May 16, 2024

బంధుత్వాలు బహు భారమైన రోజులివి!  అన్నదమ్ములు, తండ్రి తనయులు.. అన్ని బంధుత్వాలు, రక్త సంభంధాలు గాలిలో కొట్టుకు పోతున్నాయి!! ఆస్తి పాస్తుల పేర్లతో, కలహాలతో.. రక్తపాతాన్ని.. చవి చూస్తున్నాయి!! ఒకే రక్తం –  ప్రేమకు బదులు ద్వేషాన్నే రగిలిస్తున్నాయి..!! తీపి చుట్టరికాలు చేదు గుళికలై సహించరానివిగా  పరిణమిస్తున్నాయి!! పలకరించుకోవడం.. గగనమై… కలహించుకోవడం.. నిత్య గుణమైంది… బంధువులే  పీక్కు తినే రాబందువులు.. అయిన కాలమిది!! ఈ రోజుల్లో బంధుత్వ సంబంధాల ప్రాధాన్యతను తెలియజేసే వ్యాసం చదవండి…

శుభకరుడు అల్లాహ్  ఇలా సెలవిచ్చాడు:

మానవులారా! మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి ద్వారా సృష్టించాడు. అదేప్రాణి నుండి దాని జతను కూడా సృష్టించాడు. తిరిగి వారిరువురి నుండి కోటానుకోట్ల మంది స్త్రీపురుషుల్ని ప్రపంచంలో విస్తరింపజేశాడు. మీరు ఒకరిద్వారా మరొకరు తమ అవసరాలు గడుపుకోవడానికి దేవుని పేరును ఒక సాధనంగా చేసుకుంటారు. అలాంటి దేవునికి భయపడండి. రక్త సంబంధీకులతో మీకు ఏర్పడివున్న సహజ బాంధవ్యాన్ని తెంచకండి. అల్లాహ్ మీ చర్యల్ని  గమనిస్తున్నాడన్న సంగతి మరచిపోకండి. (సూరతున్‌ నిసా: 1)

బంధుత్వాలు బహు భారమైన రోజులివి!  అన్నదమ్ములు, తండ్రి తనయులు.. అన్ని బంధుత్వాలు, రక్త సంభంధాలు గాలిలో కొట్టుకు పోతున్నాయి!! ఆస్తి పాస్తుల పేర్లతో, కలహాలతో.. రక్తపాతాన్ని.. చవి చూస్తున్నాయి!! ఒకే రక్తం –  ప్రేమకు బదులు ద్వేషాన్నే రగిలిస్తున్నాయి..!! తీపి చుట్టరికాలు చేదు గుళికలై సహించరానివిగా  పరిణమిస్తున్నాయి!! పలకరించుకోవడం.. గగనమై… కలహించుకోవడం.. నిత్య గుణమైంది… బంధువులే  పీక్కు తినే రాబందువులు.. అయిన కాలమిది!!

సమాచార, సాంకేతిక విప్లవం ఈ విశాల ప్రపంచాన్ని చిన్న గదిగా మార్చేసింది. దేశవిదేశాల మధ్య గల వేల మైళ్ల దూరాన్ని చెరిపేసి వారిని నిమిషాల్లో కలిపే పరికరాలు సహజంగానే అందరికీ అందుబాటులో ఉన్నాయి. అయినా దూరాలు తగ్గడం అలా ఉంచితే మరింత పెరుగుతున్నా యి. మానవ సంబంధాలు మెరుగవుతూ కన్పించినా కుటుంబ సంబంధాలు కుంటు పడు తున్నాయి. ఒకరి మాట ఒకరికి నచ్చడం లేదు. ఒకరి ఉనికిని ఒకరు సహించడంలేదు. విత్తునాటి చెట్టు పెంచితే… చెట్టు పెరిగి పళ్ళు పంచితే… తిన్న తీపి మరచిపోయి చెట్టుకొట్టి కట్టెలమ్మినట్టే… నేడు కన్నవారి యెడల వ్యవహరాయించడం జరుగుతుంది. ఆకుచాటు పిందె ముద్దు. తల్లిచాటు బిడ్డ ముద్దు.  బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నత ల్లే అడ్డు అడ్డు.  ఉగ్గుపోసి ఊసు నేర్పితే… చేయిబట్టి నడక నేర్పితే… పరుగు తీసి పారిపోయే..  చేయిమార్చి చిందులేసే.. కర్కశులైన కొడుకులను కూతుళ్లను ఏమనాలి?

