April 13, 2024

నేటికి 1450 సంవత్సరాలకు పూర్వం ప్రపంచ పరిస్థితులను చూసినట్లయితే అరబ్బు మానవాళి పూర్తి అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉండేది. ఆనాటి  అరబ్బు జాతి  పరిస్థితి చూసినట్లయితే సకల రకాల చెడులకు నిలయంగాఉండేది. ఆ తరుణంలో సృష్టికర్త సమస్త మానవాళికి కారుణ్యంగా అంతిమ దైవప్రవక్తగా ముహమ్మద్‌ (స) వారిని అరబ్బులో పుట్టించాడు.

ఆ కాలంలో నైతికంగా అరబ్బు భూ భాగం అధోపాతాళానికి చేరింది. అరేబియా యావత్తు ఆటవిక రాజ్యంగా తయారైంది. ఎటుచూసినా దుర్మార్గం తాండవించేది. వ్యభిచారం, మద్యపానం, జూదం వంటి వాటిని గర్వకారణంగా భావించేవారు. బహుదైవారాధన, విగ్రహారాధనను కలిగి  ఉండేవారు. అరబ్బు తెగలు ఒకదానిపై ఒకటి కత్తులు దూసేవి. చిన్న చిన్న కారణాలకే రక్తం  ఏరులై పారేది. చిన్న చిన్న కారణాల వల్ల దశాబ్దాలుగా యుద్ధాలు జరిగేవి. వడ్డీ వ్యాపారాలు నిర్వహించేవారు. కొల్లగొట్టడం, దోపిడీ, అన్యాయం, అక్రమాలు, అనాథలు, నిరుపేదల హత్యలు సర్వసాధారణంగా ఉండేవి. కర్ర గలవారిదే బర్రె అన్న ధోరణిలో ఉండేది. మనుషుల ధన మాన ప్రాణాలకు ఏమాత్రం రక్షణ ఉండేది కాదు.

లజ్జా రహితంగా స్త్రీ పురుషులు నగ్నంగా సంచరించేవారు. అరబ్బు జాతి వారు ఎవరినైనా తమ అల్లుడిగా స్వీకరించడాన్ని నీచంగా భావించేవారు. మూర్ఖపు పరువు ప్రతిష్టల కొరకు తమ ఆడ సంతానాన్ని  సజీవంగానే  పూడ్చిపెట్టేవారు. వారి మూర్ఖత్వం ఎలా ఉండేదంటే ప్రపంచాన్ని జయిస్తున్న అలెగ్జాండర్‌ అరబ్బు దేశానికి వచ్చినప్పుడు వారి జీవన విధానాన్ని గమనించి అంటాడు ‘‘ఎలాంటి జీవన విధానం కనీసం మానవత్వం మచ్చుకైనా కనబడనటువంటి జనం. మానవ ప్రాణాలకు వీరి దగ్గర ఎలాంటి విలువ లేదు. ఇలాంటి ప్రజలను ఏలటమా? ‘ఛీ’ అని ఆ దేశాన్ని వదిలి ముందుకు వెళతాడు అలెగ్జాండర్‌.

అలాంటి అంధకారంలో అలాంటి మూర్ఖత్వపు జాతిని కేవలం 23 సం॥ కాలంలో సభ్యత సంస్కారం గొప్ప నైతిక విలువలు కల సత్సమాజంగా మార్చిన ఒకే ఒక్క మనిషి ప్రవక్త(స).

ప్రవక్త (స) వారు అరబ్బు జాతిలో ఎలాంటి మార్పును తీసుకు వచ్చారంటే వేరొకరి ప్రాణాలను చాలా సులువుగా తీసేటటువంటి వారిని మరొకరి ప్రాణాల కోసం ప్రాణాలు అర్పించే వారిగా, దారి దోపిడీ చేసేవారిని దానధర్మాలు చేసేవారిగా, అత్యాచారాలు చేసేవారిని పరాయి స్త్రీని కన్నెత్తి చూడటమే పాపంగా భావించే విధంగా, ఆడపిల్లను  అదృష్టంగా, మానవ సమాజాన్ని అంధకారంలో నుంచి నైతిక విలువలు కలిగిన మానవ జాతిగా మార్చి మానవ జాతికే నిలువుటద్దంగా మార్చిన ఘనత ప్రవక్త (స) వారిది.

దానికి ఉదాహరణ అన్సారులు తమ ఇళ్ళు, ఆస్తులు, సంపదల్లో సగభాగాన్ని మక్కా నుంచి వచ్చిన ప్రవాసులకు ఇచ్చేయడం ఆశ్చర్యకరమైన  పరిణామం కదా. సామాజికంగా అత్యున్నత హోదాలో ఉన్నవారితో సమానంగా ఒక బానిస నిలబడటం అత్యుత్తమ సమానత్వాన్ని చాటిచెప్పడం లేదా?

