November 12, 2024

తెలుగు నాట భక్తిరసం
తెప్పలుగా పారుతోంది
డ్రైనేజీ స్కీములేక
డేంజరుగా మారుతోంది

గజ్జెల మల్లారెడ్డి ఎప్పుడో రాసిన కవిత ఇది. కాని ఇప్పుడు ఈ పాదాలను కాస్త మార్చుకోవడం అవసరం. భక్తిరసం పెరగడం వల్ల పెద్ద ప్రమాదమేమీ ఉండదు. కాని మతతత్వం పెరగడం వల్ల చాలా ప్రమాదం. అందువల్ల
దేశంలో మతతత్వం … అని మొదటి లైను మార్చుకోవలసి ఉంటుంది.
బాలివుడ్ గా పిలువబడే హిందీ చిత్ర పరిశ్రమ ఒకప్పుడు అద్భుతమైన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా  ప్రసిద్ధి పొందింది. కాని గత దశాబ్ధకాలంగా ఈ పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ప్రాపగాండ సినిమాలకు మారుపేరని చాలా మంది విమర్శించే స్థాయికి దిగజారింది. ఇస్లామోఫోబిక్ సినిమాలు తీస్తే కాసుల వర్షం కురుస్తుందని, మతతత్వశక్తుల ప్రాబల్యం పెరిగిన వాతావరణంలో ఈ సినిమాలు రాజకీయంగా కూడా తమకు ప్రయోజనాలిస్తాయని, ఇలాంటి సినిమాలు తీస్తే అధికారంలో ఉన్న పెద్దల ఆశిస్సులు లభిస్తాయని బహుశా నిర్మాతలు పోటీ పడి తీస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి చాలా సినిమాలు విడుదలయ్యాయి. సినిమా ముసుగులో మత విద్వేషాన్ని రేకెత్తించే కథనాలు వివాదాలకు కారణమయ్యాయి.
ఈ కోవకు చెందిన తాజా ముస్లిం విద్వేష చిత్రం  “హమారే బారా”.  ఒక ముస్లిం మహిళ తన తల్లి గర్భం ప్రమాదకరమైంది కాబట్టి గర్భస్రావం చేయించడానికి తన తండ్రిని కోర్టుకు లాగిన కేసు ఈ కథలో ఉంది.
‘హమారే బారా’ చిత్రంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు వివాదాస్పద చిత్రం విడుదలను నిలిపివేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు చిత్రనిర్మాతలు ట్రైలర్ నుండి వివాదాస్పద సంభాషణలను తొలగించారని వాదనలు ఉన్నప్పటికీ, న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వాదనను తోసిపుచ్చింది.
అంతకు ముందు  హైకోర్టులో ఈ సినిమా కేసు విచారణ జరిగింది. మొదల స్టే ఆర్డర్ ఇచ్చిన హైకోర్టు ఒక రోజు తర్వాత చిత్ర విడుదలపై ఉన్న నిషేధాన్ని హైకోర్టు ఎత్తివేసింది.
ట్రైలర్ చూస్తే, హమారే బారా ముస్లిం మహిళలు ఇంట్లో ఖైదీలుగా పడి ఉంటారన్నట్లు చూపించింది.  ముస్లిం పురుషులు లైంగిక హింసకు పాల్పడే విలన్లుగా చూపించారు.  సినిమా ట్రైలర్ చూసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అభ్యంతరకరమైన సంభాషణలు ఉన్నాయన్నారు.
