‘అంతర్జాతీయం’ అనే పదానికి అప్పట్లో అర్థమే లేదు. ఎందుకంటే, ఆధునిక నేషన్ స్టేట్స్ లేదా దేశాలు అప్పట్లో లేవు. కాని చక్రవర్తులు, రాజులు, తెగల నేతల పాలనాపరిధిలో ఉన్న భూభాగాలు ఉండేవి, కొందరి అధికార పరిధిలో విశాల భూభాగాలుండేవి, కొందరి అధికార పరిధిలో పరిమితమైన భూభాగం ఉండేది. ఈ పాలకుల మధ్య సంబంధాలనే అప్పట్లోని అంతర్జాతీయ సంబంధాలుగా భావించాలి. కాబట్టి నేడు మనకు తెలిసిన ఆదునిక అంతర్జాతీయ శాసనాలనే భావనే అప్పట్లో లేదు. ప్రవక్త ముహమ్మద్ (స) ఆగమనం తర్వాత, ఆయన్ను దైవం ప్రవక్తగా నియమించిన తర్వాత దివ్యఖుర్‌ఆన్ గ్రంథం ద్వారా మానవాళికి అవసరమైన మార్గదర్శక బోధనలను పంపించాడు. ఈ బోధనల వెలుగులో ప్రవక్త ముహమ్మద్ (స) ఆచరణలు, ఆయన చెప్పిన మాటలు ఇస్లామీయ శాసనాంగం అయ్యాయి. ఇదే షరీఅత్.
ప్రవక్త ముహమ్మద్ (స) గురించి మనం మాట్లాడుతున్నామంటే అర్థం నేటికి పద్నాలుగు శతాబ్దాల ముందు కాలం గురించి మాట్లాడుతున్నాం. అప్పటి ప్రపంచం ఎలా ఉండేది? నేటి ప్రపంచం వేరు, అప్పటి ప్రపంచం వేరు. కాని అప్పుడు కూడా అగ్రరాజ్యాలు ఉండేవి. నేటి మాదిరిగానే. అప్పటి అగ్రరాజ్యాలు రెండు. తూర్పున బైజాంటైన్ సామ్రాజ్యం ఇది రోమన్ సామ్రాజ్యానికి కొనసాగింపు. రెండవది సాసానీ సామ్రాజ్యం. ఇది పర్షియన్ సామ్రాజ్యానికి కొనసాగింపు. అప్పట్లో భారత దేశంలోని గుప్తుల సామ్రాజ్యం కూడా పెద్దదే. అప్పట్లో అరేబియాలో చిన్న చిన్న తెగల గణరాజ్యాలు కూడా ఉండేవి. వాటికి అంత బలం లేదు. గుప్తుల సామ్రాజ్యం ఇస్లాం రాక మునుపే పతనమయ్యింది. భారతదేశంలో చాళుక్యుల కాలం అది. అరేబియాలో ప్రవక్త ముహమ్మద్ (స) నాయకత్వంలో ఇస్లామ్ విస్తరించడం ప్రారంభమైన కాలం. అప్పట్లో సాంకేతికంగా ప్రపంచం చాలా వెనుకబడి ఉంది. ఇప్పటి ఆధునిక యంత్రాలు లేవు. చాలా పనులు నేడు కృత్రిమ మేథస్సుతో జరుగుతున్నాయి. అప్పట్లో చిన్న చిన్న పనులు కూడా మనిషి స్వహస్తాలతో చేసుకోవలసి ఉండేది. నేడు ఈ మెయిల్‌తో సందేశం పంపేస్తాం. లేదా వాట్సప్ చేసేస్తాం. కాని అప్పట్లో ఒక సందేశం పంపాలంటే మనిషికి ఇచ్చి పంపాలి, ఎంత దూరమైనా సరే. అంటే ఒక సందేశం దూర ప్రాంతానికి వెళ్ళాలంటే కొన్ని నెలలు, ఒక్కోసారి సంవత్సరాలు పట్టేది. అయితే శాస్త్ర సాంకేతిక పరిశోధనలు జరుగుతూ ఉండేవి. మనిషి ఎల్లప్పుడు కొత్త విషయాలను కనుగొనే అన్వేషణ లోనే ఉన్నాడు. బగ్దాద్, అలెగ్జాండ్రియాల్లో గొప్ప విద్యాలయాలు ఉండేవి. అంతకు ముందు గ్రీకు, రోమన్, భారతీయ ప్రాచీన నాగరికతలు, విద్యాసంస్థలు ఉండేవి. వర్తక వాణిజ్యాల విషయానికి వస్తే సిల్కు రోడ్డు ద్వారా వివిధ ప్రాంతాల మధ్య వాణిజ్యం జరిగేది. నేటి మాదిరి దేశాల సరిహద్దులు లేవప్పుడు. అందువల్ల అంతర్జాతీయ వాణిజ్యం అని పూర్తిగా చెప్పలేము. కాన్‌స్టాంటి నోపుల్ అంటే నేటి టర్కీ రాజధాని ఇస్తాంబుల్, అలెగ్జాండ్రియా తదితర నగరాలకు సిల్కు రోడ్డు ద్వారా వాణిజ్యం జరిగేది. ఇండియా, చైనా, మధ్యప్రాచ్యంలో అనేక సంస్కృతులు వర్ధిల్లాయి. సమాజంలో అనేక నిమ్నోన్నతలు ఉండేవి. పాలకులు, కులీనులు, సాధారణ ప్రజలు, బానిసలు. ప్రపంచంలో అనేక చోట్ల బానిసత్వం అప్పట్లో ఉండేది. ఆధునిక దేశాలు లేదా నేషన్ స్టేట్స్ అనే భావన అప్పట్లో లేదు. చక్రవర్తులు, రాజులు, తెగల నాయకులు తమ అధికార పరిధిలో పాలించేవారు. యుద్ధాలు, సామ్రాజ్య విస్తరణలు, రక్తపాతాలు సాధారణంగా జరుగుతూ ఉండేవి. అప్పటి కాలం గురించి మనం మాట్లాడు కుంటున్నాం.
