November 24, 2024

హమాస్ ఇస్రాయీల్ పై దాడి చేసిన తర్వాతి నుంచి గాజాపై ఇస్రాయీల్ కొనసాగిస్తున్న అమానుష దాడులన్నింటినీ అమెరికా సమర్థిస్తూ వస్తోంది. కాని ఇటీవల అమెరికాకు కూడా సమర్థించడం సాధ్యం కాని పరిస్థితి తలెత్తింది. గాజాలో హమాస్ ను అంతమొందిస్తామంటూ ఇస్రాయీల్ ప్రారంభించిన దాడులు నిజానికి హమాస్ సాయుధులను ఏమీ చేయలేకపోయాయి, కాని అమాయక గాజా ప్రజలను చంపుతున్నాయి. దాదాపు 18 వేల మంది మరణించినట్లు తెలుస్తోంది. గాజాను శిధిలాల గుట్టగా మార్చేసినా హమాస్ ను ఇస్రాయీల్ పూర్తిగా అంతం చేస్తుందని చెప్పడం సాధ్యం కాని పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటే నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇస్రాయీల్ వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయి.

అమెరికాలోను పాలస్తీనా పట్ల మద్దతు పెరుగుతోంది. ఈ పరిస్థితి అమెరికా అధ్యక్షుడికి కూడా ఇబ్బందికరంగా మారింది. మొన్న ఒక కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ ఇస్రాయీల్ రక్షణ బాధ్యత అమెరికాపైనే ఉందని, అయితే ఇస్రాయీల్ కు అమెరికా కన్నా ఎక్కువగా యూరోపియన్ యూనియన్ బలం ఉందని అన్నాడు. కాని ఈ మద్దతును ఇప్పుడు ఇస్రాయీల్ కోల్పోతోందని కూడా ఆయన చెప్పాడు. ఎందుకంటే ఇస్రాయీల్ గాజాపై బాంబుదాడులు చేస్తూ అమాయక ప్రజలను చంపడమే దానికి కారణం.
హమాస్ ను అంతమొందించే హక్కు ఇస్రాయీల్ కు ఉందని కూడా ఆయన చెప్పాడు. అమెరికా అధ్యక్షుడు ఈ మాటలు చెప్పగానే ఇస్రాయీల్ ప్రధాని తమకు అమెరికా పూర్తి మద్దతిస్తోందని, గాజాపై దాడులకు అమెరికా అధ్యక్షుడి పూర్తి మద్దతు ఉందని అన్నాడు. కాని అమెరికా అధ్యక్షుడు ఈ మద్దతును కొనసాగించడం కష్టమే. ఎందుకంటే డెమొక్రటిక్ పార్టీలో కూడా ఇప్పుడు ఇస్రాయీల్ వైఖరి పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి.
డిసెంబర్ 12వ తేదీన ఐక్యరాజ్యసమితిలో గాజా యుద్ధాన్ని తక్షణం ఆపాలన్నీ తీర్మానానికి అనుకూలంగా ఇండియా కూడా ఓటు వేసింది. ఇంతకు ముందు ఐక్యరాజ్యసమితిలో ఇలాంటి తీర్మానం వచ్చినప్పుడు ఇండియా తటస్థవైఖరి తీసుకుందని గమనించాలి. ఇప్పుడు ఇండియా వైఖరి కూడా మారింది. ఈ సారి తీర్మానానికి 153 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. తీర్మానాన్ని వ్యతిరేకించిన దేశాలు కేవలం పది మాత్రమే. ఇందులో ఇస్రాయీల్, అమెరికాలతో పాటు మరికొన్ని పాశ్చాత్య దేశాలున్నాయి. మరో 23 దేశాలు ముఖ్యంగా యూరప్ దేశాలు తటస్థ వైఖరి తీసుకున్నాయి. ఇంతకు ముందు ఇండియా కూడా ఇదే వైఖరి తీసుకుంది. కాని ఇప్పుడు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసింది.
