July 15, 2024

సెప్టెంబరు 5వ తేదీ నుంచి మరో చర్చ దేశంలో ప్రారంభ మయ్యింది. నిజానికి ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడి నప్పటి నుంచి రోజుకో కొత్త చర్చ ముందుకు వస్తూనే ఉంది. ఇప్పుడు భారతదేశం పేరుపైన చర్చ మొదలయ్యింది. రాష్ట్రపతి కార్యాలయం నుంచి జి20 డిన్నరుకు పంపిన ఆహ్వానంలో”President of Bharat”అని ఆహ్వానాన్ని పంపారు. సాధారణంగా”President of India” అని ఆహ్వానం పంపుతారు. ఈ సారి ఇది మారింది. భారత రాజ్యాంగంలో ఇండియా, భారత్‌ అనే రెండు పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇండియా అనే పేరును పూర్తిగా తొలగించేస్తారని, కేవలం భారత్‌ అనే పేరు మాత్రమే ఉంచుతారని చర్చలు మొదలయ్యాయి.

ఇరవై ఏడు పార్టీలు ఒక్కటై ఇండియా కూటమి ఏర్పడినప్పటి నుంచి పాలకకూటమిలో ఒకవిధమైన కంగారు కనిపిస్తోంది. నెలరోజుల క్రితం, జులై నెలలో ఒక సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఎన్డీయేకు కొత్త భాష్యం చెప్పారు. నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయెన్స్‌ అంటే ఎన్డీయే కూటమి సమావేశం న్యూఢల్లీిలో జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్‌ అంటే న్యూ ఇండియా అని, డి అంటే డెవలప్‌మెంట్‌ అనీ, ఏ అంటే ఆస్పిరేషన్‌ అని వివరణ ఇచ్చారు. అప్పుడు ఇండియా అనే పదం పట్ల బీజేపీ నేతలెవ్వరు వ్యతిరేకత చూపలేదు. ఇండియా అనేది తమ పేరులో కూడా ఉందని చెప్పుకునే ప్రయత్నాలు చేశారు. కాని ఈ ప్రయత్నాలు పెద్దగా ప్రజల్లోకి వెళ్ళలేదు. ఆ తర్వాత ప్రధాని మోడీ స్వయంగా ఇండియా అనే పదాన్ని తక్కువ చేస్తూ, ఇండియన్‌ ముజాహిదీన్‌ పేరులో కూడా ఇండియా ఉందని, ఈస్ట్‌ ఇండియా కంపెనీ పేరులో కూడా ఇండియా ఉందని ఎద్దేవా చేశారు. ఒకవిధంగా ఇండియా కూటమి పేరును తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నించారు. అప్పట్లోనే అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ ఇండియా పేరు విషయంలో తన వ్యతిరేకత ప్రదర్శిస్తూ మాట్లాడాడు. ఇప్పుడు ఏకంగా ఇండియా పేరునే తొలగించే విధంగా వ్యవహరిస్తున్నారు. అందుకే ప్రతిపక్షాలు ఈ విషయమై విమర్శలు సంధిస్తున్నాయి. ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత బీజేపీ వణుకుతోందని అంటున్నారు.
ముంబయిలో ఇండియా కూటమి సమావేశం జరిగిన తర్వాత సీట్ల సర్దుబాటు మొదలు అనేక విషయాలపై నిర్ణయాలు జరిగిపోయాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాట్లాడుతూ ప్రతిపక్ష కూటమి పేరు ఇండియా అని పెట్టుకున్న తర్వాత మాత్రమే బీజేపీ నేతలు ఇండియా పేరును మార్చే పనిలో పడ్డారని అన్నారు. బీజేపీ 9 ఏళ్ళలో చేసింది పేరుమార్పు తప్ప మరేమీ కాదని విమర్శించారు. ఆప్‌ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా ఈ చర్యలను విమర్శిస్తూ ప్రతిపక్ష కూటమి పేరు ఇండియా పెట్టుకుంటే దేశం పేరును భారత్‌ అని మార్చేస్తారా? ఒకవేళ ప్రతిపక్ష కూటమి పేరు మార్చుకుని భారత్‌ అని పెట్టుకుంటే దేశం పేరు బీజేపీ అని మార్చేస్తారా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇండియా కూటమిని చూసి బీజేపీ భయపడుతోందని అందువల్లనే ఈ పేరుమార్పు రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్‌ నాయకుడు వేణుగోపాల్‌ అన్నారు.
గమనించవలసిన మరో విషయమేమిటంటే, ఇటీవల ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ ఇండియా అనే పేరు వాడడాన్ని తగ్గించుకోవాలని, భారత్‌ అనే పేరు వాడాలని సూచించారు. ఈ సూచన వచ్చిన కొన్ని రోజుల్లోనే ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా బదులు ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ అని జి20 ఆహ్వాన లేఖలు వెళ్ళాయి.
కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ పేరు మార్చే ఆలోచన ఏదీ లేదని అంటూనే, భారత్‌ అనే పేరును వ్యతిరేకించే వారి మనస్తత్వం ఎలాంటిదో అర్థమవుతుందని అన్నాడు. ఈ మాటలను జాగ్రత్తగా గమనించాలి. ఎవరు భారత్‌ అనే పేరును వ్యతిరేకిస్తున్నారు? ఎవరు భారత్‌ అనే పేరు పట్ల అభ్యంతరాలు చెబుతున్నారు? స్పష్టంగా తెలిసేదేమంటే ఎవ్వరు భారత్‌ అనే పదం పట్ల అభ్యంతరాలు కాని, వ్యతిరేకత కాని చెప్పడం లేదు. రాహుల్‌ గాంధీ పాదయాత్ర పేరు ’’భారత్‌ జోడో యాత్ర‘‘. ఇండియా కూటమి ట్యాగ్‌ లైన్లో జుడేగా భారత్‌, జీతేగా ఇండియా అని రెండు పదాలు కనిపిస్తాయి. కాంగ్రెసు భారత్‌ అనే పదాన్ని వ్యతిరేకించడం లేదన్నది స్పష్టం. ఇదే మాట కాంగ్రెసు ఎం.పీ. గౌరవ్‌ గోగోయ్‌ చెప్పారు. దేశానికి ఇండియా, భారత్‌ అనే రెండు పేర్లు కూడా ఆమోదించబడిన పేర్లని. ఇప్పుడు బీజేపీ ఈ రెండు పేర్లను ఒకదానికి మరొకటి పోటీగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. కాంగ్రెసు పార్టీ రెండు పేర్లను స్వీకరిస్తుందని, రెండు పేర్ల పట్ల గర్విస్తుందని చెప్పారు. ఇస్రోలో ఇండియా పదం ఉంది, ఐఐటిల్లో ఇండియా అనే పదం ఉంది. ఐఐఎంలలో ఇండియా పదం ఉంది. ఎక్కడెక్కడ మార్చుతారని ప్రశ్నించారు. కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చెప్పిన మాటలు అందువల్లనే జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉంది. ‘‘భారత్‌ పేరు పట్ల వ్యతిరేకత చూపించేవారున్నారు’’ అంటూ ఆయన రాజకీయం చేశాడు. వ్యతిరేకత చూపించడం లేదు. అయినా ఎందుకు చెబుతున్నాడంటే, ఎవరో వ్యతిరేకత చూపిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో సృష్టించడానికి. భారత్‌, ఇండియా అనే పదాల మధ్య పోటీ పెట్టి, భారత్‌ అనే పదం పక్షాన తామున్నామని, ఇండియా అనే విదేశీ పదం పక్షాన ప్రతిపక్షాలున్నాయనే ఒక కృత్రిమ విభజన సృష్టించి ప్రజలను అయోమయానికి గురిచేసి రాజకీయ ప్రయోజనాలు పొందే ప్రయత్నాలివి. హిందూ ముస్లిం విభజన మాదిరిగానే ఇది మరో రకం విభజన. విభజించు పాలించు రాజకీయాలివి. భారత్‌ అంటే మోడీ, భారత్‌ అనేది దేశసంస్కృతి, హిందూ సంస్కృతిని సూచించే పదం, ఇండియా అనేది విదేశీ పదం, బానిస పాలనను గుర్తు చేసే పదం, దేశభక్తి ఉన్న బీజేపీ భారత్‌ పక్షాన ఉంది. దేశభక్తి లేని ప్రతిపక్షాలు విదేశీపదమైన ఇండియా పక్షాన ఉన్నాయనే ఒక కృత్రిమ చర్చ ప్రారంభించి ప్రజల్లో విభజన తీసుకువచ్చే ప్రయత్నాలివి.
ప్రతి దేశానికి ఒకే పేరు ఉంటుందని, ఇలా రెండు పేర్లు ఉండవని కొందరు కొత్త వాదన తీసుకొస్తున్నారు. నిజానికి ఈ వాదన తప్పు. చాలా దేశాలకు రెండు పేర్లున్నాయి. సిరియా దేశానికి మరోపేరు షామ్‌. ఈజిప్టు దేశానికి మరో పేరు మిశ్ర్‌. ఈరాన్‌ మరో పేరు ఫారాస్‌. జోర్డాన్‌ మరో పేరు ఉర్దున్‌. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ మరో పేరు ముత్తహిదా అరబ్‌ ఇమారాత్‌. చైనా దేశాన్ని హిందీ ఉర్దూ భాషల్లో చీన్‌ అంటారు. రష్యాదేశాన్ని కూడా ఈ భాషల్లో రూస్‌ అని వ్యవహరిస్తారు. బ్రిటన్‌ను బర్తానియా అంటారు.