‘అంతర్జాతీయం’ అనే పదానికి అప్పట్లో అర్థమే లేదు. ఎందుకంటే, ఆధునిక నేషన్ స్టేట్స్ లేదా దేశాలు అప్పట్లో లేవు. కాని చక్రవర్తులు, రాజులు, తెగల నేతల పాలనాపరిధిలో ఉన్న భూభాగాలు ఉండేవి, కొందరి అధికార పరిధిలో విశాల భూభాగాలుండేవి, కొందరి అధికార పరిధిలో పరిమితమైన భూభాగం ఉండేది. ఈ పాలకుల మధ్య సంబంధాలనే అప్పట్లోని అంతర్జాతీయ సంబంధాలుగా భావించాలి. కాబట్టి నేడు మనకు తెలిసిన ఆదునిక అంతర్జాతీయ శాసనాలనే భావనే అప్పట్లో లేదు. ప్రవక్త ముహమ్మద్ (స) ఆగమనం తర్వాత, ఆయన్ను దైవం ప్రవక్తగా నియమించిన తర్వాత దివ్యఖుర్‌ఆన్ గ్రంథం ద్వారా మానవాళికి అవసరమైన మార్గదర్శక బోధనలను పంపించాడు. ఈ బోధనల వెలుగులో ప్రవక్త ముహమ్మద్ (స) ఆచరణలు, ఆయన చెప్పిన మాటలు ఇస్లామీయ శాసనాంగం అయ్యాయి. ఇదే షరీఅత్.
అంతర్జాతీయ సంబంధాల విషయంలో ప్రవక్త ముహమ్మద్ (స) బోధనలు ఏమున్నాయని ప్రవక్త జీవిత చరిత్రను పరిశీలిస్తే ఆధునిక అంతర్జాతీయ శాసనాలకు అక్షరాలు నేర్పింది ఆయనే అని అర్థమవుతుంది. వివిధ సముదాయాల మధ్య ఒప్పందాలు, అంగీకారాలు ఆయన జీవిత కాలంలో అనేకం జరిగాయి. ఇరుగు పొరుగు తెగలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా శాంతియుత సహజీవనానికి, ముస్లిములు, ముస్లిమేతరుల హక్కుల పరిరక్షణకు ఆయన ప్రయత్నించారు. అప్పట్లో తెగలంటే నేటి దేశాలుగానే భావించాలి. ఎందుకంటే ఆయా తెగల నాయకులకే ఆ తెగ నివసించే ప్రాంతంలో సర్వాధికారాలుండేవి. ఆయా తెగలతో ఒప్పందాలు నిజానికి నేటి అంతర్జాతీయ ఒప్పందాల స్థాయి కలిగినవి.
ఈ ఒప్పందాలు ఇష్టమొచ్చినట్లు చేసుకున్న ఒప్పందాలు కావు. దివ్యఖుర్‌ఆన్ బోధనల వెలుగులో, ఖచ్చితమైన నియమ నిబంధనలకు లోబడి ఆయన ఒప్పందాలు చేసుకున్నారు. న్యాయం, పరస్పర గౌరవమర్యాదలు, దాడులు చేయకపోవడం, దాడులు జరిగితే సహకరించడం వంటి మౌలిక నియమ నిబంధనల ప్రాతిపదికన ఈ ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాల్లో కీలకమైన అంశం గమనిస్తే వ్యక్తులు, సము దాయాలన్నీ సమానం, అందరితోను సమాన వ్యవహారశైలి ఉండాలన్న సూత్రం ప్రాతిపదికగా కనిపిస్తుంది. ఇవన్నీ మత విశ్వాసాలకు అతీతంగానే కనిపిస్తాయి. అంటే ముస్లిములకు, ముస్లిమేతరులకు మధ్య భేదభావం చూపించడం అనేది ఎక్కడా కనిపించదు. ప్రవక్త ముహమ్మద్(స) ఇచ్చిన మాటకు కట్టు బడాలని, ఒప్పందాలను గౌరవించాలని గట్టిగా బోధించిన అనేక ప్రవచనాలు న్నాయి. నేటి ఆధునిక అంతర్జాతీయ శాసనాల్లోను ఇదే మౌలికమైన, కీలకమైన నియమం.
