April 29, 2024

ఎన్డీటీవీలో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించిన ప్రముఖ పాత్రికేయుడు రవీష్ కుమార్ నవంబర్ 30, 2022వ తేదీన చానలుకు రాజీనామా చేశారు. మొత్తం 27 సంవత్సరాలు ఆయన ఎన్డీటీవీలో పనిచేశారు. రవీష్ కుమార్ రాజీనామాకు కారణాలేమిటన్నది చూస్తే ఎన్డీటీవీ యాజమాన్యం మారిపోయింది. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితులైన వారి చేతుల్లోకి యాజమాన్యం వచ్చింది. రవీష్ కుమార్ స్వేచ్ఛగా తన పని చేసే వాతావరణం లేకుండా పోయింది. దేశంలో పాత్రికేయవిలువలకు ప్రాముఖ్యం ఇచ్చే జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పరిస్థితికి రవీష్ కుమార్ రాజీనామా ఒక ఉదాహరణ.
గోదీ మీడియా అనే పదాన్ని మొదట ఉపయోగించింది రవీష్ కుమార్. పాలకపక్షానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్న మీడియాగా ఆయన గోదీ మీడియా అనే పదాన్ని వాడారు. అదే గోదీ మీడియాలో భాగం కాకూడదనే ఆయన ఎన్డీటీవీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత రవీష్ కుమార్ యూట్యూబ్ చానల్ స్వంతంగా ప్రారంభించి అక్కడ మాట్లాడడం మొదలుపెట్టారు. ఎన్డీటీవీ యాజమాన్యం మారక ముందు ఎన్డీటీవీపై ప్రభుత్వం అనేక ఆరోపణలు చేసింది. మనీ లాండరింగ్ మొదలు స్పాన్సర్ షిప్ నష్టాల వరకు దాడులు అనేకవిధాలుగా జరిగాయి. దేశంలో స్వతంత్ర మీడియా ఎదుర్కొంటున్న సంక్లిష్ట స్థితికి ఇదొక ఉదాహరణ. ఎన్డీటీవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రవీష్ కుమార్ ప్రారంభించిన యూట్యూబ్ చానల్ ను లక్షలాది మంది ఆదరించడం ప్రారంభించారు. ఒక్క రవీష్ కుమార్ మాత్రమే కాదు అనేక మంది ప్రముఖ జర్నలిస్టులు తమ చానళ్ళను, వార్తాసంస్థలను వదిలి స్వతంత్ర జర్నలిజం కోసం యూట్యూబ్ ను ఆశ్రయించడం ఇప్పుడు ఎక్కువయ్యింది
ఈ పరిస్థితి ఏం సూచిస్తుంది. వార్తాసంస్థలు, మీడియాపై ప్రభుత్వ ఒత్తిడికి ఇది నిదర్శనంగా చాలా మంది విశ్లేషిస్తున్నారు. నిష్పక్షపాత స్వతంత్ర జర్నలిజం కోసం సోషల్ మీడియా వేదికలను ఆశ్రయించక తప్పడం లేదని పలువురు వాపోతున్నారు. అయితే సోషల్ మీడియాలో ప్రవేశించి తమ గొంతు వినిపించాలనుకుంటున్న ఈ జర్నలిస్టులకు సమస్యలు తక్కువగా లేవు. ఆర్థిక సవాళ్ళు, నిలకడైన ఆదాయం లేకపోవడం, న్యాయపరమైన మద్దతు లభించకపోవడం, ఆన్ లైన్ వేధింపులు,  మాత్రమే కాదు భౌతికదాడుల భయాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో జర్నలిజం పరిస్థితిని ఎన్డీటీవీ టేక్ ఓవర్ అద్దం పడుతుంది.
ప్రపంచంలోని 180 దేశాల్లో భారతదేశం వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్సు ప్రకారం 161వ స్థానంలో ఉంది. స్వతంత్ర జర్నలిస్టులు అనేక సవాళ్ళను ఎదుర్కుంటున్నారు. అనేకమంది ఇప్పుడు యూట్యూబ్ తదితర సోషల్ మీడియా ద్వారా తమ గొంతు వినిపిస్తున్నారు. ఉద్యోగాలు వదిలేసి బయటకు వచ్చేశారు. చివరకు ఒక పుస్తకం రాయాలన్న జర్నలిస్టు స్వతంత్రంగా రాసే పరిస్థితి ప్రముఖ మీడియా సంస్థల్లో లేదని తెలుస్తోంది. అందువల్లనే చాలా మంది ఉద్యోగాలకు రాజీనామా చేసి సోషల్ మీడియా వేదికగా పనిచేసుకుంటున్నారు. త్వరలో 2024 సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో స్వతంత్ర జర్నలిజం, యూట్యూబ్ వేదికగా పనిచేస్తు్న్న జర్నలిస్టులు ఎలాంటి ప్రభావం చూపిస్తారో వేచి చూడాలి.