మరో ముఖ్యమైన విషయమేమిటంటే, దేశానికి హిందూస్తాన్‌ అనే మరోపేరు కూడా ఉంది. సారే జహాం సే అచ్ఛా హిందూస్తాన్‌ హమారా గేయాన్ని మనం మరిచిపోలేము కదా. నిజానికి హిందూ అనే పదానికి చాలా దగ్గరగా ఉన్న పదం హిందూస్తాన్‌. నిజం చెప్పాలంటే హింద్‌ అనే పదానికి రూపాంతరం ఇండియా. ఈ పదం ఇండస్‌ లేదా సింధూ నది వల్ల వచ్చింది. భారతమాతాకి జై అనే నినాదంతో పాటు అంతకన్నా ఎక్కువగా ప్రాచుర్యం పొందిన నినాదం జై హింద్‌. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఈ నినాదం స్వీకరించారు.
కాని ఇప్పుడు బీజేపీ దేశాన్ని భారత్‌ అని మాత్రమే పేరుండాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రపతి భవనం నుంచి జి20 ప్రతినిధులకు విందు ఆహ్వానంలో భారత్‌ అని పేర్కొన్నారు. అలాగే ఇండోనేషియా ప్రధాని పర్యటనకు అక్కడి నుంచి వచ్చిన ఆహ్వానంలోను”Prime Minister of Bharat” అని ఆహ్వానపత్రం వచ్చేలా చేశారు. ఇండియా అని నిన్నటి వరకు వ్యవహరించిన ఇండోనేషియా ఇలా అకస్మాత్తుగా భారత్‌ అని రాయడం వెనుక కథ ఊహించడం కష్టం కాదు. ఇండియా బదులు భారత్‌ అని రాసిన మొదటి దేశం ఇండోనేషియాగా చరిత్రలోకి ఎక్కింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరస్‌ ప్రతినిధి ఫర్హాన్‌ హక్‌ మాట్లాడుతూ పేరు మార్చమని తమ వద్దకు విజ్ఞప్తి వస్తే వెంటనే ఆమోదిస్తా మని చెప్పారు. ఇటీవల టర్కీ తన పేరు తుర్కియే అని మార్చు కుంది. ఐక్యరాజ్య సమితి కూడా ఇప్పుడు ఆ పేరుతోనే వ్యవహరిస్తోంది.
సింధూ నదిని గ్రీకులు ఇండస్‌ నది అంటారు. ఇండస్‌ అన్న పదం గ్రీకు పదం కాదు, లాటిన్‌ పదం. మరో విషయం గమనించాలి. గ్రీకు దేశానికి మరోపేరు యునాన్‌. హిందీ, ఉర్దూ భాషల్లో గ్రీకును యునాన్‌ అని రాస్తారు. ఈ గ్రీకుకు చెందిన చరిత్రకారుడు హెరెడోటస్‌ క్రీ.పూ. 440లోనే ఇండియా అనే పదం ఉపయోగించాడు. అప్పుడు గ్రీకు పర్షియా సామ్రాజ్యంలో భాగం. ఆయన టర్కీ, ఈరాన్‌ దేశాలను ఇండియాతో పోల్చుతూ ఇండియా స్వర్గతుల్యమన్నాడు. ఇంగ్లీషువాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత దేశాన్ని ఇండియా అని వ్యవహరించడం మొదలు పెట్టారు. కాబట్టి ఇండియా అనే పేరు ఇంగ్లీషు వాళ్ళు ఇచ్చింది కాదు, ఇది ఇంగ్లీషు భాషా పదం కూడా కాదు. ఇక భారతదేశానికి అనేక పేర్లు ఉన్నాయి. హింద్‌, హిందూస్తాన్‌, జంబూద్వీపం, ఆర్యవర్తం వగైరా పేర్లు. అరబ్బులు మన దేశాన్ని అల్‌ హింద్‌ అని పిలిచేవారు. దాని నుంచే హిందూస్తాన్‌ పేరు వచ్చింది. ఇక భారత్‌ అనే పేరు విషయానికి వస్తే, రాజా దశరథుడి కుమారుడి పేరు భరతుడు. రాముడికి సోదరుడు. నాట్యశాస్త్రం రచించింది భరతముని. దుష్యంతుడు, శకుంతలల కుమారుడు భరతుడు. కొన్ని కథలు ఈ పేర్ల వల్ల దేశానికి భారతదేశం అనే పేరు వచ్చిందని చెబు తాయి. రాజ్యాంగ సభలో కూడా దేశం పేరు గురించి చాలా చర్చ జరిగింది. కొందరు కేవలం భారత్‌ అనే పేరు ఒక్కటే ఉండాలన్నారు. మరికొందరు ఇండియా పేరు కూడా ఉండా లన్నారు. చివరకు మెజారిటీ నిర్ణయంతో రెండు పేర్లు ఉంచారు. కాబట్టి ఈ రెండు పేర్లలో ఏ పేరును వాడినా అందులో తప్పేమీ లేదు. అభ్యంతరాలు ఎవరికీ ఉండకూడదు. ఇంగ్లీషులో రాస్తున్నప్పుడు ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా అని రాయడం ఒక సంప్రదాయంగా వస్తోంది. అంతే తప్ప మరేమీ కాదు. అలాంటప్పుడు ఈ వివాదమేమటి అనేది ప్రశ్న.