July 27, 2024

Smoke and flames billow after Israeli forces struck a high-rise tower in Gaza City, October 7, 2023. REUTERS/Ashraf Amra NO RESALES. NO ARCHIVES

గాజా నిజానికి ఒక బహిరంగ జైలు వంటిదిగా మారిపోయింది. ఇస్రాయీల్ ఏర్పడడమే దురాక్రమణ రాజ్యంగా ఏర్పడింది. 1948 మే 15వ తేదీన పాలస్తీనా అరబ్బు ప్రజల్లో 70 శాతం మంది తమ ఇల్లువాకిలి వదిలేసి ఇస్రాయీల్ ఏర్పాటు కోసం శరణార్థులుగా మారిపోయిన సంఘటన చరిత్రలో మాయని మచ్చ వంటిది. ఇప్పుడు 80 లక్షల మంది పాలస్తీనా శరణార్థులు ఉన్నారు. ఆ తర్వాత 1948 యుద్ధంలోనే ఇస్రాయీల్ 77 శాతం భూభాగాన్ని ఆక్రమించుకుంది. 1967 యుద్ధం తర్వాత మరిన్ని భూభాగాలను ఇస్రాయీల్ ఆక్రమించుకుంది. 1973 యుద్ధం ఐక్యరాజ్యసమితి జోక్యంతో ఆగింది. ఆ యుద్ధం తర్వాత పాలస్తీనీయుల హక్కులను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. కాని ఇస్రాయీల్ భూ దురాక్రమణ కొనసాగుతూనే వచ్చింది. హమాస్ తర్వాత ఏర్పడిన సాయుధ సంస్థ. హమాస్ బలం ఎక్కువగా గాజాలోనే ఉంది. 2012లో గాజాలో ఇస్రాయీల్ బీభత్సం సృష్టించింది. హమాస్ ఇస్రాయీల్ ఉనికినే గుర్తించడానికి నిరాకరిస్తోంది. 2023 మొదటి ఐదు నెలల కాలంలో ఇస్రాయీల్ పాల్పడిన దౌర్జన్యాల వార్తలు తరచు ప్రపంచం చదువుతూనే వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ దాడిని అర్థం చేసుకోవాలి.

మానవప్రాణం అత్యంత విలువైనది. మనిషి ప్రాణాలు తీసే యుద్ధం అత్యంత అమానుషమైనది. హమాస్ దాడిలో, ఆ తర్వాత ఇస్రాయీల్ దాడిలో చనిపోతోంది అమాయక ప్రజలే. ఇది అత్యంత దుర్భరమైన వాస్తవం.

