April 13, 2024

మోహిత్ యాదవ్ అనే బస్సు కండక్టరు తన బస్సును ఇద్దరు ముస్లిం ప్రయాణీకులు నమాజు చేసుకోడానికి ఆపాడు. అతని ఉద్యోగం పోయింది. చివరకు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజానికి అతను కేవలం ముస్లిం ప్రయాణీకులు నమాజు చదవడానికి మాత్రమే బస్సు ఆపలేదు. కొందరు ప్రయాణీకులు మూత్రవిసర్జన కోసం బస్సు ఆపమన్నారు. అదే టైములో ముస్లిం ప్రయాణీకులు కూడా నమాజు చేసుకుని వచ్చేయండని అన్నాడు. బస్సు ఆగింది రెండు నిముషాలు మాత్రమే. కాని వైరల్ వీడియోలు వచ్చాయి. అతని ఉద్యోగం పోయింది. చివరకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది.

మరో మోహిత్ యాదవ్ పేరు కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మోను మానేసర్ అని పిలువబడే ఈ మోహిత్ యాదవ్ పై మతతత్వ విద్వేషంతో హత్యలు చేసిన ఆరోపణలున్నాయి. నూహ్ అల్లర్లకు అతడే కారణమన్న వార్తలు వచ్చాయి. కాని ఈ మతోన్మాదిని మాత్రం కాపాడ్డానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాని మతసామరస్యం, పరమతం పట్ల గౌరవం చూపించిన మోహిత్ యాదవ్ చివరకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించారు.

దేశంలో ఇటీవల వచ్చిన వార్తలు గమనిస్తే చాలు మతవిద్వేషం, ముఖ్యంగా ముస్లిం విద్వేషం ఎలా సమాజంలో గూడుకట్టుకుపోయిందో అర్థమవుతుంది. గుజరాత్ కు చెందిన అర్నాజ్ బాను స్కూలు టాపర్. అగష్టు 15 స్వతంత్ర దినోత్సవం నాడు ఆమెకు అవార్డుతో సన్మానం జరగవలసింది. కాని ఆమెను పిలవలేదు. మరో అమ్మాయిని సన్మానించారు. అర్నాజ్ బాను ఏడుస్తూ ఇంటికి వెళ్ళింది. ఎందుకు ఆమెను స్టేజిపై పిలవలేదని ప్రశ్నించినప్పుడు స్కూలు అధికారులు ఆమె ఆ రోజు స్కూలుకు రాలేదని చెప్పారు. కాని సిసిటీవీలో ఆమె స్కూలుకు హాజరయ్యిందని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. మతోన్మాదం, మతవిద్వేషమే అర్నాజ్ బాను పట్ల వివక్షకు కారణమయ్యింది.

ముజఫ్ఫర్ నగర్ సంఘటన అందరికీ తెలిసిందే. ఒక స్కూలు టీచరు ఒక ముస్లిం విద్యార్థిని, చిన్నపిల్లవాడిని, తన తరగతిలోని అందరు విద్యార్థులతో చెంపదెబ్బలు కొట్టించింది. పైగా ముస్లిం మహిళల గురించి, ముస్లిం పిల్లల గురించి అనాగరికంగా మాట్లాడింది. ఈమె తాను చేసిన పనికి సిగ్గుపడడం లేదు. తానేదో ఘనకార్యం చేసినట్లు తర్వాత చెప్పుకుంది. ఈ వీడియో కూడా వైరల్ అయ్యింది. ఆ వెంటనే బీజేపీ నాయకుడు సంజీవ్ బల్యాన్ ఆమెకు మద్దతుగా ఆమె వద్దకు వెళ్ళాడు. అంతేకాదు, రైతు నాయకుడు నరేష్ తికాయత్ కూడా వెళ్ళి ఆమెకు మద్దతుగా నిలబడ్డాడు. ఇది దేశంలో పరిస్థితి.