న్యాయసూత్రాలు, మానవ హక్కులు, అణిచివేతల నిషేధం, దాడులను నివారించడం` ఇవన్నీ ప్రవక్త ముహమ్మద్ (స) మాటల్లోను, చేతల్లోను స్పష్టంగా కనిపిస్తాయి. వివిధ తెగల మధ్య కుదిరిన ఒప్పందాల్లోను ఇవి కనిపిస్తాయి. ఇవే మౌలిక నియమాలు నేటి అంతర్జాతీయ మానవహక్కుల్లోను, మానవీయ చట్టంలోను, అంతర్జాతీయ చట్టాల్లోను తర్వాతి కాలాల్లో చోటు చేసుకున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ సూత్రాలు అంతర్జాతీయ చట్టాల రూపకల్పనకు తోడ్పడ్డాయి. ఆధునిక అంతర్జాతీయ శాసనం యూరపులో సాంస్కృతిక పునరుజ్జీవనం తరువాత ప్రారంభమయ్యిందని అంటుంటారు. ఆధునిక చరిత్ర ప్రారంభంలో అంతర్జాతీయ ఒప్పందాలు, సంప్రదాయాల పునాదులపై ఈ చట్టాలు ఏర్పడ్డాయని భావిం చడం జరుగుతుంది. కాని నిశితంగా పరిశీలిస్తే ఈ ఆధునిక ఒప్పందాలు, అంతర్జాతీయ వ్యవహారాల సంప్రదా యాల వెనుక సుదీర్ఘకాలంగా ఇస్లామీయ సామ్రాజ్యం ఆచరించి చూపించిన నమూనా పునాదిగా కనిపించి తీరుతుంది. ఈ నమూనా ప్రవక్త ముహమ్మద్ (స) జీవితకాలంలో ఆచరించి చూపించిందే.
ఉదాహరణకు యుద్ధ నియమాలను ప్రపంచంలో ఖచ్చితంగా ప్రవేశపెట్టింది ప్రవక్త ముహమ్మద్ (స). నేడు అంతర్జాతీయ న్యాయసూత్రాల్లో Just war theory వెనుక ఈ నియమాల ప్రభావమే ఉందంటే అతిశయోక్తి లేదు. అంతర్జాతీయ చట్టం పౌరులకు రక్షణ కల్పించాలని చెబుతుంది. నిరాయుధులపై దాడి చేయరాదని చెబుతుంది. యుద్ధఖైదీల పట్ల మానవీయంగా వ్యవహరించాలని చెబుతుంది. యుద్ధాల్లో అనవసర ప్రాణ నష్టాలకు పాల్పడరాదని చెబుతుంది. ఆచరణలో ఇవన్నీ ఎంత వరకు నిలబెట్టుకుంటారన్నది నేటి యుద్ధాలను పరిశీలిస్తే తెలిసి పోతుంది. కాని ఈ సూత్రాలన్నీ ప్రవక్త బోధనల్లో కనిపించడమే కాదు, అప్పటి యుద్ధాల్లోను ఈ బోధనలకు కట్టుబడిన అనేక ఉదాహరణలు మనకు చరిత్రలో కనిపిస్తాయి. అలాగే దౌత్యపర మైన ఒప్పందాలు ఆధునిక అంతర్జాతీయ వ్యవహారాల్లో మనం రోజు వింటూ ఉంటాం. ఈ ఆధునిక భావన ప్రవక్త కాలంలోను కనిపిస్తుంది. వివిధ తెగలతో అనేక ఒప్పందాల్లో ఈ సూత్రాలే మనకు కనిపిస్తాయి. మతస్వేచ్ఛ, శాంతి, పరస్పర సహకారం వంటి నియమాలు మనకు ఆధునిక ఒప్పందాలు, దౌత్య వ్యవహారాల్లో ప్రముఖంగా కనిపిస్తుంటాయి. క్లుప్తంగా చెప్పా లంటే ఆనాటి ఒప్పందాలే ఆధునిక వ్యవహారాల్లో నియమ నిబంధనలకు పునాదులయ్యాయి.
యుద్ధాల్లో నిరాయుధులకు రక్షణ కల్పించడమన్నది ఇస్లామీయ యుద్ధ నియమాల్లో ముఖ్యమైనది. ఇందులో మహిళలు, పిల్లలు, నిరాయుధులైన వారిపై దాడి చేయరాదని స్పష్టమైన నిర్దేశాలున్నాయి. ఇవన్నీ మనకు ఆధునిక అంతర్జాతీయ మానవీయ చట్టంలోను కనిపించే విషయాలే. ఇంకా చెప్పాలంటే, యుద్ధ ఖైదీలకు రక్షణ కల్పించాలన్న నియమం మనకు స్పష్టంగా దివ్య ఖుర్‌ఆన్‌లోనే కనిపిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ (స) వివాదాలకు శాంతియుత పరిష్కారం సాధించాలని నొక్కి చెప్పారు. సలహాలు, సంప్రదింపులు, మధ్యవర్తుల సహకారం వంటి పద్ధతుల ద్వారా వివాదాల పరిష్కారానికి ఆయన చూపించిన మార్గమే నేడు సలహా సంప్రదింపులతో వివాదాల పరిష్కారం అనే భావనగా కనిపిస్తుంది. అనేకవిధాలుగా మనకు అంతర్జాతీయ న్యాయ సూత్రాల్లో ప్రవక్త బోధనల ప్రభావం కనిపిస్తుంది.
క్లుప్తంగా చెప్పాలంటే న్యాయబద్దమైన యుద్ధం Just war, దౌత్య ప్రయత్నాలు, నిరాయుధులకు రక్షణ, శాంతియుతంగా వివాదాల పరిష్కారమనే పద్ధతులు, సూత్రాలు ప్రవక్త ముహమ్మద్ (స) ద్వారా నేటి ఆధునిక అంతర్జాతీయ శాసనాల వరకు వచ్చాయని భావించాలి. ఈ సూత్రాలే అంతర్జాతీయ సంప్రదాయాలకు పునాదులయ్యాయి. ప్రస్తుత అంతర్జాతీయ న్యాయ సూత్రాలు రూపొందడానికి భూమికలయ్యాయి.