ఐక్యరాజ్యసమితి తీర్మానంలో హమాస్ ఉగ్రదాడి గురించి ప్రస్తావన వచ్చేలా చేయాలని అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు, ఇండియా కూడా ప్రయత్నించాయి. కాని అది సాధ్యం కాలేదు. ఈ సారి తీర్మానంలో కూడా గతంలో మాదిరిగానే ఐక్యరాజ్యసమితి హమాస్ దాడులను ప్రస్తావించలేదు. అయినప్పటికీ ఇండియా తన వైఖరిని మార్చుకుంది. డిసెంబర్ 8వ తేదీన కూడా ఇలాంటి ఒక తీర్మానం భద్రతామండలిలో వచ్చింది. కాని అమెరికా వీటో చేసింది.
హమాస్ దాడి చేసిన రోజున వెంటనే ప్రధాని మోడీ ఇస్రాయీల్ కు అనుకూలంగా, ఇస్రాయీల్ తో సంఘీభావం ప్రకటిస్తూ ట్వీటు చేశారు. మూడు రోజుల తర్వాత ఇస్రాయీల్ ప్రధానితో భారత ప్రధాని మోడీ ఫోనులో మాట్లాడారు. భారతదేశం ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. ఈ రెండు సందర్భాల్లోను గాజాలోని ప్రజల గురించి ప్రస్తావనే రాలేదు. హమాస్ దాడి జరిగిన ఐదు రోజుల తర్వాత భారత విదేశాంగ శాఖ నుంచి వచ్చిన ప్రకటనలో రెండు దేశాల పరిష్కారం గురించి, పాలస్తీనా గురించి మాట్లాడారు. ఆ తర్వాత కూడా ఐక్యరాజ్యసమితిలో భారతదేశం తటస్థ వైఖరి కొనసాగించింది. కాని ఇప్పుడు గాజా యుద్ధాన్ని వెంటనే ఆపాలన్న తీర్మానాన్ని బలపరుస్తూ పాలస్తీనాకు అనుకూల వైఖరి తీసుకోవలసి వచ్చింది. దీనికి ముఖ్యకారణం గాజాలో ఇస్రాయీల్ కొనసాగిస్తున్న అమానుష, క్రూరమైన దాడులే. మరోవైపు అమెరికా అధ్యక్షుడు తాము ఇస్రాయీల్ కు మద్దతిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఆయన కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉన్నాడు. అమెరికాలో ప్రజల్లోనే కాదు, డెమొక్రటిక్ పార్టీలోను, అధికారుల్లోను కూడా అమెరికా అధ్యక్షుడి వైఖరి పట్ల వ్యతిరేకత ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అమెరికా గాజా తీర్మానాన్ని వీటో చేసిన తర్వాత భారతదేశం కూడా మరోసారి తటస్థ వైఖరి తీసుకుంటుందని పలువురు భావించారు. కాని అలా జరగలేదు. నిజానికి పాలక బీజేపీకి ఇస్రాయీల్ పట్ల ఉన్న అభిమానం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఇస్రాయీల్ కు వ్యతిరేకంగా ఉన్న తీర్మానాన్ని బలపరచడం మారిన వైఖరికి నిదర్శనం.
గాజా విషయంలో ఇప్పుడు ఇస్రాయీల్, అమెరికా లు ఒంటరైపోయాయి. ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రారంభించిన రష్యా ఎలా ఐక్యరాజ్యసమితిలో ఒంటరైపోయిందో అదేవిధంగా ఇప్పుడు ఇస్రాయీల్, అమెరికాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిలోను అసహనం పెరుగుతోంది. ఇస్రాయీల్ ప్రభుత్వంలో ఉన్న మతతత్వవాదులను తొలగించాలని కూడా ఆయన ఒక సందర్భంలో చెప్పాడు. ఈ యుద్ధం తర్వాత ఇస్రాయీల్ గాజాలో తన సైన్యాన్ని కొనసాగించాలని అనుకుంటుంది. గాజాను అదుపులో ఉంచుకోవాలని భావిస్తోంది. కాని అమెరికా ఈ యుద్ధం తర్వాత రెండుదేశాల పరిష్కారాన్ని బలంగా ముందుకు తీసుకురావాలని భావిస్తోంది. వచ్చే సంవత్సరం అమెరికాలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇస్రాయీల్ కు బిడెన్ ఇస్తున్న మద్దతు అమెరికా ఎన్నికల్లో బెడిసికొట్టే ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఇస్రాయీల్ పూర్తిగా అమెరికా సరఫరా చేసే ఆయుధాలపై ఇప్పుడు ఆధారపడుతోంది. మందుగుండు సరఫరా అమెరికా నిరంతరం కొనసాగిస్తుందన్న హామీ కూడా లేదు. ఏది ఏమైనా గాజాలో ఇస్రాయీల్ కు మద్దతివ్వడం పెద్ద తప్పిదంగా ఈ దేశాలు భావించే పరిస్థితులు వస్తున్నాయి.
