September 17, 2024

దేశంలోని వక్ఫ్ ఆస్తుల ఆదాయాన్ని సద్వినియోగం చేస్తే చాలు ముస్లిములకు సంక్షేమపథకాల అవసరమే ఉండదు. ప్రభుత్వమిచ్చే స్కాలర్ షిప్పులు, హజ్ సబ్సిడీల అవసరమే ఉండదు. ముస్లిముల ఆర్థిక సమస్యలన్నింటిని వక్ఫ్ ఆస్తుల ఆదాయంతో పరిష్కరించవచ్చు. కాని ప్రభుత్వాలు అలా జరగనివ్వలేదు.

సచార్ కమిటీ నివేదిక దేశంలో ముస్లిములు అత్యంత వెనుకబడి ఉన్నారని స్పష్టం చేసింది. వెనుకబడిన వర్గాల కన్నా ముస్లిములు అధికంగా వెనుకబాటుకుగురై ఉన్నారని వివరించింది. సచర్ కమిటీ చేసిన సూచనల్లో కీలకమైన ఒక సూచన ఏమిటంటే, వక్ఫ్ ఆస్తులను ముస్లిముల ప్రగతి వికాసాల కోసం ఉపయోగించి ఫలితాలు సాధించవచ్చని చెప్పడం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ముస్లిముల వక్ఫ్ ఆస్తులనే నిరాకరించే గొప్ప పనికి పూనుకుంటోంది. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే బీజేపీ నినాదం నిజరూపమేమిటో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో మోడీగారు చెప్పిన మంగళసూత్రం, బర్రెల వ్యాఖ్యలతో తేటతెల్లమయ్యింది. ఇప్పుడు దీనికి కొనసాగింపే ఈ వక్ఫ్ చట్టం సవరణ బిల్లు.

ప్రభుత్వం వక్ఫ్ చట్టం 1995ను సవరిస్తూ యునిఫైడ్‌ వక్ఫ్‌ మేనేజ్‌మెంట్‌, ఎంపవర్‌మెంట్‌, ఎఫీషియన్సీ అండ్‌ డెవలప్‌మెంట్‌ యాక్ట్‌ 2023 బిల్లును ప్రవేశపెట్టడానికి పూనుకుంటోంది. ఇందులో ప్రధానమైన విషయం వక్ఫ్ బోర్డుకు ఉన్న అధికారాలకు కోత పెట్టడం. ఒక స్థిరాస్తి వక్ఫ్ఆస్తి అవునా కాదా అన్నది నిర్ణయించే అధికారం వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40 ప్రకారం వక్ఫ్ బోర్డుకు ఉంది. ఈ సెక్షన్ ఇప్పుడు తొలగిస్తామని అంటున్నారు. అంటే ఒక ఆస్తి వక్ఫ్ ఆస్తి అవునా కాదా అన్నది నిర్ణయించే అధికారం ఇప్పుడు వక్ఫ్ బోర్డుకు ఉండదు. అంతేకాదు, కేంద్ర, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో ముస్లిములతో పాటు ముస్లిమేతరులకు కూడా ప్రాతినిథ్యం కల్పిస్తామంటున్నారు.
ఈ బిల్లు ప్రస్తుతం ఉన్న వక్ఫ్ చట్టానికి 40 సవరణలు ప్రతిపాదిస్తోంది.
వక్ఫ్ చట్టం సవరణ బిల్లు కూడా పౌరసత్వ సవరణ చట్టం వంటిదే అంటే తప్పులేదు. నిజానికి ఈ బిల్లు వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం 1947లో వక్ఫ్ ఆస్తులుగా నిర్ధారించబడిన వాటన్నింటిని మళ్ళీ చర్చకు పెట్టి వక్ఫ్ ఆస్తులపై వేటు వేయడం. వక్ఫ్ చట్టానికి సవరణ ఎందుకు అవసరమయ్యిందన్నది కాస్త లోతుగా ఆలోచించవలసిన విషయం. బాబరీ మస్జిద్ వివాదం ఇప్పుడు బీజేపీకి రాజకీయంగా ఓట్లు రాబట్టే ఆయుధంగా మిగల్లేదు. అందువల్ల వారణాసిలో మస్జిదు, మధురలో ఈద్గా, మధ్యప్రదేశ్ లో కమల్ మౌలా మస్జిదు వగైరాలపై కొత్త వివాదాలను రాజేస్తున్నారు. కాని ఈ స్థలాలు వక్ఫ్ ఆస్తులుగా ఉండడం వల్ల న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ ఇబ్బందులను పరిష్కరించడానికి ఉద్దేశించినవే ఈ సవరణలు. వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించబడినవి వక్ఫ్ ఆస్తులు కాదని చెప్పాలంటే ఇప్పుడు ఈ కొత్త చట్టం అవసరమే మరి.
