July 15, 2024

మానవుల మానసిక, శారీరక ఆరోగ్యం  సలక్షణంగా ఉండాలంటే, దేహంలోని అవయవాలన్నీ క్రమబద్దంగా, నియమానుసారంగా స్పందించవలసి ఉంటుంది. ఏ అవయవానికి ఏ  కాస్త సుస్తీ చేసినా, స్పందించక పోయినా పూర్తి ఆరోగ్య వ్యవస్థ ప్రభావితమవుతుంది. అవయవాలన్నిటిలో ఒక ప్రధాన అవయవం  గుండె. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే గుండె పనితీరు మెరుగ్గా ఉండటం చాలా అవసరం. గుండె ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి అంత ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది. జీవిత కాలాన్ని గుండె నిర్ణయిస్తుంది. అందుకే ఎవరైనా మరణిస్తే గుండె ఆగిపోయింది అంటూ ఉంటాం. కనుక గుండెను ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉంచుకోవడం చాలా అవసరం. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా దానికి సంబంధించిన కొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.   

ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబరు 29న గుండె దినోత్సవాన్ని జరుపు కుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), వరల్డ్‌ హార్ట్‌ ఫెడరేషన్‌ (WHO) లు సంయుక్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తాయి. ఈ సందర్భంగా, గుండె జబ్బులపై  అవగాహన పెంచుకొని అవి రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తారు. గుండె సంబంధిత వ్యాధులను నివారించడం కోసం 1946లో జెనీవాలో వరల్డ్‌ హార్ట్‌ ఫెడరేషన్‌ సంస్థ  ఏర్పాటయింది. 1999లో అప్పటి ఆ సంస్థ అధ్యక్షుడు ఆంటోనియో బాయెస్‌ డీ లూనా (Antonio Bayes de Luna) తొలిసారిగా ఈ దినోత్సవాన్ని నిర్వహించాడు. అప్పటినుండి అది ప్రపంచ వ్యాప్తంగా విస్తరిం చింది. 2010 వరకు సెప్టెంబర్‌ చివరి ఆదివారం నిర్వహించ బడేది. 2011నుండి సెప్టెంబరు 29వ తేదీన నిర్వహించడం జరుగుతోంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం, వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ప్రజలకు అవగాహన కలిగించడం మొదలైన అంశాలపై ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ప్రచారం చేస్తారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్‌ హార్ట్‌ ఫెడరేషన్‌ సంయుక్తంగా దాదాపు 100 దేశాలలో ఏర్పాటు చేసిన 196 కార్డియాలజీ సొసైటీల ద్వారా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, నడక, పరుగు, ఇతరత్రా వ్యాయామ సంబంధిత ఆటలు ఆడిరచడం, బహిరంగ చర్చలు, సైన్స్‌ సెమినార్లు నిర్వహించడం లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు, కుటుంబాలు, సంఘాలు, ప్రభుత్వాలు మొదలైనవి గుండె ఆరోగ్యానికి సంబం ధించి ప్రజలను చైతన్యవంతం చేసేకార్యకలాపాల్లో పాల్గొం టాయి. ఈ ప్రచారం ద్వారా మానవ  ప్రపంచాన్ని ఆరోగ్య వంతమైన సమాజంగా తీర్చిదిద్దాలన్నది అసలు లక్ష్యం.

