July 27, 2024

విద్యాలయాల్లో, పరిశోధనాసంస్థల్లో స్వేచ్ఛా స్వతంత్రాలు ఎంతైనా అవసరం. కాని విశ్వవిద్యాలయాల స్వేచ్ఛలపై ఉక్కుపాదం మోపే పరిస్థితులు మన ముందుకు వస్తున్నాయి. ’’ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంలో పతనమవుతున్న ప్రజాస్వామిక విలువలు‘‘ అనే అంశంపై అశోక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఒకరు పరిశోధనా పత్రం రాశారు. దీనిపై ఆరా తీయడానికి విశ్వవిద్యాలయంలోకి ఇంటిలిజెన్స్ బ్యూరో అడుగుపెట్టిందనే వార్తలు వచ్చాయి. ఈ పరిశోధనా పత్రం రాసిన ప్రొఫెసర్ ని, ఎకనమిక్స్ డిపార్టుమెంటులో ఫాకల్టీ సభ్యులను విచారించాలని ఇంటిలిజెన్స్ బ్యూరో వచ్చిందట.

అశోక విశ్వవిద్యాలయం ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయం. పూనేలో ఉంటున్న సవ్యసాచి దాస్ ఈ విశ్వవిద్యాలయం ప్రొఫెసరు. ఆయన రాసిన పరిశోధనా పత్రం గురించి పత్రికల్లో వచ్చిన వార్తలను పట్టుకుని ఇంటిలిజెన్స్ బ్యూరో యూనివర్శిటీ కాంపస్ లోకి అడుగుపెట్టింది…

నిజానికి పోలీసు విభాగం మాదిరిగా లేదా మరో విచారణ సంస్థ మాదిరిగా ఎవరినైనా ప్రశ్నించే, విచారించే, అరెస్టు చేసే అధికారాలు ఐబికి లేవు. ఐబి పని అవసరమైన సమాచారాన్ని సేకరించడం. ఈ సమాచారం ఆధారంగా ఇతర విచారణ సంస్థలు చర్యలు తీసుకుంటాయి. సవ్యసాచి దాస్ రాసిన పరిశోధనా పత్రం ఆన్ లైన్ లో ముద్రించారు. ఈ పత్రంలో ముఖ్యమైన కీలకమైన అంశమేమిటంటే, 2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీ తక్కువ మార్జిన్ తో గెలిచిన ఎన్నిస్థానల్లో అవకతవకలకు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయన్నది పరిశీలించడం. ఈ పరిశోధనా పత్రం రాజకీయ దుమారానికి కారణమైంది. బీజేపీ నేతలు దీనిపై మండిపడ్డారు. అశోక విశ్వవిద్యాలయంలో పెట్టుబడులు పెట్టిన వ్యాపారవేత్తలు, యూనివర్శిటీ బోర్డులో ఉన్నవారికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు కూడా వెళ్ళాయట. కేంద్ర విద్యామంత్రి నుంచి కూడా ఫోన్లు వెళ్ళాయట. పరిశోధనాపత్రం రాసిన ప్రొఫెసర్ ఉద్దేశ్యమేమిటంటూ మండిపడ్డారట.

అశోక విశ్వవిద్యాలయం విదేశీ విరాళాల లైసెన్సు సెప్టెంబరు 2023లో రిన్యూవల్ చేయించుకోవలసి ఉంది. ప్రభుత్వానికి, బీజేపీకి, బీజేపీ అనుబంధ సంస్థలకు ఇష్టం లేని పనులు చేస్తున్న సంస్థలను వేధించడానికి ఈ లైసన్సు ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. హోం శాఖ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ సంస్థలపై పెత్తనం చెలాయిస్తుంది. హోంశాఖకు ఏదైనా సంస్థ విషయంలో చర్యలు తీసుకోవడం అవసరమైతే, అందుకు కావలసిన నివేదికలు ఐబి నుంచి అందుతాయని పలువురు విశ్లేషిస్తున్నారు.

సవ్యసాచి దాస్ పరిశోధనా పత్రం తర్వాత అశోక విశ్వవిద్యాలయం ఈ పరిశోధనా పత్రంతో తమకు సంబంధం లేదని చేతులు దులుపుకుంది. ఆ తర్వాత దాస్ అక్కడి నుంచి రాజీనామా చేసేశారు. ఈ వివాదంలో విశ్వవిద్యాలయం వైఖరికి నిరసనగా మరో సీనియర్ ఎకనమిక్స్ ప్రొఫెసర్ పులపరే బాలకృష్ణన్ కూడా రాజీనామా చేశారు. దాస్ కు మద్దతుగా ఎకనమిక్స్ డిపార్టుమెంటులో  చాలా మంది ప్రకటనలు జారీ చేశారు.

ఇలాంటిదే మరో సంఘటన అన్ అకాడమీలో జరిగింది. ఇందులో న్యాయశాస్త్రం బోధించే కరణ్ సాంగ్వాన్ రాజకీయ ఉద్దేశ్యాలతో విద్యార్థులతో మాట్లాడారంటూ అన్ అకాడమీ ఆయన్ను తొలగించింది. ఆయన చెప్పిందేమిటంటే, విద్యార్థులతో మాట్లాడుతూ మీరు ఈ సారి ఓటు వేస్తున్నప్పుడు చదువుకున్న వారికి ఓటు వేయండి. లేకపోతే ఇలాంటి పరిస్థితులే వస్తాయి అన్నాడు. ఈ వీడియో వైరల్ అయ్యింది. ఆ వెంటనే అన్ అకాడమీ ఆయన్ను తొలగించింది. చదువుకున్నవారికి ఓటేయండి అని చెప్పడం నేరమెలా అయ్యింది? సాంగ్వాన్ ఎవరి పేరు తీసుకోలేదు, కాని చాలా మంది ఆయన బీజేపీని లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశాడంటున్నారు. ఆయన్ను అన్ అకాడమీ తొలగించడాన్ని పలువురు విమర్శిస్తూ సాంగ్వాన్ కు మద్దతుగా ముందుకు వచ్చారు. చదువుకున్న వారికి ఓటేయడమని చెబితే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం చల్లారకముందే ఇలాంటిదే మరో వివాదం ముందుకు వచ్చింది. భారత రాజకీయాల్లోకి చదువుకున్నవారు రావాలని ఆన్ లైన్ లో బోధించే బబితా మేడమ్ చెబుతున్న మాటల వీడియో అది. ఐసియస్ కోచింగ్ సెంటర్ పేరుతో నడిచే ఆన్ లైన్ ట్యూటోరియల్ లో బోధిస్తున్న బబితా మేడమ్ కూడా ఇదే మాట చెప్పింది. మీరు ఓటు వేసినప్పుడు ఐదేళ్ళ కాలానికి మీ బాధ్యత వారికి అప్పగిస్తున్నారని తెలుసుకోండి. ఉద్యోగాలు, రిక్రూట్మెంట్, విద్యాసంస్థల ప్రమాణాలు అన్నింటి బాధ్యత వారిదే అవుతుంది. కాబట్టి చదువుకున్న వారికి ఓటేయండి అని చెప్పింది.

కాని ఈ మాటలు ప్రభుత్వంలో ఉన్నవారికి ఎందుకు కోపం కలిగించాయని ఇప్పుడు పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, పరిశోధకులు ఏది చెప్పాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడే పరిస్థితులు వచ్చాయన్నది స్పష్టంగా అర్థమవుతోంది.

– వాహెద్