అక్టోబర్ 7వ తేదీన పాలస్తీనా మిలిటెంటు సంస్థ హమస్ ఇస్రాయీల్ పై బహుముఖ దాడి చేసింది. హమస్, ఇస్రాయీల్ మధ్య 2021లో పదకొండు రోజుల యుద్ధం జరిగింది. ఆ తర్వాత ఆ స్థాయిలో తీవ్రమైన దాడిగా ఇది పరిగణించబడుతోంది. హమస్ ఈ దాడికి ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ అని పేరుపెట్టింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఆరున్నరకు ఈ దాడి ప్రారంభమైంది. హమస్ వాయుదాడులు, సముద్రదాడులు, భూదాడులు ముప్పేటలా ఈ దాడి కొనసాగించింది. దాదాపు 5 వేల రాకెట్లను హమస్ ఇస్రాయీల్ పై ప్రయోగించినట్లు ప్రకటించింది. గాజాలో హమస్ బలంగా ఉంది. గాజా నుంచి సుదూరాన ఉన్న టెల్ అవీవ్ వరకు రాకెట్లతో దెబ్బతీసినట్లు తెలుస్తోంది. ఇస్రాయీల్ సైనిక ప్రతినిధి డేనియల్ హగారి ఈ దాడిని ధృవీకరించాడు. హమాస్ ముప్పేట దాడి చేసిందని చెప్పాడు. భూమార్గాన, సముద్రమార్గాన, గగనతలం నుంచి దాడులు చేశారని, ఇస్రాయీల్ లోకి చొచ్చుకువచ్చారని అన్నాడు. యూదుల సెలవుదినం సించాట్ తోరా రోజున ఈ దాడి జరిగింది. దీనికి ప్రతీకారంగా ఇస్రాయీల్ హమాస్ పై ప్రతిదాడులు ప్రారంభించింది. ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్ పేరుతో ఈ ఆపరేషను ప్రారంభించింది. గాజా పై భారీగా బాంబుల వర్షం కురిపించింది. కఫార్ అజా, దెరాట్, సుఫా, నహల్ ఓజ్, మాజెన్, బేఈరీ, రీమ్ మిలటరీ బేస్ తదితర ప్రాంతాల్లో కాల్పులు కొనసాగుతున్నాయని, పోరాటాలు కొనసాగుతున్నాయని ఇస్రాయీల్ సైన్యం తెలియజేసింది. హమస్ ప్రతినిధి ఖదోమీ మాట్లాడుతూ దశాబ్దాలుగా పాలస్తీనాపై జరుగుతున్న దౌర్జన్యాలు, దాడులకు ప్రతిస్పందనగా ఈ దాడిని అభివర్ణించాడు. గాజాలో పాలస్తీనా ప్రజలపై ఇస్రాయీల్ దుర్మార్గాలను అంతర్జాతీయ సమాజం అడ్డుకోవాలని, అల్ అక్సా వంటి తమ పవిత్ర ప్రదేశాలపై దాడులను అడ్డుకోవాలని హమస్ ప్రతినిధి చెప్పారు. హమస్ మిలిటరీ కమాండర్ ముహమ్మద్ డాయిఫ్ మాట్లాడుతూ భూమిపై చివరి దురాక్రమణను తొలగించే గొప్ప పోరాటదినంగా ఈ రోజును వర్ణించాడు. ఇస్రాయీల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మాట్లాడుతూ ఇస్రాయీల్ యుద్ధాన్ని ఎదుర్కుంటుందని, ఈ యుద్ధంలో ఇస్రాయీల్ గెలిచి తీరుతుందన్నాడు. ఇస్రాయీల్ రక్షణమంత్రి యువావ్ గాలంట్ కూడా ఇదే మాట చెప్పాడు. ఈ దాడుల తర్వాత ఇస్రాయీల్ కేబినెటు అత్యవసర సమావేశం నిర్వహించింది. అంతర్జాతీయ సమాజం ఈ దాడులను వెంటనే ఖండించింది. యూరోపియన్ యూనియన్, బ్రిటన్ తదితర దేశాలు హమస్ దాడులను ఖండించాయి. ఈరాన్ పాలస్తీనా పోరాటయోధులకు తన మద్దతు ప్రకటించింది. ఇస్రాయీల్ పై హమస్ చేసిన దాడి, ఇస్రాయీల్ ప్రతిదాడులు అదుపుతప్పి పూర్తి స్థాయి యుద్ధంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో మరింత అస్థిరతకు ఇది దారితీయవచ్చు.

