కాంగ్రెస్ కర్నాటకలో ఘనవిజయం సాధించింది. దేశంలోని లౌకికవాద శక్తులు సంతోషించాయి. మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా కర్నాటక ప్రజలు గొప్ప తీర్పు చెప్పారని చాలా మంది భావించారు. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ దేశంలో ప్రేమాభిమానాల దుకాణాలు తెరుస్తానని అన్నారు. జనం సంతోషించారు. విద్వేష వాతావరణం ఇక సమసిపోతుందనుకున్నారు. నిజంగా ఇదంతా జరుగుతుందా?
ఇటీవల కాంగ్రెసు నాయకుడు అజీజ్ ఖురైషీ కాంగ్రెసుపై చేసిన వ్యాఖ్యలు గమనించదగినవి. విదిశాలో కాంగ్రెసు ముస్లిం నేతలతో మాట్లాడుతూ కాంగ్రెసు సీనియర్ నాయకుడు అజీజ్ ఖురైషీ చేసిన వ్యాఖ్యలు మధ్యప్రదేశ్ లో బీజేపీకి కాంగ్రెసుపై దాడి చేసే అవకాశాలిచ్చాయన్నది నిజమే. కాని అజీజ్ ఖురైషీ వ్యాఖ్యల్లో నిజం లేదా? 82 సంవత్సరాల అజీజ్ ఖురైషీ ఉత్తరప్రదేశ్ గవర్నరుగా పనిచేశారు. మధ్యప్రదేశ్ మంత్రిగా సేవలందించారు. లోక్ సభలో సీనియర్ సభ్యుడు. ఆయన చేసిన వ్యాఖ్యలు కొట్టిపారేయదగినవి కావు. కాంగ్రెసు వైఖరిని నిరసిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసు సాఫ్ట్ హిందుత్వ కార్డు ఉపయోగిస్తుందని విమర్శించారు. ముస్లిములు మీకు బానిసలు కాదంటూ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెసుతో సహా అన్ని పార్టీలు ఈ విషయం అర్థం చేసుకోవాలని, ముస్లిములు ఎవరికీ బానిసలు కాదని, అసలు ముస్లిములు మీకెందుకు ఓటేయాలని అడిగాడాయన. పోలీసు, డిఫెన్సు, బ్యాంకు మొదలైన చోట్ల ముస్లిములకు ఉద్యోగాలు దొరకడం లేదని, బ్యాంకు రుణాలు వారికి దొరకవని, అలాంటప్పుడు ఎందుకు ఓటేయాలంటూ ఆయన మండిపడ్డారు. ముస్లిముల దుకాణాలు, వారి ఇండ్లు, ఆరాధనాలయాలు దాడులకు గురవుతున్నాయి, దహనమవుతున్నాయి, పిల్లలు అనాధలవుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెసులోను కొందరు నేతలు మతపరమైన రాజకీయాలు నడుపుతున్నారని, గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారని చెప్పారు. జై గంగామాతాకి, జై నర్మదా మాతాకి నినాదాలిచ్చుకుంటూ తిరగడం ద్వారా ఓట్లవాన కురుస్తుందని ఆశిస్తున్నారని చెప్పారు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఈ వ్యాఖ్యలు చేసిన అజీజ్ ఖురైషీ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ప్రకటించారు. కావాలంటే తనను కాంగ్రెసు పార్టీనుంచి బహిష్కరించవచ్చని సవాలు విసిరాడు. ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆశయాలు, విలువలను కాంగ్రెసు పార్టీ ఇప్పుడు తుంగల్లో తొక్కిందని అన్నారు.
ఈ వ్యాఖ్యల వీడియోను ఇప్పుడు బీజేపీ వాడుకుంటోంది. కాంగ్రెసు నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో చూడండంటూ మధ్యప్రదేశ్ లో రాజకీయప్రయోజనాలు పొందడానికి ప్రయత్నిస్తోంది. దీనివల్ల కాంగ్రెసుకు నష్టం కలుగుతుందా? లేదా?? అన్నది తర్వాతి ప్రశ్న. అజీజ్ ఖురైషీ లేవనెత్తని ప్రశ్నల్లో వాస్తవం ఉందా లేదా అన్నది అసలు ప్రశ్న.
