మొన్న మే నెలలో చైనాలోని యున్నాన్ ప్రాంతంలోని నాగూలో ముస్లిములు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు 14వ శతాబ్దానికి చెందిన ఒక మస్జిదును పాక్షికంగా ప్రభుత్వం కూల్చేయడానికి తీసుకున్న నిర్ణయంపై ఈ నిరసన ప్రదర్శనలు జరిగాయి. మస్జిదు నిర్మాణాన్ని కొంతకాలం క్రితం విస్తరించారు. అయితే 2020లో అక్కడి న్యాయస్థానం మస్జిదు కొత్తగా విస్తరించిన నిర్మాణాలను కూల్చేయాలని ఆదేశించింది. ఇక్కడ హూయీ మైనారిటీ ముస్లిముల అధికంగా నివసిస్తున్నారు. చైనాలో హూయీ ముస్లిములు మూడవ అతిపెద్ద మైనారిటీ సముదాయం. వీగర్ ముస్లిముల మాతృభాష వేరు. హూయీ ముస్లిముల మాతృభాష మాండారిన్. హాన్ మెజారిటీ సముదాయానికి సాంస్కృతికంగా చాలా సన్నిహితంగా కనబడే మైనారిటీ సముదాయం ఇది. అయినప్పటికీ చైనా ప్రభుత్వం ముస్లిముల పట్ల శత్రుత్వమే చూపిస్తోంది. చైనా రాజ్యాంగంలో మతస్వేచ్ఛ ఉంది కాని ఇటీవల మతస్వేచ్ఛను, ముఖ్యంగా ముస్లిముల మతస్వేచ్ఛను కాలరాసే ప్రయత్నాలు ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇది గత కొంతకాలంగా జరుగుతూ వస్తున్నదే.
చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో దాదాపు మూడింట రెండు వంతుల మస్జిదులు చైనా ప్రభుత్వ విధానాల వల్ల కేవలం మూడేళ్లలో కూల్చివేయబడ్డాయి లేదా శిధిలమయ్యాయని 2019లో ఒక నివేదిక ప్రకటించింది.
సుమారు 16,000 మసీదులు నష్టానికి గురయ్యాయి. ఈ ప్రాంతంలోని మస్జిదుల్లో 65 శాతం నాశనమయ్యాయని, ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ (ASPI) థింక్ ట్యాంక్ చెప్పింది. ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ విషయాన్ని కనిపెట్టారు.
2017 నుండి చాలా వరకు నష్టం జరిగింది. సగానికి పైగా అంటే 8,500 మస్జిదులు పూర్తిగా కూల్చివేయబడ్డాయి. చైనా ప్రభుత్వం వీగర ముస్లిముల సాంస్కృతిక వారసత్వాన్ని చురుకుగా చెరిపివేస్తోంది మార్చేస్తోందని ASPI నివేదిక కనుగొంది.
సాంస్కృతిక విప్లవం తరువాత, 3,000 కంటే తక్కువ మసీదులు మిగిలి ఉన్న ఈ ప్రాంతంలోని మస్జిదుల సంఖ్యను “కనిష్ట స్థాయికి” తీసుకువచ్చినట్లు నివేదిక పేర్కొంది.
వీగర్ ప్రజలపై చైనా అణిచివేత గురించి బ్రిటన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో, షింజ్యాంగ్ లో అక్రమంగా నిర్బంధించిన వారిని విడుదల చేయాలని పిలుపు ఇచ్చింది. ఆ తర్వాత ఈ నివేదిక వెలుగులోకి వచ్చింది.
బ్రిటనుకు చెందిన దక్షిణ ఆసియా, కామన్వెల్త్ దేశాల విదేశాంగ మంత్రి లార్డ్ అహ్మద్ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో మాట్లాడుతూ, షింజ్యాంగ్ లో చైనా అధికారుల సొంత పత్రాల ద్వారా క్రమబద్ధమైన మానవ హక్కుల ఉల్లంఘన గురించిన బలవంతపు ఆధారాలు ఉన్నాయి అన్నారు.
బలవంతపు శ్రమ, బలవంతపు కుటుంబ నియంత్రణ, సంస్కృతిపై, మతంపై ఉన్న ఆంక్షల గురించి ’’విశ్వసనీయ” నివేదికలను ఆయన ప్రస్తావించారు. అనేక సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ బీజింగ్ ఈ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలను పదేపదే ఖండిస్తోంది. షింజ్యాంగ్ లోని ప్రభుత్వ విధానాలు పేదరికాన్ని తొలగించడానికి, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి రూపొందించబడ్డాయని చెబుతోంది.
చైనా ప్రభుత్వం ఇటీవల ఈ ప్రాంతంలోని నిర్బంధ శిబిరాలను “వృత్తి శిక్షణా కేంద్రాలు” గా సమర్థిస్తూ ఒక నివేదికను ప్రచురించింది. ప్రతి సంవత్సరం పదిలక్షల మందిని ఇక్కడి కార్మిక శిక్షణ కార్యక్రమాలకు పంపుతున్నామని ఒక శ్వేతపత్రంలో తెలిపింది.
ఇస్లామిక్ వాస్తు నిర్మాణాలను, చిహ్నాలను తొలగించడానికి జరుగుతున్న ప్రయత్నాలను ASPI నివేదిక బట్టబయలు చేసింది. రూపు మార్చబడిన అనేక మస్జదులను సూచిస్తూ, “తరచుగా షింజ్యాంగ్ లో పునరుద్ధరణ పనుల సాకుతో సాంస్కృతిక విధ్వంసం జరుగుతందని” ASPI నివేదిక పేర్కొంది.
కార్గిలిక్ లోని జేమ్ మసీదు విషయంలో, మసీదుకు సంబంధించిన అరబిక్ రచన, నెలవంక చిహ్నాలను తొలగించారు. “పార్టీని ప్రేమించండి, దేశాన్ని ప్రేమించండి” అనే ప్రభుత్వ ప్రచార ఎర్ర బ్యానర్ వేలాడదీశారు
మసీదులతో పాటు, ప్రభుత్వ అధికారులు ఈ ప్రాంతంలోని పవిత్ర మందిరాలు, స్మశానవాటికలు, ఇతర ధార్మిక పర్యటన స్థలాలను అపవిత్రం చేశారు. 30 శాతం పవిత్ర స్థలాలను కూల్చివేశారని, మరో 27.8 శాతం ఏదో ఒక విధంగా దెబ్బతిన్నాయని ASPI నివేదిక చెప్పింది.
వీగర్ భాష, సంగీతం, వాస్తు, నివాసాలు, ఆహార అలవాట్లు కూడా మార్చడం లేదా తొలగించడం ద్వారా వీగర్ సామాజిక, సాంస్కృతిక జీవితాన్ని మార్చేసే బలవంతపు ప్రయత్నాలు చైనా చేస్తోందని నివేదిక ప్రకటించింది.
అమెరికా ఆంక్షలు విధించింది. షింజ్యాంగ్ లో మైనారిటీలపై చైనా అణిచివేతలను ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. షింజ్యాంగ్ లో ఉత్పత్తి చేయబడిన ఎగుమతులపై పరిమిత నిరోధంతో అనేక చర్యలు తీసుకున్నారు. చైనాపై ఇప్పుడు ఒత్తిడి పెరుగుతోంది.
– రుఫైదా