July 27, 2024

దేశరాజధాని నగరం ఢిల్లీలో నివసించే వారి ఆయుర్థాయం వాతావరణ కాలుష్యం వల్ల 12 సంవత్సరాలు తగ్గిపోతుందని 2023 సంవత్సరం ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ సూచించింది. యూనివర్శిటీ ఆఫ్ చికాగో కు చెందిన ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ ఈ నివేదికను రూపొందించింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించిన స్థాయి కన్నా ఢిల్లీలో 25 రెట్లు అధిక కాలుష్యం ఉంది.

దేశ రాజధాని నగరం ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకుంటున్నప్పటికీ నగరంలో భారీ నిర్మాణ ప్రాజెక్టు కొనసాగుతూనే ఉంది. పర్యావరణానికి సంబంధించిన నియమాలను ఉల్లంఘిస్తున్నట్లు తెలిసినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ చేయడం లేదు. ఇంతకు ముందు ప్రగతి మైదాన్ సెంటరును కూల్చి వేసిన తర్వాత అక్కడ కోట్ల రూపాయల వ్యయంతో ఎగ్జిబిషన్ కం కన్వెన్షన్ సెంటరుతో పాటు మరికొన్ని భవనసముదాయాలు నిర్మిస్తున్నారు. నిర్మిస్తున్నది ఎవరో కాదు కేంద్రంలోని వాణిజ్య పారిశ్రామిక శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ఈ పనులు చేయిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పనిచేసే కేంద్ర కాలుష్య మండలి ఈ పర్యావరణ ఉల్లంఘనల విషయాన్ని ఎప్పుడో  బయటపెట్టింది. మరోవైపు అదే కేంద్ర ప్రభుత్వ ఆధ్యర్యంలో పనిచేసే మరో శాఖ ఈ నిర్మాణాల ద్వారా పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ఢిల్లీ నగరం వాయు కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరవుతుంటే మరోవైపు ఈ పరిస్థితి నెలకొని ఉంది.

ప్రపంచంలో సులభ వాణిజ్యం సూచిక అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సూచికలో భారతదేశం పైకెగబాకింది. కాని సులభ వాణిజ్యం కోసం పర్యావరణాన్ని బలిపెడుతున్నామా? సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్ ప్రారంభించిన నమతీ ఎన్విరాన్ మెంటల్ జస్టిస్ ప్రోగ్రాం డైరెక్టరు కంచి కోహ్లీ ఈ సమస్య గురించి గతంలో ఏమన్నారంటే -’’2016 జనవరిలో సులభవాణిజ్యం గురించి ప్రభుత్వం గట్టిగా చెప్పింది. ఆ తర్వాత మంత్రిత్వ శాఖలన్నీ సులభ వాణిజ్యానికి పెద్ద పీట వేశాయి. ఇవన్నీ వ్యాపారవర్గాల ప్రయోజనాలను కాపాడ్డానికి తీసుకుంటున్న చర్యలు. వీటికి పర్యావరణ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది.‘‘

బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి పర్యావరణ చట్టాలను నీరుగార్చడం ప్రారంభమయ్యింది. దీని ప్రభావం దేశంలోని పర్యావరణంపై తీవ్రంగా పడుతోంది. బీజేపీ అధికారంలోకి రాగానే అటవీశాఖ అనుమతులను సులభం చేసింది. పారెస్ట్ క్లియరన్స్ నిబంధనలను సరళం చేసింది. అటవీ భూములను ఇతర ఉపయోగాలకు వాడుకోవాలంటే ఈ అనుమతులు తప్పనిసరి. అంటే అటవీ భూముల్లో గనుల తవ్వకం, నిర్మాణాలు చేపట్టడం వంటివి చేయాలంటే ఇప్పుడు తేలికయ్యింది. కొత్త ఉత్తర్వులు 2014, అగష్టు 8వ తేదీన జారీ అయ్యాయి. భారత పర్యావరణం అడవులు వాతావరణ మార్పుల శాఖ జారీ చేసిన ఈ కొత్త ఉత్తర్వుల ప్రకారం ఫారెస్ట్ క్లియరెన్స్ లో స్టేజ్ 1 అనుమతి లభిస్తే చాలు పనులు ప్రారంభించవచ్చు. అంతకు ముందు ఫారెస్ట్ క్లియరెన్స్ స్టేజ్ 2 తుది దశ ఆమోదం లభించిన తర్వాతనే పనులు ప్రారంభించే నిబంధన ఉండేది. అది తొలగించారు.