మధ్యప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెసు నాయకుడు కమల్ నాథ్ ఇప్పుడు హిందూత్వ రాజకీయాలు కొద్దిగా నడిపితేనే విజయం లభిస్తుందనుకుంటున్నాడు. మధ్యప్రదేశ్ లోని మరో ముఖ్యమైన నాయకుడు, సెక్యులర్ వాదిగా పేరుపడిన దిగ్విజయ సింగ్ హిందూత్వ సంస్థ భజరంగ్ దళ్ గురించ మాట్లాడుతూ అందులో కూడా కొందరు మంచివాళ్ళు ఉండవచ్చుకాబట్టి తాము అధికారంలోకి వస్తే నిషేధించడం జరగదని అన్నారు. కాని భజరంగ్ దళ్ లో అల్లర్లకు పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని చెప్పారు.
మధ్యప్రదేశ్ కాంగ్రెసు పార్టీ ఇప్పుడు లౌకికవాదానికి కట్టుబడి ఉందా? లేక సాఫ్ట్ హిందూత్వ రాజకీయాలు నడుపుతుందా? కమల్ నాథ్ సాఫ్ట్ హిందూత్వకు జై కొడుతున్నాడు. దిగ్విజయ సింగ్ కొంతలో కొంత మెరుగు. లౌకికవాదానికి కట్టుబడి ఉండాలంటున్నాడు. కర్నాటకలో పత్రికలతో మాట్లాడుతూ దిగ్విజయ సింగ్ స్పష్టంగా లౌకికవాదానికి కట్టుబడి ఉన్నానని ప్రకటించాడు. హిందూరాష్ట్ర గురించి ఎవరైనా మాట్లాడుతుంటే అలాంటి వాళ్ళు రాజ్యాంగ పదవుల నుంచి తప్పుకోవాలని చెప్పాడు. హిందూరాష్ట్ర గురించి కమల్ నాథ్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. దేశంలో 82శాతం జనాభా హిందువులే కాబట్టి దేశం హిందూరాష్ట్ర అని ఆయన అన్నాడు. కాంగ్రెసు పార్టీలోని వైరుధ్యాలు మధ్యప్రదేశ్ నేతలను గమనిస్తే స్పష్టంగా తెలుస్తున్నాయి.
భాగేశ్వర్ బాబా గురించి చాలా మంది చదివే ఉంటారు. భాగేశ్వర్ బాబా భారతదేశం హిందూరాష్ట్ర కావాలని బాహాటంగా ప్రకటించాడు. ముస్లిములకు వ్యతిరేకంగా బాబా భాగేశ్వర్ వ్యాఖ్యలు అందరికీ తెలిసినవే. గతంలో అంటరానితనం పాటిస్తున్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. మరో సందర్భంలో బుల్డోజర్ బాబాగా పేరు పొందాడు. హిందువులంతా ఒక్కటై తమపై రాళ్ళు విసురుతున్న వారి ఇండ్లపై బుల్డోజర్లు నడపాలని అన్నాడు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుల్డోజర్ రాజకీయాలు ఎప్పటి నుంచో నడుపుతూనే ఉంది. బాబా భాగేశ్వర్ వ్యాఖ్య నిజానికి ముస్లిములకు విరుద్దంగా చేసిన వ్యాఖ్య అన్నది చాలా మంది స్పష్టంగా వివరించారు. బాబా భాగేశ్వర్ కు కాంగ్రెసు నాయకుడు కమల్ నాథ్ ఇప్పుడు ముఖ్య భక్తుడైపోయాడు. బాబా భాగేశ్వర్ కు మధ్యప్రదేశ్ లో భక్తులు కూడా చాలా మంది ఉన్నారు, కాబట్టి రాజకీయంగా ఆయనతో సాన్నిహిత్యం వల్ల ప్రయోజనాలున్నాయని కమల్ నాథ్ వంటి కాంగ్రెసు నేతలు భావిస్తున్నారు.
