November 12, 2024

ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర రెండువందలు తగ్గిపోయింది. దేశంలో రాజకీయాలిప్పుడు వంటగ్యాస్ లాగే మండుతున్నాయి.

ముంబయిలో ఇండియా కూటమి మూడవ సదస్సు జరగబోతోంది. ఇండియా కూటమి సదస్సులతో మోడీ ప్రభుత్వం కుదుపులకు గురవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ తొమ్మిదేళ్ళలో మోడీ ప్రభుత్వం ఎన్నడూ ఇష్టపడని నిర్ణయాలు ఇప్పుడు వరుసగా తీసుకుంటోంది. అధికధరలను మోడీ ప్రభుత్వం ఎన్నడూ పట్టించుకోలేదు. నిరుద్యోగాన్ని ఎప్పుడు పట్టించుకోలేదు. కాని ఇప్పుడు అప్పాయింట్ మెంట్ లెటర్ల పంపిణీ జరుగుతోంది. గ్యాస్ ధర కొద్దో గొప్పో దిగివచ్చేసింది. మమతా బెనర్జీ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇండియా కూటమి రెండు సదస్సులు జరిగితేనే గ్యాస్ ధర దిగి వచ్చేసింది. ఇది ఇండియా బలం అని ట్వీటు చేశారు.

ఇండియా కూటమి మూడవ సదస్సు కన్నా ముందు రాహుల్ గాంధీ బెంగుళూరు వెళ్ళారు. అక్కడ ఒక పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ప్రకారం ప్రతి మహిళ ఎక్కౌంటులో రెండువేల రూపాయలు తక్షణం నగదు బదిలీ చేస్తామని ప్రకటించారు. ఈ పథకం ప్రారంభమైంది. దీనికి జవాబు అన్నట్లు మధ్యప్రదేశ్ లో బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక పథకం ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ప్రతి మహిళకు 1250 రూపాయల నగదు బదిలి చేస్తున్నామని అన్నారు. మొదట 250 రూపాయలు బదిలీ చేస్తున్నామని అన్నారు. మిగిలిన వెయ్యి రూపాయలు సెప్టెంబర్ 10వ తేదీన ఖాతాల్లో వేస్తామన్నారు. కాని ఆ తర్వాత మాట మార్చేశారు. సెప్టెంబర్ 10వ తేదీన కాదు అక్టోబర్ నుంచి ఇస్తామంటున్నారు. అంటే ఎన్నికల కోడ్ అప్పటికి అమల్లోకి వచ్చేస్తోంది. కాబట్టి ఇవ్వవలసిన అవసరమూ ఉండదు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పిన అబద్దం ఇదొక్కటే కాదు, గ్యాస్ సిలిండర్ రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం 500కే ఇస్తోంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి తమ ప్రభుత్వం ఇక గ్యాస్ సిలిండర్ 450 రూపాయలకే ఇస్తామన్నారు. మహిళలు గ్యాస్ సిలిండర్ల కోసం క్యూలో నిలబడ్డారు. కాని హామీ ఉత్తుత్తిదేనని తేలిపోయింది. గ్యాస్ సిలిండర్ ధర దాదాపు 1200 రూపాయల వరకు మధ్యప్రదేశ్ లో ఉంది. మహిళలకు నిరాశా మిగిలింది.