హమస్ దళాలు ఇస్రాయీల్ లోనికి చొచ్చుకువచ్చినట్లు తెలుస్తోంది. ఇస్రాయీల్ లొని కొన్ని ప్రాంతాలను హమస్ తన అదుపులో తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఇస్రాయీల్ సైన్యం హమస్ ను వెనక్కు నెట్టడానికి పోరాడుతోంది.  హమాస్ దాడి ఇస్రాయీల్ ను దిగ్భ్రాంతికి గురిచేసిందని విశ్లేషకులు అంటున్నారు. గాజా సరిహద్దు నుంచి దాదాపు 24 కిలోమీటర్ల వరకు హమస్ దళాలు ఇస్రాయీల్ లోనికి చొచ్చుకువచ్చినట్లు వార్తలు వచ్చాయి. అనేక చోట్ల హమస్ ఇస్రాయీల్ సైనికులను, సాధారణ పౌరులను కూడా నిర్బంధంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిర్బంధంలోకి తీసుకున్న ఇస్రాయీల్ మహిళల పట్ల హమస్ మిలిటెంట్లు చాలా అమానుషంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలే నిజమైతే ప్రతిఘటన ఉద్యమంగా హమాస్ పంపాదించుకున్న సానుభూతిపరులను కూడా కోల్పోవచ్చు. చాలా వీడియోలు ఫేక్ వార్తలవి కూడా వస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా యుద్ధం అనేది అమానుషమైనది.

ఈ దాడిని పరిశీలిస్తే 1973లో ఈజిప్టు, సిరియా దళాలు చేసిన దాడి మాదిరిగా ఉందని కొందరు వర్ణిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఇస్రాయీల్ సెట్లర్లు అల్ అక్సా వద్ద ఆయుధాలతో చొరబడి బీభత్సం సృష్టించారు. గత కొంతకాలంగా గాజాలో ఇస్రాయీల్ దౌర్జన్యాల వార్తలు వస్తూనే ఉన్నాయి. రష్యా మాజీ అధ్యక్షుడు డిమిట్రి మెద్వదేవ్ మాట్లాడుతూ ఈ దాడి ఊహించిందే అన్నాడు. మధ్యప్రాచ్యంలోను, ఉక్రెయిన్ లోను అమెరికా జోక్యం వల్ల ఇలాంటి పరిణామాలు తప్పవని అన్నాడు.

నిజానికి ఈ దాడి ఆశ్చర్యకరమైనదేమీ కాదు. రష్యా మాజి అధ్యక్షుడు చెప్పినట్లు ఇది ఎప్పుడో ఒకప్పుడు జరగక తప్పదనే పరిస్థితులే కనిపిస్తూ వచ్చాయి. గత కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా గత ఏడు నెలలుగా ఇస్రాయీల్ దౌర్జన్యాలు శృతిమించాయి. వేలాది మంది సైనికులను వెస్ట్ బ్యాంకులో పంపించి ఇస్రాయీల్ పాలస్తీనీయులపై కొనసాగించిన హత్యాకాండలు ప్రపంచానికి తెలియనివి ఏమీ కాదు. పసిపిల్లలు కూడా అనేకమంది ఈ దాడుల్లో మరణించిన వార్తలు వచ్చాయి. వెస్ట్ బ్యాంకులో ఇస్రాయీల్ ఇంచార్జి మంత్రి బిజాలీ స్మోట్రిచ్ అక్కడి పాలస్తీనా గ్రామం హువారాను పూర్తిగా ధ్వంసం చేయించాడు. అక్కడి సెట్లర్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే, కొన్ని వార్తల ప్రకారం, పాలస్తీనా కుటుంబం తమ ఇంట్లో వండుకుని తినబోతున్న సమయంలో ఎవడో ఒక సెట్లర్ వస్తాడు. ఇల్లు ఖాళీ చేయమంటాడు. పాలస్తీనా కుటుంబం ఆ ఇల్లు ఖాళీ చేసి, తమ స్వంత ఇంటిని ఖాళీ చేసి శరణార్థులుగా వెళ్ళి పోక తప్పని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో బతుకుతున్న పాలస్తీనీయులు ఈ దాడి తర్వాత కోల్పోయేదేముంటుంది. హమాస్ దాడి తర్వాత గాజాను సర్వనాశనం చేస్తామని ఇస్రాయీల్ ప్రధాని ప్రకటించాడు. కాని పాలస్తీనీయులు ఇంకా నాశనం కావలసిందేముంది. వారు కోల్పోయేదేముంది. వారు సర్వనాశనం ఎప్పుడో అయిపోయారు.