ఇండోర్ లో ఒక పన్నెండేళ్ళ ముస్లిం పిల్లవాడిని అతడి తరగతిలోని తోటి విద్యార్థులే బట్టలు విప్పి అమానుషంగా కొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ విద్యార్థులను అరెస్టు చేశారు. కాని ఇలాంటి విద్వేషం చిన్నపిల్లల మనస్సుల్లోకి ఎక్కడి నుంచి వచ్చింది. ఈ విద్వేషాన్ని చిన్నపిల్లల బుర్రల్లోకి వాట్సప్ సిరంజీలతో ఎక్కిస్తున్న అంకుల్లు, ఆంటీలు ఎవరు?

ఢిల్లీలోని ఒక ప్రభుత్వ స్కూలులో ఒక టీచరు, హేమ గులాటీ అనే ఆవిడ, తన క్లాసులో ఉన్న ముస్లిం విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. ముస్లిములు తమ ధార్మిక ప్రదేశాల్లో జంతుచర్చాలు ఉంచుతారని, స్వతంత్రం తర్వాత ముస్లిములు దేశానికి చేసింది ఏదీ లేదని, ముస్లిములు పశువులను కోసుకు తినేస్తారని చెప్పడమే కాదు, ముస్లిముల పవిత్ర ప్రదేశాలు మక్కా మదీనాల గురించి, దివ్యఖుర్ఆన్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసింది. దేశవిభజన తర్వాత మీరెందుకు పాకిస్తాన్ వెళ్ళలేదని ముస్లిం విద్యార్థులను ప్రశ్నించిందట. స్కూలు పిల్లల మనసుల్లో ఎలాంటి విషాన్ని నూరిపోస్తున్నారీ మతోన్మాదులు?

మతోన్మాదం ఏ స్థాయికి చేరుకుందంటే, జమ్ములోని కథువాలో సంఘటనలు ఇప్పుడెవరికైనా గుర్తున్నాయా? ఒక ఏడేళ్ళ బాలికను గుడిలో నిర్బంధించి అత్యాచారం, హత్య చేసిన నిందితులను విడుదల చేయాలంటూ బీజేపీ మంత్రులు ర్యాలీ తీశారక్కడ.

బిల్కిస్ బాను సామూహిక అత్యాచారం, ఆమె మూడేళ్ళ బాలికను హత్య చేసిన నేరస్తులను ప్రభుత్వం విడుదల చేసింది. వారు విడుదలై రాగానే వారి కాళ్ళకు కొందరు దండాలు పెట్టారు. మరికొందరు వారికి సన్మానాలు చేశారు. వారు చాలా సంస్కారవంతులని బీజేపీ నేతలు కొందరు వ్యాఖ్యానించారు.

అణిచివేతలు, వివక్షలు పసితనంలోనే ఎదురైతే ఆ పిల్లల మనోధైర్యం దెబ్బతినవచ్చు. కాని ఈ కఠినపరిస్థితులను తట్టుకుంటూ గొప్ప మేధావులుగా, విజేతలుగా ఎదిగిన వారు కూడా ఉన్నారు. ఈ మతోన్మాద విషాన్ని స్కూళ్ళలో ఎదుర్కుంటున్న ముస్లిం పిల్లలు అలాంటి మనోధైర్యంతో జీవితంలో గొప్ప స్థానాలకు ఎదిగే సంకల్ప బలాన్ని పొందాలని ఆశిద్దాం. కాని మరో మతం పట్ల విద్వేషాన్ని పిల్లల్లో నూరిపోస్తే అలాంటి విద్వేషంతో పెరిగిన పిల్లలు ఎలాంటి పౌరులుగా మారతారు? తల్లిదండ్రుల పట్ల, సమాజం పట్ల, ఇతరుల పట్ల ఎలా వ్యవహరిస్తారు? ఇతర మతస్తుల పట్ల హింసోన్మాదాన్నిఆనందించే మనస్తత్వం ఎలాంటి సమాజాన్ని నిర్మిస్తుందన్నది అందరూ ఆలోచించవలసిన ప్రశ్నలు.