ప్రవక్త ముహమ్మద్ (స)కు ముందు ప్రపంచంలో ఇలాంటి విశ్వజనీన భావనేదీ లేదు. వివిధ సాంప్రదాయిక, ప్రాంతీయ, తెగల ప్రధానమైన చట్టాలు, కట్టుబాట్లు ఉండేవి. ఈ చట్టాలు, సంప్రదాయాల ప్రకారం వివిధ తెగలు, రాజ్యాలు వ్యవహరించేవి. గమనించవలసిన విషయమేమిటంటే, అప్పట్లో అంతర్జాతీయ సంబంధాలు సాధారణంగా బలాబలాల తూకంపై, తెగల సంప్రదాయాలపై, తాత్కాలిక ఏర్పాట్లపై ఆధారపడి ఉండేవి. అంతేకాని శాశ్వతమైన, లాంఛనమైన, ఖచ్చితమైన న్యాయచట్రం అంటూ ఏదీ ప్రవక్త ముహమ్మద్ (స) కు ముందు కాలంలో లేదు. ఉదాహరణకు సాంప్రదాయిక చట్టాలు వివిధ తెగలకు భిన్నరూపాల్లో ఉండేవి. ఈ సాంప్రదాయిక చట్టాలు మతం, సమాజం, సంస్కృతి తదితర అంశాలపై ఆధారపడి ఉండేవి. మరోవైపు తెగల మధ్య సంబంధాలు రక్త సంబంధాల ప్రాతిపదికన కూడా ఉండేవి. వివాదాలు, ఘర్షణలు తలెత్తితే తెగల మండళ్ళు లేదా లాంఛ నేతర సంప్రదింపుల ద్వారా అప్పుడప్పుడు పరిష్కరించుకోవడం కూడా జరిగేది. తరచూ యుద్ధాలు జరిగేవి. యుద్ధాల్లో నియమనిబంధలేవీ లేవు. అత్యంత క్రూరంగా శత్రువులను అణచివేయడమే ఉండేది. నిరాయుధులు, పిల్లలు, మహిళలన్న విచక్షణ కూడా సాధారణంగా ఉండేదికాదు. దౌత్యసంబంధాలనే భావన కూడా అప్పట్లో లేదు. పాలకుల వ్యక్తిగత రాయబారుల ద్వారా సందేశాలు పంపించడం మాత్రమే ఉండేది. అలాంటి రాయబారులకు దౌత్యపరమైన రక్షణ అనేది ఏదీ ఉండేది కాదు. రాయబారులకు భద్రత అన్నది దాదాపు లేదనే చెప్పాలి. చాలా సందర్భాల్లో వివిధ తెగలు, లేదా రాజ్యాల వ్యవహారశైలి వారి మతాచారాల ప్రకారం ఉండేది. మతపెద్దలకు నిర్ణయాధికారాలు ఉండేవి. వాణిజ్యం వివిధ ప్రాంతాల మధ్య జరిగినా అది పరస్పర లాభాలు పునాదిగా జరిగేది, అంతే తప్ప ఖచ్చితమైన న్యాయచట్రం ఏదీ ఉండేది కాదు.
ఈ నేపథ్యంలో మనం ప్రవక్త ముహమ్మద్(స) బోధనలను చూడాలి. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ప్రవక్త ముహమ్మద్(స) బోధనలు, ఆయన ఆచరణలు అప్పటి ప్రపంచంలో సరికొత్త భావనలను ప్రవేశపెట్టాయి. ఈ భావనలే అంతర్జాతీయ వ్యవహారాలపై తర్వాతి కాలాల్లో గొప్ప ప్రభావాన్ని వేశాయి. ఇందులో మతపరమైన మైనారిటీల హక్కులను గుర్తించడం కూడా ఒకటి. యుద్ధ నియమాలు, రాయబారులకు రక్షణ, యుద్ధఖైదీల హక్కులు ఇలాంటి అనేక భావనలు నెమ్మదిగా చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ శాసనాలు మధ్యయుగాల్లో, ఐరోపాలో సాంస్కృతిక పునరుజ్జీవనం తర్వాతి కాలాల్లో యూరపులో ప్రారంభమయ్యాయని చాలా మంది విశ్వసి స్తున్నప్పటికీ, ఈ భావనలకు పునాదులు మనకు ఇస్లామీయ చట్టాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ప్రారంభ కాలాల్లోని ఇస్లామీయ న్యాయనిపుణులు, ఉదాహరణకు అల్ షేబానీ, అల్ మవార్దీ వంటి వారు అంతర్జాతీయ సంబంధాలపై, వివిధ దేశాల వ్యవహారాల శైలి గురించి వివరణాత్మకంగా గ్రంథాలు రాశారు. ఈ గ్రంథాలు తర్వాతి కాలాల్లో అంతర్జాతీయ శాసనాల రూపకల్పనపై ప్రభావం వేశాయి.