మరోవైపు గాజా యుద్ధంలో అడుగుపెట్టిన హూతీలు కొత్త సవాళ్ళను విసురుతున్నారు. ఇప్పటి వరకు గాజా యుద్ధం విస్తరించలేదు. వెస్ట్ బ్యాంకులో కూడా ఇస్రాయీల్ దుందుడుకు చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ వెస్ట్ బ్యాంకులో పూర్తి స్థాయి యుద్ధంగా మారలేదు. ఇరుగు పొరుగున ఉన్న లెబనాన్, సిరియా, జోర్డన్, ఈజిప్టు దేశాలు పాలస్తీనాకు ఇస్తున్న మద్దతు ఇంతవరకు కేవలం మాటలకే పరిమితం. లెబనాన్ లో హిజ్బుల్లా అడపాదడపా దాడులు చేస్తూ ఇస్రాయీల్ సైన్యానికి తన బలం ఎంత ఉందో చెబుతున్నప్పటికీ పూర్తి స్థాయి యుద్ధంలో దిగలేదు. ఒకవిధంగా చెప్పాలంటే హిజ్బుల్లా కూడా సహనంతో వ్యవహరిస్తోంది. సిరియాలోని అనేక సాయుధ గ్రూపులు కూడా చాలా వరకు యుద్ధాన్ని విస్తరించకుండా సహనం వహిస్తున్నాయనే చెప్పాలి. జోర్డన్, ఈజిప్టులు యుద్ధానికి దూరంగానే ఉన్నాయి. ఈ దేశాలు యుద్ధంలోకి వస్తే ప్రాంతీయంగా యుద్ధం విస్తరించే ప్రమాదం ఉంది. ఈ ప్రాంతంలో ప్రయోజనాలున్న సౌదీ అరేబియా, టర్కీ, ఈరాన్ దేశాలు కూడా పాలస్తీనాకు మాటసహాయమే చేస్తున్నాయి. అంతకు మించి ఏమీ చేయడం లేదు. అమెరికా, యూరపు దేశాల నుంచి ఇస్రాయీల్ కు సహాయం లభిస్తున్నప్పటికీ ఈ దేశాలు ప్రత్యక్షంగా యుద్ధంలో లేవు.
ఆర్థికంగా కూడా గాజాలో యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థలపై పడే ప్రభావమేమీ లేదు. అమెరికా, ఇస్రాయీల్ దేశాలకు రక్షణ ఖర్చులు పెరగడం తప్ప మిగిలిన దేశాలపై పడే ప్రభావం ఏదీ లేదు. కాని, ఈ యుద్ధంలో అడుగుపెట్టి తమ బలమేమిటో చూపిస్తున్న హూతీలు ఈ సమతుల్యాన్ని, ప్రపంచదేశాల నిష్క్రియాపరత్వాన్ని సవాలు విసిరే అవకాశాలున్నాయి. ఆ పరిస్థితిలో యుద్ధం విస్తరించడం తప్పదు. ఎమన్ కు చెందిన హూతీ తిరుగుబాటు దళాలు హిందూమహాసముద్రానికి, ఎర్ర సముద్రానికి మధ్య ఉన్న బాబల్ మందేబ్ సముద్రమార్గాన్ని దాదాపు నియంత్రిస్తున్నారు. ఇది ఇరుకైన నౌకామార్గం. హర్మూజ్, మలక్కా జలసంధుల తర్వాత ప్రపంచంలో అతిపెద్ద మూడవ జలసంధి ఇది. ప్రతి రోజు ఇక్కడి నుంచి అరవై లక్షల బారెళ్ళ చమురు రవాణా జరుగుతుంది. ఈ చమురు ముఖ్యంగా యూరప్ దేశాలకు వెళుతుంది. గాజా యుద్ధంలో పాలస్తీనా పక్షనా దిగిన హూతీలు ఎర్రసముద్రంలో నౌకామార్గాలపై పంజా విసురుతున్నారు. దీనివల్ల చమురు ధరలు పెరుగుతాయి. చమురు ధరలు మాత్రమే కాదు చాలా ధరలు పెరుగుతాయి.
