July 15, 2024

మరోసారి ఉమ్మడి పౌరస్మృతి తెరపైకి వచ్చింది. ప్రైవేటు బిల్లు రూపంలో ప్రవేశపెట్టడానికి బీజేపీ ప్రయత్నించింది. ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో యూనిఫాం సివిల్ కోడ్ విషయంలో మరోసారి చర్చ మొదలైంది.  ఈ చర్చ చాలా కాలంగా కొనసాగుతూ వస్తోంది. ఈ చర్చ చాలా పాతది. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతి నుంచి ఈ చర్చ మరింత ఉధృతంగా కొనసాగుతోంది. నిజానికి లా కమీషన్ యూనిఫాం సివిల్ కోడ్ కు విరుద్దంగా స్పష్టమైన అభిప్రాయం ప్రకటించిన తర్వాత కూడా ఈ చర్చ కొనసాగుతుందంటే ఈ చర్చ వెనుక ఉన్న రాజకీయాలను మనం అర్థం చేసుకోవచ్చు

బీజేపీ పార్టీ ఎజెండాలో ఉమ్మడి పౌరస్మృతి కీలకమైన అంశం. ఇప్పుడు ప్రైవేటు సభ్యుడి బిల్లు రూపంలో పార్లమెంటు ముందుక వచ్చింది. బీజేపీ ఎం.పీ. కిరోడీ లాల్ మీనా విపక్షాల నిరసనల మధ్య దీన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఉమ్మడి పౌరస్మృతి కోసం ఒక జాతీయ పరిశీలనా కమిటి ఏర్పాటు చేయాలని ఈ బిల్లు సూచిస్తుంది. కాంగ్రెస్, టి.ఎం.సీ, డిఎంకే, ఎండిఎంకే, ఆర్జేడీ.సమాజ్వాదీ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఎన్సిపి తదితర పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. దీనివల్ల దేశంలో బిన్నత్వంలో ఏకత్వ సూత్రం దెబ్బతింటుందని లౌకిక స్ఫూర్తికి విరుద్దమని వాదించాయి. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అనవసరం, అవాంఛనీయమని లా కమీషన్ నివేదిక స్పష్టం చేసిన విషయం కూడా ప్రతిపక్షాలు గుర్తు చేశాయి. ఉమ్మడి పౌరస్మృతి అవసరాన్ని చెబుతూ కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నలుగురు భార్యలను పెళ్లాడటం అసహజం’’ అని గడ్కరీ అన్నారు. ఓ ప్రైవేటు చానల్‌ నిర్వహించే ‘ఎజెండా ఆజ్‌తక్‌’ అనే కార్యక్రమంలో నితిన్‌ గడ్కరీ పాల్గొన్నారు. ఉమ్మడి పౌరస్మృతి ప్రస్తావన ఈ సందర్భంగా రాగా, అది ఏ మతానికి వ్యతిరేకం కాదని, దేశ క్షేమం, పేదల సంక్షేమం మాత్రమే తాము కోరుకుంటున్నామని ఆయన అన్నారు.

బీజేపీ పాలనలోని ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లు యూనిఫాం సివిల్ కోడ్ గురించి ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నాయ్. బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీలలో అయోధ్య రామమందిరం, కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి తొలగించడం, యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావడం ముఖ్యమైనవి. బీజేపీ చెప్పినట్లుగానే అయోధ్యలో రామమందిర నిర్మాణం మొదలైంది. కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని తొలగించారు. ఇక ఇప్పుడు బీజేపీ యూనిఫాం సివిల్ కోడ్ మీద దృష్టి పెట్టింది. యూనిఫాం సివిల్ కోడ్‌ను తీసుకురావాలనే డిమాండ్ దేశానికి స్వాత్రంత్ర్యం వచ్చిన నాటి నుంచే ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-44 కూడా ఇదే చెబుతోంది. దేశ పౌరులకు యూనిఫాం సివిల్ కోడ్ తీసుకొచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశిక సూత్రాల రూపంలో రాజ్యాంగం సూచిస్తోంది. కానీ చాలా కాలంగా దేశంలో ముస్లిములే కాదు చాలా మంది హిందువులు కూడా  యూనిఫాం సివిల్ కోడ్‌ను వ్యతిరేకిస్తూ వచ్చారు.