వక్ఫ్ అంటే ధార్మిక సేవా కార్యాక్రమాల కోసం ఎవరైనా దానమిచ్చిన ఆస్తులు. దానమివ్వడం అంటే తన ప్రయివేటు ఆస్తిని ఒక వ్యక్తి ధార్మిక కార్యక్రమాల కోసం అంటేమస్జిదు నిర్మాణం కోసం లేదా, ముస్లిం ఖబ్రస్తాన్ కోసం లేదా ముస్లిముల ధార్మిక ఆచరణల కోసం అలాగే సేవా కార్యక్రమాల కోసం అంటే వితంతువుల పెన్షన్లు, పిల్లల చదువులు మొదలైన వాటికి ఆర్థిక సహాయం అందించడానికి దానమిచ్చిన ఆస్తులు. కాబట్టి ఇవి ప్రభుత్వ ఆస్తులు కావు, ప్రయివేటు ఆస్తులన్నది ముందుగా అర్థం చేసుకోవాలి. వక్ఫ్ ఆస్తులను అమ్మడం కాని కొనడం కాని చేయలేరు. అయితే దురాక్రమణల సమస్య సాధారణంగా స్తిరాస్తుల వ్యవహారంలో ఎలా ఉందో అలాగే వక్ఫ్ ఆస్తుల విషయంలోను దురాక్రమణల సమస్య ఉంది. ఈ సమస్యను పరిష్కరించి వక్ఫ్ ఆస్తుల నిర్వహణను పటిష్టపరిస్తే, వక్ఫ్ వల్ల వచ్చే ఆదాయమే ముస్లిముల ప్రగతి వికాసాలకు అవసరమైన చర్యలు చేపట్టడానికి సరిపోతుంది. ఇదే విషయాన్ని సచర్ కమిటి చెప్పింది. కాని ఇప్పుడు వక్ఫ్ ఆస్తులనే కబళించే ప్రయత్నలు మొదలయ్యాయి. ముస్లిములకు చెందిన ఆస్తులను కైవసం చేసుకోడానికే ఈ బిల్లు తీసుకువచ్చారని సాధారణ ముస్లిములు భావిస్తున్నారు.
దేశంలో గురుద్వారా చట్టం 1925 ఉంది. ఈ చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తులను కూడా వ్యవస్థీకరించి ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించాలని చాలా కాలంగా ముస్లిములు కోరుతున్నారు. కాని ఇప్పుడు ప్రభుత్వం మరింత నియంత్రణ తన చేతుల్లోకి తీసుకోవాలని పూనుకుంది.
దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులు అపారంగా ఉన్నాయి. ఈ ఆస్తులను సరిగా ఉపయోగిస్తే ముస్లిముల సంక్షేమానికి, ప్రగతి వికాసాలకు ఈ ఆదాయమే సరిపోతుంది. కాని గురుద్వారా ప్రబంధక్ కమిటి వంటిది ముస్లిముల విషయంలో కూడా ఏర్పాటు చేస్తే పంజాబులో గురుద్వారా ప్రబంధక్ కమిటీ తర్వాత రాజకీయంగా బలపడినట్లే ముస్లిముల ఈ సంస్థ కూడా రాజకీయంగా బలం పుంజుకుంటుందనే భయాలు కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉన్నాయి. వక్ఫ్ బోర్డును ఈ విధంగా వ్యవస్థీకరిస్తే దేశవ్యాప్తంగా ముస్లిములందరు ఒకే గుర్తింపు క్రింద సమైక్యమయ్యే అవకాశం ఉంది. అందువల్ల ముస్లిముల్లో చీలికలు తీసుకురావాలంటే బోహ్రా తదితర సముదాయాలకు ప్రత్యేక వక్ఫ్ బోర్డులనే కొత్త ప్రతిపాదన అవసరమని ప్రభుత్వం భావించింది.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వక్ఫ్ ఆస్తులు ఆయారాష్ట్రాల వక్ఫ్ బోర్డుల పేర రిజిష్టరై ఉన్నాయి. మస్జిదులు, ఖబ్రస్తాన్ లు, దర్గాలు, ఖాన్ ఖాలు, స్కూళ్ళు, అనాధశరణాలయాలు, ఈద్గాలు వగైరా ఇందులో ఉన్నాయి. దేశంలోని వక్ఫ్ ఆస్తుల ఆదాయాన్ని సద్వినియోగం చేస్తే చాలు ముస్లిములకు సంక్షేమపథకాల అవసరమే ఉండదు. ప్రభుత్వమిచ్చే స్కాలర్ షిప్పులు, హజ్ సబ్సిడీల అవసరమే ఉండదు. ముస్లిముల ఆర్థిక సమస్యలన్నింటిని వక్ఫ్ ఆస్తుల ఆదాయంతో పరిష్కరించవచ్చు. కాని ప్రభుత్వాలు అలా జరగనివ్వలేదు. మరోవైపు దురాక్రమించుకున్న శక్తులు వక్ఫ్ ఆస్తుల ఆదాయాన్ని పేద ముస్లిములకు అందనివ్వలేదు. అనేక వక్ఫ్ ఆస్తులు దురాక్రమణలకు గురయ్యాయి. అనేక ఆస్తులు కోర్టు వివాదాల్లో ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించే బదులు బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ సమస్యలను మరింత సంక్లిష్టం చేయాలనుకుంటోంది.
దేశంలోని మతస్వేచ్ఛకు ఈ బిల్లు విరుద్దమైనదిగా మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. వక్ఫ్ బోర్డు అధికారాలకు కత్తెర పెట్టి ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకోవాలనుకుంటోంది.
ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు వక్ఫ్ ఆస్తులు నిజానికి ప్రయివేటు వ్యక్తులు, లేదా గత కాలంలో రాజులు దానమిచ్చిన ఆస్తులు. ఏ పని కోసం వక్ఫ్ గా ఆస్తులను ఇవ్వడం జరిగిందో ఆ పని కోసమే వాటిని ఉపయోగించాలి. మదరసా కోసం ఇచ్చిన ఆస్తిని మదరసా కోసమే ఉపయోగించాలి. ఇవి ప్రయివేటు ఆస్తులే కాని ప్రభుత్వ ఆస్తులు కావు. మస్జిదు కోసం ఇచ్చిన వక్ఫ్ భూమిలో మస్జిదు నిర్మాణంతో పాటు, ఇళ్ళు, దుకాణాలు కట్టడం వల్ల వాటి కిరాయి నుంచి ఆదాయం లభిస్తుంది. ఈ ఆదాయం మస్జిదు నిర్వహణ ఖర్చులకు ఉపయోగిస్తారు. వితంతువులకు, అనాధపిల్లలకు సహాయమందించడానికి కూడా వక్ఫ్ ఆస్తులున్నాయి. వక్ఫ్ ఆస్తి నిర్వహణ బాధ్యతలు చూసే మేనేజరును ముతవల్లీ అంటారు. ఈ ముతవల్లీల విషయంలో విమర్శలు, ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఈ ముతవల్లీల పనితీరును పర్యవేక్షించే ఒక సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన రావడంతో 1995లో వక్ఫ్ చట్టం రూపంలో ఇది అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డులు ఏర్పడ్డాయి. వక్ఫ్ బోర్డు చేసే పని ఈ పర్యవేక్షణ చూడడం. గమనించవలసిన విషయమేమిటంటే, ఒక వ్యక్తి తన ఆస్తిని మస్జిదు నిర్మించాలని వక్ఫ్ చేశాడు. అంటే దానమిచ్చాడు. ఆ ఆస్తిలో మస్జిదు నిర్మాణం జరిగి, దాని నిర్వహణకు ఒక ముతవల్లీ ఏర్పాటవుతారు. అలాగే మరో వ్యక్తి తన ఆస్తిని అనాధపిల్లల సంరక్షణకు దానమిచ్చాడు. అక్కడ అనాధశరణాలయం కట్టి దాని నిర్వహణకు ఒక ముతవల్లీ ఏర్పాటవుతాడు. అయితే ఈ నిర్వహణ బాధ్యతల విషయంలో వక్ఫ్ బోర్డుకు ప్రత్యక్ష ప్రమేయమేమీ ఉండదు. ఎందుకంటే వక్ఫ్ బోర్డు ధార్మిక సంస్థ ఏమీ కాదు. అది చట్టబద్దంగా పర్యవేక్షణకు ఏర్పడిన సంస్థ మాత్రమే. వక్ఫ్ ఆస్తికి ముతవల్లీ మాత్రమే ధార్మికప్రాతినిథ్యం వహిస్తాడు. ఆ వక్ఫ్ ఆస్తి దురాక్రమణకు గురైనా, లేదా దురుపయోగమవుతున్నా అప్పుడు వక్ఫ్ బోర్డు ఈ విషయంలో కల్పించుకుంటుంది. ప్రత్యేక వక్ఫ్ ఆస్తి నిర్వహణ వ్యవహారాలన్నీ ముతవల్లీ, మేనేజింగ్ కమిటీల ద్వారానే జరుగుతాయి.
ఇక్కడ గమనించవలసిన మరో విషయమేమిటంటే, ఒక వ్యక్తి చాలా సంవత్సరాల క్రితం తన ఆస్తిని ప్రత్యేక లక్ష్యంతో అంటే పిల్లల చదువు కోసం వక్ఫ్ చేశాడు. కాని ఆ వక్ఫ్ ఆస్తికి ముతవల్లీగా నియమించబడిన వ్యక్తి ఆ ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించలేదు. అప్పడు పరిస్థితేమిటి? ఇలాంటి సంఘటన ఏదన్నా వక్ఫ్ బోర్డు దృష్టికి వస్తే, అవసరమైన విచారణ తర్వాత వక్ఫ్ బోర్డు ఆ ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే అధికారాలున్నాయి. అయితే వక్ఫ్ బోర్డు ఏ ఆస్తినైనా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించడం ఏకపక్షంగా కూడా జరగదు. సాక్ష్యాధారాలు చూపించవలసి ఉంటుంది. సుప్రీంకోర్టు ఫిబ్రవరి 2022 తీర్పులో కూడా ఈ విషయం స్పష్టంగా ఉంది. వక్ఫ్ బోర్డు నిర్ణయంపై కోర్టుకు వెళ్ళి అప్పీలు చేసుకోవచ్చు. వక్ఫ్ చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించడినవి సంబంధిత రాష్ట్ర వక్ఫ్ బోర్డు పేర రిజిష్టరవుతాయి. వక్ఫ్ బోర్డు పేరుతో రిజిష్టరైనంత మాత్రాన ఈ ఆస్తికి యాజమాన్య హక్కు వక్ఫ్ బోర్డుకు ఉండదు. కేవలం పర్యవేక్షణ అధికారాలు మాత్రమే ఉంటాయి. నిర్వహణ బాధ్యతలు ముతవల్లీ, మేనేజింగ్ కమిటీలకు ఉంటాయి. ఎవరికి కూడా క్రయవిక్రయాల హక్కు ఉండదు. వక్ఫ్ బోర్డు చేసే పని ఏమిటంటే వక్ఫ్ ఆస్తి ఏ పని కోసం వక్ఫ్ చేయబడిందో ఆ పనికి మాత్రమే ఉపయోగపడేలా చూడడం, దురుపయోగాలు, దుర్వినియోగాలు, దురాక్రమణలు జరగకుండా చూడడం. క్లుప్తంగా చెప్పాలంటే వక్ఫ్ ఆస్తి ప్రభుత్వ ఆస్తి కాదు, వక్ఫ్ బోర్డుకు క్రయవిక్రయాల హక్కులతో సహా యాజమాన్యహక్కులేవీ లేవు.