అణిచివేయబడిన వారు శాశ్వతంగా అణిచివేతను భరిస్తూ ఉండరు. స్వేచ్ఛ కోసం ఆకాంక్ష చివరకు ఏదో ఒక రూపంలో బట్టబయలు అవతుందన్నాడు మార్టిన్ లూథర్ కింగ్

గత అర్థశతాబ్ధానికి పైగా పాలస్తీనా అత్యంత దారుణమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. గాజా నిజానికి ఒక బహిరంగ జైలు వంటిదిగా మారిపోయింది. ఇస్రాయీల్ ఏర్పడడమే దురాక్రమణ రాజ్యంగా ఏర్పడింది. 1948 మే 15వ తేదీన పాలస్తీనా అరబ్బు ప్రజల్లో 70 శాతం మంది తమ ఇల్లువాకిలి వదిలేసి ఇస్రాయీల్ ఏర్పాటు కోసం శరణార్థులుగా మారిపోయిన సంఘటన చరిత్రలో మాయని మచ్చ వంటిది. ఇప్పుడు 80 లక్షల మంది పాలస్తీనా శరణార్థులు ఉన్నారు. ఆ తర్వాత 1948 యుద్ధంలోనే ఇస్రాయీల్ 77 శాతం భూభాగాన్ని ఆక్రమించుకుంది. 1967 యుద్ధం తర్వాత మరిన్ని భూభాగాలను ఇస్రాయీల్ ఆక్రమించుకుంది. 1973 యుద్ధం ఐక్యరాజ్యసమితి జోక్యంతో ఆగింది. ఆ యుద్ధం తర్వాత పాలస్తీనీయుల హక్కులను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. కాని ఇస్రాయీల్ భూ దురాక్రమణ కొనసాగుతూనే వచ్చింది. హమాస్ తర్వాత ఏర్పడిన సాయుధ సంస్థ. హమాస్ బలం ఎక్కువగా గాజాలోనే ఉంది. 2012లో గాజాలో ఇస్రాయీల్ బీభత్సం సృష్టించింది. హమాస్ ఇస్రాయీల్ ఉనికినే గుర్తించడానికి నిరాకరిస్తోంది. 2023 మొదటి ఐదు నెలల కాలంలో ఇస్రాయీల్ పాల్పడిన దౌర్జన్యాల వార్తలు తరచు ప్రపంచం చదువుతూనే వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ దాడిని అర్థం చేసుకోవాలి.

హమస్ దాడి చాలా పెద్ద స్థాయిలో జరిగింది. వేలాది మంది పోరాటయోధులు పాల్గొన్నారు. బుల్డోజర్లు, హ్యాండ్ గ్రెనెడ్లు రకరకాల ఆయుధాలు, వాహనాలు ఉపయోగించారు. ఈ స్థాయి దాడి చేయాలంటే పథకరచనకు, ఏర్పాట్లకు చాలా సమయమే పట్టి ఉండాలి. ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైన గూఢచారవ్యవస్థగా చెప్పుకునే ఇస్రాయీల్ గూఢచార సంస్థ, తన పక్కనే జరుగుతున్న ఈ ఏర్పాట్లను పసిగట్టలేకపోయింది. ఇస్రాయీల్ గగనతలంలో ప్రవేశించే ప్రతి క్షిపణిని కూల్చివేసే ఐరన్ డోమ్ గొప్పలు ఇప్పుడు ఇస్రాయీల్ చెప్పుకోవడం సాధ్యం కాదు.