ఆ తర్వాత 2016లో కాలుష్యం లేని పరిశ్రమల జాబితా తయారు చేశారు. అందులో 36 పరిశ్రమలను పేర్కొన్నారు. వాటికి శ్వేత పరిశ్రమలని పేరుపెట్టారు. ఈ పరిశ్రమలు ప్రారంభించాలంటే పర్యావరణ అనుమతులు తీసుకోనవసరం లేదన్నారు. అంతకు ముందున్న నియమాలను సడలించారు. ఈ పరిశ్రమల్లో ఫోటో వోల్టాయిక్ సెల్స్ తో సౌరవిద్యుత్ ఉత్పత్తి, వాయు విద్యుత్ ఉత్పత్తి, 25 మెగా వాట్ల కన్నా తక్కువ జలవిద్యుత్ ఉత్పత్తి తదితర పరిశ్రమలున్నాయి. వీటికి ఇప్పుడు పర్యావరణ అనుమతులు అవసరం లేదు.ఇంతకు ముందు ఈ పరిశ్రమలు ప్రారంభించాలంటే జల కాలుష్య నియంత్రణ చట్టం 1974, వాయు కాలుష్య నియంత్రణ చట్టం 1981 క్రింద అనుమతులు తప్పనిసరిగా తీసుకోవలసి వచ్చేది. ఇక్కడ ఆలోచించవలసిన విషయమేమంటే, చిన్నస్థాయి జలవిద్యుత్ ప్రాజెక్టు పనిచేస్తున్నప్పుడు కాలుష్యం చాలా తక్కువే కావచ్చు కానీ, ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు విపరీతమైన కాలుష్యానికి కారణమవుతుంది. ప్రాజెక్టు నిర్మాణానికి స్టోన్ క్రషర్లను ఉపయోగించవలసి వస్తుంది.

పర్యావరణ ప్రభావం అంచనా నోటిఫికేషన్ 2006 ప్రకారం ఇంతకు ముందు నిర్మాణ పనుల ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు తీసుకోవడం అవసరమయ్యేది. కాని 2016లో దీన్ని కూడా మార్చారు. నిర్మాణ ప్రాజెక్టులకు ముందస్తు పర్యావరణ అనుమతులు అవసరం లేదన్నారు. 20 వేల చదరపు మీటర్ల కన్నా తక్కువ విస్తీర్ణంలో జరిగే నిర్మాణ పనుల ప్రాజెక్టుల విషయంలో స్వంతంగా ఒక డిక్లరేషన్ ఇస్తే చాలు మునిసిపాలిటీ నుంచి అనుమతి దొరికేస్తుంది. అలాగే 20 వేల చదరపు మీటర్ల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణ ప్రాజెక్టులు ప్రారంభిస్తే మునిసిపల్ అధికారుల నుంచి అనుమతులు తీసుకుంటే చాలు.

పర్యావరణ అనుమతుల విషయంలో వివిధ ప్రాజెక్టులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో కొన్నేళ్ళ క్రితమే కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక కూడా తెలియజేసింది. ఇటీవల కోస్తా ప్రాంతాల్లో కోస్టల్ రెగ్యులేటరి జోన్ నోటిఫికేషన్ను కూడా నీరుగార్చారు. అక్టోవర్ 2017లో అక్కడ గనుల తవ్వకాలకు, యురేనియం, థోరియం, టైటానియం, టాంటాలియం, జిర్కోనియం వంటి అణుధార్మిక ఖనిజాల తవ్వకానికి అనుమతులు ఇచ్చారు. ఇంతకు ముందు అణుధార్మిక ఖనిజాలు కోస్తా యేతర ప్రాంతాల్లో అలభ్యంగా ఉన్నప్పుడు మాత్రమే కోస్తా ప్రాంతాల్లో ఈ గనుల తవ్వకానికి అనుమతి ఇవ్వాలనే నిబంధన ఉండేది. ఈ చర్యల వల్ల ఇప్పటి వరకు పర్యావరణానికి ఎంత నష్టం వాటిల్లిందో లెక్కించడం చాలా కష్టం. ఈ నష్టం ఫలితాలు మనకు కనబడడానికి కొంత కాలం పడుతుంది. ఆ ఫలితాలు మన కళ్ళ ముందుకు వచ్చేనాటికి కనీసం కోర్టుల్లో న్యాయం కోసం వెళ్ళాలన్నా అవసరమైన చట్టాలేవీ ఉండని పరిస్థితి రావచ్చును.