కాబట్టి వక్ప్ ఆస్తులు ఇచ్చింది ముస్లిములే. ఇవి వారి ఆస్తులే. వక్ఫ్ ఆస్తుల్లో రెండు రకాలున్నట్లు మనం గమనించవచ్చు. ముస్లిములు దానమిచ్చిన ఆస్తులుగా స్పష్టమైన దస్తావేజులు ఉన్న ఆస్తులు. అంటే వక్ఫ్ నామా ఉన్న ఆస్తులు. ఇవి మొదటి రకం. రెండవరకం ఏమిటంటే, స్పష్టమైన దస్తావేజులు లేకపోయినా సుదీర్ఘకాలంగా ప్రత్యేకకార్యక్రమాల కోసం ఉపయోగపడుతూ వచ్చిన ఆస్తులు. ఉదాహరణకు ఏదన్నా ప్రదేశం వందేళ్ళకు మించి ఖబ్రస్తాన్  గా ఉపయోగపడుతూ వస్తూంటే దాన్ని వక్ఫ్ ఆస్తిగానే పరిగణించడం జరుగుతుంది. అలాగే ఏదన్నా మస్జిదులో శతాబ్ధాలుగా నమాజులు జరుగుతుంటే ఆ మస్జిదు స్థలానికి సంబంధించి వక్ఫ్ పత్రాలు లేకపోయినా అది కూడా వక్ఫ్ గా పరిగణించబడుతుంది. ఈ రెండవరకానికి సంబంధించి వివాదముంది. గమనించవలసిన విషయమేమిటంటే, ప్రస్తుతమున్న వక్ఫ్ చట్టం ప్రకారం కూడా రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల సర్వే ప్రభుత్వం నియమించే సర్వేయర్ మాత్రమే చేస్తారు. ఆ ఆస్తి విషయంలో ఏవైనా అభ్యంతరాలు వస్తే వాటిని కూడా రికార్డు చేసి రాష్ట్రప్రభుత్వానికి నివేదిక పంపుతారు. ఆ నివేదికను ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకు పంపిస్తుంది. వక్ఫ్ బోర్డు తన జవాబు ఇస్తుంది. ఇలా ఈ ప్రక్రియ ముగిసి వక్ఫ్ ఆస్తిగా నిర్ధారణ జరిగిన తర్వాతనే గెజిట్  లో వస్తుంది.
వక్ప్ ఆస్తుల క్రయవిక్రయాలుజరిగే అవకాశం లేదని చెప్పుకున్నాం. కాని చాలా సందర్భాల్లో వక్ఫ్ఆస్తుల దురాక్రమణల గురించిన వార్తలు కూడా వస్తుంటాయి. విషయమేమిటంటే, ఏ స్తిరాస్తికి సంబంధించైనా తగాదాలు రావడం జరుగుతుంది. ప్రయివేటు ఆస్తులైనా, ప్రభుత్వ ఆస్తులైనా ఇలాంటి వివాదాలు వస్తుంటాయి. దురాక్రమణలు స్తిరాస్తుల విషయంలో జరగడం, వివాదాలు తలెత్తడం ఇతర స్తిరాస్తుల విషయంలో ఎలా జరుగుతుందో వక్ప్ ఆస్తుల విషయంలో కూడా అలాగే జరుగుతుంది. వక్ఫ్ ఆస్తికి ఉన్న ఒక రక్షణ ఏమిటంటే, వక్ప్ ఆస్తి క్రయవిక్రయాలు చట్టవిరుద్దం కాబట్టి వక్ప్ బోర్డు ఆ ఆస్తిపై తన హక్కును తిరిగి పొందే ప్రయత్నాలు చేయడానికి సానుకూలత ఉంది. ఏదన్నా స్తిరాస్తి ఎవరి అధీనంలో నైనా పన్నెండు సంవత్సరాలు, లేదా ముప్పయి సంవత్సరాలుగా ఉంటే సాధారణంగా ఆ ఆస్తిపై అతనికి యాజమాన్య హక్కులు లభించే అవకాశం ఉంటుంది. కాని వక్ఫ్ ఆస్తి విషయంలో ఇది వర్తించదు. ఉదాహరణకు ఏదైనా ఆస్తి ఒక వ్యక్తి అధీనంలో ఉంది. యాభై సంవత్సరాలకు పైబడి అతను ఆ ఆస్తిని అనుభవిస్తున్నాడు లేదా మరొకరికి అమ్మేశాడు. ఆ ఆస్తి వక్ఫ్ ఆస్తి అని దస్తావేజులు వక్ఫ్ బోర్డు వద్ద ఉంటే, వక్ఫ్ బోర్డు ఆ ఆస్తిని తిరిగి రాబట్టుకునే ప్రయత్నాలు చేయవచ్చు.