ప్రవక్త ముహమ్మద్ (స) కాలంలో తెగల పాలనా భూభాగం దేనికదే ఒక రాజ్యంగా ఉండేది. రోమన్, పర్షియన్ సామ్రాజ్యాలు మహాశక్తిమంతమైన సామ్రాజ్యాలుగా ఉండేవి. వివిధ రాజ్యాలు సామంత రాజ్యాలుగా ఉండడమో లేక మహాసామ్రాజ్యం తరఫున నియమించబడిన గవర్నర్ పరిపాలనలో ఉండడమో జరిగేది. ఈ పరిస్థితుల్లో ఒక చిన్న ముస్లిం రాజ్యం రూపుదిద్దు కుంటున్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ (స) చూపించిన రాజనీతి, దౌత్యనీతికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు మనకు ఆ కాలంలో ప్రవక్త ముహమ్మద్ (స) బోధనలు, ఆచరణలు నేటి అంతర్జాతీయ శాసనానికి ఎలా తోడ్పడ్డాయో అర్థమవుతుంది. నేడు అంతర్జాతీయ శాసనంలో అత్యంత కీలకమైన విషయం శాంతి స్థాపన అన్నది మరిచిపోరాదు. ఇదే సూత్రం అప్పట్లో ప్రవక్త ముహమ్మద్(స) బోధనల్లో, ఆచరణల్లో ముఖ్యంగా కనిపిస్తుంది.
ఇలాంటి ఒప్పందాల్లో క్రీ.శ.628లో జరిగిన హుదైబియా ఒప్పందం గురించి ప్రస్తావించాలి. అంతర్జాతీయ సంబంధాలు, దౌత్యనీతి, రాజనీతి ఇవన్నీ మనకు ఈ హుదైబియా ఒప్పందంలో కనిపిస్తాయి. మదీనాలో ఇస్లామీయ రాజ్యానికి, మక్కాలోని ఖురైష్ తెగల రాజ్యానికి మధ్య కుదిరిన ఒప్పందం ఇది. ఈ ఒప్పందం పదేళ్ళ కొరకు కుదిరిన నిర్యుద్ధ ఒప్పందం. నేటి ఆధునిక కాలంలోను మనకు నిర్యుద్ధ ఒప్పందాలు, కాల్పుల విరమణ అంగీకారాలు తెలుసు. ఈ ఒప్పందాలు శాంతి స్థాపన ముఖ్య లక్ష్యంగా జరుగుతుంటాయి. జాతీయ రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా ఇలాంటి ఒప్పందాల్లో కొంతమేరకు సర్దుబాట్లు చేసుకోవటం, కొంత వెనక్కి తగ్గడం, పట్టువిడుపులు చూపించడం అనేది దౌత్యనీతి. పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం కుదిరిన ఈ ఒప్పందంలోను మనకు ఈ దౌత్యనీతి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆరేళ్ళుగా ఎడతెగకుండా మదీనా, మక్కాల మధ్య ఘర్షణలు, యుద్ధాలు కొనసాగుతున్నప్పుడు ఈ ఒప్పందం ద్వారా పదేళ్ళ శాంతియుత పరిస్థితులను ప్రవక్త తన సంప్రదింపుల రాజనీతి ద్వారా సాధించారు. ఈ ఒప్పందం కోసం ఆయన అవసరమైన పట్టు విడుపు చూపించారు. శాంతిసాధన ముఖ్యలక్ష్యంగా అవసరమైన రాజీ ధోరణి ప్రదర్శించారు. ఆయన రాజీ ధోరణి ప్రదర్శించడం, వెనక్కి తగ్గినట్లు కనిపించడం స్వయంగా ఆయన సన్నిహిత అనుయాయుల్లో కూడా చాలా మందికి నచ్చలేదు. ఇది సహజమే. నేడు కూడా అంతర్జాతీయ వ్యవహారాల్లో చేసుకునే ఒప్పందాలను జాతీయ స్థాయిలో విమర్శించడం మనకు కనిపి స్తూనే ఉంటుంది. ఇది చాలా దేశాల వ్యవహారాల్లో జరుగు తుంది. కాని శాంతిసాధనే ముఖ్యమైనప్పుడు జాతీయ స్థాయి వ్యవహారాలను పక్కన పెట్టి పట్టువిడుపులు చూపించాలన్న దౌత్యనీతికి ఒక గొప్ప పాఠం వంటిది హుదైబియా ఒప్పందం. ఈ ఒప్పందం తర్వాత మదీనా రాజ్యం బలహీనంగా కనిపిస్తుం దనుకున్న వారి అంచనాలు ఆ తరువాత తారుమారయ్యాయి. శాంతియుత వాతావరణమే ఇస్లాంకు అవసరం. హుదైబియా ఒప్పందం నిజానికి ప్రవక్త (స) సాధించిన ఒక గొప్ప విజయంగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ శాంతి కాలంలోనే ఇస్లామ్ శరవేగంగా విస్తరించింది. ఇస్లామ్ అంటేనే శాంతి.