ముంబయి ఇండియా కూటమి సదస్సులో శరద్ పవార్ ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు సంధించారు. ఉద్ధవ్ థాక్రే తన సహజమైన వ్యంగ్యధోరణిలో గ్యాస్ సిలిండరు 200 వందలు తగ్గించడమేమిటి, నాలుగు రోజులాగితే ఈ ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంచిపెడతామని చెబుతుంది చూడండి అన్నారు. ఏది ఏమైనా ఇండియా కూటమి రెండు సదస్సుల తర్వాత ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. మొన్నటి వరకు గ్యాస్ సిలిండర్ ధర గురించి మాట్లాడని బీజేపీ నేతలు, 2014కు ముందు దేశంలో వివిధ రాష్ట్రాల్లో 400 నుంచి 500 రూపాయల ధర మాత్రమే పలికిన గ్యాస్ సిలిండర్ ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో దాదాపు 1200 రూపాయల వరకు చేరుకుంది. కాని ఎన్నడూ ఈ ధర గురించి బీజేపీ నేతలు పట్టించుకోలేదు. పైగా గ్యాస్ ధర మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని చెప్పేవారు. కాని ఇప్పుడు హఠాత్తుగా మార్కెట్ ను పక్కకు నెట్టేసి ధర తగ్గించేశారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు కూడా గ్యాస్ సిలిండర్ ధర అధికంగానే ఉంది. 2014తో పోల్చితే గ్యాస్ సిలిండర్ ధర చాలా ఎక్కువగా ఉంది. అప్పట్లో మన జాతీయ చానళ్ళు సిలిండర్ ధర మూడున్నర రూపాయలు పెరిగినా ప్రజల నడ్డి విరిగిపోయిందని చర్చలు పెట్టేవి. కాని మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభయ్యేసి రూపాయల చొప్పున పెంచుతూ దాదాపు 12వందలకు గ్యాస్ సిలిండర్ ధరను చేరుకునేలా చేసినప్పటికీ మన టీవీ చానళ్ళలో ఎన్నడూ దీనిపై చర్చ జరగలేదు. అప్పట్లో గ్యాస్ సిలిండర్ ధర 4వందలే ఉన్నప్పటికీ సిలిండరుతో ధర్నాలు చేసిన స్మృతి ఈరానీ ఇప్పుడు రెండువందలు తగ్గించేశాం చూడండి అంటున్నారు. కాని అమాంతంగా 12వందల వరకు పెంచేశారన్నది చెప్పడం లేదు.

ఇండియా కూటమి సదస్సులు ఇలాగే జరుగుతుంటే, పెట్రోలు, డీజిలు, నిత్యావసరాల ధరలు అన్నీ తగ్గే అవకాశముందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మోడీ గారు రెండువందల రూపాయలు సిలిండర్ పై తగ్గించి రక్షాబంధన్ కానుక తన సోదరీమణులకు ఇచ్చానన్నారు. రెండువందలు తగ్గిస్తే సిలిండర్ ధర తగ్గిపోయినట్లేనా. జాతీయ చానళ్ళు మోడీ ప్రభుత్వాన్ని పొగడ్డంలో తలమునకలై ఉన్నాయి. కాని ప్రజలు వాస్తవాన్ని గుర్తిస్తున్నారు. సిలిండర్ ధర 5వందలకు దిగిరావాలని చాలా మంది కోరుతున్నారు.

మొన్న మార్చిలో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే మార్చి 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంచారు. మార్చి 8వ తేదీన హోలీ పండుగ వచ్చింది. అప్పుడు సోదరీమణుల పెద్దన్నకు పండుగ కానుక గుర్తుకు రాలేదా? అప్పుడెందుకు 50 రూపాయలు పెంచారు. అప్పుడు హోలీ సందర్భంగా పెద్దన్నకు సోదరీమణులు గుర్తుకురాలేదు. ఎందుకంటే అప్పుడు ఎన్నికలైపోయాయి. ఇప్పుడు రాఖీ సందర్బంగా పెద్దన్నకు సోదరీమణులు గుర్తొచ్చారు. ఎందుకంటే ఎన్నికలొస్తున్నాయి. అలాగే మార్చి 2022లో, అంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోలు, డీజిలు ధర పెరగడం ప్రారంభమయ్యింది. అంతకు ముందు 137 రోజుల పాటు ఈ ధరలు పెంచకుండా ఎన్నికలు ముగిసేవరకు వేచి ఉన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే పదిరోజుల్లో తొమ్మిది సార్లు ధరలు పెరిగాయి. 2022 మార్చి ముగిసే సరికి పెట్రోలు ధర లీటరు వంద వరకు కొన్ని ప్రాంతాల్లో చేరుకుంది.  ఎన్నికల తర్వాత ధరలు పెంచే రికార్డు బీజేపీ స్వంతం. అలాంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ధరలు తగ్గించానంటోంది. మహిళలు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారని, గ్యాస్ సిలిండర్ ధర తగ్గడం వల్ల చాలా సంతోషిస్తున్నట్లు చెబుతున్నారని బీజేపీ నేతలు ప్రచారం మొదలుపెట్టారు. ధర ఇప్పుడు కాస్త తగ్గగానే ప్రజలు కొద్దోగొప్ప ఊరట పొందారన్నది నిజమే, అలాగే ధరలు విపరీతంగా పెంచుతూ పోయినప్పుడు ఈ మహిళలకే చాలా కష్టాలు, ఇబ్బందులు ఎదురయ్యాయన్నది కూడా నిజమే కదా. అప్పుడు ఈ నేతలు మహిళల కష్టనష్టాల గురించి ఎందుకు ఆలోచించలేదు?