సుప్రీంకోర్టు న్యాయవాది వజీహ్ షఫీక్ ఈ వివాదాలకు సంబంధించి ఒక సంఘటనను అశోక్ పాండే ఇంటర్వ్యులో చెప్పారు. ఢిల్లీలో వక్ఫ్ బోర్డు చాలా కాలం క్రితం ఒక వక్ఫ్ ఆస్తిని అద్దెకు ఇచ్చింది. అద్దెకు వున్న వ్యక్తి సుదీర్ఘకాలం అందులో నివసించాడు. అతను మరణించిన తర్వాత పిల్లలకు ఆ ఆస్తి వక్ప్ ఆస్తి అని తెలియదు. అందువల్ల వాళ్ళు పంచుకున్నారు.  ఆ ఆస్తిని బిల్డరుకు అమ్మేశారు. బిల్డర్ అక్కడ ఫ్లాటులు కట్టి అమ్మేశాడు. చాలా మంది లోన్లు తీసుకుని ఆ ఫ్లాటులు కొనుక్కున్నారు. కాని, ఇలాంటి వ్యవహారం ముందుకు వస్తే వక్ఫ్ బోర్డు ఆ ఆస్తిని తిరిగి రాబట్టుకోడానికి ట్రిబ్యునల్ ను ఆశ్రయించవచ్చు. ఫ్లాటులు కొన్నవారు తమ డబ్బులు మునిగిపోయాయని, మోసపోయామని బాధపడవచ్చు. కాని ఆ ఆస్తి వక్ఫ్ ఆస్తి అనే వాస్తవాన్ని కాదనలేరు. బాధితులు వక్ఫ్ బోర్డు తమ ఆస్తులను దురాక్రమించేస్తుందని ఆరోపించవచ్చు, కాని వాస్తవం అది కాదు. ఆ ఆస్తి స్వతహాగా వక్ఫ్ ఆస్తి కాబట్టే వక్ఫ్ బోర్డు తన క్లెయిమ్ చేస్తుంది. ఇక్కడ మరో విషయమేమిటంటే, వక్ఫ్ బోర్డులకు తమ ఆస్తులను నిర్వహించుకోవడమే సరిగా చేతకావడం లేదు. అద్దెకిచ్చిన ఆస్తులను మరిచిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. అలాంటి వక్ఫ్ బోర్డులు పనిగట్టుకుని వక్ప్ ఆస్తుల పేరు చెప్పి దురాక్రమణలు చేయడం అనేది ఊహకు కూడా అందని విషయం. ఇంకో విషయమేమిటంటే, ఏదన్నా వక్ఫ్ ఆస్తిని వక్ప్ బోర్డు వక్ఫ్ ఆస్తిగా ప్రకటించినా వక్ప్ బోర్డుకు లభించే హక్కులేమిటి? ఆ ఆస్తిని అమ్మడం కుదరదు. ఆ ఆస్తి ఏ పనికి ఉద్దేశించి వక్ప్ చేయబడిందో ఆ పనికి ఉపయోగించడం తప్ప మరో పని చేయడం కూడా కుదరదు. కాబట్టి వక్ఫ్ బోర్డులు అన్యాయంగా దురాక్రమణలు చేస్తున్నాయని చెప్పే మాటల్లో బలం లేదు.
