November 21, 2024

దేశంలో మతోన్మాదం, మూకహత్యలు, మతకలహాలు, గోరక్షక దళాల దాడుల వంటి సంఘటనలు సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. హిజాబ్, హలాల్, అజాన్ తదితర విషయాలపై కొత్త కొత్త వివాదాలను సృష్టించి ముస్లిం సమాజాన్ని నిరంతరం వేధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయాల గురించి కాంగ్రెస్ నేత శశిథరూర్ ఇటీవల ఇండియాటుడేలో రాసిన ఒక వ్యాసం ఆలోచనాత్మకంగా ఉంది. ఆయన మూడు సంఘటనలను ప్రస్తావించాడు.

పదిహేను సంవత్సరాలుగా భారతదేశానికి తరచు వచ్చే ఒక లెబనాన్ మహిళ ఇంతకు ముందు తాను ఇండియా వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానించేవారని, తన పేరు ’’నూర్‘‘ చెబితే అందమైన పేరని చెప్పేవారని, కాని ఇప్పుడు పేరు చెప్పగానే ’’ఓహో .. ముస్లిమా‘‘ అన్న ప్రతిస్పందన వింటున్నానని .. ఇక తాను బహుశా ఇండియా రాకపోవచ్చని చెప్పిన సంఘటన మొదటిది.

ఒక మాజీ భారత దౌత్యవేత్త, గతంలో పాకిస్తాన్ పై, ఇస్లామిక్ టెర్రరిజం (శశిథరూర్ రాసిన పదం)పై తీవ్ర దాడులు చేసిన దౌత్యవేత్త తనతో మాట్లాడుతూ తన మిత్రుని గురించి చెప్పిన విషయం మూడవది. ఆ మిత్రుడు కాబూల్ లో ప్రముఖ వైద్యుడు. ఆ వైద్యుడు అఫ్గనిస్తాన్ లో పెరుగుతున్న తాలిబాన్ ప్రాబల్యం గురించి ఆందోళన చెంది, తన భార్యాపిల్లలను ఇండియాకు పంపాడు. పాకిస్తాన్ కు పంపలేదు. ఇండియాకు పంపాడు. ఇక్కడ మంచి స్కూలులో పిల్లలను చేర్పించాడు. కాని ఏడాదిలోనే అతనికి విషయం అర్థమయ్యింది. ఇప్పుడు పాత ఇండియా లేదని తెలిసిపోయింది. అతని పిల్లలతో ఆడుకోడానికి అపార్టుమెంట్ లోని మిగిలిన పిల్లలు రావడం లేదు. మా అమ్మానాన్న ముస్లిం పిల్లలతో ఆడుకోవద్దన్నారని ముఖం మీదే చెప్పారట. ఈ విషయం ఆ మిత్రుడు చెప్పగానే ఈ మాజీ భారత దౌత్యవేత్త నిర్ఘాంతపోయాడు. మీ భార్యాపిల్లలను వెంటనే దుబాయ్ లేదా లండనుకు పంపించండి, వాళ్ళను ఇండియా తీసుకురమ్మని చెప్పినందుకు సిగ్గుపడుతున్నాను అని సలహా ఇచ్చాడట.

మూడవ సంఘటన, ఐక్యరాజ్యసమితిలో ఒక భారత శాంతి చర్చల నిపుణుడు పాల్గొన్నప్పుడు చర్చలకు వచ్చిన టెర్రరిస్టు భారతదేశానికి చెందిన వ్యక్తి అని తెలియగానే తీవ్రంగా ప్రతిస్పందించిన విషయం. ఇండియాలో ముస్లిములపై ఏం జరుగుతుందంటూ నిలదీసిన విషయం.

ఇలాంటి చెదురుమదురు సంఘటనలు కొన్నింటి ఆధారంగా భారతదేశంలో పరిస్థితిని మదింపు చేయడం ఉచితం కాదు కాని, ఈ సంఘటనలు కేవలం కొన్ని వారాల సమయంలో జరిగిన సంఘటనలని, సమాజంలో మతపరమైన విద్వేషం ఎంతగా వేళ్ళూనుకుందో చూపించే సంఘటనలని శశిథరూర్ రాశారు. అల్పమైన ఎన్నికల ప్రయోజనాల కోసం మతవిద్వేషాన్ని రెచ్చగొట్టడం వల్ల ఎన్నికల ప్రయోజనాలు సాధించుకోవచ్చు కాని దేశప్రతిష్ఠ, దేశప్రయోజనాలకు తీవ్రమైన విఘాతం కలుగుతుందని హెచ్చరించారు.

దేశంలో ఇప్పుడు వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో చాటుమాటుగా చెప్పే విషయాలు కూడా ఇప్పుడు బాహాటంగా బహిరంగ సభల్లో గొప్పగా చెబుతున్నారు. వీడియో తీసి వైరల్ చేస్తున్నారు. మతోన్మాదం, మతవిద్వేష వ్యాఖ్యలు మామూలై పోయాయి. గతంలో ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వెంటనే ఖండనలు వచ్చేవి. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలను ఖండించవలసిన అవసరం కూడా లేదనుకుంటున్నారు. హింసాకాండ జరిగితే, కారకులు మెజారిటీ వర్గీయులైతే ఎలాంటి చర్యలు ఉండవనే వాతావరణం కనిపిస్తోంది.

గతంలో అమర్ అక్బర్ అంథోనీ వంటి సినిమాలకు టాక్సులు రద్దు చేసేవారు. ఇప్పుడు థియేటర్లలో మతహింసా రెచ్చగొట్టే నినాదాలకు కారణమవుతున్న కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ వంటి సినిమాలకు టాక్సులు రద్దు చేస్తున్నారు. మతవిభజన, మతవిద్వేషం రాజ్యం చేస్తున్నాయి. ఒకప్పుడు మతసహనం, మతసామరస్యాల భావాలు బలంగా ఉండేవి. ఇప్పుడు అవి కనిపించడం లేదు. ఈ పరిస్థితి దేశానికి మంచిదా? ప్రజలంతా ఆలోచించవలసిన అవసరం ఉంది.

Leave a Reply