బంధువులు మూడు రకాలు

1) ఎవరు ఎలా ఉన్నా తాము  మాత్రం అందరితో  మంచిగా  ఉంటారు.

2) ఎదుటివారు బాగుంటే వీరూ బాగుంటారు. హానీ అయితే చేయరు.

3) పరిస్థితులు అనుకూలించినా, ప్రతికూలించినా అందరి వెనకాల  గోతులు త్రవ్వుతూనే ఉంటారు. వీళ్ళను బంధువులు అనడం కన్నా రాబంధువులు అనడం సబబేమో. చిన్న పెద్ద ప్రతి విషయానికి పొడుచుకు తింటూ ఉంటారు.

బంధువులెవరయినా అనుచితంగా ప్రవర్తిస్తూ బంధుత్వాలు తెగతెంపులకు పాల్పడినప్పటికీ బంధుత్వ హక్కులను నిర్వర్తించటంలోగాని, వారితో సత్సంబంధాలు పెట్టుకోవటంలో గాని తమ తరపునుంచి ఎలాంటి లోటూ రానివ్వకూడదు. ‘బంధు ప్రేమ’ అంటే ఇదే.  ఇస్లామీయ షరీఅత్లో బంధుప్రేమకు ఎంతో ప్రాముఖ్యముంది. బంధువుల పట్ల మంచిగా మెలగాలని ఇస్లాం తాకీదు చేస్తోంది.  తండ్రి తరపు బంధువులు, తల్లి తరపు బంధువులు ఇరువర్గాలవారూ బంధువుల క్రిందికే వస్తారు. వారందరితోనూ సద్భావంతో మెలగటం చాలా అవసరం.

హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారి  కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా తెలియజేశారు : దేవుడు సమస్త సృష్టిరాసుల్ని సృష్టించిన తరువాత ‘బంధుత్వం’ లేచి నిలబడి ‘‘(దేవా!) నేను బంధుత్వాల తెగత్రెంపుల బారినుండి నీ శరణు కోరుకుంటు న్నాను’’ అని అంది.  దానికి ‘‘అయితే నీతో సత్సంబంధాలు పెట్టుకున్న వాడితో నేనూ సత్సంబంధాలు పెట్టుకుంటాను. నీతో తెగ త్రెంపులు చేసుకున్నవాడితో నేనూ తెగతెంపులు చేసుకుం టాను,  ఇది నీకిష్టమే కదా!’’ అని అడిగాడు దేవుడు. దానికి బంధుత్వం ‘‘ఇష్టమే ప్రభూ!’’అని అంది. అప్పుడు అల్లాహ్  ‘‘సరే ఆ భాగ్యం నీకు దక్కుతుంది’’  అని అన్నాడు.

బంధం బలపడితేనే అందం

హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారి కథనం- దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధించారు: అల్లాహ్ ను, అంతిమదినాన్ని విశ్వసించే వ్యక్తి తన (ఇంటికొచ్చిన అతిథిని గౌరవించాలి. అల్లాహ్ ను, అంతిమ దినాన్ని విశ్వసించే వ్యక్తి తన బంధువులతో సత్సంబంధాలు పెట్టుకోవాలి. అల్లాహ్ ను అంతిమ దినాన్ని విశ్వసించే వ్యక్తి పలికితే మంచి మాటే పలకాలి లేదా మౌనం వహించాలి.’’ (బుఖారీ- ముస్లిం)

బంధువుల పట్ల మంచిగా మెలిగితే దేవుడు కూడా సంతోషిస్తాడు. దీనికి భిన్నంగా  బంధువుల హక్కుల్ని నెరవేర్చకుండా వారితో సత్సంబంధాలు కొనసాగించటానికి నిరాకరించటం దైవాగ్రహానికి కారణభూతమవుతుంది. ఈ హదీసు కూడా బంధుప్రేమను గురించి తాకీదు చేస్తోంది.