ఈ వివాదం రాజకీయమైనది. ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత ఏదో ఒక చర్చ తీసుకురావాలని భావిస్తున్న బీజేపీ నేతలు సృష్టించిన వివాదం ఇది. ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత ఇండియా అనే పదాన్ని బీజేపీ, మోడీ సర్కారులోని పెద్దలు వాడడం తగ్గించాలనుకుంటున్నారు. ఇలా ఇండియా అనే పేరు వాడకాన్ని తగ్గించే ప్రయత్నాలనే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి తప్ప భారత్‌ అనే పదం పట్ల అభ్యంతరాలు కాదు. ఇండియా అనే పేరును పూర్తిగా తొలగించాలంటే

రాజ్యాంగ సంస్కరణ అవసరమవుతుంది. పార్లమెంటులో మూడిరటా రెండువంతుల మెజారిటీతో ఈ సంస్కరణ సాధ్యం. కాని రాజ్యసభలో ప్రభుత్వానికి అంత బలం లేదు. ఒకవేళ ఇండియా అనే పేరును తొలగించాలనుకుంటే చాలా చోట్ల తొలగించవలసి వస్తుంది.”Constitution of India, Supereme court of India, Reserve bank of India”.. ఇలా అనేక పేర్లు మార్చవలసి వస్తుంది. అలాగే కరెన్సీ నోట్లపై ఇండియా అనే పేరే ఉంది. మళ్ళీ నోట్లు ముద్రించాలి. అంటే మళ్ళీ నోట్ల రద్దు తీసుకువస్తారా?
ఇండియా అనే పేరును తొలగించాలన్న ప్రతిపాదన ఇది కొత్త కాదు. 2012లో కాంగ్రెసు సభ్యుడు శాంతారామ్‌ నాయక్‌ ఇండియా అనే పేరును తొలగించాలని అన్నాడు. ఆయన గోవా కాంగ్రెసు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. 2014లో ఉత్తరప్రదేశ్‌ లో యోగీ ఆదిత్యనాథ్‌ లోక్‌ సభలో ఒక కొత్త ప్రతిపాదన చేశాడు. రాజ్యాంగంలో ఇండియా అని ఉన్నచోట హిందూస్తాన్‌ రాయాలని చెప్పాడు.  2020లో సుప్రీంకోర్టులో ఒక కేసు వచ్చింది. చీఫ్‌ జస్టిస్‌ యస్‌.ఏ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ విషయంలో జోక్యం చేసుకునేది లేదని స్పష్టం చేసింది.

ఇండియా అనే పదం పట్ల ఇంత వ్యతిరేకత బీజేపీలో ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇప్పుడు బీజేపీ నేతలు మాట్లాడుతున్న మాటలు వింటే కంపరమొస్తుంది. బీజేపీ నాయకుడు హర్‌ నాథ్‌ సింగ్‌ యాదవ్‌ ఇండియా అనే పదం బ్రిటీషు వాళ్ళు ఇచ్చిన తిట్టుపదం అన్నాడు. బ్రిటీషు వాళ్ళు ఇచ్చిన పేరే అనుకుందాం. కాని ఇది తిట్టుపదమా? దేశం పేరును తిట్టు పదంగా చెప్పిన ఈ నాయకుడిని ఏమనాలి? అంతర్జాతీయంగా భారతదేశానికి గుర్తింపు ఇండియా అనే పేరుతోనే ఉన్నప్పుడు, ఈ పేరుతో మనకు శతాబ్దాల అనుబంధం ఉన్నప్పుడు, ఇండియా జీతాగా అని మనం గర్వంగా చెప్పుకుంటున్నప్పుడు, ఇండియా అనేది తిట్టుపదం అని చెప్పే ఈ నేతలకు సిగ్గుందా? ఇదే మాటను కాంగ్రెసు నేతలెవరైనా చెప్పి ఉంటే, లేదా ఎవరైనా మరో పార్టీ నాయకుడు చెప్పి ఉంటే దేశభక్తులుగా దండోరా వేసుకునే బీజేపీ నేతలు ఎలాంటి హంగామా చేసి ఉండేవారో ఒకసారి ఆలోచించండి.