ఆదేశిక సూత్రాలను పరిశీలిస్తే, అధికరణ 45 ప్రకారం ఆరేళ్ళ లోపు పిల్లలకు పౌష్ఠికాహారం అందించాలి. ప్రాధాన్యత దృష్ట్యా ఇది చాలా ముఖ్యమైన అధికరణగా భావించాలి. ఎందుకంటే, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రిసర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రచురించిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో 121 దేశాల్లో 107వ స్థానంలో ఉందని వార్త. కాబట్టి ఆదేశికసూత్రాల్లో పిల్లలకు పౌష్ఠికాహారం అందించడమన్నది అత్యంత ప్రాముఖ్యం ఉన్న అంశంగా తీసుకుని దానిపై చర్చ జరగాలి. కాని దానిపై చర్చ జరగడం లేదు. ఉమ్మడి పౌరస్మృతి గురించి వాదించే వారు ఒకే దేశం ఒకే చట్టం అనే నినాదం వినిపిస్తుంటారు. కాని ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, పంజాబ్, ఒడిశా, పుదుచ్చేరి, మధ్యప్రదేశ్, కర్నాటక, జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గోవధ నిషేధ చట్టాలున్నాయి. కానీ డామన్ డయ్యు, గోవాల్లో ఉన్నాయా? దేశవ్యాప్తంగా గోవధ నిషేధ చట్టం ఒకేలా ఎందుకు అమలు కావడం లేదు? అధికరణ 244 ప్రకారం ఈశాన్య రాష్ట్రాల గిరిజన తెగల ప్రజలకు ప్రత్యేక ప్రొవిజన్లున్నాయి. అక్కడ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిళ్ళున్నాయి. అయితే అరుణాచల ప్రదేశ్, నాగాల్యాండ్, మిజోరంలో కొన్ని భాగాల్లో ఇవి చెల్లవు. అలాగే షెడ్యూల్డ్ ఏరియాలలో గిరిజన తెగలకు ప్రత్యేక ప్రొవిజన్లున్నాయి.

నాగాల్యాండ్ నుంచి 2016లో ఒక వార్త వచ్చింది. ఈస్టర్న్ మిర్రర్ పత్రికలో ఆ వార్త వచ్చింది. నాగా బార్ అసోసియేషన్ యూనిఫాం సివిల్ కోడ్ కు వ్యతిరేకంగా జారీ చేసిన ప్రకటన అది. యూనిఫాం సివిల్ కోడ్ కోసం నరేంద్రమోడీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు దేశంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని దెబ్బతీస్తాయని, నాగా ప్రజల సంస్కృతికి అది విఘాతమని ఆ ప్రకటన సారాంశం. నాగాలాండ్, మేఘాలయ, మిజోరం ప్రజల స్థానిక కట్టుబాట్లకు రాజ్యాంగపరమైన  రక్షణ ఉంది. ఉదాహరణకు ఆస్తులు, వారసత్వం విషయంలోను అక్కడి సంప్రదాయాలు వేరు. భారత్‌లో పౌర స్మృతులు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. అందువల్ల 1970ల నుంచి రాష్ట్రాలు తమకంటూ సొంత పౌర స్మృతులను రూపొందించుకుంటూ వస్తున్నాయి. హిందువుల్లో కొడుకులతో సమానంగా కూతుళ్లు కూడా వారసత్వ ఆస్తిలో వాటాను పొందేలా 2005లో చట్టాలను సవరించారు. కానీ దీనికంటే ముందే సుమారు అయిదు రాష్ట్రాలు అమ్మాయిలకు వారసత్వ ఆస్తిలో వాటా హక్కును కల్పిస్తూ చట్టాలు చేశాయి. వీటిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి.