హమాస్ చాలా ఖచ్చితమైన లెక్కలతో ఈ దాడి చేసిందని నిపుణులు చెబుతున్నారు. ఇస్రాయీల్ గగనతలాన్ని కాపాడే ఐరన్ డోమ్ సామర్థ్యం 90 శాతం మాత్రమే అన్నది గతంలో చేసిన దాడుల్లో హమాస్ కనిపెట్టింది. వంద క్షిపణులు ప్రయోగిస్తే కనీసం పది క్షిపణులు లక్ష్యాన్ని చేధిస్తాయి. అదే 5000 క్షిపణులు ప్రయోగిస్తే, విధ్వంసం జరుగుతుంది. హమాస్ ఈ లెక్కలే వేసుకుంది. పైగా హమాస్ తయారు చేసుకునే క్షిపణులకు అయ్యే ఖర్చు మూడు వందల డాలర్లకు మించదని అంటున్నారు. కాని ఈ క్షిపణిని కూల్చడానికి ఇస్రాయీల్ ప్రయోగించే ఐరన్ డోమ్ క్షిపణి ఖర్చు ఎనభై వేల డాలర్లు. ఈ దాడి ఆర్థికంగా కూడా ఇస్రాయీల్ పై పెనుభారంగా మారబోతోంది. ప్రపంచంలో తిరుగులేని సైనికశక్తిగా చెప్పుకునే ఇస్రాయీల్ సైన్యం ఇలాంటి పరాభవాన్ని ఎన్నడూ ఊహించలేదు. ఇది ఇస్రాయీల్ కు తలెత్తుకోలేని పరిస్థితి కల్పించింది.