స్కూలు పీజులు, వంటనూనె, నిత్యావసరవస్తువులు, పెట్రోలు, డీజిలు ఒక్కటేమిటి మోడీ ప్రభుత్వ కాలంలో అన్నింటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు హఠాత్తుగా ప్రభుత్వం ధరలు తగ్గించడం ఎందుకు జరిగిందంటే, ఇండియా కూటమి సదస్సుల ప్రభావం కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

ఇండియా కూటమికి ఎదురు దెబ్బతీయడానికి మోడీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళవచ్చని కొందరు భావిస్తున్నారు. ఇంతకు ముందు వాజపేయి ప్రభుత్వం కూడా ముందస్తు ఎన్నికలు జరిపించింది. కాని సోనియా నాయకత్వంలో యుపియే ఘనవిజయం సాధించింది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పదేళ్ళ పాటు పాలించింది. సెప్టెంబరు 10వ తేదీ వరకు జి20 సదస్సు ఇండియాలో జరగబోతోంది. ఆ తర్వాత ఈడి దాడులు ప్రారంభిస్తుందని కొందరు భావిస్తున్నారు. ప్రతిపక్షాలపై ఒత్తిడి పెంచడానికి ఈడీని ఆయుధంగా ఉపయోగిస్తారని చాలా మంది అభిప్రాయం. సంజయ్ మిశ్రాను ఈడీ అధినేతగా ఇప్పటికే పలుమార్లు పదవికాలాన్నిపొడిగించిన బీజేపీ ప్రభుత్వం ఆయన్ను ఉపయోగించి ప్రతిపక్షాలపై ఒత్తిడి తీసుకువస్తుందని కొందరి అంచనా. ఈడీ అధినేతగా సంజయ్ మిశ్రా సెప్టెంబర్ 15వ తేదీన పదవీ విరమణ చేయవలసి ఉంది. ఆ తర్వాత కూడా ఆయన్ను ఏదో ఒక పదవి సృష్టించి ఆయనకు అధికారాలు కట్టబెట్టే వ్యూహాలు ఉండవచ్చని కూడా కొందరు భావిస్తున్నారు. ముఖ్యంగా ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూఫేష్ భాగేల్ అరెస్టు కావచ్చనే అనుమానాలు ప్రచారంలో ఉన్నాయి.

ఇండియా కూటమి మొదటి సమావేశం పట్నాలో జరిగింది. ఆ తర్వాత బెంగుళూరులో రెండవ సదస్సు జరిగింది. ఇప్పుడు ముంబయిలో మూడవ సదస్సు. ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు జరిగి, దేశవ్యాప్తంగా ర్యాలీలు ప్రారంభం కావచ్చు. ఎందుకంటే, ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఒక్కటై ఉంటే అన్ని పార్టీల ఓట్ల శాతం 63 వరకు ఉంది. ఎన్డీయే ఓట్ల శాతం 37 శాతం మాత్రమే. ప్రతిపక్షాల సమైక్యత మోడీ ప్రభుత్వాన్ని కుప్పకూలేలా చేయవచ్చు. అందువల్లనే ప్రతిపక్ష సమైక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు జరగవచ్చు. మహారాష్ట్రలో శివసేనను చీల్చి ప్రభుత్వాన్న పడగొట్టినప్పటికీ అక్కడ బీజేపీ బలం లేదు. ఏక్ నాథ్ షిండే బలం కూడా పెద్దగా ఎన్నికల్లో ఉండకపోవచ్చు. మహావికాస్ అఘాడీ చాలా బలంగా ఉంది. శరద్ పవార్ ను తమవైపు తిప్పుకుంటేనే మహారాష్ట్రలో బీజేపీకి అవకాశాలు మెరుగవుతాయి. అజిత్ పవార్ రావడం వల్ల బీజేపీకి పెద్దగా ప్రయోజనం ఉన్నట్లు ఇప్పుడు కనబడడం లేదు. శరద్ పవార్ ను శరద్ పవార్ కుమార్తెను తమవైపు తిప్పుకోవడానికి బీజేపీ ఏం చేస్తుంది? శరద్ పవార్ ఇండియా కూటమిలో కొనసాగుతారా లేదా అన్నది కాలమే చెప్పాలి.