గుండె సంబంధిత వ్యాధులను సైలెంట్‌ కిల్లర్స్‌గా చెబుతారు. క్యాన్సర్‌ కన్నా  ఎక్కువ మరణాలు గుండె వ్యాధుల వల్లనే సంభవిస్తున్నాయంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మిగతా వ్యాధుల మాదిరిగా స్పష్టమైన సంకేతాలు కనబడినా… అవగాహనా లోపం వల్ల వాటిని గుండె సంబంధ సమస్యలుగా చాలామంది గుర్తించలేకపోతుంటారు. గుండె జబ్బు అనగానే సాధారణంగా మనకు గుండె పోటు ఒక్కటే గుర్తుకొ స్తుంది. గుండెపోటు పెద్ద సమస్యే, కానీ మరికొన్ని కీలక సమస్యలూ ఉన్నాయి. నిజానికి గుండె ఒక పంపులా పనిచేస్తూ శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సరఫరా చేస్తుంది. మామూలు పంపులు పని చేయటానికి విద్యుత్తు ఎలా అవసరమో, అలాగే మన గుండె నిరంతరం కొట్టుకోవటానికి కూడా శక్తి కావాలి. ఇందుకు గుండె పైగదుల్లో కుడి వైపున సైనో ఏట్రియల్‌ నోడ్‌ (ఎస్‌ఏ నోడ్‌), ఏట్రియో వెంట్రిక్యులార్‌ నోడ్‌ (ఏవీ నోడ్‌) అనే కేంద్రాలుంటాయి. వీటి నుండి నిరంతరం విద్యుత్‌ తరంగాలు వెలువడతాయి.‘ఎస్‌ఏ నోడ్‌’ నుంచి వెలువడే విద్యుత్తరంగాలు గుండె పైగదులైన కుడి కర్ణిక నుంచి ఎడమ కర్ణికకు చేరుకొని.. అవి రెండూ మూసుకునేలా చేస్తాయి. దాంతో రక్తం వేగంగా నెట్టినట్టుగా కింది గదులైన జఠరికల్లోకి వస్తుంది. అప్పుడు ‘ఏవీ నోడ్‌’ నుంచి వెలువడే విద్యుత్‌ తరంగాలు జఠరికలు మూసు కునేలా చేస్తాయి. ఇదంతా ఒక క్రమపద్ధతిలో, లయాత్మకంగా, నిరంతరాయంగా జరుగుతుండటం వల్ల రక్తం ధమనుల్లోకి చేరుతుంది. అయితే కొన్నిసార్లు రకరకాల సమస్యల కారణంగా ఈ విద్యుత్‌ తరంగాలు గతితప్పి, గుండె లయ దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీన్నే ‘అర్‌ హిత్మియా’ (arrhythmia) అంటారు. దీంతో గుండె కొట్టుకునే వేగం క్రమంగా తగ్గటం (brady cardia)అనూహ్యంగా పెరగటం (Tachycardia)లాంటి పరిస్థితులు తలెత్తవచ్చు. వేగం తగ్గడంవల్ల రక్త సరఫరా మందగించి, మెదడుకు తగినంత రక్తం అందదు. ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అలసట, నిస్సత్తువ ఆవహి స్తుంది. నాడి నెమ్మదిగా కొట్టుకుంటుంది. వేగం పెరిగితే గుండె దడ పుడుతుంది. తగుస్థాయిలో గుండె కొట్టుకోలేకపోవడం వల్ల రక్తం  అన్ని అవయవాలకు చేరదు. ఫలితంగా విపరీతమైన ఆయాసం వస్తుంది. కొన్నిసార్లు గుండెలో తేలికపాటి నొప్పికూడా రావచ్చు. తల తేలికగా ఉన్నట్లు, తిరిగినట్లు అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో స్పృహ తప్పటం కూడా జరగవచ్చు. కనుక ఇలాంటి పరిస్థితి తలెత్తక ముందే, గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. జీవన విధానంలో, ఆహార అలవాట్లలో చిన్న చిన్న మార్పుల ద్వారా ఇలాంటి ప్రమాదాన్ని నివారించవచ్చు. అంటే, చిన్నపాటి వ్యాయామాలు చేయాలి. నడవాలి, తేలికపాటి పరుగు లాంటివి అలవాటు చేసుకోవాలి. ధూమపానం, మద్యపానం అలవాటు  గనక ఉంటే, పూర్తిగా మానేయాలి. టీ, కాఫీలు తగ్గించాలి. ఆహారంలో  ఆకు కూరలు  ఎక్కువగా  ఉండేలా చూసుకోవాలి. ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. క్యాన్సర్‌ వంటి రోగాలను సైతం దగ్గరికి రానీయవు. పాలకూర, బచ్చలి కూర, కొత్తమీర, ముల్లంగి మొదలైన వాటిలో కొవ్వు శాతం తక్కువ ఉండటంతో పాటు ఫోలిక్‌ యాసిడ్‌, మెగ్నీషియం, కాల్షియం, పోటాషియం ఎక్కువగా లభిస్తాయి. ఇవి గుండె పనితీరును మెరుగు పర్చడంలో ఎంతగానో దోహదపడతాయి. ప్రతిరోజు ఉదయం అల్పాహారంగా ఓట్స్‌/ బార్లీ తీసుకోవడం గుండెకు మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తారు. వీటిలో లభించే బీటా గ్లూకాన్‌ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తుంది. చిరుధాన్యాలు, బార్లీ, పప్పు ధాన్యాలు, అవిశెలు, బీన్స్‌ మొదలై నవి ఆహారంలో తీసుకోవడం మంచిది. వీటిలో ఉండే విటమిన్స్‌, ఐరన్‌, ఫైబర్‌ యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును  అదుపులో  ఉంచుతాయి. దీని ద్వారా గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఇవే కాకుండా టొమాటో, యాపిల్‌, సోయాతో పాటు, తాజా పళ్ళు, కూరగాయలు, తక్కువ కొవ్వు కలిగిన పాల పదార్థాలు సేవించవచ్చు. వారానికి రెండు మూడు సార్లయినా చేపలు తినడం మంచిది. చక్కెర, ఎరుపు మాంసం (Red meat)  సేవనం తగ్గించాలి. వంటల్లో ఆలివ్‌ నూనె ( జైతూన్‌ ఆయిల్‌ ) వాడకం గుండెకు మేలు చేస్తుంది. రోజువారీ ఆహారంలో ఇలాంటి చిన్నచిన్న నియమాలు పాటించే వారికి,  మిగిలిన వారితో పోలిస్తే గుండెపోటు (హార్ట్‌ ఎటాక్‌ ) వచ్చే అవకాశాలు 11 శాతం తక్కువగా ఉంటాయట. కనుక, తరచుగా కాకపోయినా, అప్పుడప్పుడైనా గుండె చప్పడు వినే ప్రయత్నం చెయ్యాలి. దాని సంకేతాలను అర్ధం చేసుకొని అప్రమత్తం కావాలి. వ్యాపార వైద్యుల్ని కాకుండా, నమ్మకమైన మానవీయ వైద్యుల్ని అప్పుడప్పుడూ సంప్రదిస్తూ ఉండాలి. నాణ్యమైన, సమతుల ఆహారం, సరైన నిద్ర, తేలిక పాటి వ్యాయామాలు చేస్తూ, చెడు ఆలోచనలకు తావు లేకుండా, మంచి  ఆలోచనలతో, పరోపకార గుణంతో, ఉన్నంతలో సంతృప్తిగా, సంతోషంగా జీవించగలిగితే  దైవం ఆయుష్షు ఇచ్చినంతకాలం ఆరోగ్యంగా జీవించవచ్చు. ఏమంటారు.?

  • యం.డి.జునైద్ ఖాన్, ఫార్మాసిస్టు