మరో ఉదాహరణ మదీనాలో ముస్లిం రాజ్యం స్థాపించిన తర్వాత ఈ రాజ్యానికి ఒక రాజ్యాంగాన్ని కూడా ప్రవక్త ముహమ్మద్ తీసుకొచ్చారు. ఇది మదీనా చార్టర్‌గా కూడా పేర్కొనబడు తుంది. మదీనాలోని వివిధ సముదాయాలు, తెగల విధులు, బాధ్యతలు, హక్కుల సమగ్ర వివరణ ఇందులో ఉంది. ముస్లిములు, యూదులు, ఇతర తెగలకు సంబంధించి వారి విధి బాధ్యతలు, హక్కుల ప్రస్తావన స్పష్టంగా ఉన్న డాక్యుమెంట్ ఇది. దీనివల్ల వివిధ తెగల మధ్య ఒక విధమైన విశ్వాసం, నమ్మకం, సామాజిక సంబంధం ఏర్పడ్డాయి. వివిధ తెగల మతస్వేచ్ఛ, స్వతంత్ర ప్రతిపత్తిని కూడా ఈ డాక్యుమెంట్ గుర్తించింది. ఆధునిక కాలంలోని అంతర్జాతీయ చట్టంలో కనిపించే మైనారిటీ హక్కులు, మతసహనం వంటి భావాలకు పునాదులు ఇక్కడే ఉన్నాయి. ఈ ఒప్పందాలను మరింత నిశితంగా పరిశీలిద్దాం. ప్రవక్త మదీనా వచ్చిన తర్వాత ఎదుర్కున్న సమస్యలు చాలా ఉన్నాయి. మదీనాలో యూదులు బలంగా ఉండేవారు. మదీనాలోని వివిధ తెగలతో వారికి సంబంధాలున్నాయి. యూదులకు అప్పటికే ప్రవక్త ముహమ్మద్ (స) పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. కాని మదీనాలో ప్రవక్త ప్రజాదరణ చూసిన తర్వాత వారు పైకి మాత్రం వ్యతిరేకతను ప్రదర్శించలేదు. కాని ఈ వ్యతిరేకత గురించి ప్రవక్తకు బాగా తెలుసు. అందువల్ల ఖచ్చితమైన ఒప్పందాలతో శాంతిభద్రతల వాతావరణం ఏర్పరచాలని నిర్ణయించారు. యూదులతో ఒప్పందం చేసుకున్నారు. వారికి పూర్తి మతస్వేచ్ఛ, మతాచారాల స్వేచ్ఛ, ఆస్తిహక్కు విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇస్తూ ఒప్పందం చేసుకోవాలనుకున్నారు. ఈ ఒప్పందం తర్వాత ముస్లిములకు సంబంధించిన వివిధ తెగల మధ్య కూడా సంబంధాలు మెరుగు పడ్డాయి. ఈ ఒప్పందం తర్వాత మదీనా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని తెగలన్నీ ఒక గణతంత్ర ప్రజాస్వామిక రాజ్యంగా ఏర్పడ్డాయి. ఒప్పందాల ద్వారా శాంతిభద్రతలను సాధించడానికి ప్రవక్త ఆ తర్వాత వివిధ తెగలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఆ విధంగా ఒప్పందం లేదా అల్ అహద్ అనేది ఇస్లామీయ అంతర్జాతీయ వ్యవహారాల్లో ఒక ముఖ్యాంశం అయ్యింది. నిజానికి ఒప్పందం అనేది ఇస్లాంలో ప్రతి వ్యవహారంలోను కీలకమైనది. చివరకు వ్యక్తిగతంగా ఆడ మగ కలిసి జీవించడానికి చేసుకునే పెళ్ళి కూడా ఇస్లాములో ఒక ఒప్పందమే అయ్యింది. ఒప్పందంలో చేసిన వాగ్దానాలకు ముస్లిములు ఖచ్చితంగా కట్టుబడాలని స్వయంగా దివ్యఖుర్‌ఆన్ ఆదేశించింది. ‘‘చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి. నిస్సందేహంగా వాగ్దానం విషయంలో మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది’’ (దివ్య ఖుర్‌ఆన్: 17:34)
‘ముస్లిములు తాము చేసుకున్న ఒప్పందాల షరతులకు కట్టుబడాలి.’ అని ప్రవక్త ముహమ్మద్ (స) ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. యుద్ధాలకు సంబంధించిన స్పష్టమైన నియమావళి కూడా ఈ కాలంలోనే క్రోడీకరించడం జరిగింది. ఈ నియమాలను ముస్లిము సైన్యాలు ఎన్నడూ అతిక్రమించలేదు. అంతేకాదు దౌత్యవేత్తలు, రాయబారులకు రక్షణ కల్పించే నియమాలను ఖచ్చితంగా ప్రవేశపెట్టింది ప్రవక్త ముహమ్మద్ (స). మరణానికి కొన్ని రోజుల క్రితం కూడా ఆయన(స), రాయబారుల పట్ల మర్యాదగా మసలుకోవాలని తన సహచరులకు గట్టిగా తాకీదు చేశారు. మనం గమనించ వలసిందేమిటంటే, పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం నేటి మాదిరి అంతర్జాతీయ శాసనం, జెనివా ఒప్పందాలు ఏమీ లేని కాలంలో, క్రూరమైన అమానుష యుద్ధాల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవడమే జరుగుతున్న కాలంలో సలహా సంప్రదింపులు, దౌత్యనీతి, పరమత సహనం, దౌత్యవేత్తలకు రక్షణ, యుద్ధాల్లో మానవీయవిలువలు వంటివి ప్రవేశపెట్టి వాటికి కట్టుబడిన కారుణ్యమూర్తిగా ప్రవక్త ముహమ్మద్ (స) కనిపిస్తారు. ఆయన మాటలు, చేతలే తర్వాతి కాలాల్లో అంతర్జాతీయ శాసనాలకు బీజాలేశాయి.
