November 23, 2024

ట్రక్కు డ్రైవర్ల సంఘం చివరకు ఆందోళన విరమించింది. కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహితలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి కొత్త నియమనిబంధనలకు వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన ప్రారంభించారు. జనవరి 2వ తేదీన సమ్మె ప్రారంభమైన రెండవరోజు హోంమంత్రిత్వ శాఖ ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్ పోర్టు కాంగ్రెసుతో చర్చలు జరిపిన తర్వాత ఈ సమ్మె విరమించారు. ఈ చర్చల్లో ఏం జరిగిందంటే, హిట్ అండ్ రన్ కేసులు అంటే యాక్సిడెంట్ చేసి అక్కడి నుంచి పారిపోయే కేసుల్లో కొత్త చట్టాలు అప్పుడే అమల్లోకి రావని, ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్ పోర్టు కాంగ్రెసు ప్రతినిధులతో చర్చలు సంప్రదింపుల తర్వాత మాత్రమే అమలు చేస్తామని ప్రభుత్వం వివరణ ఇచ్చిన తర్వాత సమ్మె విరమించారు.

ఇక్కడ గమనించవలసిన పదాలు ’’చర్చలు సంప్రదింపులు‘‘. అధికారం చేతుల్లో ఉన్నవారు, ఏమైనా చేసేయవచ్చు అనుకునేవారు ఇప్పుడైనా చర్చలకు సంప్రదింపులకు ఉన్న ప్రాధాన్యత గుర్తిస్తారా? దేశంలో చట్టాలు చేస్తున్నప్పుడు చర్చలు సంప్రదింపుల ప్రాముఖ్యాన్ని తెలుసుకుంటారా?
ఇటీవల పార్లమెంటు నుంచి భారీ సంఖ్యలో సభ్యులను బహిష్కరించడం జరిగింది. ఇలా భారీ సంఖ్యలో సభ్యులను బహిష్కరించిన మరో ఉదాహరణ ఎప్పుడైనా ఉందా? ఇది ప్రజాస్వామ్యమా? పెద్ద సంఖ్యలో సభ్యులు సభలో లేనప్పుడు బిల్లులు ప్రవేశపెట్టి చట్టాలు చేయడానికి తగిన సౌలభ్యం సంపాదించుకున్నారు. చర్చలు సంప్రదింపుల్లేకుండానే చట్టాలు చేయడం సముచితమా? చివరకు ప్రభావిత వర్గాలు ఆందోళనలకు, నిరసనలకు దిగిన తర్వాత చర్చలు సంప్రదింపుల గురించి మాట్లాడక తప్పలేదు.
ఇదంతా ఇలా ఎందుకు జరుగుతోంది? అధికారాలు కేంద్రీకృతం కావడం, సభ్యులను బహిష్కరించి చట్టాలు చేయడం, ప్రచారప్రసార సాధనాలను ఉపయోగించుకుని మాన్యుఫాక్చరింగ్ కంసెంట్ ప్రక్రియ కొనసాగించడం. ఒకే నాయకుడి చేతుల్లో అధికారాలన్నీ గుప్పిట పెట్టుకునే రాచరిక ధోరణి ఇవే కారణాలు కాదా? కాని ఇలాంటి చట్టాలు చేసినప్పుడు సహజంగానే ప్రభావిత వర్గాలు నిరసనలకు దిగుతాయి. ఈ చట్టాలను సవాలు చేస్తూ, ఈ చట్టాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేయడం సహజ పరిణామం. ఇదంతా జరిగిన తర్వాత మాత్రమే చర్చలు సంప్రదింపుల గురించి మాట్లాడుతున్నారు.