బహుభార్యత్వానికి సంబంధించి ముస్లిముల పర్సనల్ లా వారికి అనుమతిస్తుంది కాబట్టి ముస్లిములు ఒకటి కన్నా ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారన్న అపోహ ఎప్పటి నుంచో ఉంది. నితిన్ గడ్కరి చేసిన వ్యాఖ్య గమనించాలి. నలుగురిని వివాహమాడడం అనాగరికమని ఆయన అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చాలా మంది యూనిఫాం సివిల్ కోడ్ చర్చ వచ్చినప్పుడు చేస్తుంటారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. 1961లో మతపరంగా బహుభార్యత్వంపై జనాభా లెక్కల్లో వివరాలున్నాయి. ఆ వివరాల ప్రకారం ముస్లిముల్లో బహుభార్వత్వం తక్కువ. ముస్లిముల్లో 5.7శాతం ఉంటే, హిందువుల్లో 5.8శాతం ఉంది. బహుభార్యత్వం హిందువుల్లో చట్టపరంగా నిషిద్ధం. 1950లోనే ఈ చట్టం వచ్చింది. గిరిజనుల్లో చాలా ఎక్కువ 15.25శాతం ఉంది. 2016లో కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి మాట్లాడుతూ బహుభార్వత్వం ముస్లిముల కన్నా హిందువుల్లోనే ఎక్కువగా ఉందని అన్నారు. 1974లో ఒక సర్వే జరిగింది. ఆ సర్వే ప్రకారం ముస్లిముల్లో బహుభార్వత్వం 5.6శాతం. హిందువుల్లో 5.8శాతం. 2006లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే జరిగింది. దేశంలో 2 శాతం భార్యలు తమ భర్తలకు మరో భార్య ఉందని చెప్పారు. బహువివాహాలనేది ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువ. 1950లో హిందూ మ్యారేజ్ యాక్ట్ ద్వారా సాధించిందేమిటి? బహుభార్యత్వాన్ని నిషేధించడం వల్ల బహుభార్యత్వం అంతం కాలేదు. కాని రెండవభార్యగా వచ్చిన మహిళకు సామాజిక, ఆర్ధిక భద్రత లేని పరిస్థితి ఏర్పడింది. పైగా మైత్రి కరార్ వంటివి వచ్చాయి. హిందూ పురుషుడు రెండవ వివాహం చేసుకునే అవకాశం లేనందువల్ల చట్టం నుంచి తప్పించుకోడానికి మైత్రికరార్ పేరుతో మరో మహిళతో స్నేహఒప్పందం చేసుకునేవాడు. ఇది మరోవిధమైన బహుభార్యత్వం. ఆ తర్వాత దాని పేరు ’’సర్వీస్ అగ్రిమెంట్‘‘గా మారింది. దానికి ఎలాంటి చట్టబద్దమైన హోదా లేదు.

ఉత్తరాఖండ్ ఎన్నికల్లో యూనిఫాం సివిల్ కోడ్ ను బీజేపీ ఎన్నికల సమస్యగా ప్రస్తావించింది. ఎన్నికల్లో ప్రయోజనాల కోసం యూనిఫాం సివిల్ కోడ్ ప్రస్తావన అప్పుడప్పుడు తీసుకురావడం జరుగుతూనే ఉంది. కామన్ సివిల్ కోడ్ విషయంలో కేవలం ముస్లిములు మాత్రమే అభ్యంతరాలు చెబుతున్నారా? మిగిలిన వారెవ్వరూ దీనికి అభ్యంతరాలు చెప్పడం లేదా? గోవాలో పోర్చుగ్రీసు వారి కామన్ కోడ్ అమలులో ఉంది. దీని ప్రకారం వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయడం తప్పేనిసరి. పెళ్ళి కాగానే భార్యకు భర్త సగం ఆస్తిలో హక్కు లభిస్తుంది. దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేస్తే ఒప్పుకుంటారా? అవిభక్త హిందూ కుటుంబం ప్రకారం పన్నుల మినహాయింపు పొందుతున్న వారిలో చాలా వ్యాపార కుటుంబాలున్నాయి. చాలా కుటుంబాలు బీజేపీకి మద్దతిచ్చే కుటుంబాలు. వీరంతా కామన్ సివిల్ కోడ్ కోసం ఒప్పుకుంటారా? ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజన తెగలు తమ తెగల చట్టాలనే పాటిస్తున్నాయి. వారంతా కామన్ సివిల్ కోడ్ కు సిద్ధంగా ఉన్నారా? కేరళ, కర్నాటక తదితర రాష్ట్రాల్లో వివిధ కట్టుబాట్లు సంప్రదాయాలున్నాయి. వాటన్నింటి విషయమేమిటి?

