November 23, 2024

తెలంగాణలో ముస్లిం ఓట్లు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పాయి. కాంగ్రెసు ఘనవిజయానికి కారణమయ్యాయి. రాష్ట్ర జనాభాలో ముస్లిములు 13 శాతం ఉన్నారు. దాదాపు 45 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ముస్లిం ఓట్లు నిర్ణయాత్మకంగా ఉన్నాయి.

ముస్లిం ఓట్లు కాంగ్రెసు వైపు మొగ్గు చూపడానికి ముఖ్యమైన కారణాల్లో ఒకటి జమాఅతె ఇస్లామీ హింద్‌ తెలంగాణా విభాగం ప్రకటించిన మద్దతు. మొత్తం 69 స్థానాల్లో జమాఅత్‌ కాంగ్రెసుకు మద్దతిచ్చింది. పార్టీ ప్రాతిపదికన కాకుండా అభ్యర్థుల ప్రాతి పదికన జమాఅత్‌ మద్దతు ఇచ్చినప్పటికీ, అత్యధికంగా కాంగ్రెసు అభ్యర్థులకే మద్దతు లభించిందన్నది స్పష్టం. ఈ నియోజక వర్గాల్లో ముస్లిం ఓటర్లను ఈ నిర్ణయం ప్రభావితం చేసింది. ఈ నియోజకవర్గాలే కాకుండా వాటికి ఆనుకుని ఉన్న నియోజక వర్గాల్లో కూడా ముస్లిం ఓటర్లపై ఈ ప్రభావం పడిరది.
మరోవైపు తెలంగాణ ముస్లిం సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కూడా కాంగ్రెసుకు షరతులతో కూడిన మద్దతిచ్చింది. రాష్ట్రంలోని ముస్లిములందరూ సమైక్యంగా కాంగ్రెసుకు ఓటు వేయాలని పిలుపునిచ్చింది. కాంగ్రెసు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోగా ముస్లిం డిక్లరేషనులోని వాగ్దానాలు అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావడానికి ఈ మద్దతు నిర్ణయం ఉపయోగపడుతుందని ప్రకటించింది. ఎన్నికల తేదీకి వారం ముందు ఈ ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన కూడా ముస్లిము లను ప్రభావితం చేసింది. అయితే ముస్లిములు కాంగ్రెసుకు ఇచ్చిన మద్దతు కాంగ్రెసు పని తీరుపై ఉంటుందని, రానున్న రోజుల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోకపోతే రానున్న సాధారణ ఎన్నికల్లో ఈ మద్దతు కాంగ్రెసుకు ఉండదని కూడా జాక్‌ స్పష్టం చేసింది.
ఈ ప్రకటనలు ముస్లిం ఓట్లు చీలిపోకుండా కాపాడాయి. ముఖ్యంగా మహబూబ్‌ నగర్‌, హుజూర్‌ నగర్‌, వరంగల్‌ ఈస్ట్‌, ఖమ్మం, బోధన్‌, ఇబ్రాహీం పట్నం, షాద్‌ నగర్‌, రామగుండం, నిజామాబాద్‌ రూరల్‌, నల్గొండల్లో ఎన్నికల ఫలితాలపై ప్రభావం వేశాయి. బీఆరెస్‌ పార్టీలో ముస్లిం నేతలెవ్వరు చెప్పుకోదగ్గవారు లేరు. మజ్లిస్‌ పార్టీతో బీఆరెస్‌ స్నేహాన్ని చూపించి ముస్లిం ఓట్లను పొందాలనుకున్న ప్రయత్నం ఫలించలేదు. 2014, 2018 ఎన్నికల్లో బీఆరెస్‌ పక్షాన నిలబడిన ముస్లిం ఓటర్లు ఈ సారి కాంగ్రెసును బలపరిచారు.
బీజేపీ అగ్రనాయకులు ఈటెల రాజేందర్‌, బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్‌, రఘునందన్‌ రావులు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇది బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ. ముస్లిం ఓట్లు సమైక్యంగా పోలవ్వడమే ఈ ఫలితాలకు కారణం. గతంలో మాదిరిగా ముస్లిం ఓట్లు ఈ సారి చీలిపోలేదు. ఈటెల రాజేందర్‌ బీఆరెస్‌ను వదిలి బీజేపీలో చేరిన నేత. ఈయన పోటీ చేసిన గజ్వేల్‌లోను, హుజురాబాద్‌లోను రెండు చోట్ల ఓడిపోయారు. బండి సంజయ్‌ బీజేపీ ప్రముఖ నాయకుడు. కరీంనగర్‌ ఎం.పీ. ఈయన కరీంనగర్‌లో ఓడిపోయారు. నిజామాబాద్‌ ఎం.పీ ధర్మపురి అరవింద్‌ కోరుట్లలో ఓడిపోయారు. రఘునందన్‌ రావు దుబ్బాకలో ఓడిపోయారు.
అయితే కామారెడ్డిలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి కె. వెంకట రమణా రెడ్డి తన ప్రత్యర్థులు రేవంత్‌ రెడ్డిపై, కేసీఆర్‌ పై గెలవడం చెప్పుకోదగ్గ విషయం. కాంగ్రెసు, బీఆరెస్‌ అగ్రస్థాయి నేతలిద్దరు ఇక్కడ పోటీలో ఉండడం వల్ల ముస్లిం ఓట్లు చీలిపోయాయన్నది స్పష్టం. అలాగే గత ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచిన బీజేపీ ఈసారి ఎనిమిది స్థానాల్లో గెలుపు నమోదు చేసింది.
కాంగ్రెసు, బీఆరెస్‌ మధ్య ముస్లిం ఓట్లు చీలిపోయే పరిస్థితి ఈసారి బీజేపీకి కొన్ని నియోజకవర్గాల్లో ఉపయోగపడిరది.
ఏది ఏమైనా ఈ ఎన్నికలు బీఆరెస్‌కు మొదటి సారి ఓటమి అనుభవంలోకి వచ్చేలా చేశాయి. ముస్లిం రాజకీయ ప్రాతినిథ్యం పట్ల నిర్లక్ష్యం చూపించడం, ముస్లిములకు టిక్కెట్లివ్వకపోవడం, ముస్లిం నాయకత్వాన్ని ప్రోత్సహించకపోవడం, కేంద్రస్థాయిలో అనేక నిర్ణయాల్లో ముస్లిం మనోభావాలను గౌరవించకుండా బీజేపీకి మద్దతుగా నిలబడడం ఇలాంటి అనేక కారణాలు ముస్లిములు బీఆరెస్‌కు దూరమయ్యేలా చేశాయి. ఇప్పటికైనా బీఆరెస్‌ నాయకత్వం తప్పులు దిద్దుకుంటుందా?