హమస్ ను అమెరికా టెర్రరిస్టు సంస్థగా ప్రకటించింది. కాని 2007 నుంచి గాజాలో హమస్ దే ప్రభుత్వం. నిరంతరం ఇస్రాయీల్ సైనికచర్యల నీడలో ఉన్నప్పటికీ హమస్ ఈ స్థాయి దాడి చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం ఇస్రాయీల్ రాజకీయ పరిస్థితి వివిధ పార్టీల మధ్య చీలిపోయి ఉంది. ఇంతకు ముందు జరిగిన యుద్ధంలో కూడా ఇస్రాయీల్ హమస్ పై పూర్తిగా పైచేయి సాధించలేకపోయింది. ఈ స్థాయిలో ఇస్రాయీల్ పై దాడి చేయడం వల్ల ఇస్రాయీల్ ప్రతిదాడులు ఉంటాయన్నది హమస్ కు కూడా బాగా తెలుసని పలువురు భావిస్తున్నారు. ఇప్పుడు ఇస్రాయీల్ ఏం చేస్తుంది? ప్రతిదాడులకు పూనుకుని భీకరమైన బాంబుల వాన కురిపిస్తే జనసమ్మర్థం ఉన్న గాజాలో మానవహననమే జరగవచ్చు. ఈ పరిస్థితి ఇస్రాయీల్ లోని పాలస్తీనా జనాభా రెచ్చిపోయేలా చేస్తుంది. గల్ఫ్ ప్రాంతంలోని అరబ్బు దేశాలు ప్రతిస్పందించక తప్పని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఇస్రాయీల్ ప్రతిదాడుల్లో 160 మంది పాలస్తీనీయులు మరణించారని, వెయ్యి మంది గాయపడ్డారని వార్తలు వచ్చాయి. ఈ హింసాకాండ మరింత పెరిగితే అరబ్బు దేశాల ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరగవచ్చు. అరబ్బు పాలకులకు ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. ఇస్రాయీల్ అరబ్బు దేశాలతో సంబంధాలు మెరుగుపరచుకునే క్రమంలో ఉంది. ఈ ప్రయత్నాలన్నీ దెబ్బతింటాయి. ఆర్థికంగా ఇస్రాయీల్ కు దెబ్బతగిలే పరిస్థితులు తలెత్తవచ్చు. అలా అని హమస్ పై గట్టి చర్యలు తీసుకోకపోతే ఇస్రాయీల్ బలహీనంగా కనబడుతుంది. నెతన్యాహు తన ప్రభుత్వం బలహీనంగా కనబడడాన్ని భరించగలిగే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇస్రాయీల్ లోని నెతన్యాహు ప్రభుత్వాన్ని ముందు నుయ్యి, వెనుక గొయ్యి వంటి పరిస్థితిలో నెట్టేసింది హమస్ అని చాలా మంది భావిస్తున్నారు. నెతన్యాహు ఒకవైపు వెస్ట్ బ్యాంక్ లో, గాజాలో దౌర్జన్యాలు కొనసాగిస్తూ, సెటిల్మెంట్లను విస్తరిస్తూ మరోవైపు అరబ్బు దేశాలతో సంబంధాలు మెరుగు పరచుకుంటూ వస్తున్నాడు. పాలస్తీనా స్వతంత్రదేశం అనేది ఏర్పడకుండా వేయవలసిన ఎత్తులన్నీ వేస్తూ వస్తున్నాడు. గాజా, వెస్ట్ బ్యాంకుల్లో ఇస్రాయీల్ దుర్మార్గాల వార్తలు ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. పటిష్టమైన ఇంటిలిజెన్స్, ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్ వేర్లు, సైనిక ఔట్ పోస్టులు, చీమచిటుక్కుమన్నా, పక్షి రెక్క విప్పినా ఇస్రాయీల్ కు తెలిసిపోతుందనే వాతావరణం సృష్టించాడు. కాని గాజాలో హమస్ ఇంత పెద్ద స్థాయి దాడికి ఏర్పాట్లు ఈ ఇంటిలిజెన్స్ కన్నుకప్పి చేయగలిగింది. ఈ దాడి చేసి నెతన్యాహుకు ఏం చేయాలో తోచని స్థితికి నెట్టేసింది. తీవ్రమైన ప్రతిదాడులకు పాల్పడితే భారీస్థాయిలో ప్రాణనష్టం సంభవిస్తుంది. ఇస్రాయీల్ దాడుల్లో చిన్నపిల్లలు చనిపోయిన వార్తలు కొంతకాలం క్రితం వచ్చాయి. ఇస్రాయీల్ కొనసాగిస్తున్న ఈ దుర్మార్గాల పట్ల ఇప్పటికే అరబ్బు ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కాని అరబ్బు దేశాల్లోని పాలకులు, అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, మొరక్కో, సూడాన్, సౌదీ తదితర దేశాలు ఇస్రాయీల్ తో సంబంధాలు మెరుగుపరచుకోవడం కూడా జరుగుతూ వస్తోంది. పాలస్తీనా గురించి ప్రత్యేకంగా చాలా సార్లు మాట్లాడే టర్కీ అధ్యక్షుడు ఉర్దుగాన్ కూడా ఇటీవల ఇస్రాయీల్ ప్రధానిని కలిశాడు. ఇప్పుడు ఇస్రాయీల్ ప్రతిదాడులు చేస్తే, గాజాలో భారీ ప్రాణనష్టం సంభవిస్తే ఈ అరబ్బు దేశాలు ఇస్రాయీల్ తో సంబంధాల విషయంలో వెనకడుగు వేసే అవకాశాలున్నాయి. మరోవైపు ఈరాన్ నిర్ద్వంద్వంగా హమస్ కు మద్దతుగా మాట్లాడింది. రష్యా మాజీ అధ్యక్షుడు కూడా ఇదంతా పాశ్చాత్యదేశాల పుణ్యమే అని ఈ దాడి జరగడంలో ఆశ్చర్యమేమీ లేదన్నాడు.