హూతీల దాడులను అదుపు చేయడం సాధ్యమా? దౌత్యపరంగా హూతీలతో చర్చలు జరిపే ప్రసక్తి రాదు. ఎందుకంటే వారిని ఎవరు గుర్తించడం లేదు. ఒక్క ఈరాన్ మాత్రమే మాట్లాడగలదు. ఈరాన్ కూడా సూత్రబద్దంగా హూతీలను బలపరుస్తుంది కాని వారిని అదుపు చేయడం ఈరాన్ కూ సాధ్యం కాకపోవచ్చు. ఈరాన్ చెప్పినా వాళ్ళు వినకపోవచ్చు. ఆర్థిక ఆంక్షలను విధించి హూతీల మెడలు వంచే అవకాశాలు కూడా లేవు. ఎమన్ పై అనేక ఆంక్షలు విధించినా హూతీలు ఎన్నడూ పట్టించుకోలేదు. సముద్రంపై సరుకుల నౌకలను మాత్రమే కాదు సాయుధ నౌకలపై కూడా దాడులు చేసిన చరిత్ర హూతీలకు ఉంది. ఎర్రసముద్రంలో నౌకలకు హూతీల బెడద ఎప్పుడూ ఉంది. జనవరి 2017లో రిమోట్ బోటులతో సౌదీ నౌకపై దాడి చేయడమే కాదు సౌదీ నౌకాదళం ఎమన్ జలాల నుంచి వెనక్కు తగ్గేలా చేశారు. జులై 2018లో సౌదీ ఆయిల్ ట్యాంకర్లను క్షిపణులతో ధ్వంసం చేశారు. 2021లో ఎమన్ తీరంలో ఈరాన్, ఇస్రాయీల్ మధ్య అప్రకటిత జలయుద్ధం జరిగింది. గాజా యుద్ధం నేపథ్యంలో కూడా హూతీలు పాలస్తీనాకు మద్దతుగా ఒక నౌకను అపహరించారు. ఆ తర్వాత అమెరికా హూతీలను ఉగ్రవాదులుగా ప్రకటించాలనే విషయం ఆలోచిస్తోంది. ఈ విషయమై అమెరికా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా హూతీ, హిజ్బుల్లా వంటి సంస్థలు మరింత రెచ్చిపోయే అవకాశాలున్నాయి. అందువల్లనే అమెరికా, పాశ్చత్యదేశాలు ఆచితూచి అడుగేస్తున్నాయి.
ఎర్రసముద్రంలో హూతీలను ఎదిరించడానికి ఇప్పుడు అమెరికా, ఫ్రాన్స్, యుఏయి, ఇస్రాయీల్ తదితర దేశాలు ఒక్కటవుతున్నాయి. తమకు వ్యతిరేకంగా ఒక్కటవుతున్న దేశాల గురించి హూతీలకు తెలుసు. సౌదీ, యుఏయి దేశాలు ఈ కూటమిలో చేరకుండా ఇప్పటికే హూతీలు హెచ్చరికలు జారీచేశారు. ఈ హెచ్చరికలను ఈ దేశాలు పెడచెవిన పెట్టలేవు. ఎందుకంటే ఈ దేశాల చమురు రిగ్గులపై హూతీ దాడులను ఆపడం అంత తేలిక కాదు. ఈ చమురు క్షేత్రాలపై దాడులు జరిగితే యుద్ధం మరింత విస్తరిస్తుంది. ప్రపంచంలో చమురు ధరలు ఆకాశాన్నంటుతాయి.
అత్యంత అమానుషంగా వేలాది ప్రాణాలు బలైపోతున్న గాజాయుద్ధం పై నిజానికి ప్రపంచదేశాలు ఇప్పుడు ఆలోచిస్తున్నది తక్కువ. కాని హూతీలు రెచ్చిపోతే అదుపుచేయడం ఎలా అని ఆలోచిస్తున్నది ఎక్కువ. మానవప్రాణాల కన్నా చమురుకే ఎక్కువ విలువ ఉందనిపిస్తోంది.

– వాహెద్