నిజం చెప్పాలంటే యూనిఫాం సివిల్ కోడ్ కు సంబంధించిన డ్రాఫ్ట్ డాక్యుమెంటు ఏదీ లేదు. లా కమీషన్ యూనిఫాం సివిల్ కోడ్ విషయమై 16 ప్రశ్నలతో ఒక ప్రశ్నావళి జారీ చేసింది. ప్రజాభిప్రాయ సేకరణకు ఉద్దేశించిన ప్రశ్నావళి ఇది. దీని గురించి తర్వాత మాట్లాడదాం. ముందు యూనిఫాం సివిల్ కోడ్ విషయం చూద్దాం. రాజ్యాంగ నిర్మాతలు uniform అన్న పదాన్ని వాడారే కాని common అన్న పదం వాడలేదు. కామన్ అన్న పదం వాడి ఉంటే దేశవ్యాప్తంగా ఒకే చట్టం రావాలి. కాని యూనిఫాం అనే పదంలో ఒకే చట్టం అన్న భావన లేదు, ఒకేమాదిరి చట్టాలన్న భావం ఉంది. బహుళ మతాలు ఉండడం వల్ల మనదేశంలో వివిధ చట్టాలున్నాయనుకోవడం సరికాదు. చట్టాలు రాష్టానికి, రాష్ట్రానికి మారుతాయి. స్త్రీ పురుషులకు కూడా చట్టాన్ని వర్తించడంలో తేడాలున్నాయి. కాబట్టి రాజ్యాంగ నిర్మాతలు దేశవ్యాప్తంగా ఒకే చట్టం ఉండాలని భావించారనో లేక ఒకేదేశం, ఒకే చట్టం అనే భావంతో ఈ అధికరణ పెట్టారనో అనుకోలేము. ఒకేమాదిరి చట్టాలన్న భావనే అందులో ఉంది. ఇలా అభిప్రాయపడడానికి మరో కారణమేమంటే, పర్సనల్ లాకు సంబంధించి అవసరమైన శాసనాలు చేసే అధికారం పార్లమెంటుతో పాటు అసెంబ్లీలకు కూడా ఉంది.

దేశంలోని హిందువులందరికీ ఒకే చట్టం వర్తిస్తుందా? ఉత్తరాదిలో కొన్ని బంధుత్వాలు వివాహసంబంధాలకు నిషిద్ధం. కాని దక్షిణాదిన అలాంటి నిషేధాలు లేవు. నాగాలాండ్, మేఘాలయ, మిజోరం ప్రజల స్థానిక కట్టుబాట్లకు రాజ్యాంగపరమైన  రక్షణ ఉంది. ఉదాహరణకు ఆస్తులు, వారసత్వం విషయంలోను అక్కడి సంప్రదాయాలు వేరు.

ఇలాంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్ తీసుకువస్తామన్న వాదనను పరిశీలించవలసి ఉంది. రాజ్యాంగ నిర్మాతలు యూనిఫాం అన్న పదం వాడడంలోనే వేర్వేరు చట్టాలు ఒకేమాదిరిగా జెండర్ జస్టిస్ సాధించే చట్టాలన్న భావం నిక్షిప్తమై ఉంది. అంతేకాని ఒకే చట్టం దేశవ్యాప్తంగా అనే భావం లేదు.