కుమారులు లేక కుమార్తెలు చూపే సత్ప్రవర్తనకు తండ్రికన్నా తల్లి మూడు రెట్లు ఎక్కువ హక్కుదారు అవుతుందని తెలుస్తోంది. దీనికి స్త్రీ శారీరక బలహీనత ఒక కారణం కావచ్చు. ఈ శారీరక బలహీనత కారణంగా తల్లి తన సంతానంపై ఎక్కువగా ఆధార పడవలసి వస్తుంది. రెండో విషయం ఏమిటంటే తల్లి తన సంతానం కోసం మూడు దుర్భరమైన కష్టాలను భరిస్తుంది. ఈ కష్టాల్లో తండ్రి ఏ విధంగానూ పాలుపంచుకోడు. 1. తొమ్మిది మాసాలపాటు  తల్లి బిడ్డను తన కడుపున మోస్తుంది. 2. జీవన్మరణాల సమస్య వంటి ప్రసవవేదనను భరిస్తుంది. 3. ప్రసవించిన తరువాత రెండు సంవత్సరాల పాటు బిడ్డకు పాలిస్తుంది. ఈ కష్టాలవల్ల రాత్రిళ్ళు ఆమె నిద్రపాడవుతుంది. ఆమె సౌందర్యం కళావిహీనమై పోయి ఆరోగ్యం దెబ్బతింటుంది. బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఒక్కోసారి ఆమెకు ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించవలసి  ఉంటుంది. ఎడతెరిపి లేకుండా ఇన్ని కష్టాలు, బాధలు భరించాల్సి వస్తుంది. కనుకనే ఇస్లాం ధర్మం తల్లికి ఎంతో ఉన్నత స్థానాన్ని ప్రసాదిం చింది.

‘‘నీ ప్రభువు ఇలా నిర్ణయం చేశాడు: మీరు కేవలం ఆయనను తప్ప మరెవరినీ  ఆరాధించకండి. తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించండి. ఒకవేళ మీ వద్ద వారిలో ఒకరుగాని ఇద్దరుగాని ముసలివారై ఉంటే, వారి ముందు విసుగ్గా ‘ఛీ’ అని కూడా అనకండి. వారిని కసురుకుంటూ సమాధానం ఇవ్వకండి. వారితో మర్యాదగా మాట్లాడండి. మృదుత్వమూ, దయాభావమూ కలిగి వారిముందు నినమ్రులై ఉండండి. ఇంకా, ‘‘ప్రభూ! బాల్యంలో వారు నన్ను కారుణ్యంతో, వాత్సల్యంతో పోషించినట్లు, నీవు వారిపై కరుణ జూపు’’ అంటూ ప్రార్థిస్తూ ఉండండి.’’ (అల్‌ ఇస్రా: 33, 34)

ఇంకొక చోట ఇలా అన్నాడు:

‘‘మానవుడు తన తల్లిదండ్రుల హక్కును గుర్తించాలని స్వయంగా మేమే అతనికి నిర్దేశించాము. అతని  తల్లి బలహీనతపై బలహీనతను సహించి అతనిని తన కడుపున మోసింది. అతను పాలు విడిచిపెట్టటానికి రెండు సంవత్సరాలు పట్టింది. (ఇందుకే మేము అతనికి) ‘‘నాకు కృతజ్ఞుడవై ఉండు, నీ తల్లి దండ్రులకు కృతజ్ఞతలు తెలుపు (అని ఉపదేశించాము.)’’ (లుఖ్మాన్‌ : 14)

హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి దైవప్రవక్త (స) దగ్గరికి వచ్చి, ‘‘దైవప్రవక్తా! నా సత్ప్రవర్తనకు అందరి కన్నా ఎక్కువ హక్కుదారులెవరు?’’ అని అడిగాడు. దానికి ఆయన ‘‘నీ తల్లి’’ అని చెప్పారు. ‘‘ఆ తరువాత ఎవరు?’’ అని అడిగాడా వ్యక్తి. దానికి ఆయన ‘నీ తల్లి’ అనే చెప్పారు. ఆ వ్యక్తి మళ్ళీ, ‘‘ఆ తరువాత ఎవరు?’’ అని అడిగాడు. అప్పుడు కూడా ‘‘నీ తల్లి’’ అనే చెప్పారు దైవప్రవక్త(స). ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు ‘‘ఆ తరువాత ఎవరు?’’ అని. అప్పుడు ఆయన ‘నీ తండ్రి’ అని చెప్పారు. (బుఖారీ – ముస్లిం)

వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ‘‘దైవప్రవక్తా! నా సత్ప్రవర్తనకు ఎవరెక్కువ హక్కుదారులు?’’ అని ఆ వ్యక్తి అడగ్గా ‘‘నీ తల్లి. ఆ తరువాత నీ తల్లే. ఆ తరువాత కూడా నీ తల్లే. ఆ తరువాత నీ తండ్రి. తరువాత నీకు ఎవరెంత దగ్గరి వారయితే వారు’’ ఆయన చెప్పారు.

రక్తసంబంధీకులు ఎవరు?

దైవగ్రంథం ప్రకారం రక్తసంబంధీకులే ఒకరి కొకరు ఎక్కువ హక్కు దారులు. నిశ్చయంగా అల్లాహ్  ప్రతి విషయాన్నీ ఎరిగినవాడు. (అన్ఫాల్‌ : 74-75)

రక్త సంబంధం అంటే, తల్లి వైపు మరియు తండ్రి వైపు బంధు వులు. అంటే వారి తండ్రులు, తల్లులు, తాతలు, అమ్మమ్మలు మొదలయినవారు.

కొడుకులు, కూతుళ్లు వారి పిల్లలు,  వారి పిల్లల పిల్లలు మొదలయినవారు.

అన్నాదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు, వారి పిల్లలు,  వారి పిల్లల పిల్లలు మొదలయినవారు.

మామలు, అత్తలు, మామలు, మేనత్తలు మరియు వారి పిల్లలు మొదలయినవారు.

బంధాన్ని బలపర్చడం ఎలా?

1) దూరమయిన వారికి దగ్గరవ్వడం:

బంధువులు తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారన్న నెపంతో తాము కూడా వారితో బంధుత్వాన్ని త్రెంచుకోవటం భావ్యం కాదు. ఎందుకంటే ఇస్లాంలో ఇతర బంధువులు తమకు అపకారం తలపెట్టినప్పటికీ తాము మాత్రం వారితో ఉపకార భావంతోనే మెలగాలని తాకీదు చేయబడిరది. బంధువులతో ఎల్లప్పుడూ మంచిగా మెలిగేవాడు దేవుని దృష్టిలో అత్యంత గౌరవనీయుడిగా, ఆదరణీయుడిగా పరిగణించబడతాడు. అలాంటి వ్యక్తి కోసం దైవం ఆకాశాల నుండి ప్రత్యేక సహాయకులను పంపుతాడు.

హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారి కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త(స) వద్దకు వచ్చి, ‘‘దైవప్రవక్తా! నా బంధువులు కొందరు న్నారు. నేను వారితో సత్సంబంధాలు కొనసాగించాలని ప్రయత్ని స్తున్నప్పటికీ వారు మాత్రం నాతో తెగతెంపులు చేసుకోవాలని చూస్తున్నారు. నేను వారిపట్ల మంచిగా మెలగుతుంటే వారేమో నాకు కీడు తలపెడుతున్నారు. నేను వారిపట్ల ఉదార వైఖరిని అనుసరిస్తుంటే వారు మాత్రం నాపట్ల మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు’’  అని దైవప్రవక్తకు తన గోడు వినిపించుకున్నాడు. అతని మాటలు విని ఆయన, ‘నువ్వు చెప్పింది నిజమే అయితే నువ్వు వారి నోళ్ళల్లో వేడిబూడిదను పోస్తున్నావనుకో. నువ్వు మాత్రం వారిపట్ల ఇలాగే సత్ప్రవర్తనతో మెలగుతున్నంత కాలం దేవుని తరఫు నుండి వారికి వ్యతిరేకంగా ఒక సహాయకుడు నీ వెంట ఉంటాడు’ అని అన్నారు. (ముస్లిం)