ఒకప్పుడు ప్రముఖ టెలివిజన్ షో “అంత్యాక్షరి” కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన అన్ను కపూర్ ఇందులో నటించాడు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. సమాజంలో ఒక సముదాయం పట్ల  ద్వేషాన్ని పెంచే చిత్రం అని చాలా మంది విశ్లేషించారు. బాలీవుడ్ వినోదాత్మకంగా, సామాజిక చిత్రాలను, విలువలతో కూడిన చిత్రాలను రూపొందించిన రోజులు పోయాయి. ఇప్పుడు ఒక సముదాయంపై దాడి చేయడానికి మాత్రమే చాలా సినిమాలు తయారవుతున్నాయి. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ (2022) నుండి ‘ది కేరళ స్టోరీ’ (2023) వరకు విద్వేషమే ప్రధానంగా ఈ సినిమాలు తయారవుతున్నాయి. నిజానికి అన్నూకపూర్ ఇంతకు ముందునటించిన డ్రీమ్ గర్ల్ సినిమా 2019లో వచ్చింది. ఆ సినిమాలో కూడా అన్నూ కపూర్ ముసలి వయసులో రెండవ పెళ్ళి కోసం ముస్లిముగా మారడం గురించిన సీన్లు ఒక ప్రత్యేక సముదాయాన్ని లక్ష్యంగా చేసుకున్న సీన్లే. అయితే ఆ సినిమాలో హాస్యం కోసం చేసిన ప్రయోగంగా చాలా మంది ఈ థర్డ్ గ్రేడ్ హాస్యాన్ని భరించారు. కాని కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ వంటి సినిమాలు అవాస్తవాలు, వక్రీకరణలతో పూర్తి స్థాయి ఇస్లామోఫోబిక్ సినిమాలుగా వచ్చాయి. ప్రాపగాండ సినిమాకు రాజకీయ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి.  ఉత్తర కొరియా, రష్యా నాజీ కాలం నాటి జర్మనీల్లో ఈ సినిమాలు ఎలా ప్రభుత్వ ప్రోత్సాహం పొందుతాయో మనం చూశాం. ‘దేడ్ ఇష్కియా’, ‘ఏ వతన్ మేరే వతన్’ వంటి చిత్రాలకు ప్రసిద్ధి చెందిన రచయిత, నిర్మాత దరాబ్ ఫరూకీ హమారే బారా చిత్రం గురించి  ది సిటిజన్ వార్తాసంస్థతో  మాట్లాడుతూ, ఈ చిత్రం తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తుందని, కనీస పరిశోధన కూడా సబ్జక్టుపై చేయలేదన్నది స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. “అసలు వాళ్ళు ఏం తీశారో కూడా వాళ్ళకు తెలియదు, ఇస్లాం గురించి  చెప్పగల ఏ ధర్మవేత్తను సంప్రదించినా చాలా వివరాలు వారికి తెలిసి ఉండేవి. ఈ చిత్రం  కేవలం ముస్లింలను ఆటవికులుగా చిత్రించే ఆలోచనతో తీసింది మాత్రమే “అని ఫరూకీ అన్నారు. ముస్లింలను రాక్షసులుగా చిత్రీకరించే ఆలోచనతోనే ఇలాంటి ప్రాపగాండ సినిమాలు తీస్తారని చెప్పాడు.
“ఈ చిత్రం పేరు, ట్రైలర్, ముస్లిం మహిళలను చూపించిన తీరు, ఇస్లామోఫోబియా తప్ప మరొకటి కాదు. బుల్లీ బాయి యాప్, సుల్లీ డీల్స్  తర్వత ఇప్పుడు ఈ చిత్రం.. వరుసగా దేశంలో ఇస్లామోఫోబియా  నిరంతర ప్రచార వరద కొనసాగుతోందని ” ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యురాలు డాక్టర్ ఆస్మా జెహ్రా అన్నారు.
National Crime Records Bureau ప్రకారం బాలికలు, మహిళలపై నేరాలు ప్రకారం బాలికలు, మహిళలపై నేరాలు నాలుగు రెట్లు పెరిగాయి. అందులో 14 శాతం మంది బాధితులు ముస్లిం మహిళలు. మిగిలిన 86 శాతానికి పైగా మహిళలపై జరుగుతున్న నేరాలు ఘోరాలు చాలా ఉన్నాయని ఆమె చెప్పారు.
‘కాశ్మీర్ ఫైల్స్’  ‘కేరళ స్టోరీ’ సినిమాలే కాదు ఇలాంటి ఇస్లామోఫోబిక్ ప్రాపగండ సినిమాలు చాలానే  విడుదలయ్యాయి. స్వతంత్ర వీర్ సావర్కర్, జహంగీర్ నేషనల్ యూనివర్శిటీ, ఆర్టికల్ 370, మై అటల్ హూన్ వంటి ఇటీవల విడుదలైన సినిమాల్లో ఇతివృత్తాలు ముస్లిములను కించపరిచేవి, వారిని విలన్లుగా చూపించే చిత్రాలే. ‘కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ’ ఇప్పుడు ‘హమారే బారా’ ఈ మూడు చిత్రాలు మాత్రమే ప్రజలకు తెలుసు.  ‘హమారే బారా’ చిత్రం ముస్లింలు అధికసంతానం కలిగి ఉంటారని చెప్పే సినిమా. ఖుర్ఆన్ ప్రకారం తల్లి ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఎక్కువ మంది పిల్లలు కనడమే ప్రధానంగా ముస్లిములు ఆలోచిస్తారని చెప్పే సినిమా. ఎన్నికల ప్రచారంలో స్వయంగా మోడీ అధికసంతానం కలిగిన వారంటూ ముస్లిములపై చేసిన దాడిని కూడా గుర్తు చేసుకుంటే ఎవరి కోసం ఈ సినిమా తీశారో అర్థమవుతుంది.
ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రికి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ విడుదల చేసిన వర్కింగ్ పేపర్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ నివేదిక ప్రకారం, దేశ జనాభాలో భారతీయ ముస్లిం జనాభా 1950 నుండి 43 శాతానికి పైగా పెరిగిపోయింది. ఒకవైపు లోక్ సభ ఎన్నికలు జరుగుతుంటే మధ్యలో ఈ నివేదిక విడుదల చేసారు.