ఇప్పుడు మోడీగారికి, బీజేపీకి బాకాలుగా మారిన చానళ్ళలో ఇదే చర్చ జరుగుతోంది. తీహార్‌ జైలు చూసొచ్చిన పాత్రికేయుడు సుధీర్‌ చౌదరీ బ్రేకింగ్‌ న్యూస్‌ ‘‘దేశం పేరు ఇప్పుడు ఇండియా నుంచి భారత్‌ అని మారబోతోంది’’ అన్నాడు. నిజానికి భారత్‌ అనే పేరు ఎప్పుడు ఉంది. ఇండియా టీవీ సిగ్గు లేకుండా ‘‘ఇండియా భారత్‌ ఛోడో’’ అని రాసింది. ఇండియా భారత్‌ ఛోడో…ఈ మాటలకు అర్థమేమిటి? నిన్నటి వరకు క్విట్‌ ఇండియా గురించి మాట్లాడిన ప్రధాని క్విట్‌ ఇండియా ఉద్య మాన్ని గుర్తు చేస్తూ అవినీతి క్విట్‌ ఇండియా అన్నారు కదా. ఇప్పుడు ఇండియా పట్ల వ్యతిరేకత ఎందుకు? ఇండియా అంటే తిట్టుపదం, ఇండియా భారత్‌ ఛోడో వంటి మాటలు చెప్పిన, రాసిన వారిపై చర్యలు తీసుకుంటారా?ఇండియా తిట్టుపదమా? నరేంద్రమోడీ 2014లో గెలిచినప్పుడు ప్రధాని మోడీ ఏమని ట్వీట్‌ చేశారు. India has won అని ట్వీటు చేశారు. ఇప్పుడు ఇండియా అనే పదంతో ఎలర్జీ ఎందుకు? ఇండియా అనే పదాన్ని తొలగించి బీజేపీ ప్రభుత్వం భారత్‌ అనే పదం వాడగానే ప్రభుత్వానికి వత్తాసు ఎప్పుడెప్పుడు పలకాలా అని ఎదురు చూసే వాళ్ళు వెంటనే గొంతు విప్పారు. భారతమాతాకి జై అని అమితాబ్‌ బచ్చన్‌ గారు ముందుకు వచ్చాడు. ప్రభుత్వానికి వత్తాసు పలికే మరో ప్రముఖుడు క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఇండియా అనే పేరు బ్రిటీషు వాళ్లు ఇచ్చిన పదమని, భారత్‌ అనే పేరే తగిందని అన్నాడు. వీరేంద్రసెహ్వాగ్‌ ఆడుతున్న క్రికెట్‌ కూడా ఇచ్చింది బ్రిటీషు వాళ్ళే. క్రికెట్‌ వదిలేసి ఆయన కబాడీ ఎందుకు ఆడడం లేదు? మోడీ భజన చేసే కంగానా రణావత్‌ ఏమందంటే పాత డిక్షనరీలో ఇండియా అంటే బానిస అనే అర్థముందంట. ఈ అర్ధాన్ని ఇంగ్లీషు ప్రొఫెసర్లు ఇంతకాలం ఎందుకు చెప్పలేదు? ఇంగ్లీషు తెలియని మనలాంటి అజ్ఞానులకు ఇప్పుడు కంగానా రణావత్‌ ఇంగ్లీషు పాఠాలు చెబుతోంది. భారతదేశానికి స్వతంత్రం 2014లోనే వచ్చిందని చెప్పిన ప్రబుద్దురాలు ఈమె. 2021లో ఈ కంగనా రణావత్‌ ఒక ట్వీటులో ఫాల్‌ ఇన్‌ లవ్‌ విత్‌ ఇండియా అని రాసింది. అప్పుడామెకు ఇండియా అనే పదం అర్థం తెలియదా? ఇక సైనా నెహ్వాల్‌ కూడా వెనకబడ లేదు. జైహింద్‌, భారత్‌ అని ట్వీటు చేసింది. మహిళా మల్లయోధులు ఢల్లీి వీధుల్లో న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు వీళ్ళెవ్వరు అస్సలు నోరు విప్పలేదు. ఎందుకంటే, బీజేపీ నాయకుడు బ్రజ్‌ భూషణ్‌ లైంగిక వేధింపులపై ఆ మహిళా మల్లయోధులు రోడ్లపైకి వచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఈ ప్రముఖుల నోళ్ళు మూతపడతాయి. కాని ఇలాంటి సందర్భాల్లో ముందుకు వచ్చి వీరోచితంగా ట్వీట్లు చేస్తుంటారు. ఇండియా పదాన్ని తొలగించడం అంత అవసరమా? ఇండియా అనే పదం ఒక బ్రాండ్‌, అంతర్జాతీయంగా గుర్తింపు ఈ పదంతో ముడిపడి ఉంది అని శశిథరూర్‌ రాసిన ట్వీటులో వాస్తవముంది.

ఇండియా భారత్‌ అనే ఈ కృత్రిమ చర్చను ప్రారంభించిన వాళ్ళు కోరుకునేది ప్రజల్లో విభజన. ఐదు దశాబ్ధాల పాటు తమ కార్యాలయంలో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడానికి ఇష్టపడని సంస్థ అధిపతి ఇండియా పేరు వద్దు భారత్‌ పేరు కావాలని చెప్పిన వెంటనే దేశభక్తి మా స్వంతం అన్నట్లు మాట్లాడే పాలకపక్షం నేతలు ఇండియా అనే పేరు పట్ల ఏవగింపును ప్రదర్శిస్తూ మాట్లాడుతున్నారు. ఈ వాస్తవాలను ప్రజలు గుర్తించాలి.