శ్వేత పరిశ్రమలనే పేరు పెట్టి కొన్ని పరిశ్రమలకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని చెప్పడం ద్వారా జల, వాయు కాలుష్య చట్టాన్ని నిర్విర్యం చేసారు. అంతేకాదు, జాతీయ హరిత ట్రిబ్యునల్ అధికారాలు కూడా దీంతో పరిమితమయ్యాయి. ఈ నిర్మాణ పనుల వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగినా గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసే అవకాశం ఇప్పుడు లేదు. మునిసిపల్ అధికారులతోనే మొరపెట్టుకోవాలి.

వాతావరణ సంక్షోభం, పర్యావరణ కాలుష్యం వంటి సమస్యలు ఎప్పుడో భవిష్యత్ తరాలు ఎదుర్కునే సమస్యలు కావు. ఇవి మన జీవితాలను కూడా ప్రభావితం చేస్తున్న సమస్యలు. ఇప్పుడు పిల్లలు కూడా పర్యావరణ సమస్యలపై ఉద్యమిస్తున్నారు. స్వీడన్ కు చెందిన గ్రేటా థంబర్గ్ పర్యావరణ పరిరక్షణ కోసం స్కూలు ఎదుట చేసిన నిరసన ప్రదర్శనలు చివరకు ఐక్యరాజ్యసమితి వరకు వినిపించాయి. పర్యావరణ కాలుష్యం, వాతావరణ మార్పులు ఇప్పుడు మానవాళి మనుగడను ప్రశ్నించే స్థాయికి చేరుకున్నాయి. భూతాపం 1.5 డిగ్రీల సెంటీగ్రేడు వరకు పెరిగేసూచనలున్నాయని అంతర్జాతీయ వాతావరణ మార్పుల సంస్థలు ప్రకటించాయి. 2030 నుంచి 2052 మధ్యకాలంలో భూతాపం మరో 1.5 డిగ్రీల సెల్పియస్ వరకు పెరగవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలు కూడా పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నారు. స్వీడన్ లో గ్రేటా మాదిరిగానే ఉత్తరాఖండ్ కు చెందిన రిథిమా పాండే కూడా పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తోంది. ఆర్టంటీనా, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, టర్కీ దేశాలపై రిథిమా మరో ఫద్నాలుగు మంది కలిసి ఐక్యరాజ్యసమితి పిల్లల హక్కుల సంస్థకు ఫిర్యాదు చేశారు. ఈ దేశాలు ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యాలను వెదజల్లుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో పిల్లలు, యువకులు 30 శాతం ఉన్నారు. వర్ధమాన దేశాల్లోని  మరణాల్లో దాదాపు 90 శాతం ఏదో ఒక రూపంలో వాతావరణ మార్పుల వల్లనే సంభవిస్తున్నాయని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో పిల్లలు కూడా పర్యావరణ సమస్యను గుర్తించి పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న నేపథ్యంలో, ప్రజలు కూడా తమ వంతుగా ముందుకు రావలసి ఉంది. అభివృద్ధి కోసం భవిష్యత్తు తరాల జీవితాన్ని దుర్భరం చేయడం, పర్యావరణాన్ని దెబ్బతీయడంలో వివేకం లేదు. ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావలసిన బాధ్యత ప్రజలదే.

–      వాహెద్