ఇదే పరిస్థితి మనకు రాజస్థాన్ లో కూడా కనిపిస్తోంది. అక్కడ కాంగ్రెసు ముఖ్యమంత్రి గెహ్లాట్ గుళ్ళు గోపురాలు తిరగడంలో బిజిగా గడుపుతున్నారు. మధ్యప్రదేశ్ లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నర్మదా పూజ హారతులతో ప్రారంభించారు. రాజస్థాన్ లో మూకదాడుల నేరానికి పాల్పడిన హంతకుడు మోను మానేసర్ వీడియో ప్రసంగాలు జారీ చేస్తున్నాడు, కాని రాజస్థాన్ పోలీసులకు అతను దొరకడం లేదట. సాఫ్ట్ హిందూత్వ రాజకీయాలు ఉత్తరాదిన నడపడం చాలా అవసరమని కాంగ్రెసు భావిస్తుందా?
మణిపూర్ హింసాకాండపై కాంగ్రెసుపార్టీ తీవ్రమైన స్వరంతో ప్రభుత్వాన్ని నిలదీసింది. కాని ఢిల్లీ అల్లర్లు ఇంతకు ముందు జరిగినప్పుడు కాంగ్రెసు ఇలాగే ప్రతిస్పందించిందా? నూహ్, గురుగ్రామ్ లు ఇప్పుడు హింసాకాండతో అట్టుడికినప్పుడు కాంగ్రెసు ఏం చేసింది? నూహ్, గురుగ్రామ్ లలో హింసాకాండ తర్వాత ప్రభుత్వం అక్కడ ముస్లిముల ఇండ్లు, దుకాణాలను బుల్డోజర్లతో కూల్చడం ప్రారంభించింది. పంజాబ్ హర్యానా హైకోర్టు దీనిపై తీవ్రంగా వ్యాఖ్యానించింది. కోర్టు ethnic cleansing వంటి తీవ్రమైన పదాన్ని ప్రయోగించింది. ప్రభుత్వం జాతి హననానికి పాల్పడుతుందా అని ప్రశ్నించింది. ఇవి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు. హర్యానాలో ప్రభుత్వం ముస్లిములను లక్ష్యంగా చేసుకుని దౌర్జన్యాలకు పాల్పడుతుందన్నది స్పష్టంగా కనబడుతున్నప్పటికీ హర్యానా కాంగ్రెసు ఈ విషయమై నోరు విప్పిందా? మణిపూర్ గురించి ప్రధాని నోరు విప్పడం లేదని హంగామా చేసిన కాంగ్రెసు, నూహ్, గురుగ్రామ్ లలో జరుగుతున్న దౌర్జన్యాలపై ఎందుకు మాట్లాడడం లేదు. సాఫ్ట్ హిందూత్వ రాజకీయాలు కాదా?
మధ్యప్రదేశ్ లో 2003 తర్వాతి నుంచి బీజేపీ అధికారంలో ఉంది. మధ్యలో 15 నెలలు కాంగ్రెసు ప్రభుత్వం వచ్చినా బీజేపీ ఆ ప్రభుత్వాన్ని పడగొట్టింది. మధ్యప్రదేశ్ లో బీజేపీ నుంచి అధికారాన్ని లాక్కుంటే దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా విజయాలు సాధ్యమవుతాయన్నది కాంగ్రెసు ఆలోచన. గతంలోను మధ్యప్రదేశ్ లో గెలిచింది. కాని కాంగ్రెసు నేతలు గోడ దూకి బీజేపీ ప్రలోభాలకు లొంగిపోయారు. కాంగ్రెసు ప్రభుత్వం కూలిపోయింది. కాంగ్రెసులో సాఫ్ట్ హిందూత్వ రాజకీయాలను ఇష్టపడే నేతలున్నంత కాలం కాంగ్రెసుకు ఈ పరిస్థితి తప్పదు. మధ్యప్రదేశ్ లో బీజేపీ విజయానికి కారణం వెనుకబడిన వర్గాలను ఆకట్టుకోవడం. ఉమాభారతి, బాబూలాల్ గౌర్, శివరాజ్ చౌహాన్ వంటి నేతలు వెనుకబడిన వర్గాల వారే. వెనుకబడిన వర్గాలను హిందూత్వ రాజకీయాల వైపు నడపడం బీజేపీ అక్కడ సాధించిన విజయం. ఇదే ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోను నడుస్తోంది.