పౌరసమాజం తరఫున నిరసనలు పెల్లుబకడం, ఏదైనా సమస్యకు ప్రతిస్పందనగా ప్రజలు వీధుల్లోకి రావడం, ఉద్యమించడం నేటికి కూడా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి తప్పని పరిస్థితి ఉంది. ఇది గతంలో కూడా చూశాము. పౌరసత్వ సవరణ చట్టం వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబికాయి. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని, సమాజాన్ని విడగొట్టడానికి, విభాజన రాజకీయాలు నడపడానికి చట్టాలు చేస్తే ప్రజలు ఏం చేయాలి? మౌలికమైన రాజ్యాంగ విలువలను, సంప్రదాయాలను పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా చట్టాలు చేయడానికి పూనుకుంటే ప్రజలు ఏం చేయగలరు?
పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీలు నిజానికి ఇలాంటి పరిస్థితినే సృష్టించాయి. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని, సమాజంలో చిచ్చు పెట్టే రాజకీయాలు వీటి వెనుక ఉన్నాయి. ఈ ప్రయత్నాలకు వ్యతిరేకంగానే షాహిన్ బాగ్ మహిళల ఉద్యమం అంతర్జాతీయ మీడియాను కూడా ఆకర్షించింది. చివరకు ఆ చట్టం మార్గదర్శక నియమనిబంధనలు ఇంతవరకు రూపొందలేదు. ఇటీవల జరిగిన శాసనసభల ఎన్నికల తర్వాత మతతత్వ రాజకీయాలకు మరింత ఊతం లభించడంతో త్వరలో ఈ నియమనిబంధనలను రూపొందించి చట్టాన్ని అమలు చేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావలసి ఉంది. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించిన రూల్సు రూపొందించి అమలు చేయడం కుదరదు కాబట్టి అంతకన్నా ముందే చేస్తారని పలువురు భావిస్తున్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీకి చెప్పుకోడానికి రామమందిర నిర్మాణం ఒక్కటే ఉంది. సిఏఏ కూడా అమలు చేస్తే మతతత్వ రాజకీయాలతో మరోసారి గద్దెనెక్కే అవకాశం ఉంటుందన్న ఆలోచన కనిపిస్తోంది. కాని సిఏఏ అమలు విషయంలో రాజకీయంగా కూడా బీజేపీకి సానుకూల పరిస్థితి లేదు. అస్సాంలో చాలా గ్రూపులు సిఏఏను వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే 1985 అస్సాం ఒప్పందానికి ఇది విరుద్దమని వాదిస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం 1971 మార్చి 24 తర్వాత అస్సాంలోకి ప్రవేశించిన బంగ్లాదేశీలందరినీ గుర్తించి వెనక్కు పంపేయాలి. అందుకోసం ఎన్నార్సీ జరిపించారు. కాని ఎన్నార్సీపై కూడా చాలా మందికి ఇప్ప్పుడు అభ్యంతరాలున్నాయి. పెద్ద సంఖ్యలో ఎన్నార్సీలో ముస్లిముల పేర్లు ఉంటాయనుకున్నారు. అలా జరగలేదు. ఇప్పుడు మళ్ళీ ఎన్నార్సీ రీ వెరిఫికేషన్ గురించి మాట్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నార్సీ గురించి కూడా మాటలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఒక మతసముదాయాన్ని లక్ష్యంగా చేసుకున్న పనులే. ఎన్నార్సీ మళ్ళీ జరిపించాలనే పిటీషన్ సుప్రీంకోర్టులో ఉంది.  అస్సాం జనాభా 3 కోట్ల 29 లక్షల మందిలో 19 లక్షల మంది ఎన్నార్సీలో లేరు. ఇందులో దాదాపు ఆరు లక్షల మంది బెంగాలీ మాట్లాడే హిందువులకు సిఏఏ ద్వారా పౌరసత్వం ఇస్తారు. సిఏఏ, ఎన్నార్సీ ఒకదానికి ఒకటి సంబంధించినవి. సిఏఏ ఎన్సార్సీలకు సంబంధించిన పరిస్థితి ఇది.