ఒక హదీసులో ప్రవక్త (స) చెప్పిన మాటలు కూడా గమనార్హ మైనవి, ‘‘మీ సోదరుడికి సహాయం చేయండి, అతడు బాధితు డైనా, దౌర్జన్యపరుడైనా సరే’’ అన్నారు. ఈ మాటలు విన్న అనుచరులు ప్రవక్తా (స) దౌర్జన్యపరుడికి సహాయం చేయడమేమిటి అని ప్రశ్నించారు. ప్రవక్త జవాబిస్తూ, అతన్ని దౌర్జన్యం చేయకుండా నిరోధించడమే అతనికి చేసే సహాయం అన్నారు. నిజానికి ఈ హదీసులో అంతర్జాతీయ నియమాలున్నాయి. అణిచివేత, అన్యాయం, దౌర్జన్యాలను నిరోధించే సూత్రాలు ఇందులో ఉన్నాయి. ఇది వ్యక్తిగత స్థాయిలో చూస్తే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక బాధితుడు, ఒక దౌర్జన్యపరుడిగా కనిపిస్తుంది. అలాంటి సందర్భాల్లో దౌర్జన్యపరుడిని అడ్డుకోవడం, నిరోధిం చడం, అతను తన స్వంత తమ్ముడైనా, కొడుకైనా అతన్ని ఆపడం అనే బోధనలో గొప్ప మానవీయ విలువలున్నాయి. అలా ఆపడం ద్వారా నిజానికి అతనికి సహాయం చేస్తున్నామనే భావన ఉంది. అతనికి వ్యతిరేకంగా హాని చేయడం లేదన్న బోధన ఉంది. ఇదే హదీసును సాముదాయిక పరిధిలో విస్తరించి చూస్తే మరో భావం కనిపిస్తుంది. ఒక రాజ్యం మరో రాజ్యంపై దౌర్జన్యానికి పూనుకుంటే, ఒక సముదాయం మరో సముదాయం పై దుర్మార్గానికి పాల్పడితే అలాంటి సందర్భాల్లో బాధిత సముదాయానికి సహాయసహకారాలు అందించడమే కాదు, దుర్మార్గానికి పాల్పడుతున్న సముదాయంతో చర్చించాలి. సలహా సంప్రదింపులు జరపాలి, వారిని ఒప్పించాలి, నిజానికి ఇరు వర్గాలను ఒప్పించవలసి ఉంటుంది. ఇదే శాంతిస్థాపన. ఈ శాంతిస్థాపన బాధిత సముదాయానికి మాత్రమే కాదు, దుర్మార్గానికి పాల్పడిన సముదాయానికి లేదా తెగకు లేదా రాజ్యానికి కూడా సహాయం చేయడమే. ఎందుకంటే, శాంతిస్థాపన ద్వారా ఆ సముదాయం లేదా రాజ్యం కూడా ప్రయోజనం పొందుతుంది. ఇది చాలా కీలకమైన అంశం. నేడు అంతర్జాతీయ వ్యవహారాల్లో మధ్యవర్తిత్వం వహించడానికి ఏర్పడిన అంతర్జాతీయ సంస్థలు, ఒకప్పటి నానాజాతి సమితి, నేటి ఐక్యరాజ్యసమితి` ఇవన్నీ చేసేది మధ్యవర్తిత్వమే. ఈ ప్రయత్నాల్లో కొన్ని రాజ్యాల స్వార్థ వైఖరి శాంతిస్థాపనకు విఘాతం కలిగిస్తుంది, కాని ప్రవక్త (స) సూచించిన మాదిరిగా ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడడం అనేది జరిగి ఉంటే ఈ ప్రయత్నాలు ఫలించేవి. ఇక్కడ గమనించవలసిన మరో హదీసు, చెడును చూస్తే చేత్తో ఆపాలి, లేదా మాటలతో ఆపాలి లేదా కనీసం మనసులోనయినా చెడును చెడుగా భావించాలి. ఈ మాటను కూడా కేవలం వ్యక్తిగత స్థాయిలో మాత్రమే అర్థం చేసుకోరాదు. రాజ్యాల స్థాయిలో కూడా వర్తించే మాట ఇది. ఒక రాజ్యం మరో రాజ్యంపై అణచివేతకు, దురాక్రమణకు పాల్పడుతున్నప్పుడు అంతర్జాతీయ సమాజం ఏం చేయాలి? సాధారణంగా అంతర్జాతీయ వ్యవహారాల్లో బలాబలాల తూకమే అసలు నిర్ణాయక శక్తి. ఈ నిర్ణాయక శక్తి తమ వద్ద ఉండా లనుకున్నాయి కాబట్టే అగ్రరాజ్యాలు అణ్వాయుధాలు సేకరించుకున్నాయి. అందువల్ల వాటి మాట చెల్లుబాటయ్యేలా ఒత్తిడి పెంచగలుగుతున్నాయి. కాని ఈ ఒత్తిడి మంచి కోసం, బాధిత రాజ్యాన్ని ఆదుకోవడం కోసం ఉండాలని సూచిస్తున్నాయి ఈ హదీసులోని మొదటి పదాలు. చేత్తో ఆపడం అనే మాటకు అర్థమిదే. కాని ఈ బలాబలాల తూకం తన పక్షాన లేనప్పుడు అంతర్జాతీయ సమాజం ఏం చేయాలి? చర్చలు, సలహా సంప్రదింపులు, దౌత్యమార్గాల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలని చెబుతుంది హదీసులోని రెండవ భాగం. అంటే మాట ద్వారా ఆపాలి అన్న పదాలు. కాని చర్చలు సంప్రదింపుల ద్వారా కూడా పరిష్కారం సాధ్యం కాని పరిస్థితుల్లో ఏం చేయాలి? విధానపరంగా అంతర్జాతీయ సమాజం దౌర్జన్యం చేస్తున్న రాజ్యాన్ని దురాక్రమక రాజ్యంగా గుర్తించాలి. విధాన పరంగా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. తన స్థాయిలో ప్రతి రాజ్యం దురాక్రమక రాజ్యంతో వ్యవహరిస్తున్నప్పుడు ఆ రాజ్యం దురాక్రమణలకు పాల్పడిన రాజ్యమనే భావనతోనే వ్యవహరించాలి. హదీసులోని మూడో మాట, మనసులో దౌర్జన్యాన్ని దౌర్జన్యంగా భావించాలనే మాటకు అర్థమిదే. నేటి కాలంలో కూడా అంతర్జాతీయ వ్యవహారాల్లో ఈ పద్ధతులు మనకు కనిపిస్తున్నాయి. కాస్త నిశితంగా గమనిస్తే ఈ పద్ధతులను నిజాయితీతో అవలంబిస్తే అంతర్జాతీయ శాంతి సుహృద్భావాలు సుసాధ్యం అవుతాయన్నది త్రోసిపుచ్చలేని విషయం.