ఉక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత రష్యాను నిలువరించడానికి ఉక్రెయిన్ కు భారీ సహాయం అందిస్తున్న పాశ్చాత్య దేశాలు ఇప్పుడు ఇస్రాయీల్ కు సహాయం అందించే పరిస్థితి. పాశ్చాత్య దేశాలు ఇప్పుడు ముప్పేట దాడిలో ఇరుక్కుపోయాయి. రష్యా ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. మరోవైపు చైనా కూడా తన పావులు మధ్యప్రాచ్యంలో కదుపుతుంది. ఇప్పుడు మధ్యప్రాచ్యం మునుపటి మధ్యప్రాచ్యం కాదు. ఈ పరిస్థితిలో నెతన్యాహు హమస్ పై పూర్తిస్థాయి యుద్ధానికి వెళితే యుద్ధం పూర్తిగా గెలిచే అవకాశాలు కూడా తక్కువ. గతంలో జరిగిన యుద్ధంలోను ఇస్రాయీల్ హమస్ ను అణచలేకపోయింది. హిజ్బుల్లాతో యుద్ధం చేసి తన సైనిక బలం గురించి గొప్పలుపోయినా చివరకు మాడు బొప్పి కట్టి వెనక్కి తగ్గవలసి వచ్చింది. గాజాపై దాడులు తీవ్రం చేసి అరబ్బు దేశాల్లో ప్రజాగ్రహాన్ని కొని తెచ్చుకుని, ఫలితంగా దగ్గరవుతున్న అరబ్బు ప్రభుత్వాలను దూరం చేసుకుంటాడా? లేక హమస్ తీసిన దెబ్బను మరిచిపోయి పరిస్థితులు దిగజారకుండా జాగ్రత్త పడతాడా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. హమస్ మొదట దాడి చేసింది కాబట్టి ఇస్రాయీల్ ప్రతిదాడి చేసిందనే వాదన మధ్యప్రాచ్యంలో నిలబడదు. ఎందుకంటే ఇటీవలి కాలంగా ఇస్రాయీల్ అల్ అక్సా వద్ద చేపట్టిన చర్యలు, ఇస్రాయీల్ ఇటీవల కాలంగా చేస్తున్న దాడులకు ప్రతిదాడిగా హమస్ దాడిని చూసేవారే ఎక్కువ. ఈ లెక్కలన్నీ వేసిన తర్వాతనే హమస్ ఈ దాడికి దిగిందని చాలా మంది విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల ఇస్రాయీల్ సౌదీల మధ్య సంబంధాల వార్తలు హమస్ దాడికి ఒక కారణమనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇస్రాయీల్, సౌదీ సంబంధాలు అటకెక్కినట్లే అని చాలా మంది విశ్లేషిస్తున్నారు.  మరో ముఖ్యమైన విషయమేమిటంటే, గాజాలో కేవలం ముప్పయి, ముప్పయి ఐదు కిలోమీటర్ల వెడల్పు, వంద కిలోమీటర్లు సుమారు పొడవు వున్న ఒక చిన్న ప్రాంతాన్ని అదుపు చేయలేకపోతున్న ఇస్రాయీల్ సామర్థ్యం ఇప్పుడు ప్రపంచంలో ఇస్రాయీల్ ను తలెత్తుకోలేని స్థితికి తీసుకువచ్చింది.

ఇస్రాయీల్ ఉనికినే ఒప్పుకోమనే వారు కొందరు పాలస్తీనాలో ఉన్నారన్నది నిజమే. అలాగే పాలస్తీనాను పూర్తిగా ప్రపంచ పటం నుంచి తుడిచేయాలనుకునేవారు ఇస్రాయీల్ పాలకవర్గంలోనే ఉన్నారన్నది నిజమే. కాని అటు యూదుల్లోను, ఇటు పాలస్తీనా అరబ్బుల్లోను శాంతికాముకులు చాలా మంది ఉన్నారు. ఇస్రాయీల్ ఉనికిని ఒప్పుకుని శాంతియుతంగా జీవించాలనుకునే పాలస్తీనా అరబ్బులు ఉన్నారు, అలాగే పాలస్తీనా ఉనికిని, ప్రత్యేక దేశాన్ని ఒప్పుకుని కలిసి మెలిసి ప్రశాంతంగా బతకాలనుకునే యూదులు చాలా మంది ఉన్నారు. కాని ఈ శాంతిస్వరాలు యుద్ధబీభత్సాల్లో కొట్టుకుపోతున్నాయి.