ఇంతవరకు ఉమ్మడి పౌర స్మృతి మీద కోర్టులు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. గత 40 ఏళ్లలో భిన్న తీర్పుల్లో భాగంగా ‘దేశ సమైక్యత’కోసం ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలంటూ సుప్రీం కోర్టు ప్రభుత్వాలకు సూచిస్తూ వచ్చింది. అలాగే యూనిఫాం సివిల్ కోడ్ ఇప్పుడే అవసరం లేదంటూ 2018 లా కమిషన్ తన నివేదికలో పేర్కొంది. తీవ్రమైన పరిణామాలకు దారి తీసే యూనిఫాం సివిల్ కోడ్‌ను తీసుకురావడం కంటే లింగ అసమానతలను తొలగించడానికి పౌర స్మృతులకు సవరణలు చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. తమ రాజకీయ ఎజెండాను కొనసాగించడంలో భాగంగానే ఉమ్మడి పౌర స్మృతి గురించి బీజేపీ మాట్లాడుతోందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో చాలా కాలంగా బీజేపీ అధికారంలో ఉంది. కానీ ఇంత వరకు అక్కడ యూనిఫాం సివిల్ కోడ్‌ను తీసుకురాలేదు. సాధారణ ఎన్నికలు రానున్న తరుణంలో యూనిఫాం సివిల్ కోడ్‌ గురించి చర్చలు తెరపైకి వస్తున్నాయి.

కామన్ సివిల్ కోడ్ కన్నా మనకు జెండర్ జస్టిస్ ముఖ్యం. ఉన్నతస్థానాల్లో కూర్చున్న వారు చట్టాలు చేసి క్రింది వారిపై రుద్దడం వల్ల జెండర్ జస్టిస్ సాధ్యం కాదు. సముదాయంలోనే సంస్కరణల ప్రక్రియ జరిగేలా చైతన్యాన్ని, అవగాహనను పెంచడం ద్వారా మాత్రమే మహిళా న్యాయాన్ని సాధించగలం. ఈ ప్రక్రియ క్రమేణా చట్టంగా రూపుదిద్దుకుంటుంది. స్వయంగా ముస్లిమ్ సమాజంలో ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. నికాహ్ నామా నమూనాలు విడుదల చేయడం, త్రిపుల్ తలాక్ పై ముస్లిమ్ విమెన్ పర్సనల్ లా బోర్డు ప్రయత్నాలు, భారతీయ ముస్లిమ్ మహిళా ఆందోళన్ లేవనెత్తిన సమస్యలు సముదాయంలో జరుగుతున్న ఈ ప్రయత్నాలకు నిదర్శనాలు. మహిళాన్యాయం సాధించేదిశగా ఈ ప్రయత్నాలు నెమ్మదిగా చట్టాలుగా రూపుదిద్దుకోవడం కూడా కాలక్రమంగా జరుగుతుంది. కాని రాజకీయ కారణాలతో కామన్ సివిల్ కోడ్ అని హంగామా చేస్తున్నవారు నిజానికి మహిళా న్యాయం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. మతతత్వ రాజకీయాలు నడుపుతున్నారు.

పర్సనల్ లా ఇష్టం లేని వారు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వివాహాలు చేసుకునే అవకాశం ఎలాగూ ఉంది. కామన్ సివిల్ కోడ్ ముఖ్యమా? మహిళలకు న్యాయం ముఖ్యమా అన్నది అసలు ప్రశ్న. దేశంలోని గిరిజన తెగలు, ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రత్యేక నియమనిబంధనలు, స్వయంగా అవిభక్త హిందూ కుటుంబం వంటి చట్టాలు ఇంకా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు యూనిఫాం సివిల్ కోడ్ తో ముడిపడి ఉన్నాయి. కాని ఎన్నికల రాజకీయాలకు కామన్ సివిల్ కోడ్ ఉపయోగపడుతూనే వస్తోంది.