అసలిప్పుడు ఈ ఇండియా వర్సెస్‌ భారత్‌ అనే చర్చ ఎందుకు మొదలయ్యింది? ఇది ఆలోచించవలసిన ప్రశ్న. అంతకన్నా ముందు ఆలోచించవలసిన ప్రశ్న ఏమంటే గతంలో ఇండియా అనే పదం విషయంలో బీజేపీ వైఖరి ఏమిటి? 2015 నవంబర్‌ 16వ తేదీ ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ కథనం ప్రకారం భారత ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్‌ దాఖలు చేసి ఇండియాకు బదులు భారత్‌ అని పిలవవలసిన అవసరమేమీ లేదని, రాజ్యాంగంలోని అధికరణ 1 మార్చవలసిన అవసరమేమీ లేదని పేర్కొంది. ఈ విషయం ఎందరికి తెలుసు. 2015లో ఇదే మోడీ సర్కారు సుప్రీంకోర్టులో చెప్పిన మాటలు ఇవి. ఇప్పుడు హఠాత్తుగా ఇండియా అంటే బీజేపీ నేతలకు తిట్టుపదమైపోయింది. ఎందువల్ల? 2004లో ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఒక తీర్మానం ఆమోదించింది. అదేమిటంటే,”India, that is Bharat” అనే వాక్యాన్ని మార్చి”Bharat that is India” చేయాలని కోరింది. అప్పుడు ములాయం సింగ్‌ యాదవ్‌ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి. ఈ తీర్మాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ వాకౌట్‌ చేసింది. బీజేపీ సభ నుంచి వాకౌట్‌ చేసినా ముఖ్యమంత్రిగా ఉన్న ములాయం సింగ్‌ యాదవ్‌ ఈ తీర్మానాన్ని ఆమోదింపజేశారు. ఇండియా పేరు బదులు భారత్‌ అని మార్చ వలసిన అవసరం లేదని సుప్రీంకోర్టుకు కూడ చెప్పుకున్న బీజేపీ స్వయంగా ఇప్పుడు ఇండియా బదులు భారత్‌ వాడాలంటోంది. ఇప్పుడు ఎందుకు హఠాత్తుగా ఈ చర్చ.

మోడీ ప్రధాని అయిన తర్వాత స్కిల్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా అంటూ ప్రారంభించిన అనేక కార్యక్రమాల్లో ఇండియానే వాడారు. అప్పుడు ప్రధాని మోడీకి ఇండియా అనేది ఆయన పార్టీలోని నాయకుడే చెప్పినట్లు ఇండియా తిట్టుపదం అని తెలియదా? అంతకు ముందు బీజేపీ నేతలు షైనింగ్‌ ఇండియా నినాదం ఇచ్చినప్పుడు వారికి తెలియదా? కరెన్సీ నోట్లపై రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనేది మార్చి ఇప్పుడు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ భారత్‌ అంటారా? దీని కోసం మళ్ళీ నోట్లు ముద్రిస్తారా? మళ్లీ నోట్లు రద్దు చేస్తారా? దేశంలోని పాస్‌ పోర్టులన్నీ మార్చాల్సి వస్తుందా? ఇదంతా ఎందుకంటే, ప్రజల సమస్యలపై చర్చ జరక్కుండా, కేవలం ఇలాంటి కృత్రిమ చర్చలు బాకా టీవీ చానళ్ళలో చలాయిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించడమే.

దేశంలో ఇప్పుడు ఇలాంటి కృత్రిమ చర్చల సంస్కృతి పెరిగింది. అసలు సమస్యలను పక్కదారి పట్టించే వీరావేశపు చర్చలు టీవీల్లో జరుగుతుంటాయి. కొన్ని అవసరమైన చర్చలు ప్రజల్లోకి రాకుండా ఉండడానికి ఈ కృత్రిమ చర్చలు మొదలవు తుంటాయి. జి20 సమావేశానికి ముందు అంతర్జాతీయ పత్రికల్లో అదానీ గురించి వచ్చింది. అదానీ గ్రూపు అవకతవక లపై వార్తలు వరుసగా వస్తున్నాయి. ఈ వార్తలపై ప్రజల దృష్టి పడకుండా మళ్ళించడానికి, మరోవైపు రాహుల్‌ గాంధీ వరుసగా అదానీ విషయంలో చేస్తున్న దాడుల నుంచి ప్రజల దృష్టి మళ్ళిం చడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల సర్జికల్‌ స్ట్రయిక్‌ మరోసారి జరిగిందంటూ ఒక మాట ప్రచారంలో పెట్టారు. దైనిక్‌ జాగారణ్‌ పత్రిక పతాకశీర్షికలో ఈ వార్త రాసింది. ప్రజలు ఆహా మోడీ ప్రభుత్వం ఎంత గొప్పగా పాకిస్తాన్‌కు బుద్ధిచెబు తుందో అనుకునే లోపే భారత సైన్యం ఈ వార్తలో వాస్తవం లేదని ప్రకటించింది. ఇప్పుడు ఇండియా, భారత్‌ అనే పేర్లపై చర్చ మొదలెట్టారు. ఇప్పుడు పత్రికల్లో, చానళ్ళలో జి20 వార్తలకు బదులు, అదానీ గురించి అంతర్జాతీయంగా వస్తున్న వార్తలకు బదులు ఇండియా, భారత్‌ అనే చర్చ ప్రముఖంగా కనిపిస్తోంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ప్రకటన వచ్చినప్పటి నుంచి దినపత్రికల్లో శీర్షికలు రోజుకొకటి మారిపోతున్నాయి.

