November 25, 2024

బండారాలు బయటపెడుతుంది డాటా

ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాప్యులేషన్ సైన్సెస్ డైరెక్టరు ప్రొ.కే.యస్.జేమ్స్ ను ప్రభుత్వం సస్పెండు చేసింది. ఈ సస్పెన్షన్ కు చెప్పిన కారణాలు కూడా విచిత్రంగా ఉన్నాయి. కేంద్రఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ పరిధిలో ఈ సంస్థ పనిచేస్తుంది. దేశంలో అత్యంత కీలకమైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చేయిస్తుంది. దీంతో పాటు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, టుబాకో సర్వే వంటివి కూడా చేయిస్తుంది. ఇవన్నీ డాటా సేకరించే కార్యక్రమాలు. కాని ప్రభుత్వానికి ఇప్పుడు డాటా అంటేనే భయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది. కులజనగణన విషయంలో అడ్డుపుల్లలు వేస్తోంది. చాలా సర్వేల డాటా బయటపెట్టడానికి ఇష్టపడడం లేదు. IIPS డాటా చాలా సందర్భాల్లో నేతలు గొప్పగా చెప్పే మాటలకు విరుద్దంగా వాస్తవాలను బయటపెట్టింది. అందువల్ల ఈ సంస్థ పట్ల ప్రభుత్వానికి కోపం సహజమే. కాని చేదుగా ఉన్నంత మాత్రాన నిజం నిజం కాకపోదుగా.

జేమ్స్ ను సస్పెండ్ చేయడానికి చెప్పిన కారణాలు ఏం చెప్పారంటే, నియామకాల్లో, రిజర్వేషన్ రోస్టరులో, డెడ్ స్టాక్ రిజీష్టరులో అవకతవకలు కారణమని చిన్న నోట్ ఇచ్చారు. జవహర్ సిర్కార్ ది క్వింట్ లో ఈ విషయం రాస్తూ, తన 40 సంవత్సరాల ఆడ్మినిస్ట్రేషన్ జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. నియామకాలతో సహా ఇందులో చూపించిన కారణాలకు ఎవరో ఒక అధికారిని బాధ్యునిగా చేయడం కుదరదని చాలా మంది ప్రమేయంతో జరిగే వ్యవహారలని చెప్పారు. ఏది ఏమైనా జేమ్స్ ను అక్కడి నుంచి ప్రభుత్వం తొలగించాలనుకుంది అనేది స్పష్టం. ఎందుకంటే జేమ్స్ 26 సంవత్సరాలుగా డాటా సేకరణలో అనుభవం ఉన్న అధికారి. ఆయన సర్వేలు అత్యంత విశ్వసనీయమైనవిగా పేరుపొందాయి. 2019లో మోడీ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. భారతదేశంలో బహిరంగ మలవిసర్జన పూర్తిగా నిర్మూలించామని చెప్పుకుంది. కాని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5లో ఇది అబద్దమని బయటపడింది. గ్రామీణ ప్రాంతాల్లో పాతికశాతం మంది ఇంకా బహిరంగ మలవిసర్జనే చేస్తున్నారని, ఝార్ఖండ్, బీహారు వంటి రాష్ట్రాల్లో అయితే 40 శాతం వరకు ఉందని తేల్చింది.

ది వైర్ వార్తసంస్థ ప్రకారం మంత్రి మన్సూఖ్ మాండవియా దేశంలో రక్తహీనత డాటా విషయంలో డైరెక్టర్ జేమ్స్ తో విభేదించి పరుషంగా మాట్లాడాడట. కాని డైరెక్టర్ జేమ్స్ మాత్రం డాటా పూర్తిగా ఖచ్చితమైనదని గట్టిగా నిలబడ్డారని తెలిసింది. చివరకు NFHS-6 సర్వేలో రక్తహీనత గురించి గణాంకాలు లేకుండా చేశారు.

ఈ కారణాల వల్ల జేమ్స్ ను సస్పెండు చేశారని చెప్పలేం. కాని జేమ్స్ సస్పెన్షన్ కు చూపిస్తున్న కారణాలు కూడా సరిగా కనిపించడం లేదు. అనేక సందర్భాల్లో IIPS’ డాటాతో ప్రభుత్వం, మంత్రులు విభేదించడం కనిపించింది.

మరో ముఖ్యమైన విషయం గమనించాలి. మోడీ ప్రభుత్వానికి జనగణన కూడా అంతగా నచ్చదు. భారతదేశంలో 1872 నుంచి జనగణన జరుగుతోంది. 1941లో యుద్ధపరిస్థితుల్లో కూడా జనగణన నిర్వహించారు. 1931 జనగణన లెక్కలు చాలా ప్రతిష్ఠాత్మకమైనవిగా ఇప్పటికి భావిస్తారు. కాని 2021లో కోవిడ్ కారణంగా జనగణన చేయించలేమని చెప్పారు. కాని 2022 నాటికి పరిస్థితి మామూలయ్యింది కదా. కాని ఇప్పటికి కూడా కోవిడ్ సాకుతో జనగణన జరగడం లేదు.

ప్రభుత్వం గణాంకాలంటే భయపడుతుందా? జనగణన జరిగితే అనేక గణాంకాలు బయటకు వస్తాయి. జనగణన మాత్రమే కాదు కులజనగణన విషయంలో కూడా బీసీల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ డాటా బయటకు వస్తే చాలా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అలాగే దేశంలో వినియోగదారుల ఖర్చుల సర్వే కూడా జరపడం లేదు. దీనివల్ల దేశంల పేదరికం ఎలా ఉందో, కొనుగోలు శక్తి ఎలా ఉందో బయటపడుతుంది. ఈ సర్వేలు జరక్కుండా అడ్డుకోవడం, జరిగిన సర్వేల నివేదికలను ఏదో సాకుతో తొక్కిపట్టి ఉంచడం కొనసాగుతూ వస్తోంది. స్టాటిస్టిషియన్ పి.సి.మోహనన్, జే. మీనాక్షిలు నేషనల్ స్టాటిస్టిక్స్ కమీషన్ నుంచి 2019లో రాజీనామా చేయడానికి కారణమిదే. నిరుద్యోగుల డాటాను సాధారణ ఎన్నికలకు ముందు విడుదల చేయకుండా ఆపి ఉంచడాన్ని నిరసిస్తూ వాళ్ళు రాజీనామా చేశారు.

కాని విశ్వసనీయమైన డాటా లేకపోతే అభివృద్ధి పథకాలు, ప్రణాళికలకు ఏది ఆధారం అనే ప్రశ్నకు జవాబు లేదు.