హెచ్చరిక: దీనికి భిన్నంగా బంధుత్వ తెగతెంపులకు పాల్పడేవాడు దేవుని దృష్టిలో అత్యంత నీచుడిగా పరిగణించబడతాడు. అతని పర్యవసానం కూడా కాలుతున్న బూడిద తింటున్నవాడి మాదిరిగా అత్యంత హీనంగా ఉంటుంది. దైవప్రవక్త (సల్లం) పై హదీసులో ఇచ్చిన ఈ ఉదాహరణలోని ఆంతర్యం ఏమిటంటే, కాలుతున్న బూడిద తింటున్నవాడికి నోరు కాలినట్లే బంధుత్వాల తెగ త్రెంపులకు పాల్పడుతున్నవాడి పాపం  కూడా  పండుతూ   ఉంటుంది. అయితే వారిపట్ల మంచిగా మెలగుతున్న వ్యక్తి మాత్రం నిందార్హుడు కాడు. అతని హక్కుల్ని కాలరాసి, అతణ్ణి బాధ పెడుతున్నందుకు బంధువిచ్ఛిత్తికి పాల్పడిన వారే మహాపరాధులుగా పరిగణించబడతారు

2) ద్వేషించిన వారిని ప్రేమించడం

హజ్రత్‌ అబ్దుల్లాహ్ బిన్‌ అమ్ర్‌ (రజి) కథనం ప్రకారం- దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచించారు: ఒక బంధువు ఉపకారం చేస్తే దానికి బదులుగా ఉపకారం చేసేవాడు (నిజమైన) బంధు ప్రియుడు కాడు. తన బంధువులు తనతో తెగత్రెంపులు చేసుకున్నప్పటికీ వారితో సత్సంబంధాలు కొనసాగించేవాడే (సిసలైన) బంధు ప్రియుడు. (బుఖారీ)

బంధుప్రేమ  బంధువుల మధ్య ఎలాంటి సద్భావనను, సదభిప్రాయాన్ని కోరుకుంటుందో ఈ హదీసు వివరిస్తోంది. తమకు ఉపకారం చేసే బంధువులకు ఉపకారం చేయడంలో గొప్పేముంది? అది బంధుప్రేమ కాదు. ఒక ఉపకారికి ఉపకారం చేసినట్లవుతుంది అంతే! తోటి బంధువులెవరైనా తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ, తమతో బంధుత్వాన్ని త్రెంచుకోవటానికి ప్రయత్నిస్తున్నప్పటికీ తాము మాత్రం విశాల హృదయంతో వారిని మన్నిస్తూ, వారి కీడుకు బదులుగా మేలు చేసి తమ ఉదారత్వాన్ని ప్రదర్శించాలి. వారితో బంధుత్వ సంబంధాలను కొనసాగించ డానికి  ముందుకు రావాలి. అసలు సిసలైన బంధుప్రేమ అంటే ఇది! ఇస్లాం కోరేది కూడా ఇలాంటి బంధుప్రేమనే! ఇతరులు మనల్ని నీచంగా చూసినప్పుడు మనం వారిపట్ల సద్భావంతో మెలగటానికి అహం అడొస్తుంది. కాని ఆ అహంభావాన్ని అణచుకొని షరీఅత్‌ ఆదేశాల్ని పాటించాలి. అయితే అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. మరోవైపు పరిపూర్ణ విశ్వాసాన్ని పొందాలంటే మనసులోని అహంభావాన్ని అణచుకోక తప్పదు.