చానళ్ళలో రోజుకో కొత్త చర్చ వస్తోంది. మహిళల రిజర్వేషన్లంటూ ఒకసారి చర్చ, ఒకేదేశం ఒకే ఎన్నిక అంటూ మరో సారి చర్చ, ఇప్పుడు ఇండియా వర్సెస్‌ భారత్‌ చర్చ. ఈ చర్చలన్నీ అసలు చర్చను చాపక్రిందికి ఊడ్చేసే ఎత్తుగడలు మాత్రమే.
ఇలా కృత్రిమ చర్చలను తీసుకువచ్చి ప్రజల దృష్టి మళ్ళించే ఎత్తుగడ కొత్తదేమీ కాదు. ఇంతకు ముందు కేబినేట్‌ విస్తరణ అంటూ ఒక చర్చ వచ్చింది. అదేమయ్యిందో ఎవరికి తెలియదు. యూనిఫాం సివిల్‌ కోడ్‌ అనే చర్చ ముందుకు తీసుకువచ్చారు. అది కూడా ఇప్పుడు వినబడడం లేదు. ఎందుకంటే చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల వారికి, క్రయిస్తవులకు మినహాయింపులిస్తామనే మాటలు కూడా వచ్చాయి. అలాంటి మినహాయింపులుంటే ఇక అది యూనిఫాం సివిల్‌ కోడ్‌ ఎలా అవుతుందన్న విమర్శలు వచ్చాయి. చివరకు అది చర్చల్లో కనబడకుండా పోయింది. ఆ తర్వాత స్వతంత్ర దినోత్సవం రోజున వివేక్‌ దేబ్రాయ్‌ రాజ్యాంగాన్ని మార్చాలంటూ వ్యాసం రాశాడు. కొత్త రాజ్యాంగం అవసర మన్నాడు. దానిపై పెద్ద చర్చే జరిగింది. ఇలాగే 2019 చివరిలో పౌరసత్వ సవరణ చట్టం చేశారు. ఎన్నార్సీ ప్రచారం విపరీతంగా చేశారు. పౌరసత్వ సవరణ చట్టం ఇక అమలైపోతుందను కున్నారు. కాని ఇప్పటి వరకు అమలు కాలేదు. మార్గదర్శక నియమాలే రూపొందలేదు. కాని పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తు అనేకమంది నిరస నలు చేశారు. ఢల్లీిలో అల్లర్లు జరిగాయి. గోలీమారో అనే నినాదాలు మంత్రులే ప్రజలతో చెప్పించారు. ఏది ఏమైనా ఇలాంటి కృత్రిమ చర్చల్లో ప్రజలు తలమునకలై ఉండేలా చేస్తున్నారు. ఇలాంటి చర్చలేవీ చేయించే అవకాశం లేనప్పుడు టాస్కులు ఇస్తుంటారు. బాల్కనీలో నిలబడి పళ్ళాలు పట్టుకుని వాయించండి అంటారు. వెంటనే అత్యుత్సాహంగా ఆ టాస్కును పూర్తి చేసేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రజలను బిజీగా ఉంచడం ఎలాగో తెలిసిన రాజకీయమిది. ఇలా బిజీ బిజీ అయిపోయిన ప్రజలు అసలు సమస్యలను చూడనే చూడరు.

