట్ల జమాఅతె ఇస్లామీ హింద్ అధ్యక్షుడు సయ్యద్ సాదతుల్లా హుస్సేనీ తీవ్ర సంతాపం ప్రకటించారు. భారతదేశ ప్రభుత్వం ఒక రోజు సంతాపదినం ప్రకటించింది.
రయీసీ మరణం వల్ల ఈరాన్ వ్యవహారాలపై పడే ప్రభావం ఏమిటన్నది పరిశీలిస్తే, నిజానికి ఈరాన్ లో సమస్త అధికారాలు సుప్రీం లీడర్ అలీ ఖొమైనీ చేతుల్లో ఉన్నాయి. అధ్యక్షుడి అధికారాలపై పరిమితులున్నాయి. అలీ ఖొమైనీకి గత అధ్యక్షులతో కొన్ని సమస్యలు ఉండేవి. కాని రయీసీ తో ఖొమైనీకి అలాంటి సమస్యలు లేవు. విదేశీ వ్యవహారాల విషయంలో అలీ ఖొమైనీ నిర్ణయాలే అంతిమ నిర్ణయాలు. అలాగే ఇస్లామిక్ రివాల్యుషనరీ గార్డ్ కార్ప్స్ దళాలే స్వయంగా అనేక నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ దళాలు అలీ ఖొమైనీ క్రిందే పనిచేస్తాయి. ఇస్రాయీల్ పై జరిగిన దాడిలో కూడా ఈ దళాల నిర్ణయాలే ముఖ్యమైనవి. కాబట్టి ఈరాన్ వ్యవహారాలపై రయీసీ హత్య వల్ల వెంటనే పడే ప్రభావం ఏదీ ఉండబోదని చాలా మంది విశ్లేషిస్తున్నారు.
రయీసీ మరణం ప్రమాదమా? హత్యా అనేది ఇంకా స్పష్టం కాలేదు. బలమైన అనుమానాలు వినిపిస్తున్నాయి. కాని ఇతర దేశాల్లో ఇస్రాయీల్, అమెరికా దేశాలు హత్యారాజకీయాలు చేయడం కొత్త కాదు. ఈరాన్ లోనే ఖాసీం సులైమానీ, ముహిసిన్ ఫకీర్ జాదేల హత్యలు ఇలాంటివే. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఈ హత్యా రాజకీయాలను కొనసాగించే అమెరికా, ఇస్రాయీల్ దేశాల వైఖరిని ఐక్యరాజ్యసమితి, ప్రపంచదేశాలు ప్రశ్నించవలసిన అవసరం ఉంది.

– వాహెద్