అరవింద్ కేజ్రీవాల్ ను కూడా ఇండియా కూటమి నుంచి బయటకు లాగాలని చూస్తున్నారు. కేజ్రీవాల్ ఆప్ పార్టీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్ ఇలా ఎన్ని రాష్ట్రాల్లో అయినా పోటీ చేయడమే బీజేపీకి కావాలి. అలా చేయడం వల్ల కాంగ్రెస్ ఓట్లకు ఆఫ్ గండి కొడుతుంది. బీజేపీకి లాభం దక్కుతుంది. మజ్లిస్ పోటీ చేయడం వల్ల కూడా ఇలాంటి లాభమే దక్కుతుందని బీజేపీ భావిస్తుంది. అరవిండ్ కేజ్రీవాల్ ఇండియా కూటమిలో ఉంటే కాంగ్రెస్ ఓట్లకు గండి కొట్టడం జరగదు. అందువల్లనే అరవింద్ కేజ్రీవాల్ ను బయటకు లాగాలని చూస్తున్నారు.

బీజేపీకి మరో ముఖ్యమైన విషయం మాయావతిని ఇండియా కూటమికి దూరంగా ఉంచడం. మాయావతిపై అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందువల్లనే ఆమె తాను ఏ కూటమిలోను లేనని, స్వతంత్రంగా పోటీ చేస్తామని అంటున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మాయావతి ఏం చేస్తారన్నది తెలియదు. ఇప్పుడు తాను స్వతంత్రంగా ఉన్నానని చెప్పినా ఆమె ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ఇక నితీష్ కుమార్ మళ్ళీ ఎన్డీయేలోకి వచ్చే అవకాశాలు లేవు. కాని ఆయన ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయడానికి ఆయన సన్నిహితులపై ఈడీని ప్రయోగించి ఒత్తిడి తీసుకువచ్చే అవకాశాలున్నాయి. ఈ పని ప్రారంభమైందని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. నితీష్ కుమార్ పై బంధుఫ్రీతి, వారసత్వ రాజకీయాలు, అవినీతి వంటి ఆరోపణలు చేసే అవకాశమే లేదు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎన్నడూ కేసులు ఎదుర్కోలేదు. పోలీసు స్టేషనుకు వెళ్ళలేదు. అరెస్టు కాలేదు. నిజానికి మోడీ, అమిత్ షా ఇద్దరు కేసులు ఎదుర్కున్నారు. నితీష్ కుమార్ రాజకీయాల్లో తలపండిన నేత. ఆయన రాజకీయానుభవం ఇండియా కూటమిని విజయం వైపు నడిపించవచ్చు. కాబట్టి నితీష్ కుమార్ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరగవచ్చు.

కాని ఈ ఒత్తిళ్ళ రాజకీయాలు ఎంత వరకు పనిచేస్తాయన్నది ఆలోచంచవలసిన విషయం. వరుసగా రాష్ట్రాల ఎన్నికలున్నాయి. తర్వాత లోక్ సభ ఎన్నికలున్నాయి. ఈ నేపథ్యంలో హేమంత్ సోరెన్ లేదా భూఫేష్ భగేల్ లేదా మరొకరిని ఈడీ కేసుల్లో ఇరికించి అరెస్టులు చేయించడం వల్ల ప్రజాభిప్రాయంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? దీనివల్ల బీజేపీకి లాభం కన్నా నష్టమే ఎక్కువ అనే భయాలున్నాయి.

ఇండియా కూటమిలో అంతా అవినీతి నేతలేనని, కాబట్టి ఈడీ తదితర కేంద్ర సంస్థల చర్యలు సబబే అంటూ బీజేపీ ప్రచారం చేయవచ్చును. కాని అజిత్ పవార్ ను అక్కున చేర్చుకోవడం, దాంతో పాటు అదానీ విషయంలో జవాబు చెప్పలేకపోవడం, బయట పడుతున్న స్కాములు ఇవన్నీ బీజేపీకి తలనొప్పిగానే మారుతాయి. కర్నాటకలో కాంగ్రెసు బీజేపీ ప్రభుత్వ అవినీతినే ముఖ్యమైన ఎన్నికల సమస్యగా మార్చిందన్నది కూడా గుర్తుంచుకోవాలి. డబుల్ ఇంజన్ సర్కారని చెబుతున్న రాష్ట్రాల్లో అవినీతి అధికంగా ఉందన్న ప్రచారం కూడా ప్రతిపక్షాలు తీవ్రం చేస్తున్నాయి.

ఏది ఏమైనా ఇండియా కూటమి సదస్సుల తర్వాత అప్పాయింట్ మెంట్ లెటర్ల పంపిణీ జరిగింది. గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. ఇప్పుడు లీకైన గ్యాస్ లా రాజకీయాలు వ్యాపిస్తున్నాయి.

–      వాహెద్