టెలీగ్రాఫ్‌లో వచ్చిన ఒక వార్త ప్రకారం ఒకే దేశం ఒకే ఎన్నిక విషయంలో ఏర్పరచిన కమిటీ సభ్యుడు హరిష్‌ సాల్వే మూడో పెళ్ళి చేసుకున్నాడు. ఆ పెళ్ళి పార్టీలో లలిత్‌ మోడీ ప్రముఖంగా కనిపించాడు. లలిత్‌ మోడీ ఎవరో తెలుసా? ఈయన పేరు గురించి ప్రస్తావించిన ప్రసంగం వల్లనే రాహుల్‌ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది. బ్యాంకులను ముంచి లలిత్‌ మోడీ దేశం వదిలి పోలేదా? హరీష్‌ సాల్వే ఎవరంటే మాజీ సోలిసిటర్‌ జనరల్‌. ఈయన లండనులో లలిత్‌ మోడీ పక్షాన కోర్టులో వాదించిన లాయరు కూడాను. ఈ వార్త, లలిత్‌ మోడీతో హరీష్‌ సాల్వే సంబంధాలు, హరిష్‌ సాల్వే వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ కమిటి సభ్యత్వం వగైరాల గురించి మనకు చెప్పే పత్రికలేవి? ఈ విషయమై ప్రజల్లో చర్చ కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు చర్చించడానికి కృత్రిమ చర్చలు అనేకం ముందున్నాయి. అందులో ఇండియా వర్సెస్‌ భారత్‌ ఒకటి. లలిత్‌ మోడీపై భారత క్రికెట్‌ బోర్డు నిషేధం విధించిం దన్నది కూడా ప్రజలకు తెలియాలి. ఆ లలిత్‌ మోడీనే మాజీ సోలిసిటర్‌ జనరల్‌, వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ కమీటీ సభ్యుడు తన పెళ్ళికి పిలిచి మర్యాదలు చేశాడన్నది కూడా ప్రజలకు తెలియాలి. హరీస్‌ సాల్వే పార్టీలో మోయిన్‌ ఖురైషీ కూడా ఉన్నాడు. ఇద్దరు సిబిఐ డైరెక్టర్లు మొయిన్‌ ఖురైషీ వల్లనే తమ పదవులకు దూరమయ్యారు. మనీ లాండరింగ్‌ ఆరోపణలున్న వ్యక్తి. ఇలాంటి విషయాలపై చర్చ జరుగుతుందా? లేదు… అలాగే అదానీ గ్రూపు విషయంలో వస్తున్న వార్తలపై మన మీడియాలో చర్చ జరుగుతుందా? లేదు…. మణిపూర్‌లో ఏం జరుగుతోంది. మళ్ళీ అక్కడ కర్ఫ్యూ విధించారు. ఎడిటర్స్‌ గిల్డ్‌ అక్కడికి తన ప్రతినిధుల బృందాన్ని పంపించి వాస్తవాలు తెలుసుకునే ప్రయ త్నాలు చేసింది. అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి ఎడిటర్స్‌ గిల్డ్‌ ప్రతినిధుల వల్లనే రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిని ఉద్రిక్తతలు పెరుగుతున్నాయంటూ కేసులు పెట్టాడు. దీనిపై కోర్టు స్టే విధించింది. ఈ విషయమై చర్చ జరుగు తుందా… లేదు…చర్చ కేవలం ఇండియా వర్సెస్‌ భారత్‌ వంటి కృత్రిమ సమస్యలపై జరుగుతుంది. ప్రధాని మోడీ మణిపూర్‌ ఎందుకు వెళ్ళడం లేదని ఎవరు అడగరు? ఆయన జకార్త వెళుతున్నారు. జోహన్నెస్‌ బర్గ్‌ వెళుతున్నారు. కాని మణిపూర్‌ వెళ్ళరు. ఎందుకు వెళ్ళడం లేదని అడిగే తీరిక ఎవరికీ లేదు. ఎందుకంటే అందరూ ఇండియా వర్సెస్‌ భారత్‌ వంటి కృత్రిమ చర్చల్లో బిజిగా ఉన్నారు.
ఈ చర్చ కొంతకాలం కొనసాగిస్తారు. భారత్‌ అనే పేరు పట్ల ఎవరికో అభ్యంతరాలున్నాయనే భ్రమను సృష్టించే ప్రయత్నాలు బహుశా ఫలిస్తున్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే కాంగ్రెసు కూడా భారత్‌ అనే పేరును చాలా సార్లు ప్రముఖంగా ఉపయో గించింది. భారత్‌ జోడో యాత్ర. జుడేగా భారత్‌ జీతేగా ఇండియా ఇలా అనేక ఉదాహరణలున్నాయి. అలాగే బీజేపీ కూడా ఇండియా పదాన్ని చాలా విస్తృతంగా ఉపయోగించిం దన్నది అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల ఈ చర్చ ఎక్కువగా జరిగితే తమకే నష్టమనే వాస్తవాలు ఇప్పుడు అర్థమవు తున్నట్లున్నాయి. అందువల్లనే ‘మింట్‌’లో వచ్చిన వార్త ప్రకారం ప్రధాని మోడీ తన మంత్రివర్గ సభ్యులను ఇండియా, భారత్‌ చర్చకు దూరంగా ఉండమని చెప్పినట్లు వార్త వచ్చింది. బహుశా ఈ చర్చ ఇప్పుడు కనుమరుగు అయిపోవచ్చు. కాని ఇలాంటి కృత్రిమ చర్చలను రెచ్చగొడుతున్నది ఎవరో ప్రజలు గుర్తించాలి.

-వాహెద్