సిఏఏ చట్టానికి వ్యతిరేకంగా ఈ చట్టం చేసినప్పుడే 2019లో తీవ్రమైన స్థాయిలో నిరసనలు పెల్లుబికాయి. తర్వాత కరోనా రావడంతో నిరసనలు కరోనా లాక్ డౌనులోకి వెళ్ళిపోయాయి. కాని ఈ చట్టం అమలు కాకుండా అడ్డుకోగలిగాయి. ప్రజల నిరసన ద్వారా ఆగిపోయిన చట్టాల విషయానికి వస్తే వ్యవసాయ చట్టాల గురించి తప్పక చెప్పుకోవాలి. వ్యవసాయ సంస్కరణలు కోరేవారు కూడా ఈ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించారు. రైతుల ఆదోళన చివరకు ప్రభుత్వం దిగివచ్చేలా చేసింది. ఈ చట్టాలను చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం ఎవరిని సంప్రదించలేదు. ఈ బలవంతపు చట్టాలపై రైతులు సాగించిన పోరాటం గమనించదగింది. సిఏఏ చట్టానికి వ్యతిరేకంగా ముఖ్యంగా ముస్లిములు నిరసనలు తెలిపితే, రైతు చట్టాలకు వ్యతిరేకంగా ముఖ్యంగా శిక్కులు నిరసనలకు దిగారు. అయితే జాట్ తదితర వర్గాల రైతులు కూడా ఈ నిరసనల్లో పెద్దఎత్తున పాల్గొన్నారు. జాతికులమతాలకు అతీతంగా ఈ ఉద్యమం నడిచింది. లఖింపూర్ లో జరిగిన సంఘటన తర్వాత ఉత్తరప్రదేశ్ కు చెందిన రైతులు కూడా ఈ నిరసనల్లో పాలుపంచుకున్నారు. ఈ నిరసనలు సుదీర్ఘకాలం కొనసాగాయి. ఈ వ్యవసాయ చట్టాలను చేస్తున్నప్పుడు కూడా మోడీ ప్రభుత్వం ఎవరినీ సంప్రదించలేదు. రైతు సంఘాలను, రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నవారిని ఎవరినీ సంప్రదించలేదు. నిజానికి ఎవరినీ సంప్రదించకుండా చట్టాలు చేసి ప్రజలపై రుద్దడం అన్నది వలసపాలకుల లక్షణం. బ్రిటీషు వారు ఇలాగే చట్టాలు చేసేవారు.
రైతు నిరసనలకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సోషల్ మీడియాలోను ఉధృతంగా ప్రచారం జరిగింది. రాజకీయాలకు అతీతంగా ఉద్యమాన్ని నడిపించారు. పెద్ద వయసు మహిళలు కూడా ట్రాక్టర్లు నడుపుతూ ఈ ఉద్యమంలోకి వచ్చారు. లంగర్ కిచెన్లలో పాల్గొన్నారు. వేదికలెక్కి ప్రసంగాలు చేశారు. పొలాల్లో దుక్కి దున్నడమే కాదు వేదికలెక్కి ఉద్యమాలు నడపగలమని కూడా రుజువు చేశారు. వారు తమ భవిష్యత్తు కోసం నడుంకట్టి రంగంలోకి దిగారు. 1928లో బర్దోలీలో రైతుల సత్యాగ్రహాన్ని గుర్తుకు తెచ్చారు. సల్వార్ కమీజులు, పసుపు దుప్పట్టలతో ఒక సమైక్య శంఖారావం వినిపించారు.
ఇలా ఇష్టారాజ్యంగా బలవంతంగా చట్టాలు చేయడం అన్ని సందర్భాల్లోను సాధ్యం కాదని అనేకసార్లు రుజువయ్యింది. నల్లచట్టాలపై ప్రజలు అనేకసార్లు ఉద్యమించారు. ప్రత్యేక సముదాయాన్ని లక్ష్యంగా చేసుకుని చేసే చట్టాలు ప్రజల్లో, సమజంలో విభజనను రాజేస్తాయి. ఈ వాస్తవాన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలి. ముఖ్యంగా ఇండియా కూటమి పేరుతో ఒక్కటవుతున్న ప్రతిపక్షాలు గుర్తించడం ఎంతో అవసరం. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో నిరసనల స్వభావాన్ని అర్థం చేసుకుని ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా తమ విధి విధానాలను రూపొందించుకోవాలి.
ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, పెద్ద సంఖ్యలో పార్లమెంటు సభ్యులను బహిష్కరించిన సంఘటన చాలా పెద్ద సంఘటన. ఇంత పెద్ద సంఖ్యలో పార్లమెంటు సభ్యులు బహిష్కారానికి గురికావడమంటే, దేశంలోని ఓటర్లలో పెద్ద సంఖ్యలో ఓటర్లకు తమ ప్రతినిధులు పార్లమెంటులో లేని పరిస్థితి. కాని ఈ సంఘటనపై ప్రజలు ప్రతిస్పందించిన దాఖలా లేదు. నిరసన స్వరాలు వినిపించిన దాఖలా లేదు. ప్రతిపక్ష ఎంపీలు నిరసనలు చెప్పడమే తప్ప ప్రజల్లో ఆ ప్రతిఘటన, ఆందోళన, నిరసన కనిపించలేదు. కేవలం సోషల్ మీడియాలో వీరాంగాలు మాత్రమే కనిపించాయి.
దేశంలో ఇప్పటి వరకు సంచలనాత్మకంగా కొనసాగిన నిరసన ప్రదర్శనల నుంచి ప్రతిపక్షాలు నేర్చుకోవలసిన గుణపాఠాలేమైనా ఉన్నాయా? నిరంకుశ చట్టాలకు వ్యతిరేకంగా గళమెత్తీ రోడ్లపైకి వచ్చిన ప్రజలు తమ ప్రతినిధులు పార్లమెంటు నుంచి గెంటివేతకు గురైతే ఎందుకు పెదవి విప్పడం లేదు?
అమెరికాలో బ్లాక్ లివ్స్ మ్యాటర్ ఉద్యమం సంచలనాన్ని సృష్టించింది. ఇప్పుడు ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. ఇది ప్రజలకు ఉన్న బలం. ప్రజాగళం నిరంకుశ పాలకులను కూడా వెనుకడుగు వేసేలా చేస్తుంది. 1970లో చిప్కో ఉద్యమం, ఇటీవలి అన్నాహజారే ఉద్యమం ఈ ఉద్యమాలు ప్రజాబలం ఎలాంటిదో చాటి చెప్పాయి. నిర్భయ దుర్ఘటన తర్వాత ప్రజాఉద్యమం కొత్త చట్టం వచ్చేలా చేసింది. ఈ ప్రజాబలాన్ని కూడగట్టుకునే ప్రయత్నం ఇండియా కూటమి నేతలు చేయకపోతే రాజకీయంగా తమ ఉనికిని చాటి చెప్పలేరు. ముఖ్యంగా మళ్ళీ బలం పుంజుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెసు పార్టీ నేతలు ఆలోచించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో, రాజస్థానల్ లో, ఛత్తీస్ గఢ్ లో ఓటమికి దారితీసిన కారణాలేమిటో? సాఫ్ఠ్ హిందుత్వ రాజకీయాల వల్ల ఏం సాధించారో? ఆలోచించుకోవాలి. సెక్యులర్ పార్టీగా చెప్పుకుంటున్నప్పుడు సెక్యులర్ విలువల కోసం బలంగా నిలబడి చూపించాలి. ఇవన్నీ చేయలేనప్పుడు కేవలం భారత్ జోడో యాత్రలు, ముహబ్బత్ కా దుకాన్ నినాదాలను, కులజనగణన గురించి చెప్పే మాటలను ప్రజలు నమ్మడం చాలా కష్టం. ప్రజల్లో నమ్మకం లేదు కాబట్టే ఇంతమంది ఎంపీలు బహిష్కరణకు గురైనా ప్రజల్లో నిరసన వ్యక్తం కాలేదన్నది నిజం.

– వాహెద్