అయితే ఇంత గొప్ప మార్పు ఆ సమాజంలో రావటానికి కేవలం 23 సంవత్సరాలు మాత్రమే పట్టింది. మానవత్వపు చరిత్రలో అతి గొప్ప విప్లవం ఏదైనా ఉందంటే అది ప్రవక్త ముహమ్మద్‌(స) ద్వారా అరబ్బు జాతిలో వచ్చిన విప్లవం అని. ఆయనకు ప్రాప్తించిన ఈ విజయం కేవలం యాదృచ్చికం కాదు. గాలివాటానికి వచ్చి పడిన విజయం కాదు. ఆయన సత్యసంధతకు, వ్యక్తిత్వానికి ఫలితం ఇది అని ‘ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా’ అంటుంది.

అయితే కఠినులు అయిన అరబ్బుల హృదయాలు ఎలా జయించగలిగారు.  అనతి కాలంలో ఇంత గొప్ప మార్పు ఎలా రాగలిగింది. ఇది తెలియాలి అంటే ప్రవక్త వారి జీవితాన్ని మనం అర్థం చేసుకోవడం ఎంతైనా అవసరం. ప్రవక్త వారి జీవితం ఎలా ఉండేది. వారు జీవితం ఎలా గడిపారు అన్న విషయంపై దాదాపు 45వేల పుస్తకాలు వారి జీవిత విధానం మీద రాయబడ్డాయి.

ఎవరి మధ్య అయితే కలిసి పెరిగారో అలాంటి వారికి పూర్తి భిన్నమైన వ్యక్తిత్వం ప్రవక్త(స) వారిది. అరబ్బులో ప్రవక్త వారి జననం ఎలాంటిదంటే రాళ్ళ కుప్పలో ఆణిముత్యం లాంటివారు.

ప్రవక్త గుణగణాల గురించి నైతికత గురించి స్వయంగా అల్లాహ్ ఖుర్‌ఆన్‌ గ్రంథంలో సాక్ష్యం ఇవ్వటం జరిగింది.

‘‘ఓ ప్రవక్త నైతికంగా నీవు ఉన్నత శిఖరాలను  అదిరోహించి   ఉన్నావు’’ (68: 4)

మనం ఒకసారి  చరిత్రను తిరగేసి చూసినట్లయితే ఎందరో మహానుభావులు ఈ భూమి మీద పుట్టి ఎన్నో విజయాలు సాధించారు. రాజ్యాలు స్థాపించి చట్టాలు చేయడంలో, న్యాయపరంగా, నైతికంగా, వ్యాపార పరంగా, దౌత్యపరంగా, కుటుంబ వ్యవహార పరంగా వారు ఏది స్థాపించినా భౌతిక శక్తికి సంబంధించినదే. ఏదో ఒక రంగంలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. తరచుగా వారి కళ్ళ ముందే నేలకూలాయి.

కాని ప్రవక్త వారు అన్ని రంగాల్లోను మనుషుల్ని చలింపజేశారు. అన్నిటికంటే మించి దేవతలు, మతాలు అన్నింటిని కదిలించి వేశారు.

ఎవరైనా ఒక వ్యక్తి జీవితాన్ని పరిశీలించాలంటే ఆ వ్యక్తి నైతికతను చూడాలంటే అందరికన్నా ఎక్కువ అతని సన్నిహితంగా ఉండే వారికే సాధ్యం. ప్రవక్త వారికి సన్నిహితంగా ఉన్నవారిలో వారి సతీమణి హజ్రత్‌ ఆయిషా(రజి) ఒకరు.

ఒకసారి హజ్రత్‌ ఆయిషా(రజి) వద్దకు కొంతమంది వచ్చి అడుగుతారు ‘‘ఓ అమ్మా ప్రవక్త వారి గుణగణాలు ఎలా ఉండేవి అని’’

అప్పుడు ఆయిషా(రజి) ‘‘మీరు ఖుర్‌ఆన్‌ చదవరా? ప్రవక్త గుణగణాలు ఖుర్‌ఆన్‌ బోధనలకు ప్రతిబింబాలు’’ అన్నారు.

అదేవిధంగా ప్రవక్త(స) గురించి అందరూ ‘సాదిక్‌’,  ‘అమీన్‌’ అనే బిరుదులతో పిలిచేవారు. శత్రువుల సైన్యం కూడా ప్రవక్త వారి గురించి ఇవే మాటలు చెప్పేవారు.

ఉదాహరణకు, అబూ సుఫ్యాన్‌ ఇస్లాంను స్వీకరించక ముందు ఒకరోజు హెర్క్యులస్‌ దర్బారులో ప్రవక్త వారి గురించి కొన్ని ప్రశ్నలకు జవాబిచ్చాడు. ప్రవక్త వారికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వలేకపోయానని చెప్పాడు.

అంతేకాదు ప్రవక్త వారు క్షమాగుణం కలిగినవారు. ప్రవక్త వారు తన పరమ శత్రువుల్ని సయితం క్షమించేవారు.

ఉహుద్‌ యుద్ధంలో ప్రవక్త వారి ప్రియమైన బాబాయి హమ్జాను చంపి ఆయన కళేబరాన్ని ఖండఖండాలుగా ఖండిరచి దాన్ని చీల్చి కాలేయంలోని ఓ ముక్కను తీసి నమిలిన వారిని కూడా క్షమించిన దయా గుణం కలిగిన హృదయం వారిది.

  • – సఫూరా ఖాద్రి