వెనుకబడిన వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నాలు తనతరఫున కాంగ్రెసు కూడా చేస్తోంది. కులజనగణన కోసం గొంతు విప్పింది. 50 శాతం రిజర్వేషన్ పరిమితి తొలగించాలని డిమాండ్ చేస్తోంది. వీటన్నింటితో పాటు సాఫ్ట్ హిందూత్వ రాజకీయాలతో 2024లో అధికారం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. కాని ఆలోచించవలసిన ప్రశ్నలు ఏమిటంటే, ఇంతకు ముందు అజీజ్ ఖురైషీ అడిగిన ప్రశ్నలు.
ముస్లిం విద్వేషమే రాజకీయాల్లో ప్రధానంగా కనిపిస్తున్న ప్రస్తుతకాలంలో కాంగ్రెసు వివిధ అంశాలపై తన విధానాలను స్పష్టంగా ప్రకటించవలసిన అవసరం ఉంది. ప్రేమాభిమానాల దుకాణాలను తెరుస్తామంటున్న రాహులో గాంధీ ఆ దుకాణాల్లో ముస్లిములకు ప్రవేశం ఉందో లేదో చెప్పాలి. హర్యానాలో వరుసగా అనేక ర్యాలీలు జరుగుతున్నాయి. ముస్లిం విద్వేష ప్రసంగాలు జరుగుతున్నాయి. బాహాటంగా ధర్మసంసద్లలో ముస్లిములపై హింసాకాండకు పిలుపులు వినిపిస్తున్నాయి. వీటన్నింటిపై కాంగ్రెసు తన వైఖరి ఏమిటో ప్రకటించాలి. కొన్ని పంచాయతులు ముస్లిములపై నిషేధాజ్ఞల లేఖలు జారీ చేసిన వార్తలు వచ్చాయి. వాటిపై కాంగ్రెసు తన విధానాన్ని ప్రకటించాలి. ముస్లిం విద్వేష వ్యాఖ్యలు, ప్రసంగాలు చేసి దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలి. లౌకికవిలువలను కాపాడ్డానికి చేసే ప్రయత్నాలేమిటో చెప్పాలి. మూకహత్యలు, మూకదాడుల విషయంలో ఎలాంటి వైఖరి అవలంబిస్తారో, గోరక్షక దళాల దాడుల నుంచి పశువులను చట్టబద్దంగా రవాణా చేస్తున్న ముస్లిములను గోరక్షకుల పేరుతో దాడులు చేస్తున్న గుండాల నుంచి కాపాడ్డానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలి. పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెసు వైఖరి ఏమిటో చెప్పాలి. అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని ఏం చేస్తారో చెప్పాలి. ఎన్నార్సీ విషయంలో కాంగ్రెసు తన వైఖరి స్పష్టంగా ప్రకటించాలి.
సాఫ్ట్ సెక్యులరిజం ప్లస్ సాఫ్ట్ హిందూత్వ రాజకీయాలతో గోడమీది పిల్లివాటం రాజకీయాలు కాంగ్రెసు నడిపినంత కాలం కాంగ్రెసుకు నిజమైన గుర్తింపు ఏదీ దొరకదు. లౌకికవాదం కోసం బలంగా నిలబడే పార్టీగా అవసరమైతే ఎన్నికల ప్రయోజనాలను కూడా త్యాగం చేసే పార్టీగా కాంగ్రెసు ముందుకు వస్తుందా?
– వాహెద్