November 27, 2024

హుజరాబాద్ మాదిరిగా మునుగోడులో కూడా విజయపతాకం ఎగరవేయాలనుకున్న బీజేపీ ఆశలు ఆవిరయ్యాయి. టీఆరెస్ ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. మునుగోడు ఎన్నికలకు కారణం బీజేపీ రాజకీయ వ్యూహాలు. ఈ నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పలుకుబడి ఉపయోగించుకుని రాజకీయంగా హ్యాట్రిక్ కొట్టాలనుకున్నారు. దుబ్బాక, హుజరాబాద్ తర్వాత మునుగోడు గెలిస్తే ఇక తెలంగాణాలో టీఆరెస్ ను మట్టికరిపించవచ్చనేది వ్యూహం.

మునుగోడుకు బీజేపీ ఎంత ప్రాముఖ్యం ఇచ్చిందంటే స్వయంగా హోంమంత్రి అమిత్ షా వచ్చారు. రాజగోపాల రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించారు. హుజరాబాద్ లో కూడా ఇలాగే చేశారు. అక్కడ ఈటెలను పార్టీలోకి పిలిచి ఎన్నికలు జరిగేలా చేసి గెలుపు సాధించి టీఆరెస్ ను దెబ్బతీశారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ తన బలాన్ని చాలా పెంచుకుంది.

2018 ఎన్నికల్లో టీఆరెస్ 88 స్థానాలు గెలుచుకుంది. బీజేపీకి కేవలం ఒక్క స్థానం లభించింది. చాలా నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. కాని తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాలు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దుబ్బాక, హుజరాబాద్ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయాలు బీజేపీకి కొత్త ఊపు ఇచ్చాయి. 2023లో తెలంగాణాలో జెండా ఎగరేయగలమని అనుకున్నారు. కర్నాటక తర్వాత దక్షిణాదిన తెలంగాణా బీజేపీకి దొరికినట్లే అనుకున్నారు.

మిషన్ 2023లో భాగంగానే జాతీయ కార్యవర్గ సమావేశం బీజేపీ హైదరాబాద్ లో నిర్వహించింది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, అధ్యక్షుడు నడ్డా తదితర నేతలు తరచు తెలంగాణా సందర్శించారు. బీజేపీ వ్యూహాలు గమనించిన కేసీఆర్ బీజేపీపై దాడి తీవ్రం చేశారు. జాతీయ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు. రాజగోపాల రెడ్డిని ఆహ్వానించి మునుగోడు ఉపఎన్నిక జరిగేలా చేయడం రాజకీయ వ్యూహంలో భాగమే. టీఆరెస్ ఈ వ్యూహాలను గమనించి, అడ్డుకునే ప్రయత్నాలు తీవ్రంగా చేసింది. రాజగోపాల రెడ్డి ఒక ఇంటర్వ్యులో తన కుటుంబ కంపెనీకి కేంద్రం నుంచి 18 వేల కోట్ల కాంట్రాక్టు దొరికిందని చెప్పిన మాటలను కూడా టీఆరెస్ పూర్తిగా ఉపయోగించుకుంది. ఉప ఎన్నికలు గెలవడానికి రాజగోపాలరెడ్డి 500 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారని కేటీఆర్ అన్నారు. టీఆరెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాల వార్తలు వచ్చాయి. కేసీఆర్ పూర్తి స్థాయిలో బీజేపీపై దాడి చేస్తూ ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వాలు పడగొట్టే ప్రయత్నాల్లో ఉందని ఎదురుదాడులు ప్రారంభించారు.

బీజేపీ, టీఆరెస్ మధ్య మునుగోడు కోసం హోరాహోరి పోరు జరిగింది. కాని గమనించవలసిన విషయమేమిటంటే, ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు టీఆరెస్ ప్రవేశపెట్టింది. రైతుబంధు, దళితబంధు, కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ వంటి పథకాలు అమలవుతున్నాయి. కాబట్టి టీఆరెస్ భారీ మెజారిటీతో గెలవాలి. కాని సర్వశక్తులు ఒడ్డినా, మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ నడుంకట్టినా అత్తెసరు మెజారిటీ మాత్రమే వచ్చింది. యువత టీఆరెస్ కు దూరమై బీజేపీకి దగ్గరవుతుందన్న సంకేతాలు అందుతున్నాయి.

మరోవైపు మునుగోడు ఎన్నికలో డబ్బు ఏరులై పారింది. పోలీసుల తనిఖీలో పలుచోట్ల డబ్బు పట్టుబడింది. పోలింగ్ జరుగుతున్న సమయంలో కొందరు పోలింగ్ బహిష్కరించారు. ఓటు వేసేది లేదని భీష్మించారు. ఎందుకంటే, తమకు ఏ పార్టీ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఓటు వేయమని చెప్పారు. భారత ప్రజాస్వామ్యంలో ఇది విచిత్రమైన పరిస్థితి ఓటర్లే డబ్బులు డిమాండ్ చేయడం.

మునుగోడులో గెలవడానికి పార్టీలు ఎన్నికల్లో ఎంతగా డబ్బు ఖర్చు పెట్టాయంటే, అత్యంత ఖరిదైన ఎన్నికగా మారింది. డబ్బులు పంచిపెట్టడానికి పార్టీలు, అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. డబ్బులు స్వీకరించడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు, డబ్బులు ఇవ్వకపోతే ఓటేసేది లేదంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఏ స్థాయికి పార్టీలు దిగజార్చాయో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. మునుగోడులో ఎవరు గెలిచినా కాని చివరకు ఓడింది ప్రజాస్వామ్యమే.