3) బంధువుల యెడల దాతృత్వం

దానధర్మాలు చేసినప్పుడు ముందుగా తమ సన్నిహిత బంధువు లను దృష్టిలో పెట్టుకోవాలి. వారు అవసరాల్లో ఉన్నారనుకుంటే వారికే ఇవ్వాలి. ఆ తరువాత కూడా సదఖా సొమ్ము  మిగిలి ఉంటే దానిని ఇతరులకు కూడా దానం చేయవచ్చు. దీనికి భిన్నంగా ఇతరులను సుఖపెట్టి సొంత బంధువులనే విస్మరించటం ఎంతమాత్రం వాంఛనీయం కాదు.

హజ్రత్‌ అనస్‌ (రజి) గారి కథనం: మదీనా నగరంలోని అన్సార్‌  ముస్లిం లందరిలో   హజ్రత్‌ అబూ తల్షా (రజి) గొప్ప ధనికులు.  ఆయనకు  అనేక ఖర్జూర   తోటలుండేవి.  ఆ తోటల్లో ఆయనకు ‘బైరహా’ తోట అంటే ఎంతో యిష్టం. అది మస్జిద్‌ నబవీకి ముందు భాగంలో ఉండేది.  దైవప్రవక్త(స) తరచూ ఆ తోటలోకి  వెళుతుండేవారు.  అక్కడ దొరికే మంచి నీళ్ళు త్రాగేవారు. ఆ కాలంలోనే –

‘‘మీరు అమితంగా ప్రేమించే వస్తువులను (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టనంతవరకు మీరు సత్కార్యస్థాయికి చేరుకోలేరు’’ అనే దైవసూక్తి (ఆలి ఇమ్రాన్‌ : 92)  అవతరించింది.

ఈ సూక్తి అవతరించినప్పుడు హజ్రత్‌ అబూ తల్హా (రజి) దైవప్రవక్త ముందు ఇలా ప్రకటించారు: ‘‘దైవప్రవక్తా! మీరు అమితంగా ప్రేమించే వస్తువులను (తన మార్గంలో) ఖర్చుపెట్టనంతవరకు మీరు సత్కార్య స్థాయికి చేరుకోలేరని దేవుడంటున్నాడు. అలాగైతే నాకున్న సంపద మొత్తంలో బైరహా తోట నాకు అత్యంత ప్రీతికర మైనది. దాన్ని నేను దైవమార్గంలో దానం చేస్తున్నాను. దానివల్ల నాకు పుణ్యం లభిస్తుందని, ఇంకా పరలోకంలోనూ దాని పుణ్యం నాకోసం నిల్వచేసి  ఉంచబడుతుందని ఆశిస్తున్నాను. దేవుడు ఎలా ఆజ్ఞాపిస్తే అలా మీరు దీనిని వినియోగించండి.’’ ఆయన మాటలు విని దైవప్రవక్త (స) ‘‘ఓహో! ఇదెంతో లాభదాయకమైన సంపదే. నిజంగా ఇదెంతో లాభదాయకమైన సంపద. నువ్వు చెప్పిన మాటలన్నీ నేను విన్నాను. అయితే నువ్వు ఈ సంపదను (అభాగ్యులైన) నీ బంధువులకు పంచిపెడితే సముచితంగా ఉంటుందని నేను భావిస్తున్నాను’’ అని అన్నారు. దానికి హజ్రత్‌ అబూ తల్హా (రజి) ‘‘మీరు చెప్పినట్లే చేస్తాను దైవప్రవక్తా!’’ అని అన్నారు. (ఆ తరువాత దైవప్రవక్త సలహాననుసరించి) ఆయన ఆ తోటను తన బంధువులకు, చిన్నాన్న, పెద్దనాన్న కుమారులకు పంచివేశారు.’ (బుఖారీ – ముస్లిం)

 

  • – సయ్యిద్‌ అబ్దుస్సలామ్‌ ఉమరీ