వక్ఫ్ బోర్డుల విషయంలో మహిళలకు ప్రాతినిథ్యం లేదని చెప్పడం కూడా వాస్తవం కాదు. వక్ఫ్ చట్టం ప్రకారం కనీసం ఇద్దరు మహిళలు బోర్డులో ఉండాలి. అలా ఉంటున్నారు కూడా.
గత పదేళ్ళుగా అధికారంలో ఉన్న బీజేపీప్రభుత్వానికి హఠాత్తుగా ఇప్పుడు వక్ఫ్ చట్టంలో మార్పు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు, వక్ఫ్ బోర్డును మరింత పటిష్టం చేయడానికి బీజేపీప్రభుత్వం ఇంతవరకు ఎప్పుడైనా ఆలోచించిందా? ఇలాంటి అనే ప్రశ్నలు కూడా ఈ సందర్భంగా మన ముందుకు వస్తున్నాయి.
దేశంలో ఉన్న వక్ఫ్ బోర్డులు ముస్లిం సమాజానికి సేవలందించడానికి ఏర్పడ్డాయి. దేశంలో చాలా ఆస్తులు వక్ప్ ఆస్తులుగా ఉన్నాయి. అయినా దేశంలో ముస్లిముల పరిస్థితి దళితుల కన్నా దయానీయంగా ఉందని సచర్ కమిటీ వంటి నివేదికలు చెబుతున్నాయి.
వక్ఫ్ భావన ఇస్లాం ప్రారంభకాలం నుంచి ఉంది. ప్రపంచంలోని ప్రాచీన ఇస్లామీయ విశ్వవిద్యాలయాలు కైరోలని అల్ అజ్హర్, మొరక్కోలోని అల్ ఖురాయినైన్ విశ్వవిద్యాలయం వక్ఫ్ ఆస్తులతోనే ఏర్పడ్డాయి. భారతదేశంలో ఢిల్లీ సుల్తానుల కాలం నుంచి వక్ఫ్ చేయడం కనిపిస్తుంది. 1954లో జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు వక్ప్ చట్టం వచ్చింది. 1964లో కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ ఏర్పాటయ్యింది. 1995లో ఈ చట్టానికి సవరణలు చేశారు. ఈ సవరణ ప్రకారం రాష్ట్రాల్లో వక్ప్ బోర్డులు ఏర్పడ్డాయి. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సలహాసంస్థగా ఉంటుంది. వక్ఫ్ ఆస్తుల వివాదాలు వక్ఫ్ ట్రిబ్యునల్ పరిష్కరిస్తుంది. ఇందులో ప్రభుత్వ అధికారితో పాటు ఇద్దరు సభ్యులు ఉంటారు. వాళ్ళు ముస్లిములు కావలసిన అవసరం కూడా లేదు. షియా వక్ఫ్ బోర్డులు ప్రత్యేకంగా ఉన్నాయి. కాని వక్ఫ్ బోర్డులు ఆస్తులను నిర్వహించడంలో అవకతవకలు అనేకం ముందుకు వచ్చాయి. ఆస్తులు దురాక్రమణలకు గురయ్యాయి. ఫలితం పేద ముస్లిములకు అందవలసిన సేవలు అందడం లేదు. అవినీతి పెరిగిపోయింది. వక్ఫ్ ఆస్తుల వల్ల కొందరు మాత్రమే ప్రయోజనాలు పొందుతున్నారని, సగటు ముస్లిములకు, పేద ముస్లిములకు దానివల్ల వితంతు పించన్లు, అనాధపిల్లలకు నామమాత్ర సహాయాలు తప్ప మరేమీ లభించడం లేదన్న విమర్శ కూడా ఉంది.
వక్ఫ్ బోర్డులు సక్రమంగా తమ విధులు నిర్వర్తించి ఉంటే నేడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. మరోవైపు ఈ వక్ఫ్ ఆస్తులను నిర్విర్యం చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి.

– వాహెద్