హమాస్ దాడి జరిగిన తర్వాత తక్షణం భారత ప్రధాని ప్రతిస్పందించారు. ఇస్రాయీల్ పట్ల సంఘీభావాన్ని ప్రకటించారు. కష్టసమయంలో ఇస్రాయీల్ కు తోడుగా ఉన్నామన్నారు. నిజమే ఒక భయంకరమైన దాడి జరిగిన తర్వాత ప్రజాస్వామిక దేశంగా ప్రతిస్పందించడం, మన సానుభూతి ప్రకటించడం చాలా అభినందించదగిన విషయం. కాని నెలల తరబడి మణిపూర్ తగలబడుతుంటే, హత్యాకాండలు జరుగుతుంటే, అత్యంత దారుణంగా మహిళలను వివస్త్రలు చేసి ఊరేగించిన సంఘటనలు జరుగుతుంటే ప్రధాని ఎందుకు నోరిప్పలేదని పలువురు చేస్తున్న విమర్శల్లోని ఔచిత్యం కూడా కాదనలేము. నరేంద్రమోడీ పరిపాలనలో దేశం చాలా భద్రంగా ఉందని, యుపీయే కాలంలో టెర్రరిస్టు దాడులతో అల్లకల్లోలంగా ఉండేదని రాజకీయంగా హమాస్ దాడిని వాడుకోడానికి బీజేపీ నేతలు ప్రయత్నించారు. ఆ వెంటనే కాంగ్రెస్ మోడీ హయాంలో జరిగిన 30 పై చిలుకు టెర్రరిస్టు దాడుల చిట్టాను విడుదల చేసి చూసుకోమంది.

ఇస్రాయీల్ పట్ల ప్రధాని సంఘీభావం ట్విటరు ద్వారా ప్రకటించడం కూడా చాలా మందికి మింగుడు పడడం లేదు.నిజానిక భారత ప్రభుత్వ వైఖరిని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన ద్వారా తెలియజేయాలి. కాని ప్రధాని స్వయంగా మొందుకు వచ్చి ట్వీటు చేయడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ప్రభుత్వంలో అంతా ప్రధాని నరేంద్రమోడీ తప్ప మరేమీ లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెసు పార్టీ అధికారిక ప్రకటనను ఈ సందర్భంగా గమనించాలి. హమాస్ దాడిని కాంగ్రెసు పార్టీ ఖండించింది. దాంతో పాటు పాలస్తీనా ప్రజలు ఆత్మగౌరవంతో జీవించే హక్కును కూడా గౌరవించాలని, సలహా సంప్రదింపుల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని, ఇస్రాయీల్ భద్రతకు హామీ ఉండాలని పేర్కొంది. అంతర్జాతీయ వ్యవహారాల్లో ప్రకటనలు సమతుల్యంగా, దౌత్యపరమైన పరిణామాలను అంచనా వేసుకుని విడుదల చేయవలసి ఉంటుంది. కాని ఎన్నికల రాజకీయాల కోసం మధ్యప్రాచ్యంలో సంఘటనలను వాడుకుంటూ, హమస్ దాడి జరిగిన వెంటనే కేవలం సంఘీభావ ప్రకటన చేసేయడం విచిత్రంగా ఉండని చాలా మంది భావిస్తున్నారు.

ఏది ఏమైనా మధ్యప్రాచ్యంలో హమాస్ చేసిన దాడి మధ్యప్రాచ్య సమీకరణాలనే కాదు, ప్రపంచంలో బలాబలాల తూకాలను కూడా మార్చేసే అవకాశాలున్నాయి. అలాగే ఇక్కడ రాజకీయాలపై, ముఖ్యంగా ఎన్నికల రాజకీయాలపై కూడా దీని ప్రభావం బలంగా పడే అవకాశం ఉంది.

–      వాహెద్