దౌత్యవేత్తలు, రాయబారులకు ప్రవక్త(స) ముందు కాలంలో రక్షణ ఉండేది కాదు. స్వయంగా ప్రవక్త (స) పంపిన రాయబారులకు కూడా అప్పట్లో రక్షణ లభించలేదు. కాని మానవప్రాణాలకు సంబంధించి ప్రవక్త (స) చెప్పిన మాటలు రాయబారుల రక్షణకు కూడా వర్తిస్తాయి. ‘‘ఒప్పందం కుదుర్చుకున్న తెగలోని వ్యక్తి ఎవరినైనా చంపిన వాడు స్వర్గం వాసన కూడా ఆఘ్రాణించలేడు’’ అన్నారు ప్రవక్త ముహమ్మద్ (స). ఈ హదీసులో ఒప్పందాలకు ఉన్న పవిత్రత అర్థమవు తుంది. అలాగే ఒక వ్యక్తి ప్రాణాలను అన్యాయంగా తీసినవాడు మొత్తం మానవాళిని చంపినట్లే, ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన వాడు మొత్తం మానవాళిని కాపాడినట్లే అనే బోధన కూడా అంతర్జాతీయ వ్యవహారాలకు వర్తించేదే. ముఖ్యంగా రాయబారుల రక్షణకు వర్తించే ప్రబోధన. రాయబారులపై దాడి చేయడం ద్వారా కవ్వించడం, రెచ్చగొట్టడం యుద్ధాలకు దారి తీస్తుంది. ప్రాణనష్టానికి దారితీస్తుంది. మానవాళిని చంపినట్లే అనే మాటలకు ఈ అర్థం కూడా ఉంది. అలాగే ఒక రాయబారిని సముచితంగా గౌరవించడం ద్వారా, రాయబారాన్ని పంపించిన రాజ్యంతో అంగీకరించకపోయినా, ఆ రాజ్యంతో ఒక స్నేహపూర్వక సంబంధాన్ని ప్రారంభించినట్లే అవుతుంది. ఇది యుద్ధాన్ని నివారించి ప్రాణనష్టాన్ని నివారించడం అవుతుంది. ఒక ప్రాణాన్ని కాపాడిన వాడు మొత్తం మానవాళిని కాపాడ్డం అనే మాటలకు ఈ అర్థం కూడా ఉంది. అలాగే యుద్ధనియమాల్లో యుద్ధఖైదీలకు సంబంధించి ప్రవక్త ముందు కాలంలో ఎలాంటి నియమాలు లేవు. కాని ప్రవక్త స్పష్టంగా యుద్ధఖైదీలకు సంబంధించిన ఆదేశాలిచ్చారు. యుద్దఖైదీల పట్ల అనుచితంగా వ్యవహరించినవాడు మాలోని వాడు కాడు అన్నారు. అంటే యుద్దఖైదీల పట్ల అనుచిత వ్యవహారశైలి ప్రదర్శిస్తే ఆ వ్యక్తి ముస్లిం సముదాయం నుంచి వేరుపడినట్లే అని చెప్పడం చాలా తీవ్రమైన విషయం. యుద్ధఖైదీల పట్ల సముచిత వ్యవహారశైలి గురించి కీలకమైన హదీసు ఇది.
అంతర్జాతీయ వ్యవహారాల్లో న్యాయం, నిష్పక్షపాతం, ఒప్పం దాలు, ఒప్పందాలను గౌరవించడం, మానవీయ వ్యవహార శైలి, యుద్ధనియమాలు, యుద్ధఖైదీల నియమాలు, శాంతిసాధనకు రాజీ ధోరణి ప్రదర్శించడం` ఇవన్నీ నేటి ఆధునిక అంతర్జాతీయ శాసనాల్లో కీలకమైన అంశాలు. వీటన్నింటికీ పునాదులు మనకు ప్రవక్త (స) జీవితాన్ని నిశితంగా అధ్యయనం చేస్తే కనిపిస్తాయి.