ఈ నివేదికలో గణాంకాలను తిమ్మి బమ్మి చేసి భ్రమాత్మకంగా చూపిస్తున్నారన్న వివరణలు, విశ్లేషణలు అప్పట్లోనే చాలా వచ్చాయి.  2022లో విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం సంతానోత్పత్తి రేటు గత రెండు దశాబ్దాలుగా అన్ని మత వర్గాలలో బాగా క్షీణించింది. పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కూడా “ముస్లింల దశాబ్ది వృద్ధి రేటు 1981-1991 లో 32.9% నుండి 2001-2011 లో 24.6% కి తగ్గిందని పేర్కొంది. ఇదే కాలంలో హిందువుల వృద్ధి రేటు 22.7 శాతం నుంచి 16.8 శాతానికి పడిపోయింది. గణాంకాల కోణం నుంచి చూస్తే హిందువుల అభివృద్ధి రేటులో తగ్గుదల 5.9 అయితే ముస్లిములలో జనాభా వృద్ధిరేటు తగ్గుదల 8.3. అంటే హిందూ జనాభా కన్నా వేగంగా ముస్లిముల జనాభా తగ్గుతోంది. ఇది వాస్తవమైతే ముస్లిం జనాభా అరవైశాతం పెరిగిపోయిందన్న ప్రచారానికి అర్థమేమిటి?
2011 జనాభా లెక్కల ప్రకారం ముస్లింల జనాభా 17.22 కోట్లు, అప్పుడు భారతదేశంలో మొత్తం 121.08 కోట్ల జనాభాలో 14.2%. కాగా మునుపటి జనాభా లెక్కల (2001) లో ముస్లింల జనాభా 13.81 కోట్లు, అంటే మొత్తం  భారతదేశ జనాభాలో 13.43%. 2001-2011 మధ్య ముస్లిం జనాభా 24.69% పెరిగింది. ఇది భారతదేశ చరిత్రలో ముస్లింల జనాభాలో అతి తక్కువ పెరుగుదల. 1991 మరియు 2001 మధ్య భారతదేశ ముస్లిం జనాభా 29.49% పెరిగింది. నేషనల్ శాంపిల్ సర్వే 68 ప్రకారం చూస్తే హిందూ కుటుంబం సైజు 4.3 అయితే ముస్లిం కుటుంబం సైజు 5. తేడా చాలా తక్కువ. సిక్కు కుటుంబం సైజు 4.7.
తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019–20 (NFHS–5) ప్రకారం అనేక రాష్ట్రాలు జనాభా స్థిరీకరణ దశలోకి వచ్చేశాయి.  ఫెర్టిలిటీ రేటు తగ్గుతోంది.  ఆర్థిక సర్వే 2018-19 అలాగే 2017 నుండి సాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (SRS) డేటా కూడా భారతదేశ జనాభా వృద్ధి రేటు తగ్గుతున్నట్లు చూపిస్తున్నాయి.
NFHS డేటా ప్రకారం, గత రెండు దశాబ్దాల్లో అన్ని మత సముదాయాలలో ఫెర్టిలిటీ రేటు తగ్గింది.  ముఖ్యంగా ముస్లింల కుటుంబం సైజు గణనీయంగా తగ్గింది.
ముస్లింల జనాభా పెరగుతుందని బడా రాజకీయ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, మతతత్వ శక్తులు చేస్తున్న ప్రచారం, ప్రాపగాండ సినిమాల హంగామా ఇవన్నీ సామాజికంగా వేసే ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇతర సముదాయాలు ముస్లిముల పట్ల చిన్నచూపు చూడడానికి, కించపరచడానికి ముఖ్యంగా ముస్లిం మహిళలకు పనిప్రదేశాల్లో, స్కూలు, కాలేజీల్లో ప్రతికూల పరిస్థితులు సృష్టించే ప్రచారం. ఇది ముస్లిం మహిళలను ఇంటికే పరిమితం చేసే కుట్రలాంటి ప్రచారం. పైగా ముస్లిం మహిళల పునరుత్పత్తి హక్కుపై ప్రత్యక్ష దాడి ఇది. ఒక సముదాయాన్ని తప్పుడు ప్రచారంతో అప్రతిష్ఠ పాలు చేయడం, ఒకసముదాయాన్ని విలన్లుగా చిత్రీకరించడం ద్వారా దేశాభివృద్ధిని దెబ్బతీస్తున్నారని ఈ మతతత్వ శక్తులు మరిచిపోతున్నాయి. వివక్ష, పక్షపాతాలు ఎల్లప్పుడు దేశాభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారతాయి. 

– వాహెద్